Share News

కుందేళ్లకూ ఉందో దీవి..

ABN , Publish Date - Jun 22 , 2025 | 11:00 AM

ఆ దీవి ప్రాణాంతక వాయువులను ఉత్పత్తి చేసే కర్మాగారాలకు నిలయం. అక్కడ ఏం జరుగుతుందో నరమానవునికి అంతు చిక్కదు. అదొక రహస్య ప్రదేశం. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు పర్యాటకులతో కళకళలాడుతున్న ప్రముఖ టూరిస్ట్‌ కేంద్రం.

కుందేళ్లకూ ఉందో దీవి..

ఆ దీవి ప్రాణాంతక వాయువులను ఉత్పత్తి చేసే కర్మాగారాలకు నిలయం. అక్కడ ఏం జరుగుతుందో నరమానవునికి అంతు చిక్కదు. అదొక రహస్య ప్రదేశం. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు పర్యాటకులతో కళకళలాడుతున్న ప్రముఖ టూరిస్ట్‌ కేంద్రం. ఆ దీవి నిండా ఎక్కడ చూసినా స్వేచ్ఛగా విహరిస్తున్న కుందేళ్లు కనిపిస్తాయి. అవి ఎక్కడి నుంచి అక్కడికి చేరుకున్నాయో తెలుసుకోవాలంటే ‘రాబిట్‌ ఐలాండ్‌’కు వెళ్లాల్సిందే...

జపాన్‌లోని హిరోషిమా, షికోకు నగరాల మధ్యన ఉన్న ఇన్లాండ్‌ సముద్రంలో ‘ఒకునోషిమా’ అనే దీవి ఉంది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఈ దీవికి టాప్‌ సీక్రెట్‌ మిలిటరీ సైట్‌గా గుర్తింపు ఉండేది. రసాయన యుద్ధంలో వాడేందుకు విషపూరితమైన, ప్రాణాంతకమైన గ్యాస్‌ తయారీని ఈ దీవిలోనే చేశారు. ఇంపీరియల్‌ జపనీస్‌ ఆర్మీ అప్పట్లో ఈ దీవిలోనే ఆరు కిలో టన్నుల మస్టర్డ్‌ గ్యాస్‌ను ఉత్పత్తి చేసిందని చెబుతారు.


సముద్రం మధ్యలో...

1929 నుంచి 1945 మధ్యకాలంలో ఈ దీవి హానికారక రసాయనాల ఉత్పత్తి కేంద్రంగా గుర్తింపు పొందింది. ఒకవేళ ఏదైనా ఊహించని ప్రమాదం జరిగితే నగరాలపై ఆ ప్రభావం ఉండకూడదనే ఉద్దేశంతో సముద్రం మధ్యలో ఉన్న ఈ దీవిని ఎంపిక చేశారు. శత్రుదేశాలకు తెలియకుండా ఉండటం కోసం మ్యాప్‌ల్లో నుంచి ఈ దీవిని తొలగించారు. అక్కడ నివసించే ఉద్యోగులు, నివాసితులు అక్కడున్న ప్లాంట్‌లో ఏం ఉత్పత్తి చేస్తారో ఎవ్వరికీ చెప్పేవారు కాదు. ఆ విషయాన్ని అత్యంత రహస్యంగా ఉంచేవారు. పదహారేళ్ల పాటు ఆ దీవిలో ఏం జరిగిందో నర మానవుడికి తెలియకుండా జాగ్రత్తపడ్డారు. యుద్ధం ముగిసిన తరువాత సైన్యం ఆ గ్యాస్‌ని పూడ్చడం, కాల్చివేయడం ద్వారా తొలగించే ప్రయత్నం చేసింది. ఆ తరువాత దీవిని ఖాళీ చేశారు. 1971లో విషపూరిత గ్యాస్‌ తాలూకు ప్రభావం ఇంకా ఏమైనా ఉందా తెలుసుకునేందుకు అధికారులు కొన్ని కుందేళ్లను దీవిలోకి వదిలారు. అదృష్టం కొద్దీ అవి క్షేమంగా ఉండటంతో, క్రమక్రమంగా ఆ దీవి రూపురేఖలు మారిపోయాయి.


