చీకట్లో.. అడవుల్లోకి...
ABN , Publish Date - Feb 23 , 2025 | 12:29 PM
రాత్రివేళ అటవీ ప్రాంతం గుండా ప్రయాణం చేయాల్సి వస్తే గుండె వేగం రెట్టింపవుతుంది ఎవరికైనా. కానీ ఆశ్చర్యంగా యువతరం ‘నైట్ సఫారీ’లకు సై అంటోంది. ‘పగలు అడవిని చూడటం సాధారణమే. రాత్రివేళల్లో అందులోకి వెళ్లడమే మజా’ అంటూ రాత్రుళ్లు అటవీ అందాలను చూసేందుకు సఫారీ జీపులు ఎక్కేస్తున్నారు.

రాత్రివేళ అటవీ ప్రాంతం గుండా ప్రయాణం చేయాల్సి వస్తే గుండె వేగం రెట్టింపవుతుంది ఎవరికైనా. కానీ ఆశ్చర్యంగా యువతరం ‘నైట్ సఫారీ’లకు సై అంటోంది. ‘పగలు అడవిని చూడటం సాధారణమే. రాత్రివేళల్లో అందులోకి వెళ్లడమే మజా’ అంటూ రాత్రుళ్లు అటవీ అందాలను చూసేందుకు సఫారీ జీపులు ఎక్కేస్తున్నారు. చిల్లింగ్ థ్రిల్లింగ్‌తో అడవిని సరికొత్త కోణంలో చూసే అవకాశాన్ని ఈ సఫారీలు అందిస్తున్నాయి. ఇంతకీ ఈ నయా సఫారీలు ఎక్కడున్నాయి? ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి??
పగటి వేళ అడవిలో వెళుతున్న సింహాన్ని చూడటం ఒకింత ఆశ్చర్యానందానికి గురిచేసినా... అదే సింహాన్ని చిమ్మచీకట్లో చూడటం చిల్లింగ్ అనుభూతి. అచ్చంగా అలాంటి అనుభూతి కోసమే పర్యాటకులు ‘నైట్ సఫారీ’ చేయడానికి ఇష్టపడుతున్నారు. ట్రావెల్ ట్రెండ్ రిపోర్టు ప్రకారం 60 శాతం పైగా పర్యాటకులు ‘డార్క్ స్కై జోన్’ ప్రయాణాలకు ప్రాధాన్యం ఇస్తున్నారట. అంటే ఎలాంటి కాలుష్యం లేకుండా స్వచ్ఛమైన ఆకాశాన్ని చూసే అవకాశం ఉన్న ప్రాంతాలు. నేషనల్ పార్కులు ఆ కోవకు చెందినవే. మన దేశంలో నేషనల్ పార్కులు చాలా ఉన్నా అందులో కొన్ని మాత్రమే పర్యాటకులకు నైట్ సఫారీ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి.
మూడు గేట్లు... ముచ్చటైన అనుభవాలు...
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుల్లో సియోని, చింద్వారా జిల్లాలలో 758 చదరపు కిలోమీటర్లలో ‘పెంచ్ పార్క్’ విస్తరించి ఉంది. అంతరించిపోయే స్థితిలో ఉన్న జంతుజాలాన్ని ఇక్కడ చూడొచ్చు. టికాడి బఫర్ జోన్‌లో చేసే నైట్ సఫారీ కొత్త ప్రపంచాన్ని కళ్ల ముందుంచుతుంది. పులులు, అడవిపందులు, అడవి కుక్కలు, తోడేళ్లు, హైనాలను ఇక్కడ చూడొచ్చు. అడవి పిల్లులు, బూడిద రంగు తోడేళ్లు కూడా కనిపిస్తాయి. పెంచ్ నది అందాలు రాత్రుళ్లు కనువిందు చేస్తాయి. నైట్ సఫారీకి ఇది కేంద్ర బిందువుగా ఉంటుంది.
