ఉప్పు చేపల కథే వేరు...
ABN , Publish Date - Jun 01 , 2025 | 10:52 AM
ఉప్పు చేప... పప్పుచారు... ఈ కాంబినేషన్ వింటేనే నోరూరిపోతుంది... ఎవరికైనా లొట్టలేసుకుంటూ తినాలనిపిస్తుంది.. అంతేకాదండోయ్... ఉప్పు చేప.. పప్పుచారు కాంబినేషన్ గొప్పదనంపై సినిమా పాటలు కూడా వచ్చాయి. ఈ క్రేజ్ ఇంతటితో ఆగలేదు. ‘పప్పుచారు.. ఉప్పు చేప’ పేరుతో రెస్టారెంట్లు సైతం వెలిశాయి.
హైదరాబాద్ నుంచి పిఠాపురం వరకు బోలెడున్నాయి. అసలింతకీ ఉప్పు చేప కథేంటి..? మామూలు చేపల గురించి తెలుసుగానీ.. ఈ ఎండు చేపలు ఎక్కడ దొరుకుతాయి? వీటిని ఎలా సిద్ధం చేస్తారు? ఇందులో లొట్టలేసుకుని మరీ తినే రకాలేంటి? ఎండు సరుకు మార్కెట్ ఎలా ఉంటుంది? సముద్రాలు దాటి ఏయే దేశాలకు ఎగుమతి అవుతున్నాయి?... తెలుసుకోవాలంటే ఈ కవర్‌స్టోరీ చదవాల్సిందే!
చేపలకూర.. చేపల పులుసు.. చేపల ఇగురు.. చేపల వేపుడు.. ఇలా వంటకాలెన్నో చేసుకోవచ్చు. వీటిని జిహ్వచాపల్యంతో ఎగబడి తిననివారంటూ ఉండరు. సముద్రం.. నదులు.. చెరువుల్లో దొరికే రకరకాల చేపలు నిత్యం మార్కెట్లు.. సూపర్‌మార్కెట్లు... నగరాల్లో మెట్రో మాల్స్‌లో విక్రయిస్తుంటారు. అయితే ఈ చేపల తరహాలోనే ఉప్పు (ఎండు) చేపలకు కూడా ఎంతో గిరాకీ ఉంది. సాధారణంగా అప్పుడే సముద్రంలోను.. నదుల్లోను.. చెరువుల్లోను.. కాలువల్లోను వేటాడి పట్టుకునే చేపలను పచ్చి చేపలు అంటారు. వీటిని ఐస్ లేదా ఫ్రిజ్‌లలో కొన్నిరోజులపాటు నిల్వ చేసుకుని ఆ తర్వాత నచ్చినట్లు వండుకుంటారు.
లేదంటే ఉప్పు, కారం దట్టించి నిల్వ చేసుకుని కూర వండుకుంటారు. కానీ ఎండుచేపలు అలా కాదు. వారాలు.. నెలలు.. నిల్వ చేసుకుని, నచ్చినప్పుడు నచ్చినన్ని ముక్కలు వండుకుని తినొచ్చు. మామూలు చేపలు ఎంత రుచిగా ఉంటాయో, ఉప్పు చేపలు కూడా అంతకుమించిన రుచినిస్తాయి. ఒక్కసారి వీటికి అలవాటు పడ్డామంటే తినకుండా ఉండలేం. ఈ ఉప్పు చేపలను కాల్చుకుని.. లేదంటే కూరలా వండుకుని కూడా నచ్చినట్లు తినవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఉప్పు చేపలను నంజుకుని, లేదా పప్పుచారు, గోంగూరతో తిని ఎంజాయ్ చేసే వాళ్లు కోట్లలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అంతేకాదండోయ్.. మామూలుగా ఇంట్లో చేపల కూర వండితే కమ్మటి వాసన ఓ నాలుగు ఇళ్ల వరకు వెళుతుంది. కానీ ఇంట్లో ఉప్పు చేప కాల్చడమో.. వండటమో చేస్తే ఆ వాసన ఏకంగా వీధిలోకి, పక్క అపార్ట్‌మెంట్లకు సైతం వ్యాపిస్తుంది. అదీ ఉప్పు చేప కమ్మటి వాసన ఘాటు.
