Kidney Sale for iPhone: ఐఫోన్ కొనడానికి కిడ్నీ అమ్మేశాడు.. చివరకు..
ABN , Publish Date - Oct 11 , 2025 | 12:37 PM
కుర్రకారులో ఐఫోన్స్ పిచ్చి పీక్స్‌కు చేరిపోతోంది. దాన్ని సొంతం చేసుకోడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో వాళ్లకే తెలీడం లేదు. ఓ కుర్రాడు ఐ ఫోన్ కొనుక్కునేందుకు ఏకంగా తన కిడ్నీని అమ్మేశాడు.. చివరికి..
ఇంటర్నెట్ డెస్క్: కుర్రకారులో ఐఫోన్స్ పిచ్చి పీక్స్‌కు చేరిపోతోంది. ఐఫోన్ సొంతం చేసుకోడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో వాళ్లకే తెలీడం లేదు. చైనాలో ఓ కుర్రాడు ఐ ఫోన్ కొనుక్కునేందుకు ఏకంగా తన కిడ్నీని అమ్మేశాడు.
చైనాలోని అన్హుయ్ ప్రావిన్స్‌కు చెందిన సదరు యువకుడు తొందరపాటులో తీసుకున్న నిర్ణయానికి ఇప్పటికీ మూల్యం చెల్లిస్తున్నాడు. 2011లో వాంగ్ షాంగ్‌కున్ కు కేవలం 17 ఏళ్ల వయసు. పేదింటి వాడైన ఆ యువకుడు అక్కడి యువత ప్రెస్టీజియస్‌గా భావించే ఐఫోన్ సొంతం చేసుకోవాలని తపించిపోయాడు.
ఆన్‌లైన్‌లో పోస్ట్‌లు చూసి తన కిడ్నీలలో ఒకదాన్ని చట్టవిరుద్ధమైన ఆపరేషన్ ద్వారా అమ్మడానికి అంగీకరించాడు. ఇందుకోసం అతనికి 20,000 యువాన్లు (సుమారు రూ.2.48 లక్షలు) ఇచ్చారు. ఆ డబ్బుతో అతను ఐఫోన్ 4, ఐప్యాడ్ 2 కొన్నాడు. కానీ త్వరలోనే, అతని ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమైంది. తీవ్రమైన ఇన్ఫెక్షన్ రావడమే కాకుండా, అతని మరో కిడ్నీ కూడా బలహీనపడటం మొదలైంది. రాను రాను వాంగ్ ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారింది.
ఈ క్రమంలో ఖరీదైన ఐ ఫోన్, గాడ్జెట్‌లను అతని తల్లి గమనించి, ఇవి ఎక్కడివని నిలదీసింది. వాంగ్ చివరకు జరిగిందంతా చెప్పాడు. దీంతో అతని తల్లి కన్నీటి పర్యంతమైంది. ఈ క్రమంలో విషయం బయటకి రావడంతో అధికారులు రంగంలోకి దిగారు. అక్రమ శస్త్రచికిత్సలను నిర్వహిస్తున్న ముఠాను పట్టుకున్నారు. వాంగ్‌కు 1.48 మిలియన్ యువాన్లు (సుమారు రూ.1.83 కోట్లు) పరిహారంగా ఇచ్చారు.
ఇప్పుడు, 14 ఏళ్ల తర్వాత వాంగ్ కిడ్నీ పనితీరు కేవలం 25 శాతానికి పడిపోయింది. అతను జీవితాంతం డయాలసిస్‌పై జీవించాల్సిన పరిస్థితి వచ్చింది. ఐఫోన్ కోసం కిడ్నీ అమ్ముకోవడం ఎంతటి తప్పిదమో తెలుసుకుని వాంగ్ ఇప్పుడు వాపోతున్నాడు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
భద్రాద్రి రామయ్య సేవలో 225 జంటలు
Read Latest Telangana News and National News