Nana Patekars Foundation: నటుడి గొప్ప మనసు.. ఆ కుటుంబాలకు భారీ ఆర్థిక సాయం..
ABN , Publish Date - Sep 23 , 2025 | 12:34 PM
గతంలో రాజ్ కపూర్ అవార్డు గెలుచుకున్నపుడు ఆయనకు పది లక్షల రూపాయల నగదు బహుమతి వచ్చింది. దాన్ని మహారాష్ట్ర కరువు నివారణ కార్యక్రమాలకోసం ఇచ్చేశారు. ఇలా తరచుగా ఆర్థిక సాయాలు అందిస్తూనే ఉన్నారు.
బాలీవుడ్ సీనియర్ నటుడు నానా పటేకర్ గొప్ప మనసు చాటుకున్నారు. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా పాక్ దాడుల్లో నష్టపోయిన కుటుంబాలకు భారీ ఆర్థిక సాయం అందించారు. ఇండియన్ ఆర్మీతో కలిసి ‘ది నిర్మల గజానన్ ఫౌండేషన్’ తరపున ఆ కుటుంబాలకు ఆర్థిక సాయం చేశారు. రజౌరీ, పూంచ్ జిల్లాల్లోని 117 కుటుంబాలకు 42 లక్షల రూపాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో నానా పటేకర్ మాట్లాడుతూ.. ‘దేశంలో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నపుడు సాయం చేయటం మన బాధ్యత.
వాళ్లు మన అక్కాచెల్లెళ్లు, అన్నాతమ్ముళ్లు. ఇది మనందరి బాధ్యత. చిత్ర పరిశ్రమలోని చాలా మంది అవసరం ఉన్న వారికి సాయం చేస్తూనే ఉన్నారు. కానీ, ఎప్పుడూ దాని గురించి బయటచెప్పుకోరు. అలాంటి వారిలో జానీ లీవర్ ఒకరు. పాక్ దాడుల్లో నష్టపోయిన వారికి మేము సాయం చేయకపోతే ఇంకెవరు చేస్తారు. ప్రభుత్వం ఇప్పటికే చాలా సాయం చేసింది. కేవలం ప్రభుత్వం మీదే ఆధారపడకండి. మీ వంతుగా ఎంతో కొంత చేయండి. వేరే వాళ్ల సంతోషానికి కారణం అయినపుడు నాకు ఎంతో సంతృప్తిగా అనిపిస్తుంది’ అని అన్నారు.
నేషనల్ అవార్డ్ విన్నర్.. మానవతావాది
నానా పటేకర్ 1978లో విడుదలైన ‘గమన్’ అనే బాలీవుడ్ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. హిందీ, మరాఠీ, కన్నడ, తమిళం, ఇంగ్లీష్ భాషల్లో వందకుపైగా సినిమాలు చేశారు. తన అద్భుతమైన నటనతో మూడు సార్లు జాతీయ అవార్డు గెలుచుకున్నారు. నానా పటేకర్‌కు సేవా గుణం ఎక్కువ. తల్లిదండ్రుల పేరు మీద ‘ది నిర్మల గజానన్ ఫౌండేషన్’ ఏర్పాటు చేసి అవసరమైన వారికి ఆర్థిక సాయం అందిస్తున్నారు. గతంలో రాజ్ కపూర్ అవార్డు గెలుచుకున్నపుడు ఆయనకు పది లక్షల రూపాయల నగదు బహుమతి వచ్చింది. దాన్ని మహారాష్ట్ర కరువు నివారణ కార్యక్రమాలకోసం ఇచ్చేశారు. ఇలా తరచుగా ఆర్థిక సాయాలు అందిస్తూనే ఉన్నారు.
ఇవి కూడా చదవండి
తాటి కల్లు తాగడం.. లాభమా? నష్టమా?
శుభలగ్నం సినిమా రిపీట్.. ట్విస్ట్ మామూలుగా ఉండదు..