Share News

మృత్యువు ముంగిట్లో...

ABN , Publish Date - Feb 16 , 2025 | 01:09 PM

‘‘ప్రతి మనిషికీ బతికి ఉండడానికి ఒక కారణం అంటూ ఉండాలి. అలాంటి మనిషి ఎలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా బతికే ఉంటాడు. జీవితేచ్ఛ అతన్ని బతికిస్తుంది. బతకడానికి ఒక కారణం అంటూ లేనివాళ్ళు త్వరగా మరణిస్తారు’’ అంటాడు విక్టర్‌ ఫ్రాంకిల్‌ అనే రచయిత.

మృత్యువు ముంగిట్లో...

‘‘ప్రతి మనిషికీ బతికి ఉండడానికి ఒక కారణం అంటూ ఉండాలి. అలాంటి మనిషి ఎలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా బతికే ఉంటాడు. జీవితేచ్ఛ అతన్ని బతికిస్తుంది. బతకడానికి ఒక కారణం అంటూ లేనివాళ్ళు త్వరగా మరణిస్తారు’’ అంటాడు విక్టర్‌ ఫ్రాంకిల్‌ అనే రచయిత.

‘మ్యాన్స్‌ సెర్చ్‌ ఫర్‌ మీనింగ్‌’’ అనే పుస్తకంలో బతకడానికి, బతికి ఉండడానికి ఒక్కొక్కరికి ఒక్కో కారణం ఉంటుంది. జీవితం మనల్ని మృత్యువు ముంగిట్లో నిలబెట్టినప్పుడు అలాంటి కారణం ఇంకా అవసరమవుతుంది. ఆరేళ్ళ కూతురికి ఇచ్చిన మాటకోసం క్యాన్సర్‌ బారి నుంచి తప్పించుకుని బతకడానికి ఓ తండ్రి చేసే పోరాటమే ‘ఐ వాంట్‌ టు టాక్‌’.


మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌గా క్షణం తీరిక లేకుండా గడిపే ఎన్‌ఆర్‌ఐ అర్జున్‌సేన్‌కు అకస్మాత్తుగా ఒకరోజు తనకు క్యాన్సర్‌ వ్యాధి సోకినట్టు తెలుస్తుంది. వందరోజుల కంటే ఎక్కువ బతకడని డాక్టర్లు చెప్పినపుడు అతని ప్రపంచం తల్లకిందులవుతుంది. డైవోర్సీ అయిన అర్జున్‌ ేసన్‌ ఆరేళ్ల కూతురు రియాతో కలిసి ఉంటుంటాడు. డైవోర్స్‌ ఒప్పందంలో భాగంగా రోజువిడిచి రోజు అమ్మానాన్నల దగ్గర ఉండాల్సి వచ్చిన కూతురు రియాతో కూడా అప్పటికి అతనికి అంత అనుబంధం ఉండదు. ఒకరోజు రియా తనకు ‘అమ్మ, తన స్నేహితులు, నానమ్మ, తాతయ్య, తన టీచరు తర్వాత నువ్వు ఎనిమిది సర్కిల్‌లో ఉన్నావ’ని చెప్పడం అతన్ని ఆలోచనలో పడేస్తుంది.


book8.jpg

క్యాన్సర్‌ కారణంగా నిరాశలో కూరుకుపోయిన అర్జున్‌ ఒక దశలో ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకుంటాడు. కొండపై నుంచి దూకి చనిపోవాలని కారులో బయలుదేరుతాడు. అయితే అతని నర్సు నాన్సీ నచ్చచెప్పి అతన్ని వెనక్కు రప్పిస్తుంది. అంతవరకూ నాన్న అంటే అంత అనుబంధం లేని రియా కూడా తండ్రికి ఆరోగ్యం బాగా లేకపోవడం అర్థమై అతనికి దగ్గరవుతుంటుంది. ఒకరోజు రియా తండ్రిని ‘‘నువ్వు చనిపోబోతున్నావా?’’ అని అడుగుతుంది. అర్జున్‌ ‘లేదు’ అని చెబుతాడు. ‘‘అట్లా అయితే నా పెళ్ళిలో నువ్వు డ్యాన్స్‌ చేస్తావా’’ అని అడుగుతుంది.


వందరోజుల్లో చనిపోతావని డాక్టర్లు చెప్పిన అర్జున్‌ సేన్‌కు బతకడానికి కారణం అలా రియా రూపంలో వస్తుంది. రియా పెళ్ళిలో డ్యాన్స్‌ చేేసంతవరకూ తను బతికి ఉండాలి. అదే అర్జున్‌ సేన్‌కు ఉన్న ఒకే ఒక లక్ష్యం. అందుకోసం ఇరవై వరకూ సర్జరీలు చేయించుకోడానికి కూడా వెనుకాడని అర్జున్‌సేన్‌ ఆ లక్ష్యం సాధించాడా? లేదా? అనేది మిగిలిన కథ.

