Bus Harassment Viral Video: యువతికి వింత అనుభవం.. సీటు పక్కన కూర్చున్న వ్యక్తి..
ABN , Publish Date - Sep 04 , 2025 | 08:40 AM
ఆ వ్యక్తి వింతగా ప్రవర్తించటం మొదలెట్టాడు. ఆమెను కళ్లు ఆర్పకుండా అసభ్యంగా చూస్తూ ఉన్నాడు. ఇది ఆ యువతి గమనించింది. వెంటనే సెల్ఫీ వీడియో తీయటం మొదలెట్టింది.
బస్సులో ప్రయాణిస్తున్న ఓ లేడీ కంటెంట్ క్రియేటర్‌కు వింత అనుభవం ఎదురైంది. పక్కన కూర్చున్న ఓ వ్యక్తి ఆమెతో తప్పుగా ప్రవర్తించాడు. ఆ యువతిని చూపులతోనే భయపెట్టేశాడు. ఈ సంఘటన కేరళలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. కొచ్చికి చెందిన ఓ లేడీ కంటెంట్ క్రియేటర్ బస్సులో ప్రయాణిస్తూ ఉంది. సీటులో ఆమె పక్కన ఓ వ్యక్తి కూర్చున్నాడు. అతడి వయసు 50 సంవత్సరాలు పైనే ఉంటుంది.
ఆ వ్యక్తి వింతగా ప్రవర్తించటం మొదలెట్టాడు. ఆమెను కళ్లు ఆర్పకుండా అసభ్యంగా చూస్తూ ఉన్నాడు. ఇది ఆ యువతి గమనించింది. వెంటనే సెల్ఫీ వీడియో తీయటం మొదలెట్టింది. ఆమె వీడియో తీస్తోందని తెలియగానే అతడు చూపు తిప్పుకున్నాడు. అయితే, కొన్ని సెకన్లలోనే మళ్లీ ఆమెను చూడడం మొదలెట్టాడు. ఆమెను భయపెట్టేలా చూస్తూనే ఉన్నాడు. దీంతో ఆమె కోపం కట్టలు తెంచుకుంది. అతడ్ని తిట్టి బస్ దిగేసింది. ఆ సెల్ఫీ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.
‘నేను పులిలా అతడికి సమాధానం ఇచ్చాను. ‘నువ్వలా కళ్లార్పకుండా నన్నే చూస్తూ ఉంటే.. నీ కళ్లు రెండు బయటకు వచ్చేస్తాయి’ అని అన్నాను. వెంటనే బస్ దిగేశాను. నేను ఈ వీడియో ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే.. చాలా మంది ఆడవాళ్లు వేసుకునే దుస్తుల వల్లే దాడులు జరుగుతున్నాయని అంటుంటారు. నేను పద్ధతిగా చీర కట్టుకున్నాను. అతడు నన్నలా చూడటానికి నేను వేసుకున్న దుస్తులే కారణమా’ అని ప్రశ్నించింది. ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది.
వైరల్‌గా మారిన వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘వేసుకునే దుస్తుల వల్లే ఆడవాళ్లపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని అంటున్నారు. ఆమె చీరకట్టుకుంది. అయినా వేధింపులు తప్పలేదు కదా’..‘మీరతడి చెంప పగులగొట్టాల్సింది’..‘ఆడవాళ్లకు ఇలాంటివి ప్రతీరోజు తప్పని పనులు. నిత్య జీవితంలో ఓ భాగం’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ప్రతిరోజూ బ్లాక్ కాఫీ తాగే అలవాటు ఉందా? ఈ ముఖ్య విషయాలు తెలుసుకోండి..
శోభాయాత్రకు ఏర్పాట్లు.. 30 వేల మందితో బందోబస్తు