అసలెలా చేస్తారంటే..
సాధారణంగా సముద్రంలో మర పడవల నుంచి ఇంజన్ బోట్ల వరకు వారాలు, నెలల తరబడి సముద్రంలో వేటాడతారు. ఇలా వేటాడేటప్పుడు భారీ చేపలతోపాటు చిన్నచిన్న చేపలు సైతం వలకు చిక్కుతాయి. వీటిని బోట్ల అడుగున రోజులపాటు ఐస్‌లో నిల్వ చేస్తారు. వేట అయిపోగానే హార్బర్ లేదా బెర్త్‌ల వద్దకు బోట్లు వచ్చినప్పుడు వీటిని బోటు ట్యాంకుల నుంచి బయట పోగులుగా వేస్తారు. వీటిలో పెద్దపెద్ద చేపలను విక్రయించగా, మిగిలిపోయిన చిన్నాచితక పచ్చి చేపలను ఉప్పు చేపలుగా తయారు చేస్తారు. అయితే హార్బర్ లేదా ఒడ్డుకు తెచ్చే ఈ చిన్నపాటి పచ్చి చేపలను మత్స్యకారులు పోగులుగా అమర్చి.. వేలంలో విక్రయిస్తారు.

వీటిని మత్స్యకార మహిళలు వేలంలో పాడుకుని ఎండు చేపలుగా మార్చుతారు. ఒకరకంగా చెప్పాలంటే ఎండు చేపలను తయారు చేయడంలో తొంభైశాతం మహిళలదే కీలకపాత్ర. ముఖ్యంగా పచ్చి చేపల నుంచి ఎండు చేపలుగా మారే వాటిలో వంజరం, కోనాం, మాగ, సుదుములు, పండుగప్ప, గొరస, పసుపుపార, మొరాలు, చందువా, పాల్‌సొర, నత్తలు, కొడువ, చిన్నచందుల్, కొర్రమీను, కోలా, ఖానగడతలు, పారలు, గులివిందలు, దావిడాలు, రవ్వు, కొమ్ముజెల్ల, ఎర్రమైల, వాలుగ, కానంగత్తు, పారై, శంకరా, నెమ్మీన్, కిళంగా, నీలా, పెద్ద ఎండురొయ్యలు, రొయ్యపొట్టు వంటి దాదాపు 60 రకాల ఎండుచేపలు ఉంటాయి.
వేలంలో ఈ పచ్చి చేపలను పాడుకున్న మహిళలు వీటిని రెండు పెడలుగా కోస్తారు. లోపల పేగులు, సెంకులు తదితర వ్యర్థాలను తొలగించి పూర్తిగా శుభ్రం చేస్తారు. ఇందుకు చాలా కష్టపడాలి. ఎందుకంటే పెద్ద పచ్చి చేపలను కట్ చేసి లోపల వ్యర్థాలు తొలగించి వండడానికి వీలుగా మార్చడం చాలా సులువు. కానీ చిన్న చేపలను ఇలా చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఇలా చిన్న పచ్చి చేపలను లోపల వ్యర్థాలు తొలగించిన తర్వాత వాటిని ఉప్పు కుండీల్లో ఊరబెడతారు. ఒక వారం లేదా పదిహేను రోజుల పాటు ఊరబెట్టిన తర్వాత బయటకు తీస్తారు. అప్పుడు మళ్లీ ఆ చేపలను సముద్రపు ఒడ్డున లేదా బోట్లపైన.. విశాల ప్రాంతంలో కొన్ని రోజుల పాటు ఎండ బెడతారు. ఇందుకు చాలా శ్రమించాలి. వర్షం వచ్చినా.. లేదా వాతావరణం బాగోకపోయినా వీటిలోని ఉప్పు తొలగిపోతుంది. అందుకే చేపల్లోని వ్యర్థాలను తొలగించి ఉప్పు కుండీల్లో ఉంచి, ఆ తర్వాత మళ్లీ బయట ఆరబెట్టే జాగ్రత్తలు తీసుకుంటారు. ఇలా ఆరుబయట ఎండబెట్టిన తర్వాత వంజరం, కోనాం, పండుగప్ప చేపలను ‘తట్టాలు’ అని పిలుస్తారు. వీటిని ఎండుచేపల మార్కెట్లకు, ఇతర రాష్ట్రాలకు లారీల్లో తరలిస్తారు.