రాత్రుళ్లు పక్షుల అరుపులు, సాంబార్ జింకల పరుగులు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి. పార్క్ జోన్లలోకి మూడు గేట్ల ద్వారా ప్రవేశించవచ్చు. టౌరియా గేట్ అతి పురాతనమైనది. పాపులర్ సఫారీ జోన్ గేట్‌గా గుర్తింపు ఉంది. ఈ గేట్ చాలా రద్దీగా ఉంటుంది. ఇక్కడి నుంచే రాత్రుళ్లు చాలా జీప్‌లు పార్కులోకి ప్రవేశిస్తూ ఉంటాయి. మొత్తం 74 జీపులను ఇక్కడి నుంచి అనుమతిస్తారు. రెండోది కర్మాజిరి గేట్. ఇక్కడి నుంచి 16 జీపులు అనుమతిస్తారు. ఉదయం 8, సాయంత్రం 8 అనుమతిస్తారు. వైల్డ్ డాగ్స్ చూడాలనుకునేవారు ఈ గేట్‌లో నుంచి వెళ్లాలి. మూడోది జంతారాగేట్. ఉదయం 5 జీపులు, సాయంత్రం 4 జీపులు ఇక్కడి నుంచి అనుమతిస్తారు. స్లాత్‌బేర్‌లను చూడాలనుకునే వారికి ఈ గేట్ బెస్ట్ ఆప్షన్. ఇక బఫర్ జోన్‌లోకి ప్రవేశించడానికి 4 గేట్లు ఉన్నాయి. ఈ పార్క్ నాగ్‌పూర్‌కి 100 కి.మీ దూరంలో ఉంది.
పులుల ప్రపంచం
సూర్యాస్తమయం తరువాత ‘కన్హా నేషనల్ పార్కు’ అందాలు చూసి తీరాల్సిందే. పగటిపూట సఫారీ ఆకర్షణీయంగా ఉన్నా నైట్ సఫారీ సరికొత్త అనుభవాన్ని అందిస్తుంది. ఇక్కడ విభిన్నమైన వృక్షజాలం, జంతుజాలం చూడొచ్చు. ముఖ్యంగా ముక్కి బఫర్ జోన్ దగ్గర విడిది చేసే పర్యాటకులకు మరిచిపోలేని అనుభూతి సొంతమవుతుంది. మధ్యప్రదేశ్‌లో 940 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది. ఇక్కడ నైట్‌సఫారీ ప్రతి వ్యక్తికి ఒక తీపి జ్ఞాపకంగా గుర్తుండిపోతుంది. రాత్రుళ్లు అటవీ ప్రాంతంలో నుంచి వచ్చే శబ్దాలు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తాయి. గుడ్లగూబలు, సివెట్‌లను ఎక్కువగా చూడొచ్చు. ఈ పార్కులో 83 పులులు, 42 పులి పిల్లలు ఉన్నాయి. అన్ని కాలాల్లోనూ సందర్శించవచ్చు. అయితే నవంబరు నుంచి మార్చి మధ్య కాలంలో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది.
పక్షి ప్రేమికుల కోసం...
మనదేశంలో మొదటి నేషనల్ పార్క్‌గా ‘జిమ్‌కార్బెట్ నేషనల్ పార్క్’కు గుర్తింపు ఉంది. ఉత్తరాఖండ్‌లో ఉన్న ఈ పార్క్ బెంగాల్ టైగర్‌ని చూడాలనుకునే ఔత్సాహికులకు స్వాగతం పలుకుతూ ఉంటుంది. ఇక్కడ నైట్ సఫారీ బోలెడు థ్రిల్‌ని అందిస్తుంది. పార్కులోని జిర్నా, ఢేలా, సీతాబని బఫర్‌జోన్‌ల సమీపంలో రాత్రి 7 నుంచి 10 గంటల వరకు నైట్ సఫారీని అనుమతిస్తారు. పగటివేళ నిద్రాణస్థితిలో ఉండి రాత్రుళ్లు ఆహారం కోసం వేటాడే హైనాలు కనిపిస్తాయి. 2020 లెక్కల ప్రకారం ఇక్కడ 200 పులులు ఉన్నాయి. పక్షి ప్రేమికులకు ఇక్కడ నైట్ సఫారీ మరిచిపోలేని అనుభూతిని అందిస్తుంది. గుడ్లగూబలు, నైట్‌జార్‌లు చూడొచ్చు. వన్యప్రాణి ప్రేమికులకు జిమ్‌కార్బెట్ డిసెంబర్ నుంచి మే మధ్య కాలం సందర్శనకు అనువైనది.
వెన్నెల వెలుతురులో పులుల జాడ...
ఇండియాలో ఉత్తమ టైగర్ రిజర్వ్ పార్కులలో ‘తాడోబా- అంధారి నేషనల్ పార్క్’ ఒకటి. మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో ఈ పార్క్ 1717 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది. ఈ పార్కులో 80 కన్నా ఎక్కువ పులులు ఉన్నాయని అధికారులు చెబుతుంటారు. మూన్‌లైట్‌లో పులులు సంచరించే పార్కుగా దీనికి పేరుంది. వెన్నెల వెలుతురులో పులులను చూడటం అద్భుతమైన ఆనందాన్నిస్తుంది. పులులతో పాటు అడవి పందులు, సివెట్ క్యాట్‌లు, ఇండియన్ బైసన్ వంటివి ఇక్కడ చూడొచ్చు.
