Share News

వారిది ‘మొక్క’వోని సంకల్పం..

ABN , Publish Date - Jun 22 , 2025 | 10:36 AM

బాగా డబ్బు సంపాదించాలి, లగ్జరీ కారు కొనాలి, పేద్ద బంగ్లా కట్టుకోవాలి, బ్యాంకు బ్యాలెన్స్‌ పెంచుకోవాలి... సాధారణంగా ఈ లక్ష్యాలతో ముందుకు సాగుతుంటారు చాలామంది.

వారిది ‘మొక్క’వోని సంకల్పం..

బాగా డబ్బు సంపాదించాలి, లగ్జరీ కారు కొనాలి, పేద్ద బంగ్లా కట్టుకోవాలి, బ్యాంకు బ్యాలెన్స్‌ పెంచుకోవాలి... సాధారణంగా ఈ లక్ష్యాలతో ముందుకు సాగుతుంటారు చాలామంది. కానీ రోజుకు ఓ మొక్క నాటాలి, పచ్చదనాన్ని పెంచాలి, అడవుల్ని సృష్టించాలి, పర్యావరణాన్ని పరిరక్షించాలి... అనే అ‘సామాన్యులూ’ మన మధ్యనే ఉన్నారు. ‘మొక్క’వోని సంకల్పంతో చెట్టంత ఎదిగిన అలాంటి కొందరు వృక్షప్రేమికుల కథలే ఈ వారం కవర్‌స్టోరీ.

గ్రీన్‌ అంబాసిడర్‌

...........................................

కొందరి జీవితాలు అమితాసక్తిని కలిగిస్తాయి. దిల్లీకి చెందిన రాధిక కథ అలాంటిదే. రాధిక ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 8 లక్షల పళ్ల మొక్కలను నాటారు. ఈమె ‘ప్లాంటాలజీ’ సంస్థ స్థాపకురాలు, సీఈఓ. ఇంకా ఎన్‌ఎస్‌జీ, సిఐఎస్‌ఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌ లాంటి కేంద్ర సంస్థలకు ఆమె గ్రీన్‌ అంబాసిడర్‌. రాధిక కథ మామూలుగానే మొదలైంది.


‘మొక్కలు నాటుతాను సహాయం చేయండి’ అని దిల్లీ ప్రభుత్వాన్ని ఆశ్రయించింది. వాళ్లు అంత స్థలం ఎక్కడుంది అంటూ సున్నితంగా తోసిపుచ్చారు. కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తే నిధుల లేమి అంటూ పక్కకు తప్పుకున్నారు. ఇక వేరే దారి లేక తనే సొంతంగా ‘ప్లాంటాలజీ’ అనే సంస్థను స్థాపించి మొక్కలు నాటాలని అనుకుంది. అనుకోకుండా ఓ ప్రయాణంలో ఆర్మీ ఆఫీసర్‌ పరిచయం కావడంతో ఆయనకు తన జీవితలక్ష్యం గురించి తెలియజేశారు.

book4.6.jpg

ఆయన సానుకూలంగా స్పందించి, అవకాశం ఇచ్చారు. అలా రాఽధిక 2015లో లూధియానా కంటోన్మెంట్‌లో తొలి మొక్క నాటారు. ఇక అప్పటి నుంచి దిల్లీ, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, హర్యానా, మహారాష్ట్ర, రాజస్థాన్‌లలోని ఆర్మీ కంటోన్మెంట్లలో ‘మిషన్‌ ఫాల్వన్‌’ పేరున అనేక పళ్ల మొక్కలను నాటుతూనే ఉన్నారు. మామిడి, చింత, ఉసిరి, నేరేడు తదితర పళ్ల మొక్కలనే నాటడం ఈమె స్పెషాలిటీ. దీని వెనక పెద్ద ఆలోచనే ఉంది. పండ్ల కోసం వచ్చే పక్షులూ, కోతులకు సహాయం చేసినట్టు అవుతుందని అంటారావిడ. ప్రతి మొక్క కొనుగోలుకు తన సొంత డబ్బునే వినియోగించడం విశేషం.


book4.2.jpg

సామాన్యుడు... ప్రభుత్వ సలహాదారుగా...