కష్టానికి తగ్గట్టే...
చేపలను కొన్ని రోజులపాటు బాగా ఎండబెట్టిన తర్వాత మోచేయి పొడవు ఉన్న ఒక్కొక్క వంజరం లేక కోనాం చేప రూ.800 నుంచి రూ.1,200 వరకు ధర పలుకుతుంది. పచ్చి శావడా రూ.100కి అరకిలో వరకు ధర పలుకుతుంది. నెత్తళ్లు కిలో రూ.450 నుంచి రూ.600 వరకు పలుకుతాయి. ఎండురొయ్యలు కిలో రూ.800 వరకు ఉంటాయి. పప్పురొయ్య కిలో రూ.500, రొయ్యపొట్టు కిలో రూ.450, పండుగప్ప రూ.1,000, బొమ్మిడాలు కిలో రూ.350, చందువా చేప కిలో రూ.900 వరకు మార్కెట్ పలుకుతుంది. ఉప్పుచేప ముక్కలు కిలో రూ.450, అపోలో ఫిష్ రూ.400, అయితే బోట్లపై ఆరబెట్టిన ఎండుచేపలకు రేటు మరింత ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా బోట్లపై ఎండబెట్టిన నెత్తళ్లకు మంచి ధర ఉంటుందని మత్స్యకారులు చెబుతున్నారు. ఇదంతా ఒకెత్తయితే సముద్రంలో చేపల వేట నిషేధం సమయంలో ఎండుచేపలకు మరింత గిరాకీ ఉంటుంది. ప్రాంతాన్ని బట్టి ధరలు మారుతుంటాయి. ఒకరకంగా ఈ సమయంలోనే ఎండుచేపలు విక్రయించే వారికి మంచి లాభాలు వస్తాయి.
ఎన్ని ఎండు చేపల మార్కెట్లో...
ఆంధ్రప్రదేశ్‌లో ఎండుచేపలు దొరకని తీర ప్రాంతం అంటూ లేదు. ఎక్కడికక్కడ తీర ప్రాంతాల్లో మత్స్యకారులు వీటిని విక్రయిస్తుంటారు. అయితే భారీస్థాయిలో కావాలంటే ఎండుచేపల సంతలకు వెళ్లాల్సిందే..! ఇక్కడ పాతిక నుంచి యాభై రకాలకుపైగా ఎండుచేపలు వివిధ ధరల్లో దొరుకుతాయి. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో ఉప్పాడ తీరం ఎండుచేపలకు ప్రసిద్ధి. ఉప్పాడకు ఆంధ్ర, తెలంగాణ నుంచి పర్యాటకులు సముద్రం అందాలతోపాటు ఇక్కడ ప్రఖ్యాతి చెందిన ఉప్పాడ జాంధాని చీరల కొనుగోలుకు పెద్దఎత్తున వస్తారు. వీరంతా తిరుగు ప్రయాణంలో ఎండు చేపల తట్టాలను ఎంతో ఇష్టంగా కొనుగోలు చేస్తుంటారు. ఒక్క ఉప్పాడ ఉప్పు చేపల మార్కెట్ విలువే ఏడాదికి రూ.2.50 కోట్ల వరకు ఉంటుంది.
