ఇండియా పాన్‌స్టార్ మానియా
ABN , Publish Date - Feb 23 , 2025 | 09:15 AM
సంగీతానికి సరిహద్దులు ఏముంటాయ్? ఇటు నుంచి భారతీయ సంగీతం పాశ్చాత్య తీరాలకు వెళుతుంటే.. అటునుంచి ఇటు పాప్‌మ్యూజిక్ తరలివస్తోంది. కొత్తతరం మ్యూజిక్ లవర్స్ పెరిగేకొద్దీ విదేశీ పాప్‌స్టార్‌ల దృష్టి మన దేశంపై పడింది.

సంగీతానికి సరిహద్దులు ఏముంటాయ్? ఇటు నుంచి భారతీయ సంగీతం పాశ్చాత్య తీరాలకు వెళుతుంటే.. అటునుంచి ఇటు పాప్‌మ్యూజిక్ తరలివస్తోంది. కొత్తతరం మ్యూజిక్ లవర్స్ పెరిగేకొద్దీ విదేశీ పాప్‌స్టార్‌ల దృష్టి మన దేశంపై పడింది. అందుకే భారత్‌లోని పెద్ద నగరాలైన ఢిల్లీ, ముంబయి, బెంగళూరుతో పాటు ఇటీవలే హైదరాబాద్‌లో కూడా లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్‌లు సందడి చేశాయి. క్రిస్ మార్టిన్, ఎడ్ షీరన్, బ్రియాన్ ఆడమ్స్, డువాలిపా, జస్టిన్ బైబర్ లాంటి స్టార్ సింగర్స్ సంగీత వేడుకల్లో పాల్గొన్నారు.. భవిష్యత్తులో ఈ హవా మరింత పెరిగే అవకాశం ఉంది..
‘‘టికెట్ టికెట్... కొన్ని టికెట్లే ఉన్నాయ్! మళ్లీ ఈ అవకాశం రాదు.. త్వరపడండి... ఆలస్యమైతే ఆశాభంగం..’’ థియేటర్ల ముందు బ్లాక్‌టికెట్లు విక్రయించే బ్యాచ్ ఇలాగే అరుచుకుంటూ తిరిగేదొకప్పుడు. గుజరాత్‌లోని అహ్మదాబాద్ స్టేడియం వెలుపల అచ్చం ఇలాంటి దృశ్యమే కనిపించిందీ మధ్య. అక్కడ రిలీజైంది అభిమాన హీరో సినిమా కాదు. క్రికెట్, ఫుట్‌బాల్ మ్యాచ్‌లు అంతకన్నా కాదు. అయినా సరే జనం కిక్కిరిసిపోయారు. టికెట్లు అమ్మేవాళ్ల మీదపడి లాక్కెళ్లేంత పనిచేస్తున్నారు.
స్టాక్‌మార్కెట్ బుల్‌రన్‌లో ఉన్నప్పుడు షేర్ల రేట్లు పెరిగినట్లు నిమిష నిమిషానికి రేట్లు పెంచేస్తున్నారు బ్లాక్ టికెటర్స్. బేరమాడే అవకాశమే లేదు. కొనాలనుకునే వాళ్లు కూడా ధరలను లెక్కచేయడం లేదు. ‘‘భయ్యా నువ్వు చెప్పిన రేటుకే గూగుల్‌పే చేశాను. ఇదిగో స్ర్కీన్‌షాట్.. టికెట్ నాకిచ్చేయ్..’’, ‘‘భయ్యా భయ్యా అంతకంటే ఎక్కువ నేనిస్తాను.. ప్లీజ్ నాకివ్వు. ఆయనకంటే నేనే ముందు అడిగాను..’’ అంటూ మరొకరు వెంటపడుతున్నారు. ఈ డిమాండ్ ఎంతవరకు వెళ్లిందంటే.. పాతికవేలు ఉన్న టికెట్టు లక్షరూపాయలకు చేరేంత!.