ఒకే ఒక్కడు... అలుపుసొలుపు లేకుండా... సుమారు రెండు లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అటవీ ప్రాంతంలో తిరుగుతూ ప్లాస్టిక్‌ వ్యర్థాలను ఏరుతున్నాడు. సీడ్స్‌బాల్స్‌ను తయారుచేసి అడవుల్లో విసురుతూ పండ్ల చెట్లు పెరిగేలా చేస్తున్నాడు. అడవిలోనే ఆహారం లభిస్తే కోతులు గ్రామాల్లోకి దండెత్తిరావనే ఉద్దేశంతో. ‘ప్రకృతి సంరక్షణ సేవా సమితి’ అనే ఎన్జీఓను స్థాపించి కోటికి పైగా మొక్కలను నాటే కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు. ఇవన్నీ చేస్తున్న ఆ ఒకే ఒక్కడు కొమెర అంకారావు. అతడి ముద్దుపేరు జాజి. ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొమెర జాజి ప్రయత్నాన్ని అభినందించి... రాష్ట్రానికి అటవీ, పర్యావరణ శాఖ సలహాదారుగా నియమించి...


అతడు చేస్తున్న కృషిని మరో స్థాయికి తీసుకువెళ్లింది. అంటే ఒక సామాన్యుడు ప్రకృతిపై ప్రేమ పెంచుకుని చేసిన కృషితో అతడికి తెలియకుండానే అసామాన్యుడిగా మారాడన్నమాట. 43 ఏళ్ల కొమెర జాజి స్వస్థలం గుంటూరు జిల్లాలోని కారంపూడి. అతడి కన్నా ముందుగానే తెలంగాణలో కూడా వనజీవి రామయ్య తన జీవితాన్నే వృక్షసంరక్షణ కోసం అంకితం చేశారు. ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని సాధించారు. గతేడాది మరణించిన వనజీవి రామయ్య పర్యావరణం కోసం చేసిన కృషి మరవలేనిది. ‘వృక్షోరక్షతి రక్షితః’ నినాదాన్ని తలకు తగిలించుకుని, తన సహధర్మచారిణితో కలిసి ఆయన ప్రచారం చేసేవారు.


పచ్చని ఊరి కోసం...

పోలీసులకూ పచ్చని హృదయం ఉంటుందని చెప్పడానికి నిలువెత్తు సాక్ష్యం దేవేందర్‌ సూరా. ఆయన ‘హర్యానా చెట్టు మనిషి’ గా పేరు తెచ్చుకున్నారు. సూరా పోలీస్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఊర్లో చిన్నప్పుడు ఉన్న పచ్చదనం నేడు ఎందుకు మాయమవుతోందని మధనపడుతూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఆయన వన జీవితం 2012లో సోనిపట్‌లో మొదలైంది. రోజూ ఆఫీసు డ్యూటీ అయిపోగానే మొక్కలు నాటడం మొదలుపెట్టారు. ఎక్కువగా దేశీయ మర్రి, అనాస, నేరేడు లాంటి మొక్కలను నాటుతున్నారు. ఏడాదికి ఎంత లేదన్నా 50 వేల మొక్కలు నాటాలన్నది ఆయన లక్ష్యం. అంతేకాదు ‘జనతా నర్సరీ’ని కూడా స్థాపించారు. ఏడాదికి 25 వేల మొక్కలను ఉచితంగా సరఫరా చేస్తున్నారు. ’గ్రీన్‌ సోనిపట్‌’ తన జీవిత లక్ష్యంగా పెట్టుకున్నారు. రోజు వారీ ఖర్చులకు తండ్రి దగ్గర డబ్బులు తీసుకునే దేవేందర్‌ తన జీతాన్ని మొత్తం మొక్కలకే వెచ్చిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలిచారు.


వంద కోట్ల మొక్కలు లక్ష్యంగా...

