Share News

కోటీశ్వరులకు మాత్రమే..

ABN , Publish Date - Mar 02 , 2025 | 11:56 AM

ఆ వీధిలోకి అడుగుపెడితే పోర్షే, లంబోర్గిని, బుకాటి, ఫెరారీ వంటి ఖరీదైన కార్లే కనిపిస్తాయి. లక్షలు విలువ చేసే బ్రాండెడ్‌ దుస్తులు, వస్తువులు మాత్రమే అక్కడ దొరుకుతాయి. బిలియ నీర్లు మాత్రమే ఆ షాపింగ్‌ మాల్స్‌లో కనిపిస్తుంటారు.

కోటీశ్వరులకు మాత్రమే..

ఆ వీధిలోకి అడుగుపెడితే పోర్షే, లంబోర్గిని, బుకాటి, ఫెరారీ వంటి ఖరీదైన కార్లే కనిపిస్తాయి. లక్షలు విలువ చేసే బ్రాండెడ్‌ దుస్తులు, వస్తువులు మాత్రమే అక్కడ దొరుకుతాయి. బిలియ నీర్లు మాత్రమే ఆ షాపింగ్‌ మాల్స్‌లో కనిపిస్తుంటారు. అందుకే ప్రపంచంలోనే అత్యంత ‘ఖరీదైన షాపింగ్‌ వీధి’ ఏదంటే... మిలాన్‌ (ఇటలీ) నగరంలో ఉన్న ‘మోంటెనాపొలియన్‌ స్ట్రీట్‌’ వైపు వేలు చూపుతారంతా. ఆ వీధి విశేషాలివి...

షాపింగ్‌ సమయంలో ట్యాగులు చూసి ‘అమ్మో! అంత ధరా..’ అని కొనకుండానే బయటకు వచ్చేవాళ్లు చాలామందే ఉంటారు. పండగ సమయంలో పదివేల రూపాయల బిల్లయితే పదిరోజుల పాటు దాని గురించే ఆలోచిస్తారు. మధ్యతరగతి ప్రజల ఆలోచనా ధోరణి ఎప్పుడూ అలానే ఉంటుంది. మరి ధనవంతులు... అందులోనూ బిలియనీర్ల షాపింగ్‌ ఎలా ఉంటుంది? వాళ్లంతా ఎక్కడ ఎక్కువగా షాపింగ్‌ చేస్తారో తెలుసా? ప్రపంచ వ్యాప్తంగా అనేక ఖరీదైన షాపింగ్‌ ప్రదేశాలు న్నాయి. వాటిల్లో అత్యంత ఖరీదైనదే ‘మోంటె నాపొలియన్‌ స్ట్రీట్‌’. మిలాన్‌ నగరంలోని ఈ శ్రీమంతులు షాపింగ్‌ స్ట్రీట్‌లో ఏ దుస్తులు, వస్తువులపై ఉన్న ట్యాగులను చూసిన కళ్లు చెదరడం ఖాయం. అక్కడ ధరలు లక్షల్లో ఉంటాయి. ఒక్కొక్కరి బిల్లు కోట్లలో అవుతుంది. అందుకే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వీధిగా దీనికి గుర్తింపు ఉంది.