అవును మరి, తమ కలల రాకుమారుడులాంటి అంతర్జాతీయ పాప్‌సింగర్ క్రిస్ మార్టిన్(కోల్డ్‌ప్లే బ్యాండ్) వస్తున్నాడంటే.. కొత్తతరం ఆగుతుందా మరి!. క్రెడిట్‌కార్డులు కొట్టైనా.. అప్పులు చేసైనా.. ఆఖరికి లోన్లు తీసుకునైనా ఆ మ్యూజిక్ కాన్సర్ట్‌లకు వెళ్లందే నిద్రపట్టదు. దీనిని మ్యూజిక్ మానియా అనండి.. మితిమీరిన వెర్రి అభిమానం అనండి.. ఆఖరికి పిచ్చోళ్లు అన్నా వాళ్లు పట్టించుకోరు. మొన్న అహ్మదాబాద్‌లో నిర్వహించిన లైవ్ కాన్సర్ట్ సందర్భంగా జరిగిందీ సంఘటన. అక్కడే కాదు.. ఇంటర్నేషనల్ మ్యూజిక్ ప్లేయర్స్ ఎక్కడ కాన్సర్ట్‌లు పెట్టినా ఇదే పరిస్థితి. ఇండియాలో సంగీతవేడుకలకు ఎప్పుడూ లేనంత గిరాకీ వచ్చేసిందిప్పుడు. సంగీతప్రపంచంలో ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది.
సంగీతానికి స్వర్గధామం..
ఇండియాలో సంప్రదాయ సంగీత వేడుకలంటే సంగీత విభావరిలు, మ్యూజికల్ నైట్స్, కచేరీలు, గజల్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి. రంగురంగుల విద్యుత్ దీపాలతో వెలుగు జిలుగుల మధ్య యువతను ఉర్రూతలూగించే ‘మ్యూజిక్ కాన్సర్ట్’లు మాత్రం మనకు కొత్త. అంతర్జాతీయ పాప్‌సింగర్స్‌కు అత్యధిక పారితోషికం చెల్లించే దగ్గర నుంచి అత్యాధునిక సాంకేతిక ఏర్పాట్లతో వేదికను తీర్చిదిద్దే వరకు భారీ ఖర్చుతో కూడుకున్న పని. ప్రభుత్వ అనుమతులు, అభిమానులకు సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు.. వంటివన్నీ సమకూర్చడం ఆషామాషీ వ్యవహారం కాదు. రిగ్గర్స్, కార్పెంటర్స్, క్యాటరర్స్, సెక్యూరిటీ, టెక్నీషియన్స్, ఎలక్ట్రీషియన్స్, డ్రైవర్స్, చెఫ్స్ ఇలా వందల్లో నిపుణులు అవసరం అవుతారు.
ఇంచుమించు ఒక మ్యూజిక్ కాన్సర్ట్‌కు ఐదొందలకు పైగా సహాయకులు పనిచేయాల్సి ఉంటుంది. ఈ మొత్తం ఖర్చును బట్టి టికెట్ ధరలను నిర్ణయిస్తారు. పదేళ్ల కిందట రెండువేలు టికెట్ కొనుక్కుని సంగీత వేడుకల్ని తిలకించే వాతావరణం ఉండేది కాదు. ఇప్పుడు అధిక ధరలకు టికెట్లు కొనేవాళ్లకు కొదవ లేదు. ఇదిలా ఉంచితే.. 1996లో ముంబయికి మొట్టమొదటిసారి ప్రముఖ పాప్ సింగర్ మైఖేల్ జాక్సన్ వచ్చాడు. అప్పట్లో సంగీతప్రియులకు అదో పెద్ద సంచలన వార్త. ఒక రకంగా చెప్పాలంటే మన దేశంలో.. లైవ్ మ్యూజిక్ హిస్టరీ జాక్సన్‌తోనే మొదలైందని చెప్పవచ్చు. ఆ తర్వాత అంటే 2000-2010 మధ్య ఐటీ, కార్పొరేట్ ఉద్యోగాల విప్లవం మొదలైంది.