అలాగే ఉమ్మడి శ్రీకాకుళం, విశాఖ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోనూ అనేక భారీ ఉప్పు చేప సంతలున్నాయి. నెల్లూరు జిల్లాలో కొవ్వూరు ఎండుచేపల మార్కెట్ ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడి నుంచే రాయలసీమ జిల్లాలకు ఎండుచేపలు టన్నుల కొద్దీ వెళ్తాయి. విశాఖ హార్బర్‌లో భారీ ఎండుచేపల మార్కెట్ ఉంది. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో పాతపాడు, కృష్ణాజిల్లా నాగాయలంక ఎండుచేపల మార్కెట్‌లు ఎంతో ప్రసిద్ధి చెందాయి. ఆంధ్రప్రదేశ్‌లో రోజుకు సుమారు 550 టన్నుల వరకు ఉప్పుచేపలు ఉత్పత్తి అవుతున్నాయి. అందులో 180 టన్నుల వరకు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు ఉన్నాయి. ఏడాదికి వచ్చేసరికి ఏపీలో 5.22లక్షల మెట్రిక్ టన్నుల చేప సముద్రం నుంచి వస్తుండగా, ఇందులో ఎండుచేపలు ఏటా 90 వేల మెట్రిక్ టన్నులు దిగుమతి అవుతుండటం విశేషం. వీటి వ్యాపారం రూ.1368 కోట్ల వరకు ఉంటుందని మత్స్యశాఖ అధికారులు విశ్లేషించారు.
ఎప్పుడు కావాలంటే అప్పుడు...
ఉప్పులో ఊరేసిన ఎండుచేపలను ముక్కలుగా చేసుకొని చాలామంది ఇళ్లల్లో డబ్బాల్లో నిల్వ చేసుకుంటారు. ఇంట్లో ఏ కూర వండాలో తెలియని పరిస్థితులున్నా.. లేదంటే బయట కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్న సమయంలో ఎంచక్కా ఉప్పు చేప కూర వండుకుంటారు. అంతేకాదు ఏటా వేసవి సమయంలో సముద్రంలో 61 రోజులపాటు చేపల వేట నిషేధం అమలవుతుంది. అప్పుడు పచ్చి చేపలు అసలు దొరకవు. సముద్రం చేపగా ఎండు చేపలను తినొచ్చు. దీనికి పప్పుచారు అద్భుతమైన కాంబినేషన్. కొందరు గోంగూరతోను తింటారు. రాయలసీమలో అయితే చాలామంది రాగిసంకటితో నంజుకుంటారు. తెలంగాణలో ఉప్పుచేపలను విరివిగా వాడుతారు. అందుకే ఉప్పుచేపను ప్రతి ఒక్కరు అత్యవసర కూర కింద వాడుకుంటారు.
భలే డిమాండ్
సాధారణంగా చేపలు, రొయ్యల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే కీలక స్థానంలో ఉంది. అలాగే ఉప్పుచేపల ఎగుమతుల్లోనూ ఎంతో పేరుంది. ప్రధానంగా రాష్ట్రంలో విశాఖ, శ్రీకాకుళం, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, మచిలీపట్నం, నెల్లూరు నుంచి సైతం భారీగా ఉప్పుచేపల ఎగుమతులు జరుగుతాయి. కాకినాడ జిల్లాలోని ఉప్పాడలో అయితే పూర్తి నాణ్యమైన ఎండు చేపలకు ఇతర రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉంది. ఉప్పాడ తీరప్రాంత గ్రామాలైన సుబ్బంపేట, కొత్తపేట, రంగూన్‌పేట, సూరాడపేట, రామిశెట్టిపేట, మాయాపట్నం, అమీనబాద్, మూలపేట, పొన్నాడ, కోనపాపపేట, తొండంగి మండలాల్లోని పలు తీరప్రాంత గ్రామాల్లో మత్స్యకార మహిళలు ఎండు చేపల సేకరణలో నిష్ణాతులుగా పేరొందారు.