జీవితంలో వంద కోట్ల మొక్కల్ని నాటాలనే లక్ష్యంతో సాగుతున్నారు దీపక్‌ గౌర్‌. ఆయన్ని ‘ట్రీమ్యాన్‌ ఆఫ్‌ గుర్గావ్‌’, ‘క్లైమెట్‌ వారియర్‌’గా పిలుస్తారు. అయితే 2010లో జరిగిన ఓ దుర్ఘటన ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. చాలా నెలలు కోమాలో ఉండిపోయారు. పచ్చని జీవితాలను అందిస్తోన్న చెట్లని మానవాళి పట్టించుకోవడం లేదని ఆయనకు బాధవేసింది. ఈ దిశలో తీవ్రంగా ఆలోచించి మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అలా 2012 నుంచి ఆరు లక్షలకు పైగా మొక్కల్ని నాటారు. ఉచితంగా మొక్కల్ని పంచి పెడుతున్నారు. దీని కోసం స్వయంగా నర్సరీ నిర్వహిస్తున్నారు.


‘అడవి’ మనిషి

రోజూ ఓ మొక్క నాటుతూ న్యూయార్క్‌ సిటీలోని సెంట్రల్‌ పార్క్‌ కంటే పెద్ద అడవిని మన దగ్గర ఒక వ్యక్తి సృష్టించాడంటే నమ్ముతారా? ఆయనే జాదవ్‌ మొలాయి పయెంగ్‌. ‘ఫారెస్ట్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా’గా ఆయనకు పేరుంది. జాదవ్‌ సృష్టించిన అడవి విస్తీర్ణం దాదాపు 1400 ఎకరాలు. ఆయన కృషిని గుర్తిస్తూ ఆ అడవికి ‘మొలాయి’ అని పేరు పెట్టారు. ప్రపంచంలోనే అతి పెద్ద నదీ ద్వీపంగా పేరుతెచ్చుకున్న మాజులిలోని ‘శాండ్‌బార్‌’ ఆయన కార్యస్థలం. గత నలభై ఏళ్లుగా అలుపెరగకుండా చెట్లను నాటుతూ తన పని తాను చేసుకుపోతున్నారు. ఆయన సృష్టించిన అడవిలో చెట్లతో పాటుగా రకరకాల పక్షులూ, ఏనుగులు, బెంగాల్‌ పులులు, ఖడ్గమృగాలు, కోతులు, జింకలు తదితర జంతుసమూహం వాటి ఆవాసంగా మార్చుకున్నాయి. మనిషి తలచుకుంటే ఏదైనా సాధించవచ్చనడానికి అరవై రెండేళ్ల జాదవ్‌ జీవితమే నిదర్శనం. అందుకే ‘పద్మశ్రీ’తో భారత ప్రభుత్వం ఆయన్ని గౌరవించింది.


నాడు 11... నేడు 11 లక్షలకు పైగా...

‘ఒక్క మొక్కను నాటడం అంటే పది మంది పిల్లల్ని పెంచడమే’ అని తాత చెప్పిన మాటలు జైరామ్‌ మీనాను ఆలోచనలో పడేశాయి. అప్పుడు ఆ బాలుడి వయసు 12 ఏళ్లు. మొక్కల్ని నాటడమే జీవిత ధ్యేయంగా అప్పుడే నిర్ణయించుకున్నాడు. అయిదో తరగతిలోనే పాఠశాల విద్యను ఆపేసిన జైరామ్‌ ‘వృక్షమిత్ర’గా మధ్యప్రదేశ్‌లో పేరు తెచ్చుకున్నారు. అక్కడి బసోండ్‌ గ్రామం ఆయన స్వస్థలం. మొదట 11 మొక్కలు నాటడంతో తన వృక్ష జీవితం ప్రారంభించారు. ఈ 45 ఏళ్లలో స్వయంగా 11 లక్షలకు పైగా మొక్కల్ని నాటారు. బసోండ్‌లోని ప్రభుత్వ స్థలాలు, పోలీస్‌ స్టేషన్‌, ఆస్పత్రులు, పాఠశాలలు, ఆలయాల సమీపంలో ఏపుగా పెరిగిన చెట్లన్నీ ఒకప్పుడు జైరామ్‌ నాటినవే.


