Share News

వీధులే... ద్రాక్ష తోటలు

ABN , Publish Date - Mar 02 , 2025 | 01:23 PM

మార్చి నెల వచ్చిందంటే చాలు... ప్రపంచ వైన్‌ ప్రేమికులు అర్జెంటీనా వైపు చూస్తారు. అక్కడ లక్షల ఎకరాల్లో ద్రాక్ష తోటల సాగుచేస్తుంటారు. పంట కోతకి వచ్చాక అంబరాన్నంటేలా సంబరాలు జరుపుతారు. అదే ‘మెన్డోజా గ్రేప్‌ హార్వెస్ట్‌ వేడుక’. స్థానికంగా ‘వెండీమియా’గా పిలుస్తారు.

వీధులే... ద్రాక్ష తోటలు

మార్చి నెల వచ్చిందంటే చాలు... ప్రపంచ వైన్‌ ప్రేమికులు అర్జెంటీనా వైపు చూస్తారు. అక్కడ లక్షల ఎకరాల్లో ద్రాక్ష తోటల సాగుచేస్తుంటారు. పంట కోతకి వచ్చాక అంబరాన్నంటేలా సంబరాలు జరుపుతారు. అదే ‘మెన్డోజా గ్రేప్‌ హార్వెస్ట్‌ వేడుక’. స్థానికంగా ‘వెండీమియా’గా పిలుస్తారు. ఈ వేడుకలో అన్నీ విశేషాలే...

మెన్డోజా... ఉత్తర అర్జెంటీనాలో ఓ నగరం. గ్రామ, పల్లె వాతావరణాల మేలుకలయికైన మెన్డోజాలో అడుగడునా ద్రాక్ష తోటలతో పాటు వైనరీలుంటాయి. మనదగ్గర సంక్రాంతి, బీహు ల్లాగే అక్కడ కూడా ద్రాక్ష పంటల కోత సమయంలో వేడకల్ని నిర్వహిస్తారు.


షాపులు, వీధులను ద్రాక్ష పళ్లు, ఆకులు, వైన్‌ బాటిల్స్‌తో అలంకరిస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిరంతరం సాగుతుంటాయి. సాయంత్రాల్లో వైన్‌ రుచులను చూడడంతో పాటు ఆటపాటలు మామూలే. అంతేకాకుండా ప్రతీ విభాగం నుంచి ‘హార్వెస్ట్‌ క్వీన్‌’ పేరున బ్యూటీ కాంటెస్ట్‌ను నిర్వహిస్తారు. అంతా కలిసి మార్చి మొదటి వారంలో మూడు రోజుల పాటు నేషనల్‌ గ్రేప్‌ హార్వెస్ట్‌ ఫెస్టివల్‌ని ‘ద ఫ్రాంక్‌ రొమెరో డే గ్రీక్‌ థియేటర్‌’ లో పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. ‘నేషనల్‌ హార్వెస్ట్‌ క్వీన్‌’ ని ఎంపిక చేయడంతో ఈ వేడుకలు ముగుస్తాయి.


స్పెయిన్‌వారి రాకతో...

వాస్తవానికి ‘వెండీమియా’ వేడుకలు 16వ శతాబ్దంలో మొదలయ్యాయి. స్పానిష్‌ మిషనరీకి చెందినవారు తమతో పాటు ద్రాక్ష తోటల సాగునీ ఆర్జెంటీనాకు తీసుకువచ్చారు. పంట కోతల సమయంలో ఉత్సవాలు చేయడం ప్రారంభించారు. అవే నేటికీ కొనసాగుతున్నాయి. రైతులు, వైన్‌ తయారీదారుల కష్టానికి గుర్తింపుగా సంబరాలను నిర్వహించడం ఆనవాయితీగా మారింది. 1936 ఏప్రిల్‌ నుంచి ఈ ఉత్సవాలను క్రమం తప్పకుండా జరుపుకొంటున్నారు. వేలాది మంది నృత్యసంగీతాలలో పాల్గొంటారు. నగరంలోని ప్రతి వీధిలో శకటాల ఊరేగింపులుంటాయి.

pandu.jpg


ద్రాక్షగుత్తుల హారాలను ధరించిన సుందరీమణులు చేసే నృత్యాలు హైలెట్‌గా నిలుస్తాయి. మెన్డోజాలోని ప్రతి పౌరుడూ వెండీమియాలో పాల్గొంటారంటే అతిశయోక్తి కాదు. మార్చి నుంచి నగరమంతా ఆనందడోలికల్లో మునిగిపోతుంది. ఈ వేడుకల్ని చూడడానికి వివిధ దేశాల టూరిస్టులు అక్కడికి వెళ్తుంటారు. ఈ ఏడాది మార్చి 9 న ‘వెండీమియా’ వేడుక ప్రారంభం అవుతుంది. ‘నిన్న ఓ గతం, రేపు ఓ కల... ఈ రోజే నిజం’ అన్న వాస్తవాన్ని మెన్డోజా పౌరులు గట్టిగా నమ్ముతారు. అదే వెండీమియా వేడుకకి స్ఫూర్తి.

Updated Date - Mar 02 , 2025 | 01:23 PM