2023-2024 ల మధ్య జరిగిన ఓ ఆర్ధిక సర్వేలో మన జాతీయ సగటు ఆదాయం 22 శాతం పెరిగినట్లు తేలింది. ప్రపంచీకరణ ఫలితంగా కొత్త కొత్త ఉద్యోగాలు, నవీన సంపన్నవర్గాలు, వినియోగ మనస్తత్వం వంటివన్నీ పెరిగాయి. ముఖ్యంగా ముప్పయి ఏళ్ల లోపు యువతరం కొత్త ఆదాయవర్గంగా మారింది. కాలక్షేపానికి డబ్బులు ఖర్చుపెట్టేందుకు ఆసక్తి చూపించే దూకుడు వర్గం ఇది. ఈ ధోరణి ఎంటర్‌టైన్‌మెంట్ రంగానికి కలిసొచ్చింది. స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్‌నెట్, యూపీఐ పేమెంట్‌యాప్స్ జనంలోకి మరింత వేగంగా చొచ్చుకురావడంతో.. లైవ్ మ్యూజిక్ ఇండస్ట్రీకి అవకాశాలు పెరిగాయి. అలా కాన్సర్ట్స్ ట్రెండ్ ప్రారంభమైంది. 2016లో ముంబయిలో జరిగిన గ్లోబల్ సిటిజన్ ఫెస్టివల్‌తో వేగం పుంజుకుంది.
నగరాల్లో నయా హవా..
మ్యూజిక్ కాన్సర్ట్‌లు ఎక్కడ జరుగుతున్నాయి? అంత టికెట్‌పెట్టి ఎవరొస్తున్నారు? చెప్పుకునేంత మార్కెట్ లేదేమో? అని చాలామంది సందేహిస్తారు. కానీ వాస్తవం అందుకు భిన్నంగా ఉంది. భారత్‌లో ఏటికేడు సంగీత వేడుకలకు హాజరయ్యే అభిమానుల సంఖ్య బాగా పెరుగుతోంది. ఇటీవల బుక్‌మైషో విడుదల చేసిన నివేదిక ప్రకారం మన దేశంలోని 319 నగరాల్లో 30,687 లైవ్‌షోలను ఏర్పాటు చేశారు. కేవలం వీటిని తిలకించడానికే దేశవ్యాప్తంగా నాలుగున్నర లక్షల మందికి పైగా ప్రయాణాలు చేశారు. సంగీత పరిశ్రమ, రికార్డెడ్ మ్యూజిక్, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్, లైవ్‌షోలు వంటివన్నీ కలుపుకొంటే 2019లో రూ.2,416 కోట్లు, 2023లో అయితే రూ.6,686 కోట్లు వసూలైంది.
వార్షిక వృద్ధి రేటు 10.3 శాతం ఉండటం విశేషం. వచ్చే మూడేళ్లలో ఈ పరిశ్రమ పదివేల కోట్లకు చేరుకోవడం ఖాయమని సంబంధిత వర్గాల వారు అంచనా వేస్తున్నారు. ఇక, మెట్రో నగరాలైన ఢిల్లీ, ముంబయి, అహ్మదాబాద్, బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలలో లైవ్‌షోలు అధికంగా జరుగుతుండగా.. చిన్న నగరాలలో కూడా అదే జోరు కొనసాగుతోంది. రాబోయే రోజుల్లో ఓ మోస్తరు నగరం, పట్టణాల్లో సైతం లైవ్‌షోలు జరిగే అవకాశం ఉంది. ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయి. జనం డబ్బు చలామణిలోకి వచ్చే అవకాశం ఉంది. ‘‘అహ్మదాబాద్‌లో కోల్డ్‌ప్లే (లండన్ బ్యాండ్) మ్యూజిక్ కాన్సర్ట్ జరిగినప్పుడు హోటళ్లకు ఎక్కడలేని గిరాకీ వచ్చింది. నెల రోజుల ముందే టికెట్లు బుక్ అయ్యాయి. తాజ్, ఒబెరాయ్, మారియట్, హయత్ వంటి స్టార్‌హోటళ్లు సైతం నిండిపోయాయి. ఒక్క గదీ ఖాళీగా లేదు. కొన్ని హోటళ్ల ధరలు రెండొందల శాతం పెరిగాయి కూడా. క్యాబ్స్‌కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. మ్యూజిక్ కాన్సర్ట్‌లు జాతీయస్థాయిలో