గుడ్లగూబల అరుపులు
బెంగాల్ పులులు, తోడేళ్లు, చిరుత పులులు, అడవి పిల్లులు... ఇలా వేటాడే జంతువులకు నిలయంగా ఉంటుంది ‘పన్నా నేషనల్ పార్కు’. మధ్యప్రదేశ్‌లోని పన్నా, ఛతర్‌పూర్ జిల్లాలలో 543 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది. జిన్నా, అకోలా బఫర్ జోన్‌లు నైట్ సఫారీ కేంద్రాలుగా ఉంటాయి. ఇతర పార్కులతో పోలిస్తే ఇక్కడ నైట్‌సఫారీకి వెళ్లే పర్యాటకులకు భిన్నమైన అనుభూతి సొంతమవుతుంది. చంద్రుడి వెలుగులు, నక్షత్రాల కాంతుల్లో అడవి అందాలు చూసి తీరాల్సిందే. గుడ్లగూబలను చూడటం, వాటి అరుపులు వినడం ఎప్పటికీ మరిచిపోలేరు.
అడవిలో నది
రాత్రుళ్లు వన్యప్రాణులను చూడాలనుకునే వారికి ‘సాత్పురా నేషనల్ పార్క్’ స్వాగతం పలుకుతోంది. చీకటి పడగానే అప్పటిదాకా చూసిన అడవి కొత్త రూపంలో కనిపిస్తుంది. బెంగాల్ టైగర్స్, తోడేళ్లు, అడవి పిల్లులు, నక్కలు, ఎలుగుబంట్లు, వివిధ రకాల గుడ్లగూబలను చూడటం మరిచిపోలేని సఫారీ అనుభూతిని ఇస్తుంది. సాత్పురా నేషనల్ పార్కులో ప్రశాంతంగా ప్రవహించే ‘డెన్వా నది’ సుందర దృశ్యం రాత్రుళ్లు చూసి తీరాల్సిందే.
నేషనల్ పార్కును మల్టిపుల్ జోన్స్‌గా విభజిస్తారు. సఫారీ టూర్‌తో పాటు పర్యాటకులు సులభంగా పార్క్‌లో జంతువులను చూడటానికి జోన్స్ ఉపయోగపడతాయి. బఫర్ జోన్‌లోకి పర్యాటకులను అనుమతిస్తారు. రిజర్వ్ జోన్‌లోకి ప్రవేశం ఉండదు. ఒక్కో జోన్‌లో ఒక్కోరకమైన జంతువులు ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి.
అంతర్జాతీయ నైట్ సఫారీలు
- సింగపూర్ నైట్ సఫారీ: ఇది చాలా ప్రసిద్ధమైన సఫారీ. పులులు, సింహాలు, ఏనుగులు, అడవి పిల్లులు, చిరుత, స్లాత్‌బేర్, నైల్ హిప్పో, పాంగోలిన్, మలయన్ ఫ్లయింగ్ ఫాక్స్ వంటి 130 పైగా జంతుజాతులు ఇక్కడ చూడొచ్చు.
- సబీ సాండ్ గేమ్ రిజర్వ్: దక్షిణాఫ్రికాలో ఉన్న ఈ సఫారీ లగ్జరీ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది. హైనాలు, చిరుతలు, ఇతర వన్యప్రాణులను చూడొచ్చు.
గుర్తుంచుకోవాల్సినవి...
డే సఫారీకి, నైట్ సఫారీకి తేడాలుంటాయి. నైట్‌సఫారీలో కొన్ని నిబంధనలను కచ్చితంగా పాటిస్తేనే భద్రతతో కూడిన ఆనందం సొంతం అవుతుంది. గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన సూచనలివి...
- ప్రకాశవంతమైన దుస్తులు వేసుకోకూడదు.
- ఫ్లాష్ ఫొటోగ్రఫీ ఉపయోగించకూడదు.
- ప్రతీ జాతీయ పార్కుకు కొన్ని నియమనిబంధనలు ఉంటాయి. వాటిని తప్పకుండా గౌరవించాలి.
- రీఫిల్ వాటర్ బాటిల్స్‌ను పట్టుకెళ్లాలి.
- వ్యర్థాలను వేసుకోవడానికి ఒక అదనపు బ్యాగు తీసుకెళ్లాలి.
- చెత్తను సూచించిన డబ్బాల్లోనే వేయాలి.
- దోమలే కాకుండా బగ్ బైట్స్ నుంచి కాపాడుకోవడానికి మస్కిటో రీపెల్లెంట్‌ను రాసుకోవాలి.
- నైట్‌సఫారీలో వాహనం దిగి జంతువుల దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేయకూడదు.
- జంతువుల కళ్లలోకి నేరుగా ఫ్లాష్ లైట్‌ని వేయకూడదు.