అలాగే విశాఖ, పశ్చిమగోదావరి, నాగాయలంక, నెల్లూరు జిల్లా కొవ్వూరులో వేలాది మంది ఉప్పు చేపల తయారీ, విక్రయాలపై జీవనోపాధి పొందుతున్నారు. వేట విరామంలో... సుమారు 61 రోజుల పాటు సముద్రంలో వేట లేని సమయంలో మహిళలే ఎండు చేపల విక్రయం ద్వారా కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని కొల్లేరు సరస్సు ప్రాంతంలో ఎండుచేపలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. ఇక్కడ కొరమీను, బొమ్మిడాయి, వాలుగ తదితర ఎండుచేపలు దొరుకుతాయి. అలాగే ఆంధ్ర రాష్ట్రం నుంచి అధికంగా చెన్నైలో మూల కొత్తళం ఎండుచేపల మార్కెట్‌కు వెళ్తాయి. ఇది దేశంలోనే అతిపెద్ద ఉప్పు చేపల మార్కెట్. రాష్ట్రంలో ఉప్పుచేపల తయారీ, విక్రయాల్లో సుమారుగా 38 వేల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి.
కేరళ, బెంగళూరు, కలకత్తా, చెన్నై నగరాలకు లారీల ద్వారా ఉప్పాడతోపాటు రాష్ట్రం నలుమూలల్లోని అనేక తీరప్రాంతాల నుంచి ఎండు చేపలు ఎగుమతి పెద్దఎత్తున జరుగుతోంది. ఎండు చేపలను తాటాకు బుట్టల్లో ప్యాక్ చేసి ఇతర రాష్ట్రాలకు లారీల్లో తరలిస్తారు. అలాగే పండుగప్పలు, వంజరం లాంటి ఎండు చేపలు విమానాశ్రయాల ద్వారా దుబాయ్, యూఎస్ తదితర దేశాలకు కూడా బంధువుల ద్వారా ఎగుమతి అవుతున్నాయి. అలాగే రాష్ట్రంలో ఉత్పత్తయ్యే ఎండుచేపల్లో పదిశాతమే స్థానికంగా వినియోగిస్తుండగా.. మిగిలినవి ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. దేశంలోని ఇతర తీరప్రాంత రాష్ట్రాల నుంచీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని మార్కెట్లకు ఎండుచేపలు వస్తుంటాయి. వీటికి మంచి డిమాండ్ ఉంటోంది.
ఎన్ని కష్టాలో...
ఎండుచేపల వ్యాపారానికి కష్టాలు సైతం చాలా ఉన్నాయి. ఏటా వచ్చే వరుస తుఫాన్లు, అల్పపీడనాలతో ఈ వ్యాపారం ఎక్కువగా దెబ్బతింటోంది. సాధారణంగా ఉప్పు చేపలను పాతర నుంచి తీసిన తర్వాత ఆరుబయట ఎండబెట్టడం పెద్ద సమస్యగా మారింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఎలాంటి వసతులు లేవు. పలుచోట్ల హార్బర్ల సమీపంలో ఎండేస్తున్నా తగిన చోటు ఉండడం లేదు. కావునే నేలపైనే ఇసుక, మట్టిలోనే ఆరబెట్టాల్సిన పరిస్థితి. అలాంటప్పుడు ఇసుక ఎక్కువగా కలిసిపోతుంది. ఇసుక ఎక్కువగా ఉండే ఎండుచేపలకు ధర కొంచెం తక్కువ. అదే బోట్లపై ఎండబెట్టే ఉప్పుచేపలకు కిలోకు అదనంగా రూ.100 నుంచి రూ.300 వరకు లభిస్తుంది. మరోపక్క ఎండుచేపల నిల్వకు మత్స్యశాఖ తరఫున పెద్దగా గోదాములు కూడా లేవు. దీంతో వచ్చిన ధరకు వీటిని విక్రయించాల్సిన పరిస్థితి.