జరుగుతాయి కాబట్టి అన్ని నగరాల నుంచి అభిమానులు తరలివచ్చారు. అందువల్లే ఇంత డిమాండ్..’’ అన్నారు కోల్డ్‌ప్లే నిర్వాహకులు. మ్యూజిక్ కాన్సర్ట్ విభాగం సుమారు ఆరువేల కోట్ల వ్యాపారానికి చేరుకుంది. హాస్పిటాలిటీ, హోటల్స్, టూరిజం, ట్రాన్స్‌పోర్టేషన్ వంటి వ్యాపారాలు సైతం పుంజుకున్నాయి. ఇండియాలో ఈ సంగీత వేడుకల ధోరణి పెరగడానికి బుక్‌మైషో, ఇన్‌సైడర్.ఇన్, పేటీఎం వంటివి కూడా కారణమే!. అడ్వర్‌టైజింగ్, టికెట్ల అమ్మకాలలో వీటి పాత్ర ఎంతో ఉంది. హెచ్‌ఎస్‌బీసీ, కోటక్ వంటి క్రెడిట్‌కార్డులు కూడా లైవ్‌షోలకు ఆఫర్లను ప్రకటిస్తూ.. వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. స్పాన్సర్‌షిప్ అగ్రిమెంట్లు, కమర్షియల్ పార్ట్‌నర్‌షిప్‌లతో టికెట్ల అమ్మకాలు జోరందుకున్నాయి. ఇలా ఇండియాకు అంతర్జాతీయ పాప్‌స్టార్స్ వచ్చినప్పుడు కనీసం పదిహేను కోట్ల రూపాయల టికెట్లు అమ్ముడవుతున్నాయని ఈ రంగంలోని నిపుణులు చెబుతున్నారు. ‘‘లండన్ పాప్‌స్టార్ ఎడ్ షీరన్ ముంబయి వచ్చినప్పుడు రూ.55 కోట్ల విలువచేసే టికెట్లు అమ్ముడుపోయినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు భారత్‌లో ఒక లైవ్‌షోకు వచ్చిన పెద్ద మొత్తం ఇదేనని చెబుతున్నారు.
కాన్సర్ట్‌లకు ఆద్యుడు ఆయనే..
మూడు దశాబ్దాల కిందట ముంబయిలో మైఖేల్ జాక్సన్ అడుగుపెట్టినప్పటి నుంచీ.. అంతర్జాతీయ పాప్‌సింగర్స్‌కు మన దేశంపై కన్నుపడింది. సంగీతం మన సంప్రదాయాల్లోనే ఉంది. ఏ పండగ జరిగినా, ఏ వేడుక జరిగినా డప్పుమోత మోగాల్సిందే!. ఇక ఆటపాటలు లేకుండా ఏ సినిమా ఉండదు. మ్యూజిక్ యాప్స్, యూట్యూబ్‌లలో హిట్‌పాటలను భారతీయులు పదే పదే వింటుంటారు. కోట్లలో వ్యూస్ వచ్చిన పాటలున్నాయి. ఇప్పుడు కొత్తతరం వచ్చాక.. అదే సంగీత అభిరుచిలో కొంత మార్పు వచ్చింది. అమెరికన్, కొరియన్ పాటల్ని అమితంగా ఇష్టపడుతున్నారు. ఈ మార్పును గమనించిన మ్యూజిక్ కాన్సర్ట్‌ల నిర్వాహకులు ఇంటర్నేషనల్ పాప్ సింగర్స్‌ను తీసుకొస్తున్నారు. మైఖేల్ తర్వాత ఇటీవల కాలంలో కొత్తకొత్త పాపులర్ సింగర్స్ రాక పెరిగింది. ఈ ఏడాది జనవరిలో బ్రిటిష్ రాక్ బాండ్ ‘కోల్డ్‌ప్లే’ బృందం అహ్మదాబాద్‌కు తరలివచ్చింది. అందులో క్రిస్ మార్టిన్ ప్రత్యేక ఆకర్షణ.
