‘ట్రైన్ స్ట్రీట్’లో సెల్ఫీల జోరు
ABN , Publish Date - Feb 23 , 2025 | 08:32 AM
రెస్టారెంట్‌లో టాయ్ ట్రైన్‌పై సర్వ్‌చేయడం చూశాం. టేబుల్‌పై ఏర్పాటుచేసిన ట్రాక్‌పై ఆర్డర్ ఇచ్చిన వంటకాలతో వస్తుంది బుల్లిరైలు. అదో సరదా. కానీ అక్కడ మాత్రం ట్రాక్ పక్కన వరుసగా ఉన్న రెస్టారెంట్లలో కూర్చుంటే... ఏకంగా ట్రైన్ మీ పక్క నుంచే దూసుకుపోతుంది.

రెస్టారెంట్‌లో టాయ్ ట్రైన్‌పై సర్వ్‌చేయడం చూశాం. టేబుల్‌పై ఏర్పాటుచేసిన ట్రాక్‌పై ఆర్డర్ ఇచ్చిన వంటకాలతో వస్తుంది బుల్లిరైలు. అదో సరదా. కానీ అక్కడ మాత్రం ట్రాక్ పక్కన వరుసగా ఉన్న రెస్టారెంట్లలో కూర్చుంటే... ఏకంగా ట్రైన్ మీ పక్క నుంచే దూసుకుపోతుంది. ఈ వెరైటీ అనుభవాన్ని సెల్ఫీల్లో బంధించేందుకు పర్యాటకులు వియత్నాంలోని ‘ట్రైన్ స్ట్రీట్’కు క్యూ కడుతున్నారు. ఆ విశేషాలే ఇవి...
అప్పటిదాకా ఒకటే హడావిడి... అరుపులు, కేకలు, నవ్వులు, ఊసులతో అక్కడి జనమంతా ఫుడ్, డ్రింక్స్ లాగిస్తూ ఉంటారు. ‘చుక్ చుక్...’ అంటూ రైలు శబ్దం చెవులకు వినిపించగానే ఒక్కసారిగా అందరూ సెల్ఫీలు తీసుకునేందుకు సిద్ధమవుతారు. ట్రాక్‌కు అత్యంత సమీపంలో, దాదాపుగా తగిలినట్టే అడుగు దూరంలో ఉన్న రెస్టారెంట్లను దాటుకుంటూ రైలు వెళ్తుంటే... సెల్ఫీలు తీసుకుంటూ ఆనందిస్తారు.
అది వియత్నాం రాజధాని హనోయిలోని ‘ట్రైన్ స్ట్రీట్’. అక్కడికి అడుగుపెట్టగానే.. ఒక రైల్వే ట్రాక్, దానికి ఇరువైపులా అందంగా అలంకరించిన చిన్న చిన్న కేఫ్‌లు, రెస్టారెంట్లు కనిపిస్తాయి. వాటి ఆవరణలో చెక్కతో చేసిన కుర్చీలు, బల్లలు... పక్కనే ఆ మార్గంలో రైలు ఏయే సమయంలో అక్కడికి వస్తుందో రాసి ఉన్న బ్లాక్ బోర్డు కనిపిస్తాయి. ఆ వీధిలోకి ప్రవేశించడానికి లేదా అందులో నుంచి వెళ్లే ట్రైన్‌ని చూడడానికి ప్రత్యేకించి ఎలాంటి టికెట్టు అక్కర్లేదు. అయితే ఆయా షాపుల ముందు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కుర్చీలపై కూర్చొని, తాపీగా, ఉచితంగా ట్రైన్‌ని చూస్తామంటే మాత్రం కుదరదు. అంటే అక్కడ కూర్చుని, లేదా నిల్చుని ట్రైన్‌ని చూడాలంటే కచ్చితంగా ఆయా షాపుల్లో టీ, కాఫీ, బీర్, కోక్ లేదా వేరేదైనా ఆర్డర్ ఇవ్వాల్సిందే.
కూత కూసి మరీ...
సోమవారం నుంచి శుక్రవారం వరకు... హనోయి మీదుగా వివిధ ప్రాంతాలకు రోజుకు తొమ్మిదిసార్లు రైళ్ల రాకపోకలు జరుగుతాయి. అది కూడా రాత్రి ఏడు గంటల నుంచి పదకొండు గంటల మధ్యలోనే. అదే వారాంతాల్లో అయితే ఉదయం 8:45 గంటల నుంచి రాత్రి 11 గంటల దాకా రోజుకు 16 సార్లు రాకపోకలుంటాయి. అందుకే ఈ వీధిలో వారాంతాల్లో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. విశేషం ఏమిటంటే... రైలు ఈ వీధిలోకి ప్రవేశిస్తోందనగానే అక్కడున్న వాళ్లందరినీ అలర్ట్ చేయడానికి సైరన్ మోగుతుంది. దాంతో కేఫ్ యజమానులు పర్యాటకులకు తగిన జాగ్రత్తలు చెప్పి అప్రమత్తం చేస్తారు. కాబట్టి ప్రమాదాలు జరిగేందుకు తావుండదు.
ఇల్లే కేఫ్‌గా..
ఈ రైలు మార్గాన్ని 1902లో ఫ్రెంచ్ వలస పాలనలో ఏర్పాటు చేశారు. ఆ సమయంలో ఇది నగరం నుంచి దూరంగా ఉండేదట. క్రమంగా హనోయి విస్తరిస్తూ రావడంతో ఈ రైలు మార్గం నగరం మధ్యలోకి చేరుకుంది. 90వ దశకం చివరినాటికి ‘ట్రైన్ స్ట్రీట్’కి ప్రజాదరణ బాగా పెరిగింది. మొదట్లో ఈ రైల్వే లైన్‌కు ఇరువైపులా ఇళ్లులుండేవి. పర్యాటకం పెరగడంతో ఇక్కడ నివసించే వారంతా తమ ఇళ్లను చిన్న చిన్న కేఫ్‌లుగా మార్చుకుని వ్యాపారం చేయడం మొదలెట్టారు. ఆ తర్వాత పర్యాటకుల సందడితో పాపులర్ కావడంతో హనోయిలో తప్పక సందర్శించాల్సిన ప్రాంతంగా మారింది.
2019లో ఇక్కడ జరిగిన కొన్ని అనివార్య సంఘటనల కారణంగా వియత్నాం ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని, దుకాణా లన్నింటినీ మూసివేయించింది. అయితే చర్చల అనంతరం తిరిగి 2023లో అనుమతిచ్చింది. అప్పటి నుంచి ఈ వీధిని సందర్శించిన పర్యాట కులంతా ఫొటోలు, వీడియోలతో పాటు తమ అనుభవాలను సోషల్‌మీడియాలో పంచుకోవడంతో... ‘ట్రైన్ స్ట్రీట్’ పాపులర్ సెల్ఫీ పాయింట్‌గా, ట్రావెల్ డెస్టినేషన్ స్పాట్‌గా మారిపోయింది.