Financial Stability: ఇవి ఫాలో అయితే చాలు.. మీ చేతిలో డబ్బే డబ్బు..
ABN , Publish Date - Jan 17 , 2025 | 07:14 PM
జీవితంలో ఆర్థికంగా స్థిరంగా ఉండటానికి కొన్ని ముఖ్యమైన ఆర్థిక నియమాలను పాటించడం అవసరం. ఈ నియమాలు వ్యక్తిగత ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడతాయి. అవెంటో తెలుసుకుందాం..
Financial Stability: మనిషి సంతోషంగా జీవించాలంటే బతకడానికి డబ్బు కావాలి. ప్రతి ఒక్కరు తమతమ స్థాయిలో డబ్బు సంపాదించే ప్రయత్నం చేస్తుంటారు. అయితే, సంపాదించిన డబ్బును ఎలా పొదుపు చేయాలో మాత్రం కొంతమందికి తెలియదు. అందుకే అతిగా ఖర్చు చేసి అత్యవసర పరిస్థితులు ఎదరైనప్పుడు చేతిలో చిల్లిగవ్వ లేక తీవ్ర అవస్థలు పడతారు. అయితే, ఆర్థికంగా స్థిరంగా ఉండటానికి కొన్ని ముఖ్యమైన ఆర్థిక నియమాలను మనం పాటించాలి. ఈ నియమాలు వ్యక్తిగత ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడటమే కాకుండా ధనవంతులుగా జీవించేందుకు మార్గాన్ని రూపొందిస్తాయి.
పొదుపు చాలా ముఖ్యం..
పొదుపు చేయడం చాలా ముఖ్యం. మీ ఆదాయంలో నుండి కనీసం 20-30% ను మీరు పొదుపు చేసుకోవాలి. డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్ వంటి పెట్టుబడులను పెట్టుకోండి. ఇతర వృథా ఖర్చులను తగ్గించుకోండి. అలాగే అదనపు ఆదాయం కోసం దృష్టి పెట్టండి. మీ నెలవారీ ఖర్చులను ముందుగానే ప్లాన్ చేసుకోండి. అప్పుడు మీ అధిక ఖర్చులను నియంత్రించుకోవచ్చు.
ఎమర్జెన్సీ ఫండ్..
జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. కొన్నిసార్లు అనివార్య పరిస్థితులు రావొచ్చు. అనుకోని వైద్య ఖర్చులు, ఉద్యోగం కోల్పోవడం వంటివి జరగొచ్చు. అలాంటి సమయంలో ఎమర్జెన్సీ ఫండ్ ఉపయోగపడుతుంది. మీ జీతంలో నుండి కొంత డబ్బును ఎమర్జెన్సీ ఫండ్ కోసం తీసిపెట్టుకోండి.
అప్పులు తీసుకోవద్దు..
మీరు మీ ఆదాయంలో నుండి కొంత పొదుపు చేస్తే అప్పు తీసుకునే పరిస్థితి రాదు. ఇతరుల నుండి అప్పు తీసుకునే ముందు దాని వల్ల కలిగే ఆర్థిక ఇబ్బందుల గురించి కూడా ఆలోచించండి. అధిక వడ్డీతో ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. క్రెడిట్ కార్డ్ తీసుకుంటే అధిక వడ్డీ కట్టలేక ఇబ్బందులు పడతారు.
ఇన్సూరెన్స్ ప్లాన్..
మీ కుటుంబం కోసం అనుకూలమైన ఇన్సూరెన్స్ ప్లాన్లను తీసుకోండి. ఎందుకంటే అనుకోని పరిస్థితులలో ఆర్థిక భద్రత ఉంటుంది. ప్రతి వ్యక్తికి ఆర్థిక లక్ష్యాలు ఉండాలి. మీ ఆదాయాన్ని ఖర్చులను సరియైన మార్గంలో క్రమబద్ధీకరించుకుంటే ఆర్థికంగా ఎదుగుతారు.