ఎక్కడైనా ఖాళీ ప్రదేశం కనిపిస్తే అక్కడ మొక్కలు నాటడం లేదా విత్తనాలను జల్లుతారు. అంతటితో తన పని అయిపోయిందని భావించకుండా వాటి బాగోగులూ పట్టించుకుంటారు. ఓ సైకిల్‌కి అటూఇటూ బకెట్లలో నీళ్లని తీసుకుని వెళ్లి మొక్కలకి పోసేవారు. మొక్కలు, పక్షులు, జంతువుల రక్షణకే ఆయన జీవితాన్ని అంకితం చేశారు. ప్రస్తుతం ఎంతోమంది వాలంటీర్లు ఆయనతో కలిసి పనిచేస్తున్నారు. అందరినీ ఆయన తన దారిలో నడవమని కోరతారు. ‘మీరు గ్రామాలు, పట్టణాలు ఎక్కడ నివసిస్తున్నా సరే, మీ ఇళ్లల్లో, రోడ్డు పక్కన, తోటలలో కాస్త ఖాళీ స్థలం కనిపిస్తే మొక్కలను పెంచండి. మీ జీవితాల్లోనే కాదు భూమ్మీద పచ్చదనాన్ని పెంచండి.’ అని ఆయన సలహా ఇస్తుంటారు. మధ్యప్రదేశ్‌తో ఆగకుండా రాజస్థాన్‌, ఉత్తరాఖండ్‌లలో కూడా ఆయన మొక్కల యజ్ఞం నిర్విఘ్నంగా సాగుతూనే ఉంది.


కాలుష్యం సున్నా...

డబ్బు కావాలి. ఎమర్జెన్సీ పరిస్థితి. పక్కనున్న వాళ్లని అడుగుతాం. కానీ మీనాంగుడి గ్రామస్థులు పంచాయితీ ఆఫీసులో... తమ పెరట్లో ఉన్న మొక్కని చూపించి వడ్డీలేని అప్పు తెచ్చుకుంటారు. కేరళలోని వయనాడ్‌ పర్వత సానువుల్లో ఉంది మీనాంగుడి. గతేడాది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ‘కార్బన్‌ న్యూట్రల్‌ విశేష్‌ పురస్కార్‌‘ అందుకుందీ గ్రామం. 2016 వరకూ మీనాంగుడి మిగతా ఊర్లలాగే ఓ సామాన్య గ్రామమే. 2015లో ప్యారిస్‌లో జరిగిన కర్బన ఉద్గారాల సదస్సు తీర్మానాన్ని తూచా తప్పకుండా పాటించాలని గ్రామస్తులు ప్రతిన బూనారు. అప్పట్లో ఆ గ్రామ జనాభా 34 వేలు. కానీ రోజుకి 15 వేల టన్నుల ఉద్గారాలను విడుదల చేస్తోంది. వెంటనే చెట్లను కొట్టేయడం ఆపేశారు. తొలిదశలో 1లక్షా 72 వేల మొక్కలు గ్రామంలో నాటారు.


దాంతో పాటే అద్భుతం అనిపించే పథకాన్ని తెచ్చారు. ఓ చెట్టును నాటిన మూడేళ్ల తరవాత దానిపై వడ్డీ లేని రుణాన్ని పొందే అవకాశం కల్పించింది స్థానిక పంచాయతీ. దాంతో ప్రజలు మొక్కలను మరింత జాగ్రత్తగా పెంచడం ప్రారంభించారు. ఇక రెండో దశలో సోలార్‌ విద్యుత్‌, ఎలక్ట్రిక్‌ ఆటో రిక్షాలు, వాహనాలు, సైకిళ్లు, ఎల్‌ఈడీ బల్బులు, బయోగ్యాస్‌ ప్లాంట్లు, వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ పద్ధతులు... ఇలా గ్రామ పంచాయితీ అనేక ప్రణాళికలను చేపట్టింది. పర్యావరణం గురించి ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహనా కార్యక్రమాలు, క్యాంపెయిన్లు నిర్వహించారు. దాంతో పచ్చదనం పెరిగింది. ఆ గ్రామం పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం మీనాంగుడిలో కర్బన ఉద్గారాల స్థాయి సున్నా. అందుకే ‘జీరో ఎమిషన్‌’ గ్రామంగా ప్రసిద్ధి చెందింది. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సహాయం, కార్పొరేట్‌ సంస్థలు, ఎన్‌జీవోల మద్దతు వల్లే ఇవన్నీ సాధ్యమయ్యాయని మీనాంగుడి ప్రజలు చెప్పడం గమనార్హం.


