Share News

ఒక చిన్న టాయ్‌ ఇప్పుడు ప్రపంచాన్ని ఊపేస్తోందిగా..

ABN , Publish Date - Jun 08 , 2025 | 08:50 AM

ఓస్‌.. బొమ్మనే కదా! అనుకోవద్దు. ఒక చిన్న టాయ్‌ ఇప్పుడు ప్రపంచాన్ని ఊపేస్తోంది. ఎందుకు నచ్చిందో ఏమో.. చిన్న పిల్లల దగ్గరి నుంచి సెలబ్రిటీల వరకు... అందరికీ తెగ ముద్దొచ్చేస్తోంది. హ్యాండ్‌బ్యాగ్‌లు, కీచెయిన్‌లు ఎక్కడ చూసినా ఇదే!. సామాజిక మాధ్యమాల్లో తెగ ట్రెండ్‌ అవుతున్న ఆ కొత్త టాయ్‌ పేరు లబుబు. బన్నీ చెవులు, చాటంత నోరు, మెరిసే పళ్లు.. గోలీల్లాంటి కళ్లతో అందర్నీ ఆకట్టుకున్న ఆ బొమ్మ ఎందుకంత ఫేమస్సో చూద్దాం...

ఒక చిన్న టాయ్‌ ఇప్పుడు ప్రపంచాన్ని ఊపేస్తోందిగా..

- లబుబు మానియా..

ప్రతి బొమ్మకూ ఒక కథ ఉంటుంది. లబుబు వెనక కూడా పెద్ద కథే ఉందండోయ్‌!. ఇది మాన్‌స్టర్‌ రకానికి చెందిన బొమ్మ. దీని సృష్టికర్త హాంకాంగ్‌కు చెందిన ఇలస్ట్రేటర్‌ కాసింగ్‌ లంగ్‌. 2015లో ‘ది మాన్‌స్టర్‌’ అనే స్టోరీ బుక్‌ సిరీస్‌ కోసం లబుబును గీశారు. దాంతోపాటు జిమోమో, టైకోకో, స్పూకీ, పాటో లాంటి మాన్‌స్టర్‌ బొమ్మలూ వేశాడాయన. వీటన్నిటి వెనకా స్ఫూర్తి నార్డిక్‌ మైథాలజీ. అన్ని బొమ్మల్లోకెల్లా లబుబు అందర్నీ ఆకట్టుకుంది. కుందేలులాంటి పెద్ద పెద్ద చెవులు, అనిమే కళ్లు, బయటికి కనిపించే తొమ్మిది పళ్లు... లబుబును ఆకట్టుకునేలా చేశాయి. ఈ బొమ్మ .. ముచ్చటైన ఓ ముద్దుగుమ్మ.


book3.2.jpg

మాన్‌స్టర్‌ సిరీస్‌లో ఓ పాత్ర అయిన లబుబుకు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం వచ్చేలా చేసింది చైనాకు చెందిన పాప్‌మార్ట్‌. ఈ బొమ్మల సంస్థ కాసింగ్‌ లంగ్‌తో ప్రత్యేకంగా ఒప్పందం చేసుకుని లబుబు బొమ్మల్ని ఉత్పత్తి చేయసాగింది. ఇక అప్పటి నుంచి రకరకాల సైజుల్లో బొమ్మలని మార్కెట్‌లోకి విడుదల చేసింది పాప్‌మార్ట్‌. లాస్‌ఏంజెల్స్‌, లండన్‌, జర్మనీ, బ్యాంకాక్‌, సింగపూర్‌... ఇలా అన్ని దేశాలకూ వెళ్లాయి ఈ టాయ్స్‌. ప్రస్తుతం 300 రకాల బొమ్మలు వచ్చేశాయ్‌!. అమ్మకాలు అమాంతం పెరిగాయి. ఈ క్రేజ్‌కు కారణం ‘బ్లైయిండ్‌ బాక్స్‌’ ఇదొక వినూత్న మార్కెటింగ్‌ పద్ధతి. అంటే- ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేస్తే సీల్డ్‌ బాక్స్‌లో పార్శిల్‌ వచ్చే వరకు అది ఏ బొమ్మనో తెలియదు. ఇదొక గమ్మత్తయిన అనుభవం. ఇక్కడే థ్రిల్‌గా ఫీలవుతున్నారు కొనుగోలుదారులు. ఎలాంటి బొమ్మ వచ్చిందోనన్న ఉత్కంఠ కొనుగోళ్లను ప్రేరేపిస్తున్నది. ఇందులో భాగంగా.. మాలీ సిరీస్‌ పేరుతో తీసుకొచ్చిన కొత్త కొత్త బొమ్మలు కూడా హిట్‌ అయ్యాయి.