ఈ కార్యక్రమానికి ఏకంగా లక్షకు పైగా సంగీతప్రియులు వచ్చారు. ఒక స్టేడియంలో జరిగిన అతిపెద్ద కాన్సర్ట్‌గా రికార్డు సృష్టించిందీ మ్యూజిక్ షో. ఇదే బృందం ముంబయిలో కూడా ప్రదర్శించింది. క్రిస్‌మార్టిన్ తన పాప్ సాంగ్స్ మాత్రమే కాదు.. ఎక్కడికి వెళ్లినా అక్కడ ప్రాచుర్యం పొందిన దేశీసాంగ్స్‌ను అద్భుతంగా పాడటం ఆయనకు అలవాటు. ఒక గ్లోబల్ ఐకాన్‌లాంటి సింగర్ తమ లోకల్‌సాంగ్ పాడితే మజానే కదాని భావిస్తున్నారు అభిమానులు. మొన్న ఇండియాటూర్‌కు వచ్చినప్పుడు కూడా రెహమాన్ పాట ‘మా తుఝే సలాం’ను క్రిస్‌మార్టిన్ పాడాడు. ప్రముఖ క్రికెటర్ జస్ర్పీత్ బుమ్రాను కీర్తిస్తూ ‘మై బ్యూటిఫుల్ బ్రదర్’ అంటూ ఓ పాటను ఆలపించాడాయన. ఈయన సంగీత వేడుకను తిలకించేందుకు కార్తీక్ ఆర్యన్, సుహానాఖాన్, శ్రేయా ఘోషల్, కాజల్ అగర్వాల్, విజయ్‌వర్మ, సచిన్‌టెండుల్కర్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. మరికొన్ని కాన్సర్ట్‌లలో జస్టిన్ బైబర్, ఎడ్ షీరన్, ఆలన్ వాకర్, డువాలిపా, బ్రియాన్ ఆడమ్స్ వంటి సింగర్స్ వేరువేరు కార్యక్రమాలలో పాల్గొన్నారు. మన దేశంలో సంగీతానికున్న ఆదరణను చూసి వీరంతా ఆశ్చర్యపోయారు.
బ్లాక్‌లో టికెట్ల అమ్మకాలు..
లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్‌లకు పెట్టింది పేరు ఢిల్లీ, ముంబయి, బెంగళూరు. ఈ మహానగరాల్లో ఎంత పెద్ద సంగీత వేడుక జరిగినా అభిమానులు ఆదరిస్తున్నారు. టికెట్ ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ కొనుగోలు చేసే వారి సంఖ్య అధికం. ‘‘పాప్‌స్టార్‌లు, ఏర్పాట్లను బట్టి టికెట్ ధరలను నిర్ణయిస్తారు. అవి సినిమా టికెట్లలా స్థిరంగా ఎప్పుడూ ఉండవు సాధారణంగా కాన్సర్ట్‌లకు ఐదు వేల రూపాయల నుంచి పాతికవేల వరకు టికెట్‌ధరలు ఉంటాయి. అందులోనూ విభాగాల వారీగా ధరలు మారతాయి. వేదిక ముందు భాగంలో అయితే ఒక రేటు, వెనక అయితే మరొక రేటు చెల్లించాల్సి ఉంటుంది’’ అంటున్నారు కాన్సర్ట్‌ల నిర్వాహకులు. కొన్ని యాప్స్‌లు, వెబ్‌సైట్లలో లైవ్‌మ్యూజిక్ షోల టికెట్ల అమ్మకాలు ప్రారంభించిన వెంటనే అమ్ముడవుతున్నాయి. వాటిని తిరిగి మ్యూజిక్ షోకు రెండు మూడు రోజుల ముందు నుంచి బ్లాక్‌లో అమ్మడం మొదలుపెడుతున్నారు.
ఈ తతంగాన్ని నియంత్రించడం కష్టంగా మారింది. ‘‘బ్రియాన్ ఆడమ్స్, ఎడ్ షీరన్, జస్టిన్ బైబర్ వంటి స్టార్ పాప్‌సింగర్స్‌ను లైవ్‌లో చూడాలన్నది చాలామంది జీవితకాల కోరిక. అందుకే వారు కొన్నేళ్ల నుంచి ఎదురుచూస్తుంటారు. తీరా వచ్చాక.. ఇలా బ్లాక్‌లో టికెట్ల అమ్మకాలు జరిగితే... నిజమైన అభిమానులు అరుదైన అవకాశాన్ని కోల్పోతారు. ఈ పరిస్థితి సంగీత పరిశ్రమకు మంచిది కాదు. సినిమాల్లో పైరసీని నియంత్రించినట్లే లైవ్ కాన్సర్ట్ టికెట్లను బ్లాక్‌లో విక్రయించే పోకడలకు అడ్డుకట్ట వేయాలి’’ అన్నాడు ముంబయికి చెందిన సంగీతప్రియుడు ఎంఎస్. అహ్లువాలియా. ఆయన అనేకసార్లు బ్లాక్‌లో టికెట్లు కొని మ్యూజిక్ షోలను తిలకించాల్సి వచ్చింది.
