Vote Without Voter ID: ఓటర్ ఐడీ లేకున్నా ఓటు వేయొచ్చు.. ఎలా అంటే?
ABN , Publish Date - Oct 10 , 2025 | 12:40 PM
ఓటు హక్కు అనేది 18 ఏళ్లు దాటిన ప్రతి భారతీయ పౌరుల హక్కు. అందుకే ఎన్నికలు జరిగినప్పుడు అర్హులైన వారు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఇందు కోసం ప్రభుత్వ అధికారులు విస్తృతంగా ప్రచారం చేస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ఓటర్ ఐడీ కార్డు లేదని కొందరు ఓటు వేయడం మానుకుంటారు.
ఓటు హక్కు అనేది 18 ఏళ్లు దాటిన ప్రతి భారతీయ పౌరుల హక్కు. అందుకే ఎన్నికలు జరిగినప్పుడు అర్హులైన వారు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఇందు కోసం ప్రభుత్వ అధికారులు విస్తృతంగా ప్రచారం చేస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ఓటర్ ఐడీ కార్డు లేదని కొందరు ఓటు వేయడం మానుకుంటారు. ఇలాంటి ఘటనలు అనేకం అధికారుల దృష్టికి వెళ్లాయి. దీంతో గతంలో ఎన్నికల అధికారులు ఓటు వేసే విషయంలో పలు సూచనలు చేశారు. తాజాగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల, తెలంగాణ రాష్ట్రంలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికల వేళ మరోసారి ఈ ఓటు వేసే విషయంపై అధికారులు కీలక విషయాలను వెల్లడించారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఈ నెల 13న నోటిఫికేషన్, నవంబర్ 11న ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. అటు పార్టీలు సైతం అభ్యర్థులను ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఓటు ఉండి.. ఓటరు గుర్తింపు కార్డు లేనివారు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ తెలిపారు. ప్రభుత్వానికి సంబంధించిన, ఇతర ముఖ్యమైన12 రకాల ఫోటో ఐడీలలో ఏ ఒక్కటి చూపించినా ఓటు వేసే అవకాశ ఉంటుందని ఆయన చెప్పారు.
ఓటర్ ఐడీతో పాటు పోలింగ్ బూత్‌లో కింది గుర్తింపు కార్డులు చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.
ఆధార్ కార్డు
ఉపాధిహామీ జాబ్ కార్డు
బ్యాంక్/ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ పాస్‌బుక్
ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు / కేంద్ర కార్మికశాఖ స్మార్ట్ కార్డు
డ్రైవింగ్ లైసెన్స్
పాన్ కార్డు
NPR కింద RGI జారీ చేసిన స్మార్ట్ కార్డు
భారతీయ పాస్‌పోర్ట్
ఫోటో ఉన్న పెన్షన్ పత్రాలు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల అధికారుల ఐడీ కార్డులు
ఎంపీ/ఎమ్మెల్యే/ఎమ్మెల్సీ అధికారిక గుర్తింపు కార్డులు
UDID (దివ్యాంగుల ప్రత్యేక గుర్తింపు కార్డు)
ఓటర్ జాబితాలో పేరు ఉండి.. ఈ 12 ప్రత్యామ్నాయ గుర్తింపు కార్డులలో ఏ ఒక్కటి ఉన్నా ఓటు వేయవచ్చని కర్ణన్ తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ప్రజలంతా తప్పకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి ఆర్.వి. కర్ణన్ విజ్ఞప్తి చేశారు.