పెద్దలూ కొంటున్నారు...

బొమ్మల్ని పిల్లలే కాదు.. ఇప్పుడు పెద్దలూ ఇష్టపడుతున్నారు. వాటితో ఆడుకుంటూ బాల్య స్మృతుల్ని నెమరువేసుకుంటున్నారు. ఇలా పెద్దలు ఇష్టపడుతున్న బొమ్మల్లో బ్యాగ్‌ ఛార్మ్‌ల హవా చెప్పలేనంత! ఈ ట్రెండ్‌కు ఊతమిచ్చింది కొరియన్‌ మ్యూజిక్‌ బృందమైన కె-పాప్‌. దీనికితోడు ప్రముఖ పత్రికల ఎడిటర్లు, సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్లు ఫ్లష్‌ టాయ్స్‌ బ్యాగులతో కనిపించడం వల్ల ట్రెండ్‌ మరింత వేగంగా విస్తరించింది.

ఒకప్పుడు టెడ్డీబేర్లు లేని ఇళ్ల్లంటూ ఉండేవి కావు. స్టఫ్డ్‌ టాయ్స్‌లో ఈ బొమ్మల తర్వాతే ఏవైనా! అనంతరం రకారకాల బొమ్మలు మార్కెట్లోకి వచ్చేశాయి. టాయ్స్‌ ట్రెండ్‌ ఊపందుకుంది. ఒక రకపు బొమ్మతో ఆగిపోకుండా, రకరకాల బొమ్మలను సేకరించడం మొదలుపెట్టారు. అలా మార్కెట్‌ వేగంగా పుంజుకుంది. ఆన్‌లైన్‌ అమ్మకాలు వచ్చాక అన్ని దేశాల ఉత్పత్తులు ఓ చోట లభిస్తున్నాయిప్పుడు. దాంతో ఈ రంగం చూస్తుండగానే ఊహించనంతగా వృద్ది చెందింది. అందుకే వచ్చే పదేళ్లలో బొమ్మల మార్కెట్‌ 38 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందన్నది ఒక అంచనా. ఈ పెరుగుదలలో లబుబు కీలకం.


ట్రెండ్‌ మొదలైందిలా..

కొత్తతరం అభిరుచులు అనేకం.. వినూత్నం. ఇష్టమైన వస్తువుల్ని సేకరించడం హాబీగా మారింది. ఆ అలవాట్లలోకి బొమ్మల సేకరణ కూడా చేరిందిప్పుడు. ఒక్క బొమ్మతో ఆగకుండా ట్రెండ్‌తో పాటు వచ్చే టాయ్స్‌ను సేకరించే వారి సంఖ్య పెరిగింది. అందుకే ఎప్పటికప్పుడు కొత్త కొత్త బొమ్మలు మార్కెట్లను ముంచేస్తున్నాయి. కాలానికి తగ్గట్టు ఆధునిక సంస్కృతినీ వీటి తయారీకి రంగరించారు. మరోవైపు వీధి వ్యాపారాలు పెరగడం వల్ల బొమ్మల విక్రయాలు జోరందుకున్నాయి. హాంకాంగ్‌లో ఈ ట్రెండ్‌ మొదలైంది. 1990లలో స్థానిక కళాకారులు ఎరిక్‌ సో, మైఖేల్‌ లౌ తమ మేధతో సృజనాత్మక డిజైన్ల బొమ్మలని తయారుచేశారు. ప్రత్యేకించి డిజైనర్‌ టాయ్స్‌కి గాడ్‌ఫాదర్‌గా పేరు తెచ్చుకున్నారు మైఖేల్‌ లౌ. 1999లో గార్డెనర్‌ సిరీస్‌ పేరున 12 అంగుళాల బొమ్మలను తయారుచేశారు. ఈ లిమిటెడ్‌ ఎడిషన్‌ బొమ్మలు అందర్నీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత బ్రూస్‌లీ బొమ్మలూ వచ్చాయి. హలో కిట్టీ, లిటిల్‌ ట్విన్‌ స్టార్స్‌, పోకేమాన్‌ లాంటి పాత కాలం నాటి బొమ్మలు సరికొత్త రూపురేఖలతో జపాన్‌నూ ముంచెత్తాయి.


సెలబ్రిటీలు కూడా...

