Share News

Gen Z Violent Protest: నేపాల్‌ ఉద్రిక్తత.. వెలుగులోకి ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు

ABN , Publish Date - Sep 08 , 2025 | 06:04 PM

నేపాల్ మారణకాండకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ వీడియోలో నేపాల్ పార్లమెంట్ గేట్ మంటల్లో తగలబడిపోతూ ఉంది.

Gen Z Violent Protest: నేపాల్‌ ఉద్రిక్తత.. వెలుగులోకి ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు
Gen Z Violent Protest

సోషల్ మీడియా యాప్స్ నిషేధం నేపాల్‌ను కుదిపేస్తోంది. దేశ రాజధాని ఖాట్మాండులో జన్ జీ చేపట్టిన నిరసన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. మారణ హోమం సృష్టించింది. నిరసనకారులపై భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 19 మంది చనిపోయారు. 42 మంది వరకూ తీవ్రంగా గాయపడ్డారు. నిషేధిత ప్రాంతాల్లోకి నిరసనకారులు ప్రవేశించటంతో ఈ దారుణం చోటుచేసుకుంది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ‘ది ఖాట్మాండు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్’ బనేశ్వోర్, లాయిన్ చౌర్‌లతోపాటు పలు సున్నిత ప్రదేశాల్లో కర్ఫ్యూ విధించింది నేపాల్ సర్కార్.


పార్లమెంట్ తగలబెట్టిన జన్ జీ

సోమవారం ఉదయం కొన్ని వందల మంది యువతీ, యువకులు ఖాట్మాండు వీధుల్లోకి వచ్చి నిరసనలు మొదలుపెట్టారు. న్యూ బనేశ్వోర్‌లోని పార్లమెంట్ భవనాన్ని చుట్టుముట్టారు. సెక్యూరిటీ ఫోర్స్‌ను దాటుకుని లోపలికి ప్రవేశించారు. పార్లమెంట్ గేట్‌ను ధ్వంసం చేయటంతోపాటు నిప్పంటించారు. ఈ నేపథ్యంలోనే వారిపై భద్రతా బలగాలు రబ్బర్ బుల్లెట్లతో కాల్పులు జరిపాయి. టియర్ గ్యాస్, వాటర్ కెనాన్స్ ప్రయోగించాయి. దీంతో ప్రాణ నష్టం సంభవించింది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.


భయానక దృశ్యాలు..

నేపాల్ మారణకాండకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ వీడియోలో నేపాల్ పార్లమెంట్ గేట్ మంటల్లో తగలబడిపోతూ ఉంది. కొంతమంది నిరసనకారులు గేటు పైనుంచి కిందకు దూకి పారిపోతూ ఉన్నారు. ఇంతలో బ్లాక్ టీషర్ట్ వేసుకున్న ఓ నిరసనకారుడు పార్లమెంట్ గేటుపై రాయితో దాడి చేశాడు. మరో వీడియోలో నిరసనకారులు బ్యారికేడ్స్ దాటుకుని పార్లమెంట్‌లోకి ప్రవేశించడానికి చూశారు. వారిని అడ్డుకున్న భద్రతా బలగాలపై బాటిళ్లు, ఇతర వస్తువులతో దాడికి దిగారు. ఇంకో వీడియోలో నిరసనకారులు బ్యారికేడ్లను కిందకు పడేశారు.


ఇవి కూడా చదవండి

రెచ్చిపోయిన పోలీస్ అధికారి.. బార్ డ్యాన్సర్‌తో కలిసి..

అత్యంత అరుదైన సంఘటన.. మనిషిలా దంతాలు కలిగిన చేప..

Updated Date - Sep 08 , 2025 | 08:09 PM