Coolie Movie Mania: తలైవా క్రేజ్.. థియేటర్ల దగ్గర రచ్చ రచ్చ చేసిన ఫ్యాన్స్..
ABN , Publish Date - Aug 14 , 2025 | 11:52 AM
Coolie Movie Mania: ఇప్పటి వరకు తమిళ సినిమాకు ఒక్క 1000 కోట్ల రూపాయల సినిమా కూడా లేదు. తమిళ తంబీలు కూలీ మీదే ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాతోనైనా 1000 కోట్లు కొట్టాలని చూస్తున్నారు.
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘కూలీ’ సినిమా ఈరోజు(ఆగస్టు 14) ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. అయితే, నిన్న రాత్రి అమెరికాలో ప్రీమియర్ షోలు పడ్డాయి. అక్కడ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు. తమిళనాడు కంటే ముందే ఏపీలో షోలు పడ్డాయి. ఉదయం 5 గంటలకు బెనిఫిట్ షోలు మొదలయ్యాయి. ఏపీ నుంచి కూడా మంచి టాక్ వచ్చింది. విడుదలైన ప్రతీ భాషలోనూ కూలీ శభాష్ అనిపించుకుంది. పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది.
తలైవా అంటే ఆ మాత్రం ఉండాలి..
విడుదల సందర్బంగా తలైవా క్రేజ్ స్పష్టంగా కనిపించింది. థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోయారు. ముంబైలోని ఓ థియేటర్‌లో రజినీ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు. బెంగళూరు ముకుంద థియేటర్ బయట తలైవా ఫ్యాన్స్ తప్పెట్ల మోతలు మోగించారు. డ్యాన్సులతో రచ్చ రచ్చ చేశారు. తమిళనాడులోని తిరుచిరాపల్లిలో కొంతమంది లేడీ ఫ్యాన్స్ పూల పళ్లేలతో థియేటర్‌కు వెళ్లారు. తమిళనాడులోని చాలా థియేటర్ల దగ్గర కూలీ సినిమా విడుదల సందర్భంగా పండుగ వాతావరణం నెలకొంది.
1000 కోట్ల టార్గెట్..
ఇప్పటి వరకు తమిళ సినిమాకు ఒక్క 1000 కోట్ల రూపాయల సినిమా కూడా లేదు. తమిళ తంబీలు కూలీ మీదే ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాతోనైనా 1000 కోట్లు కొట్టాలని చూస్తున్నారు. ఇక, ఈ సినిమా దాదాపు 300 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కింది. కింగ్ నాగార్జున విలన్ పాత్ర చేశారు. ఆమీర్ ఖాన్, ఉపేంద్రలు కీలక పాత్రల్లో కనిపించారు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన కూలీ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించాడు.
ఇవి కూడా చదవండి
కన్నడ స్టార్ నటుడు దర్శన్‌కు సుప్రీంకోర్టు షాక్..రేణుక స్వామి హత్య కేసులో బెయిల్ రద్దు