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్‌ వల్ల కళాకారులు, ఆర్కిటెక్చర్లు, ప్రొడక్ట్‌ డిజైనర్లు, మ్యూజిషియన్లు, ఫ్యాషన్‌ పండితులూ బొమ్మల కంపెనీలతో అనుసంధానమయ్యారు. జపాన్‌లో 2001లో బియర్‌బ్రిక్‌ బొమ్మలే దీనికి నిదర్శనం. థాయ్‌లాండ్‌ ప్రధాని షినావత్రా కూడా .. తన ఆస్తుల్లో బియర్‌బ్రిక్‌ బొమ్మలూ ఓ భాగమని ఇటీవల ప్రకటించడం విశేషం. ఇలా డిజైనర్‌ టాయ్స్‌ని ఇష్టపడే, సేకరించే పెద్దలను ‘కిడల్ట్స్‌’గా పిలవడం మొదలైంది. బొమ్మల విషయంలో జనరేషన్‌ జెడ్‌తో వీళ్లు పోటీపడుతున్నారనే చెప్పొచ్చు. టాయ్స్‌ అంటే ఒక ఆత్మీయ జ్ఞాపకం.. ఒక అద్భుత ఆటవిడుపు అన్నదే అందరి అభిప్రాయం.

అంతెందుకు? లేటెస్ట్‌ డిజైనర్‌ బొమ్మ లబుబును ప్రముఖ గాయని, నటి రిహాన్నానే కాదు.. మన అనన్యా పాండే వరకు చాలామంది తమ హ్యాండ్‌బ్యాగులకు తగిలించుకున్నారు. ఇలా పెద్దలు, పిల్లలు కలిసి ఈ బొమ్మల క్రేజీని పెంచేశారని చెప్పొచ్చు. మొత్తానికి లబుబు ఇంకొంత కాలం మార్కెట్‌ను ఏలడం ఖాయం.


సెలబ్రిటీల చేతుల్లో..

స్టార్‌ల చేతుల్లో స్టార్‌ లబుబు అని చెప్పొచ్చు. ఎందుకంటే హాలీవుడ్‌ నుంచీ బాలీవుడ్‌ వరకు చాలామంది సెలబ్రిటీలకు ఈ టాయ్‌ ఫేవరెట్‌ అయ్యిందిప్పుడు. కొరియన్‌ మ్యూజిక్‌ బృందం ‘బ్లాక్‌పింక్‌’ కు చెందిన లీసా పేద్ద లబుబుతో ఇన్‌స్టా పేజీలని నింపేసింది. ఓ చిన్న లబుబు బొమ్మని బ్యాగ్‌ ఛార్మ్‌లా తగిలించుకుని ప్రపంచాన్ని ఆ విచిత్రమైన టాయ్‌ వైపు తిప్పేలా చేసింది. దాంతో లబుబు వరల్డ్‌ ఫేమస్‌ టాయ్‌గా మారింది.


జెల్లీక్యాట్‌దీ హవానే..

ఈ ఏడాది లబుబు బొమ్మలదే. గతేడాది ప్రపంచాన్ని ఊపేసిన బొమ్మ జెల్లీక్యాట్‌. అత్యంత సాఫ్ట్‌, కడ్లీ టాయ్‌గా పేరుతెచ్చుకుంది. లండన్‌కు చెందిన సాఫ్ట్‌ టాయ్‌ కంపెనీ జెల్లీక్యాట్‌. 1999ల నుంచి ఈ మెత్తని బొమ్మలని తయారుచేస్తోంది. మనం రోజూ చూసే వస్తువులని, ఆహార పదార్థాలని, సముద్ర జీవులను ఊహకు అందని డిజైన్లలో బొమ్మలుగా తయారుచేయడం ఈ కంపెనీ ప్రత్యేకత. అయితే వీటిని అత్యంత శ్రద్ధతో ఎలాంటి హాని కలిగించని మెటీరియల్‌తో సుతిమెత్తగా తయారుచేస్తారు. నాణ్యతలో ఎక్కడా రాజీపడరు. అందుకే మిగతా వాటితో పోలిస్తే జెల్లీక్యాట్స్‌ బొమ్మల ఖరీదు ఎక్కువ. పట్టులాంటి ఆ బొమ్మలని హత్తుకుంటే హాయిగా అనిపిస్తుంది. ఒక ఆత్మీయత లభించిన ఊరట లభిస్తుందని అభిమానులు అంటున్నారు. జెల్లీక్యాట్‌ గురించి సంస్థ తొలిసారిగా సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసింది. ఆ తర్వాత ట్రెండింగ్‌లో నిలిచింది.


ఈ వార్తలు కూడా చదవండి.

పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. నిలకడగా బంగారం ధరలు..

ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి

Read Latest Telangana News and National News

Updated Date - Jun 08 , 2025 | 08:53 AM