‘అడవి’ మనిషి

రోజూ ఓ మొక్క నాటుతూ న్యూయార్క్‌ సిటీలోని సెంట్రల్‌ పార్క్‌ కంటే పెద్ద అడవిని మన దగ్గర ఒక వ్యక్తి సృష్టించాడంటే నమ్ముతారా? ఆయనే జాదవ్‌ మొలాయి పయెంగ్‌. ‘ఫారెస్ట్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా’గా ఆయనకు పేరుంది. జాదవ్‌ సృష్టించిన అడవి విస్తీర్ణం దాదాపు 1400 ఎకరాలు. ఆయన కృషిని గుర్తిస్తూ ఆ అడవికి ‘మొలాయి’ అని పేరు పెట్టారు. ప్రపంచంలోనే అతి పెద్ద నదీ ద్వీపంగా పేరుతెచ్చుకున్న మాజులిలోని ‘శాండ్‌బార్‌’ ఆయన కార్యస్థలం. గత నలభై ఏళ్లుగా అలుపెరగకుండా చెట్లను నాటుతూ తన పని తాను చేసుకుపోతున్నారు. ఆయన సృష్టించిన అడవిలో చెట్లతో పాటుగా రకరకాల పక్షులూ, ఏనుగులు, బెంగాల్‌ పులులు, ఖడ్గమృగాలు, కోతులు, జింకలు తదితర జంతుసమూహం వాటి ఆవాసంగా మార్చుకున్నాయి. మనిషి తలచుకుంటే ఏదైనా సాధించవచ్చనడానికి అరవై రెండేళ్ల జాదవ్‌ జీవితమే నిదర్శనం. అందుకే ‘పద్మశ్రీ’తో భారత ప్రభుత్వం ఆయన్ని గౌరవించింది.


చిట్టడువుల్ని పెంచాడు...

book4.5.jpg

ఓ మామిడి మొక్కను నాటితే, అది చెట్టుగా పెరగడానికి చాలా ఏళ్లే పడుతుంది. అందుకే చెట్లు పెంచాలంటే చాలామందికి ఓలాంటి నిర్లిప్తత. అయితే షుబేందు శర్మ మాత్రం ఒక మొక్క కాదు... చిట్టడువులనే పెంచుతూ వార్తలకెక్కాడు. అతడు మెకానికల్‌ ఇంజినీర్‌. ఓరోజు ఆఫీసులో అడవుల పెంపకం గురించి జపనీస్‌ బోటనిస్ట్‌ అకీరా ‘మియావాకీ’పై చేసిన ప్రసంగం విన్నాడు. అదే అతడి జీవితాన్ని మొత్తంగా మార్చేసింది. మియావాకీ పద్ధతి ప్రకారం ఇంటి పెరట్లో మొక్కలను నాటాడు. కొన్నేళ్లకి అక్కడ చిట్టడవి ఏర్పడడం అతడిని ఆశ్చర్యపరచింది.


ఉన్నపళంగా ఉద్యోగానికి రాజీనామా చేసి, ‘ఏఫారెస్ట్‌’ పేరున ఓ సంస్థను స్థాపించాడు. సహజ వాతావరణంలో వందేళ్ల కాలంలో పెరిగే చెట్లను త్వరితంగా పెంచి చూపిస్తున్నారు. మియావాకీ పద్ధతిలో సహజ ఎరువులను చేర్చి మొదట మట్టిని సుసంపన్నం చేస్తారు. స్థానికంగా పెరిగే చెట్లను ఎక్కువగా ఎంపిక చేస్తారు. మొక్కలను చాలా దగ్గర దగ్గరగా నాటుతారు. సూర్యరశ్మి కోసం ఒకదానితో ఒకటి పోటీపడుతూ తొందరగా పెరుగుతాయన్నది మియావాకీ సిద్ధాంతం. నాటిన రెండుమూడేళ్లకే ఇవన్నీ అడవి చెట్లలా స్వయంసమృద్ధిని సాధిస్తాయి. కాబట్టి మనిషి అవసరం అంతగా ఉండదు. నగర జీవితాలకు ఈ చిట్డడువులు కార్బన్‌ సింక్‌హోల్స్‌లా పనిచేస్తాయి.


