Share News

‘కృత్రిమ దీవి’లో మ్యూజియం

ABN , Publish Date - Jun 22 , 2025 | 11:50 AM

చుట్టూ స్వచ్ఛమైన నీళ్లు. మధ్యలో అందమైన దీవి. జీవితంలో ఒక్కసారైనా ఆ దీవిని సందర్శించి తీరాల్సిందే అనిపించేలా కనువిందు చేసే ఆహ్లాదకరమైన వాతావరణం. ఆశ్చర్యం ఏమిటంటే... ఆ దీవి ప్రకృతిసిద్ధంగా ఏర్పడింది కాదు... అదొక కృత్రిమ దీవి...

‘కృత్రిమ దీవి’లో మ్యూజియం

చుట్టూ స్వచ్ఛమైన నీళ్లు. మధ్యలో అందమైన దీవి. జీవితంలో ఒక్కసారైనా ఆ దీవిని సందర్శించి తీరాల్సిందే అనిపించేలా కనువిందు చేసే ఆహ్లాదకరమైన వాతావరణం. ఆశ్చర్యం ఏమిటంటే... ఆ దీవి ప్రకృతిసిద్ధంగా ఏర్పడింది కాదు... అదొక కృత్రిమ దీవి...

అనంత సాగరాలు, సరస్సుల నడుమ అక్కడక్కడా కనిపించే దీవుల గురించి తెలుసు. కానీ జర్మనీలోని హనోవర్‌ ప్రాంతంలో ఉన్న స్టెయిన్‌హుడ్‌ సరస్సులోని ‘విల్‌హెల్మ్‌ స్టెయిన్‌’ దీవికి వెళితే... అక్కడి అద్భుతానికి నోరు వెళ్లబెట్టాల్సిందే. 1761లో కౌంట్‌ విల్‌హెల్మ్‌ ఈ కృత్రిమ దీవిని నిర్మించారు. నిజానికి దీన్ని పర్యాటకుల కోసం నిర్మించలేదు. మిలిటరీ సేవల కోసం నిర్మించారు. చాలా ఏళ్లపాటు మిలిటరీ అవుట్‌పోస్ట్‌గా కొనసాగింది.


book7.2.jpg

క్రమక్రమంగా మిలిటరీ స్కూల్‌, సైన్స్‌ రీసెర్చ్‌ సెంటర్‌, అబ్జర్వేటరీగా సేవలందించింది. అప్పట్లో 16 చిన్న చిన్న దీవులు ఈ సరస్సులో ఉండేవి. వాటన్నింటిని కలుపుతూ కృత్రిమదీవిగా రూపొందించారు. దీవి మధ్యలో నక్షత్రం ఆకృతిలో కోటను నిర్మించారు. 1772లో మొట్టమొదటి జర్మనీ సబ్‌మెరైన్‌ ‘స్టెయిన్‌హుడర్‌ హెట్చ్‌’ ఈ దీవిలోనే తయారయ్యింది. విల్‌హెల్మ్‌ చనిపోయిన తరువాత 18వ శతాబ్దంలో ఈ కోటను కారాగారంగా మార్చారు. 1867లో ఇక్కడి నుంచి కారాగారాన్ని తరలించి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దారు.


మరచిపోలేని అనుభూతి

‘విల్‌హెల్మ్‌ స్టెయిన్‌’ దీవి సుమారు మూడు ఎకరాల్లో ఉంటుంది. దీనిని చేరుకోవాలంటే పడవల్లో వెళ్లాల్సి ఉంటుంది. అందులోని కోట పైనుంచి చూస్తే సరస్సు అందాలు కనువిందు చేస్తాయి. ఆహ్లాదకరమైన వాతావరణం పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటుంది. అక్కడే ఉండాలంటే వసతి సౌకర్యాలు కూడా ఉంటాయి. దీవిలో ఏర్పాటు చేసిన మ్యూజియం కనువిందు చేస్తుంది.


book7.3.jpg

ఈ దీవిలో తయారైన జర్మనీ మొదటి సబ్‌మెరైన్‌ మోడల్‌ను మ్యూజియంలో చూడొచ్చు. జర్మనీ చరిత్రను తెలుసు కోవచ్చు. కుటుంబంతో కాస్త ప్రశాంతంగా గడిపేందుకు చాలా మంది ఈ దీవికి వెళ్తున్నారు. ఈ దీవి నుంచి సూర్యోదయాన్ని చూడటం ఓ అద్భుత అనుభవంగా చెబుతున్నారు. ఇలాంటి ఎన్నో మరపురాని మధురానుభూతులను మూటగట్టుకున్నట్టుగా పర్యాటకులు సోషల్‌ మీడియాలో ఫొటోలతో సందడి చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ఢిల్లీలో పాత వాహనాలకు పెట్రోల్‌, డీజిల్‌ బంద్‌

Read Latest Telangana News and National News

Updated Date - Jun 22 , 2025 | 11:50 AM