వర్షాకాలంలో అయితే ఎండుచేపలకు పట్టిన ఉప్పు పాడై కొంచెం దెబ్బతింటాయి. వీటిని నిల్వ చేసే గోదాముల సదుపాయం లేకపోవడంతో రొయ్యల చెరువులు, కోళ్లఫారాలకు వీటిని తక్కువ ధరకు విక్రయించి నష్టపోతున్నామని మత్స్యకార మహిళలు వాపోతున్నారు. అలాగే ఆరుబయట వీటిని ఆరేయడానికి వేలకు వేల ఖరీదుతో పెద్దపెద్ద గోతాలు కొనుగోలు చేస్తుండడంతో ఖర్చుపెరిగిపోతుందని మత్స్యకార సంఘాలు వాపోతున్నాయి.
అయితే నాణ్యత కలిగిన ఎండు చేపలను తయారు చేసేందుకు ప్రత్యేకంగాఆరబెట్టేందుకు తీరప్రాంత గ్రామాల్లో ప్లాట్‌ఫాంలు, డ్రైయింగ్ రేక్‌లు నిర్మించాలని మత్స్యకార మహిళలు కోరుతున్నారు. ఉప్పుచేపలను తొట్టెలోంచి తీసిన తర్వాత వాటిని ప్లాట్‌ఫాంలపై ఎండబెడితే మంచి నాణ్యత ఉంటుందంటున్నారు. సముద్రం ఒడ్డున, ఇసుకలో, బరకాలు వేసి ఆరబెట్టిన చేపలు అంతగా నాణ్యత ఉండవని పేర్కొంటున్నారు.
ఆరోగ్యం అంతా ఇంతా కాదు..
ప్రస్తుతం మార్కెట్లో ఏంకొనాలన్నా రకరకాల రసాయనాలు కలిపి విక్రయించేవే అధికం. కానీ ఒక్క ఎండుచేపలో మాత్రం ఎలాంటి రసాయనం కలపరు. ఒకరకంగా చెప్పాలంటే ప్రస్తుత కల్తీ ప్రపంచంలో కల్తీకాని వాటిలో ఉప్పుచేపలే ఎక్కువ అని చెప్పాలి. వీటిలో అపారమైన ప్రొటీన్లు ఉన్నాయి. విటిమిన్ ఏ, డీ, ఈ పుష్కలం. అరుగుదలను పెంచి, జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. అదేసమయంలో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటూ ఆరోగ్యాన్ని ఇస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే ఎండుచేపల్లో ఉండే ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గుండెసంబంధిత వ్యాధులను అడ్డుకుంటాయి. రక్తపోటును తగ్గించి కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తాయి. మెదడు పనితీరును, జ్ఞాపకశక్తిని పదును చేస్తాయి. ఎండుచేపల్లో క్యాల్షియం, పాస్ఫరస్ వంటి ఖనిజాలు అధికం. ఇవి ఎముకలు, దంతాల ఆరోగ్యానికి సహాయపడతాయి. జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు మలబద్దకం సమస్యను తొలగిస్తాయని పోషకాహార నిపుణులు పేర్కొంటున్నారు.
ఎండు చేపల్లో ఆయుర్వేద గుణాలు ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వలన కీళ్లనొప్పులు, మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అన్ని వయస్సుల వారు తినొచ్చు. సముద్రంలో లభ్యమయ్యే నెత్తళ్ళు, మాగ, వంజరం వంటి చేపల్లో మంచి పోషకాలు లభిస్తాయని వైద్యులు చెబుతున్నారు. పచ్చినెత్తళ్ళు, ఎండు నెత్తళ్లను బాలింతలకు పత్యంగా పెడతారు. అదేవిధంగా మాగ, సుదుములు, కోనాము తదితర పచ్చిచేపల్లో మెటబాలిజం విలువలు అధికమని వైద్యులు చెబుతున్నారు. మొత్తానికి ఉప్పు (ఎండు) చేపల కథ వాటిలాగే ఎంతో రుచిగా బాగుంది కదూ.
- చుక్కా అప్పారావు, కాకినాడ
99854 11245
ఈ వార్తలు కూడా చదవండి.
నేడు స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఎంతకు చేరాయంటే..
చిన్న తేడానైనా పసిగట్టేస్తున్నారు...
Read Latest Telangana News and National News