ఇన్‌ఫ్లుయెన్సర్‌ అర్జున్‌ సేన్‌ రచించిన నిజజీవిత కథ ‘రైజింగ్‌ ఎ ఫాదర్‌’ ఆధారంగా రూపుదిద్దుకున్న ‘ఐ వాంట్‌ టు టాక్‌’ బలమైన భావోద్వేగాలతో కళ్ళకే కాదు... హృదయానికీ చక్కటి అనుభూతినిస్తుంది.


మృత్యువు ఆమ్నిపాటెంట్‌ లాంటిది. జీవితం చుట్టూ పేరుకున్న ఆశలు, ఆశయాలు, తాపత్రయాలు, సాధించిన విజయాలు అన్నింటినీ పటాపంచలు చేయగలిగిన శక్తి ఒక్క మృత్యువుకే ఉంటుంది. అలాంటి మృత్యువు ముంగిట్లో ఉన్న వ్యక్తి మానసిక స్థితి ఎలా ఉంటుంది. దానిని తట్టుకుని తిరిగి జీవితాన్ని పునర్‌ నిర్మించుకోడానికి అతను ఏం చేశాడనే బలమైన ఇతివృత్తంతో కూడిన ‘ఐ వాంట్‌ టు టాక్‌’ లో అడుగడుగునా షూజిత్‌ సర్కార్‌ దర్శకత్వ ప్రతిభ కనిపిస్తుంది. ‘పీకూ’, ‘అక్టోబర్‌’ లాంటి చిత్రాలతో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న షూజిత్‌ ‘పీకూ’లాగానే ఈ చిత్రాన్ని కూడా తండ్రీ కూతుళ్ళ అనుబంధం ప్రధానంగా తీశాడు. అనారోగ్యం, మృత్యువు, మనిషి ఒంటరితనం, ఆ ఒంటరితనంలో మాట్లాడడానికి అవసరమయ్యే ఒక మనిషి తోడు గురించి తనదైన శైలిలో చెప్పడానికి చేసిన ప్రయత్నంలో షూజిత్‌ సఫలీకృతుడయ్యాడని చెప్పాలి.


‘‘క్యాన్సర్‌ నయమై తిరిగి మామూలుగా అయితే నువ్వు ఏం చేయాలని అనుకుంటున్నావు’’ అని నర్సు నాన్సీ అడిగినప్పుడు ‘‘నేను మాట్లాడాలని అనుకుంటున్నాను’’ అని చెబుతాడు అర్జున్‌ేసన్‌. సీరియస్‌ ఇతివృత్తంతో కూడుకున్న సినిమా అయినప్పటికీ అర్జున్‌ేసన్‌ తనకు చికిత్స చేస్తున్న డాక్టరును విసిగించే అన్ని సందర్భాలు హాయిగా నవ్వుకునేలా చేస్తాయి. తనకు సర్జరీ చేస్తున్న డాక్టర్లు సర్జరీ మధ్యలో వాట్సప్‌ మెేసజ్‌ల ద్వారా సంప్రదించుకుని తనను బతికించారని అర్జున్‌ సేన్‌ చెప్పిన తీరు కూడా నవ్వు పుట్టిస్తుంది.


book8.2.jpg

అర్జున్‌సేన్‌ పాత్రకు అభిషేక్‌ బచ్చన్‌ తప్ప మరొకరిని ఊహించలేనంత చక్కగా నటించాడు. సాధారణంగా నటులు ఏ మాత్రం ఇష్టపడని డీ గ్లామర్‌ పాత్రని ఎంచుకోవడమే కాకుండా తన అద్భుతమైన నటనతో ఆ పాత్రని కలకాలం గుర్తుండిపోయేలా చేశాడు. అతని కూతురు చిన్న రియాగా, పెద్ద రియాగా చేసిన ఇద్దరూ చక్కటి అభినయాన్ని కనబరిచారు. డాక్టరు, నర్సు నాన్సీ పాత్రధారులు కథలో లీనమయ్యారు. అతిథి పాత్రలో జానీ లీవర్‌ కనిపించడం చక్కని రిలీఫ్‌. ఇందులో రితీష్‌ఫా స్ర్కీన్‌ ప్లే, సంభాషణల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించక తప్పదు. థియేటర్లలో అంతగా ఆడనప్పటికీ చక్కటి అభిరుచి ఉన్న ప్రేక్షకులకు ఒక మంచి అనుభూతినిచ్చే సినిమా ఐ వాంట్‌ టు టాక్‌’.

- జి. లక్ష్మి, 94907 35322


ఐ వాంట్‌ టు టాక్‌ (హిందీ)

దర్శకుడు: షూజిత్‌ సర్కార్‌

నటీనటులు: అభిషేక్‌ బచ్చన్‌, అహల్యా బామ్‌రూ, జానీలీవర్‌ తదితరులు.

నిడివి: 122 నిమిషాలు

విడుదల: అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

Updated Date - Feb 16 , 2025 | 01:09 PM