త్రిబుల్‌ వన్‌ మొక్కలు

book4.7.jpg

‘అయ్యో ఆడపిల్ల పుట్టిందా’ అనే స్థితి నుంచి ‘ఆహా ఆడపిల్ల పుట్టింది’ అని సంబరాలు చేసుకునే స్థాయికి చేరుకుంది పిప్లాంత్రి గ్రామం. రాజస్థాన్‌లోని ఈ గ్రామం పేరు నేడు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. కారణం 2005 నుంచి అక్కడ చేపట్టిన కార్యకలాపాలే. ఆనాటి గ్రామ సర్పంచ్‌ శ్యామ్‌ సుందర్‌ పాలీవాల్‌కే ఈ క్రెడిట్‌ అంతా దక్కుతుంది. గ్రామంలో ఆడపిల్ల పుట్టగానే సంబరంగా 111 మొక్కల్ని నాటాలని ఆయన తీర్మానం చేశారు. ఆ పాప పేరు మీద బ్యాంక్‌ అకౌంట్‌ తెరచి 21 వేల రూపాయలని గ్రామ పంచాయతీ డిపాజిట్‌ చేస్తుంది. తల్లిదండ్రులు మరో 11 వేల రూపాయలు జమ చేయాలి. అలాగే ఆ అమ్మాయికి 18 ఏళ్లు వచ్చేవరకు పెళ్లి చేయబోమని అఫిడవిట్‌లో రాసివ్వాలి.


తమ బిడ్డ పేరు మీద నాటిన 111 మొక్కల బాగోగుల్ని ఆ కుటుంబమే చూసుకోవాలి. ప్రతి రక్షాబంధన్‌కి ఆ ఆమ్మాయి చేత ఆ చెట్లకు రాఖీ కట్టించాలని ఆయన సూచించారు. అలా అక్కడి అమ్మాయిలకు ఊర్లోని చెట్లతో ప్రత్యేక అనుబంధం ఏర్పడుతుంది. దీనివల్ల పిప్లాంత్రి గ్రామ రూపురేఖలే మారిపోయాయి. నేడు పచ్చదనానికి చిరునామా పిప్లాంత్రి. ఎనిమిది వందల అడుగుల దిగువన ఉన్న భూగర్భ జలాలు నేడు 15 అడుగులకి చేరుకున్నాయి. కరువు కాటకాలు లేవు. అందరి జీవితాలూ బాగుపడ్డాయి. ఓ సర్పంచి నిర్ణయం గ్రామ ప్రజల జీవితాల్ని మార్చేసింది. అందుకే శ్యామ్‌ సుందర్‌ని కేంద్ర ప్రభుత్వం ‘పద్మశ్రీ’తో సత్కరించింది.


ఓ వైపు అభివృద్ధి, సంపద పేరిట అడవుల్ని అడ్డగోలుగా నరికేస్తుంటే... మరోవైపు వృక్ష సంపదే మానవజాతిని కాపాడుతుందనే గొప్ప సందేశంతో అడవుల్ని సృష్టిస్తున్నవారు దేశవ్యాప్తంగా చాలామందే ఉన్నారు. ప్రభుత్వం, సంస్థల సహకారం తీసుకోకుండా కేవలం వ్యక్తిగత ప్రయత్నంతో మొక్కలు నాటే మహా యజ్ఞాన్ని చిత్తశుద్ధితో నిశ్శబ్దంగా నిర్వహిస్తున్న మహనీయులకు మనమంతా అభినందనలు, కృతజ్ఞతలు తెలపాల్సిందే. వారి మొక్కవోని సంకల్పానికి నీరాజనాలు పలకాల్సిందే. ఎందుకంటే చెట్లే కదా మన శ్వాసకు మూలాధారం.

- డి.పి. అనురాధ


ఈ వార్తలు కూడా చదవండి.

స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ఢిల్లీలో పాత వాహనాలకు పెట్రోల్‌, డీజిల్‌ బంద్‌

Read Latest Telangana News and National News

Updated Date - Jun 22 , 2025 | 10:36 AM