Housing Society Secretary Assaults: మరీ ఇంత దారుణమా.. ఆడపిల్ల అని కూడా చూడకుండా..
ABN , Publish Date - Oct 28 , 2025 | 09:33 PM
స్కూటీని ఒక చోటు నుంచి మరో చోటుకు తీసుకెళ్లి పెట్టాడు. దీంతో శాలు అతడితో గొడవపెట్టుకుంది. శాలు అన్న కలుగజేసుకోవటంతో ఆ గొడవ చినికి చినికి గాలివానలా మారింది. అపార్ట్‌మెంట్స్ ప్రెసిడెంట్, మరికొందరు గార్డ్‌కు మద్దతుగా వచ్చారు.
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. పార్కింగ్ విషయంలో గొడవ నేపథ్యంలో ఓ యువతిపై, ఆమె అన్నపై కొంతమంది వ్యక్తులు దాడి చేశారు. ఇంట్లోకి చొరబడి మరీ విచక్షణా రహితంగా కొట్టారు. ఆడపిల్ల అన్న కనికరం కూడా లేకుండా అత్యంత పాశవికంగా వ్యవహరించారు. సంఘటనకు సంబంధించి బాధితురాలు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. శాలు చౌరాసియా అనే యువతి తన అన్నతో కలిసి లక్నోలోని మాదియాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే కుతిర్ అపార్ట్‌మెంట్స్‌లో ఉంటోంది. శాలు కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవుతోంది.
అక్టోబర్ 23వ తేదీన శాలు తన స్కూటీని అపార్ట్‌మెంట్స్ పార్కింగ్ ప్లేసులో పార్క్ చేసింది. కొద్దిసేపటి తర్వాత అపార్ట్‌మెంట్స్ గార్డ్ స్కూటీని ఒక చోటు నుంచి మరో చోటుకు తీసుకెళ్లి పెట్టాడు. దీంతో శాలు అతడితో గొడవపెట్టుకుంది. శాలు అన్న కలుగజేసుకోవటంతో ఆ గొడవ చినికి చినికి గాలివానలా మారింది. అపార్ట్‌మెంట్స్ ప్రెసిడెంట్, మరికొందరు గార్డ్‌కు మద్దతుగా వచ్చారు. శాలుపై, శాలు అన్నపై దాడికి దిగారు. ఇద్దరూ వారినుంచి తప్పించుకుని ఇంట్లోకి వెళ్లి దాక్కున్నారు. ఆ దుర్మార్గులు ఇంట్లోకి చొరబడి మరీ ఇద్దర్నీ కొట్టారు. భయపడిపోయిన అన్నాచెల్లెళ్లు అక్కడినుంచి పారిపోయారు.
ఫ్రెండ్స్ రూములో తలదాచుకున్నారు. తమపై దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేయడానికి నాలుగు సార్లు పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. అయితే, పోలీసులు వీరి ఫిర్యాదు తీసుకోలేదు. దీంతో శాలు కన్నీటి పర్యంతం అయింది. పోలీస్ స్టేషన్ ముందు ఓ వీడియో తీసి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. ఇంట్లో జరిగిన దాడికి సంబంధించిన వీడియోను కూడా పోస్టు చేసింది. అవి కాస్తా వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలోనే పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. రెండు వర్గాల నుంచి ఫిర్యాదులు తీసుకున్నామని చెప్పారు. దర్యాప్తు జరుగుతోందని వెల్లడించారు.
ఇవి కూడా చదవండి
నవ్యాంధ్రప్రదేశ్‌లో సంపద సృష్టిలో భాగస్వామ్యం అందిస్తాం: గల్ఫ్ తెలుగు వైశ్యవ్యాపారవర్గాలు
ఒక ముస్లిం ముఖ్యమంత్రి కాకూడదా.. బిహార్‌లో ఒవైసీ ప్రచారం షురూ