పర్యాటక క్రేందం...

దీవిలో ప్రాణాంతకమైన వాయువులు లేవని నిర్ధారణ అయ్యాక పర్యాటకులు అక్కడికి వెళ్లడం చిన్నగా మొదలైంది. అయితే ఆదీవిలో ఇప్పుడు ప్రధానాకర్షణ కుందేళ్లు. ప్రస్తుతం దీవిలో వెయ్యికి పైగా కుందేళ్లు ఉన్నాయి. విష పూరిత రసాయనాల ప్రభావం ఉన్నదీ లేనిదీ తెలుసుకోవడం కోసం కొన్ని కుందేళ్లను వదిలితే... ఇప్పుడు వాటి సంఖ్య వెయ్యి దాటింది. వాటికి ఆహారం అందించడానికి పర్యాటకులు ఉత్సాహం చూపుతుంటారు. దీవిలోనే ఉన్న ఒక రిసార్టులో సిబ్బంది కుందేళ్లకు వేసే ఆహారాన్ని అమ్ముతుంటారు.

book5.2.jpg

పర్యాటకులు ఆహారాన్ని అక్కడ కొనుగోలు చేసి కుందేళ్లకు తినిపిస్తుంటారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ కుందేళ్లకు ఆహారం తినిపిస్తూ మురిసిపోతుంటారు. చీకటిపడే దాకా కుందేళ్లతో ఎంజాయ్‌ చేసి తిరుగుముఖం పడుతుంటారు. కుందేళ్లు సైతం పర్యాటకులు వేసే ఆహారానికి అలవాటు పడి, వారి కోసం ఎదురు చూస్తుంటాయి. ఎలాంటి భయం లేకుండా పర్యాటకులతో కలిసిపోతాయి. వాటితో ఫొటోలు దిగుతూ, కెమెరాల్లో బంధించడానికి పర్యాటకులు ఆసక్తి చూపుతుంటారు.


కుక్కలు, పిల్లులకు నో ఎంట్రీ...

కాలక్రమంలో ఈ దీవిలో గోల్ఫ్‌కోర్సులు, రిసార్టులు, పార్కులు వెలిశాయి. పర్యాటకుల కోసం బీచ్‌లు కూడా అందంగా ముస్తా బయ్యాయి. కుందేళ్ల సంరక్షణ కోసం అధి కారులు అనేక జాగ్రత్తలు తీసుకుంటుంటారు. సాధారణంగా ఎలుకలు, కాకులు, అడవి పందులతో కుందేళ్లకు ప్రమాదం పొంచి ఉంటుంది. కుందేళ్లకు ప్రధాన శత్రువు అడవి కాకి. ఇవి కుందేలు పిల్లలను సులభంగా ఎత్తు కొని పోతాయి. వాటివల్ల కుందేళ్లకు ప్రమాదం రాకుండా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. ఈ దీవిలో ఒక్క కుక్క, పిల్లి కూడా కనిపించదు. అందుకే కుందేళ్లు స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. పర్యాటకులు కుక్కలు, పిల్లులు తీసుకురావడం నిషేధం. ‘రాబిట్‌ ఐలాండ్‌’ని ఏటా సందర్శిస్తున్న పర్యాటకుల సంఖ్య లక్షకు పైనే ఉంది. భవిష్యత్తు తరాల కోసం ఈ దీవిని సంరక్షించేందుకు కృషి చేయాలని పర్యావరణ వేత్తలు కోరుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ఢిల్లీలో పాత వాహనాలకు పెట్రోల్‌, డీజిల్‌ బంద్‌

Read Latest Telangana News and National News

Updated Date - Jun 22 , 2025 | 11:03 AM