దీనికన్నా ముందు చాలాకాలం పాటు న్యూయార్క్‌లోని ‘అప్పర్‌ ఫిఫ్త్‌ ఎవెన్యూ’కి రికార్డు ఉంది. కానీ మోంటెనాపొలియన్‌ ఇటీవలే దాన్ని వెనక్కి నెట్టి మొదటి స్థానంలోకి వచ్చింది. అమెరికాకు చెందిన ‘కుష్‌మన్‌ అండ్‌ వేక్‌ఫీల్డ్‌’ అనే సంస్థ విడుదల చేసిన గ్లోబల్‌ ఇండెక్స్‌లో మిలాన్‌ నగరంలోని మోంటెనాపొలియన్‌ స్ట్రీట్‌ నంబర్‌వన్‌ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ సంస్థ ఆయా ప్రాంతాల్లో అద్దెల ఆధారంగా ప్రపంచంలో ఖరీదైన షాపింగ్‌ ప్రదేశాలను ఎంపిక చేసి ర్యాంకులను ఇస్తుంది. ఇంతకుముందు చాలా ఏళ్ల పాటు న్యూయార్క్‌లోని ఫిఫ్త్‌ ఎవెన్యూ అగ్రస్థానంలో కొనసాగింది. 138 ప్రదేశాలను పరిగణలోకి తీసుకుని ర్యాంకులను ఇస్తారు. తాజాగా ఫిఫ్త్‌ ఎవెన్యూను నెట్టేసి మోంటెనాపొలియన్‌ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఏటా ఈ వీధిలో 900 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోందని లెక్కలు తేల్చారు.


విలాసవంతమైన పర్యాటకం...

book6.2.jpg

విచిత్రమేమిటంటే మిలాన్‌ నగరంలోని ఈ వీధి చాలా చిన్నది. అరకిలోమీటరు పొడవు కూడా ఉండదు. అయితేనేం.. ప్రపంచంలోని కుబేరులందరూ క్యూ కట్టేది అక్కడికే. చాలామంది పర్యాటకులు విండో షాపింగ్‌ చేస్తుంటారు. ఇక్కడ షాపింగ్‌ చేసే ఒక వ్యక్తి సగటున కనీసం రూ. 2 లక్షల 26 వేల రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు అంచనా వేశారు. మిలాన్‌ నగరంలో ఫ్యాషన్‌ వీక్స్‌, డిజైన్‌ వీక్స్‌ వంటి ఖరీదైన ఈవెంట్లు తరచుగా నిర్వహిస్తుండటంతో గత కొన్నేళ్లుగా లగ్జరీ టూరిజం బాగా పెరిగింది. ట్యాక్స్‌ విషయంలో ఇటలీ ఉదారంగా వ్యవహరిస్తుండటంతో సంపన్నులు అక్కడ నివాసం ఉండటానికి ఆసక్తి చూపుతున్నారు.


book7.2.jpg

ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకుని ప్రపంచవ్యాప్తంగా ఉన్న లగ్జరీ బ్రాండ్లు మిలాన్‌ నగరానికి క్యూ కట్టడానికి దోహదం చేశాయి. ఇందుకు మోంటెనాపొలియన్‌ స్ట్రీట్‌ సరైన వేదికగా నిలిచింది. ఫిఫ్త్‌ ఎవెన్యూలో కొన్నేళ్లుగా అద్దెలు నిలకడగా ఉంటే, మోంటెనాపొలియన్‌లో 30 శాతం మేర పెరిగాయి. వీధి చిన్నగా ఉండటం, రిటైల్‌ స్పేస్‌ తక్కువగా ఉండటంతో చదరపు అంగుళానికి డిమాండ్‌ అమాంతం పెరిగింది. ఇక్కడ ప్రపంచ ప్రసిద్ధ ఫ్యాషన్‌ బ్రాండ్లు మాత్రమే అద్దెను భరించే స్థాయిలో ఉన్నాయి. గత ఏడాది నవంబర్‌ వరకు కోటీ 10 లక్షల మంది సందర్శించారంటే... ఆ వీధికున్న క్రేజ్‌ ఏమిటో అర్థం అవుతుంది. ఇక విండో షాపింగ్‌ చేసిన వారి సంఖ్యను ఊహించుకోవాల్సిందే. ఇక్కడ షాపింగ్‌కు పోర్షే, లంబోర్గిని, బుకాటి, ఫెరారీ వంటి ఖరీదైన కార్లలో మాత్రమే వస్తుంటారు. ఒక యూరోపియన్‌ నగరం ఫ్యాషన్‌ రంగంలో మొదటి స్థానాన్ని ఆక్రమించడం గత 34 ఏళ్లలో ఇదే మొదటిసారి.

Updated Date - Mar 02 , 2025 | 11:56 AM