సంతోషాల దీవిని చూసొద్దాం పదండి..
ABN , Publish Date - Jul 20 , 2025 | 09:04 AM
ఫుట్‌బాల్ గ్రౌండ్ అంత విస్తీర్ణంలో ఉండే ద్వీపం. కరెంటు ఉండదు. తాగేందుకు మంచి నీళ్లు కూడా ఉండవు. బయటకు రావాలంటే పడవలే దిక్కు. ఎవరైనా చనిపోతే పూడ్చేందుకు ఆరడుగుల స్థలం కూడా లేదు. ‘అయినా మేమంతా ఇక్కడ సంతోషంగా ఉన్నాం’ అంటున్నారు అక్కడి ప్రజలు. ఇంతకీ ఆ వింత ద్వీపం ఎక్కడుంది?
ఫుట్‌బాల్ గ్రౌండ్ అంత విస్తీర్ణంలో ఉండే ద్వీపం. కరెంటు ఉండదు. తాగేందుకు మంచి నీళ్లు కూడా ఉండవు. బయటకు రావాలంటే పడవలే దిక్కు. ఎవరైనా చనిపోతే పూడ్చేందుకు ఆరడుగుల స్థలం కూడా లేదు. ‘అయినా మేమంతా ఇక్కడ సంతోషంగా ఉన్నాం’ అంటున్నారు అక్కడి ప్రజలు. ఇంతకీ ఆ వింత ద్వీపం ఎక్కడుంది?
‘సౌకర్యాలు ముఖ్యం కాదు... సంతోషం మాకు ముఖ్యం’ అంటారు ఆ దీవిలో నివసించే ప్రజలు. అక్కడ నివసిస్తున్నవి మత్స్యకారుల కుటుంబాలే. కొలంబియా తీరంలో ఉన్న అతి చిన్న ద్వీపం ‘శాంటాక్రజ్ డెల్ ఐలోట్’. ఫుట్‌బాల్ గ్రౌండ్ అంత విస్తీర్ణంలో ఉండే ఈ ద్వీపంలో సుమారు 1200 మంది నివసిస్తున్నారు. 120 వరకు ఇళ్లు ఉన్నాయి. రెండు షాపులు, ఒక రెస్టారెంట్‌తో పాటు స్కూల్ కూడా ఉంది. దీవి విస్తీర్ణం తక్కువగా ఉండటంతో కొంతమంది నీటిపైనే కర్రలతో ఇళ్లు కట్టుకుని నివాసం ఉంటున్నారు. జనరేటర్ సహాయంతో ఐదు గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా అవుతుంది. సాయంత్రం 6 గంటలకు విద్యుత్ సరఫరా ప్రారంభిస్తారు. రాత్రి 11 గంటల వరకు మాత్రమే విద్యుత్ ఉంటుంది. ఆ సమయంలోనే టీవీ చూస్తారు. నౌకాదళ అధికారులు మూడు రోజులకొకసారి పడవల్లో వారికి మంచి నీటిని తీసుకొచ్చి అందిస్తారు. వాటినే పొదుపుగా వాడుకుంటారు. ఇన్ని కష్టాలున్నా ఆ దీవి వారికి స్వర్గధామం.

ఎలా మొదలైందంటే...
150 ఏళ్ల క్రితం కొలంబియా తీరప్రాంత పట్టణమైన బారులో నివసించే కొంతమంది మత్స్యకారులు చేపల వేటకోసం సముద్రంలోకి వెళ్లారు. ఎప్పుడూ చేపలు పట్టే చోట కాకుండా కొత్త ప్రదేశంలో పట్టాలని 50 కి.మీ మేర సముద్రంలోకి వెళ్లారు. చేపలు పట్టి వెనుదిరిగే సమయానికి చీకటి పడింది. దాంతో తిరిగి వెళ్లడం ఎందుకని దగ్గరలో ఉన్న చిన్న దీవిలో బస చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ దీవిలో ఒక్క దోమ కూడా లేకపోవడం వాళ్లకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అంతేకాకుండా ఆ రాత్రి చాలా ప్రశాంతంగా నిద్రపోయారు.
ఆ విధంగా బాగా నచ్చడంతో ఆ దీవినే ఆవాసంగా చేసుకున్నారు. ఆ తర్వాత వాళ్లంతా తమ కుటుంబాలను తీసుకొచ్చి చిన్న చిన్న ఇళ్లు కట్టుకుని దీవిలోనే ఉండిపోయారు. మత్స్యకారుల కుటుంబాల్లోని చాలామంది చుట్టు పక్కల ఉన్న దీవుల్లోని హోటల్స్, రిసార్టులో పనిచేస్తుంటారు. ఈ దీవిలో నేరాలు సున్నా. అందుకే మత్స్యకారులు దీవిని వదలడానికి ఇష్టపడరు. పైగా ‘ఇక్కడ ప్రశాంతమైన జీవితం గడుపుతుండగా బయటి ప్రపంచం ఎందుకు?’ అని ప్రశ్నిస్తుంటారు. ఇళ్లకు తాళాలు కూడా వేయరు. ‘‘నా జీవితమంతా ఇక్కడే గడిచింది. శేషజీవితాన్ని కూడా ఇక్కడే గడుపుతాను’’ అని అంటారు 66ఏళ్ల జువెనల్ జులియో. ఈయన తాత ఈ దీవి వ్యవస్థాపకుల్లో ఒకరు.

పర్యాటకుల ఆసక్తి...
‘శాంటాక్రజ్ డెల్ ఐలోట్’ దీవిలో నివసించే మత్స్యకారులు ఒక్కదాని గురించే చింతిస్తుంటారు. అదేమిటంటే చనిపోయిన వారిని పూడ్చేందుకు స్థలం లేకపోవడం. ఎవరైనా చనిపోతే వారిని తీరానికి చేర్చి అంత్యక్రియలు పూర్తి చేస్తుంటారు. హోటల్ పుంటా భాగస్వామ్యంతో దీవిలో ఒక అక్వేరియాన్ని ప్రారంభించారు. పర్యాటకులు రుసుము చెల్లించి అక్వేరియాన్ని సందర్శించ వచ్చు. ‘‘జనాభా పెరుగుతోంది. అందుకు సరిపడా స్థలం లేదు. అలా అని రెండు, మూడు అంతస్తుల్లో భవనాలు నిర్మించలేం. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి.
ప్రతిరోజూ అలల శబ్ధంతో నిద్రలేవడం ఎంతో సంతోషాన్నిస్తుంది. ఉదయాన్నే సముద్రాన్ని చూస్తే ప్రశాంతంగా ఉంటుంది’’ అంటారు స్థానికులు. రానురాను ఈ వింత దీవిని సందర్శించే పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. అయితే పర్యాటకులు బస చేసేందుకు స్థలం లేదు. దాంతో పక్కనే ఉన్న మరో దీవిలోని హోటల్‌లో బస చేసి, ఇక్కడికి వచ్చి చూసి వెళ్తుంటారు. మన దగ్గర లంకల్లాగే ఈ దీవిలో ప్రజలు కూడా అనేక సమస్యలతో సహజీవనం చేస్తున్నప్పటికీ అందులోనే ఆనందాన్ని వెదుక్కోవడం విశేషమే కదా.
ఈ వార్తలు కూడా చదవండి..
మళ్లీ లక్ష దాటేసిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News