Fake Mineral Water Bottles: రైల్వే స్టేషన్‌లో వాటర్ బాటిల్ కొంటున్నారా? ఈ వీడియో తప్పక చూడండి..
ABN , Publish Date - Nov 24 , 2025 | 03:52 PM
రైల్ ప్లాట్ ఫామ్‌పై వాటర్ బాటిళ్లు అమ్ముకునే ఓ యువకుడు మోసానికి తెరతీశాడు. బాటిళ్లలో రైలు ప్లాట్ ఫామ్ మీద ఉన్న కుళాయి నీళ్లు నింపి అమ్మేస్తున్నాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
రైల్వే స్టేషన్‌లో వాటర్ బాటిల్ కొంటున్న వారికి హెచ్చరిక. మీరు 20, 10 రూపాయలు పెట్టి కొనే వాటర్ బాటిల్ మీ ఆరోగ్యాన్ని పాడు చేయవచ్చు. మీరు ఆస్పత్రి పాలు కావచ్చు. కొంతమంది దుర్మార్గులు ఫేక్ మినరల్ వాటర్ బాటిళ్లు అమ్ముతున్నారు. శుభ్రత లేని నీళ్లను బాటిళ్లలో నింపి అమ్మేస్తున్నారు. ఇందుకు ఉత్తర ప్రదేశ్‌లో తాజాగా జరిగిన సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది.
ఓ యువకుడు వాటర్ బాటిళ్లలో రైలు ప్లాట్‌ఫామ్ మీద ఉన్న కొళాయి నీళ్లు నింపి అమ్మేస్తున్నాడు. పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జంక్షన్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఏముందంటే.. ఓ యువకుడు రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న మురికి పట్టిన కుళాయి నుంచి నీటిని బాటిల్‌లో నింపాడు. ఆ బాటిల్‌ను అమ్మడానికి సిద్ధం చేసిన బాటిళ్ల మధ్య ఉంచాడు.
దీన్నంతా అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీశాడు. దీంతో భయపడిపోయిన యువకుడు బాటిళ్లను నెత్తిన పెట్టుకుని అక్కడినుంచి పరుగున వెళ్లిపోయాడు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘బయట ఏదైనా తినాలంటే భయంగా ఉంది. అంతా కల్తీమయం’..‘చిరు వ్యాపారులు కూడా మన జీవితాలతో ఆడుకుంటున్నారు’..‘ఇలా తినే ఆహారాన్ని, తాగే నీటిని కల్తీ చేసే వారిని ఊరికే వదిలిపెట్టకూడదు. జైల్లో పెట్టాలి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఢిల్లీలో డీకే విధేయులు.. సీఎం మార్పుపై సిద్ధరామయ్య ఆసక్తికర వ్యాఖ్యలు