టికెట్ల సమస్య అలా ఉంటే.. నగరాల్లో కాన్సర్ట్‌లను నిర్వహించడం తలకుమించిన భారమని నిర్వాహకులు పేర్కొంటున్నారు. ‘‘రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు భద్రత కల్పించడం పెద్ద సమస్య. తమ అభిమాన సింగర్ వేదికపై పాట పాడుతున్నప్పుడు... ఆయనతో కరచాలనం చేయాలని ఆరాటపడే కొందరు ఉన్నట్లుండి గుంపులు గుంపులుగా మీద పడే ప్రమాదం ఉంది. పరిస్థితి అదుపుతప్పితే తొక్కిసలాట జరగొచ్చు. గుంపును నియంత్రించడం కష్టం. కొన్ని అంతర్జాతీయ సంగీత వేడుకల్లో ఉగ్రవాదులు కాల్పులు జరిపిన సంఘటనల్నీ మరువలేము. భారత్‌లో కూడా భద్రతాలోపాల వల్ల ఉగ్రవాదుల ముప్పును తప్పించుకోవడం అంత సులభం కాదు. వేడకకు హాజరయ్యే ప్రతీ వ్యక్తినీ క్షుణ్ణంగా తనిఖీచేసి పంపడం కూడా కష్టమైనదే!’’అని కాన్సర్ట్‌ల నిర్వాహకులు పేర్కొంటున్నారు.
మన సింగర్స్ కూడా..
భారత్‌లో మ్యూజిక్ కాన్సర్ట్‌ల నిర్వహణ ప్రస్తుతం ప్రారంభదశలోనే ఉందని చెప్పవచ్చు. అంతర్జాతీయ సింగర్స్ మన దేశానికి వస్తుంటే.. మన దేశీసింగర్స్ విదేశాల్లో కాన్సర్ట్‌లు నిర్వహిస్తున్నారు. ఇది కూడా మంచి పరిణామమనే చెప్పొచ్చు. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, దుబాయ్‌లలో ప్రవాసభారతీయులు అధికంగా ఉన్నారు కాబట్టి కార్యక్రమాలు సూపర్‌హిట్ అవుతున్నాయి. దిల్జీత్ దొసాంజ్, హనుమాన్ కైండ్ (హెచ్‌ఎంకె) వంటి సింగర్స్ విదేశాల్లో బాగా పాపులారిటీ సంపాదించారు. హెచ్‌ఎంకె పాటలు విడుదలైన వెంటనే బిల్‌బోర్డ్ 200లో తొమ్మిదో స్థానం, స్పొటిఫై గ్లోబల్ 50లో ఏడో స్థానంలో నిలిచాడు. ఈయనది కేరళ. అమెరికాలోని హూస్టన్‌లో ఉన్నప్పుడు పాప్‌మ్యూజిక్ నేర్చుకున్నాడు.
పంజాబీ మ్యూజిక్ ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందడంతో హెచ్‌ఎంకెలాంటి వాళ్లకు అరుదైన అవకాశాలు వచ్చాయి. దొసాంజ్ కూడా ఇదే తరహాలో క్లిక్ అయ్యాడు. హిప్‌హాప్, ఫోక్, ట్రెడిషనల్ వంటి ధోరణులను కలగలిపి తనదైన పంజాబీ గీతాలతో ఆకట్టుకుంటున్నాడీయన. కేరళ పాప్ సింగర్స్ అయిన దబ్జీ, ఫెజొ, మెక్ కూపర్, ఎంహెచ్‌ఆర్, వేదన్ వంటి వాళ్లు కూడా బయటి దేశాల్లో సంగీత అభిమానుల హృదయాన్ని గెలుచుకున్నారు. ఒకప్పుడు సింగర్స్‌కు, మ్యూజిక్ కంపోజర్స్‌కు దేశం, ప్రాంతం, భాష అనేవి తప్పనిసరి. ఇప్పుడు ఇంటర్‌నెట్ ప్రపంచంలో సంగీతం అంతర్జాతీయమైపోయింది. సరిహద్దులను దాటుకుని సంగీతప్రియుల హృదయాలను తాకుతోంది. అందుకే అటు నుంచి వచ్చే పాప్‌సింగర్స్‌ను ఆదరిస్తున్నారు.. ఇటు నుంచి వెళ్లే దేశీ గాయకుల్ని విదేశీయులు అక్కున చేర్చుకుంటున్నారు. ఈ పరిణామమే లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్‌లకు ప్రాణం పోస్తోంది.
- సండే డెస్క్