చిన్న ప్రయత్నాలతో పెద్ద మార్పు
ABN , Publish Date - Feb 16 , 2025 | 01:40 PM
చలి వెళ్లిపోతూ వసంతాన్ని పంపిస్తోంది. వసంతం అంటే ఎక్కువ ఉదయాలు... వెలుతురు. అందుకు తగినట్టు ఇంటినీ తీర్చిదిద్దుకోవాలనుకుంటే... వసంతాన్ని ఇంట్లోకి ఆహ్వానిస్తూ ఈ మార్పులు చేస్తే చాలు... ఇంటి లుక్ అదిరిపోతుంది.
చలి వెళ్లిపోతూ వసంతాన్ని పంపిస్తోంది. వసంతం అంటే ఎక్కువ ఉదయాలు... వెలుతురు. అందుకు తగినట్టు ఇంటినీ తీర్చిదిద్దుకోవాలనుకుంటే... వసంతాన్ని ఇంట్లోకి ఆహ్వానిస్తూ ఈ మార్పులు చేస్తే చాలు... ఇంటి లుక్ అదిరిపోతుంది.
- సాధరణంగా చలికాలంలో ముదురు రంగు దుప్పట్లు, రగ్గులనే వాడతారు. అవి ఇంట్లో వెలుగును ఒకరకంగా తక్కువ చేస్తాయి. చలికాలం పోయింది కాబట్టి వాటి స్థానంలో తెల్లని, లేత రంగుల కాటన్, లెనిన్ దుప్పట్లని దులిపి బయటకు తీయాలి. దిండు కవర్లనీ మార్చేయాలి.
- గత కొంతకాలంగా గృహాలంకరణలో మొక్కలూ భాగం అయ్యాయి. పచ్చని మొక్కలూ, పూల తీగలూ పరిసరాలనే కాదు... మనసునూ ఉల్లాసంగా ఉంచుతాయి. ఒత్తిడిని పోగొడుతాయి. అందుకే ఇంటి లోపల ఖాళీ ప్రదేశాల్లో, కిటికీలపై ఆక్సిజన్ ఇచ్చే మొక్కల్ని పెంచితే అటు ఇంటికి ఇటు వంటికీ మంచిది.
- ఇంట్లో అన్నిచోట్ల మొక్కలను పెట్టడం, వాటి పెంపకం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అలాంటివారు ప్లాస్టిక్ పూల కుండీల ఆప్షన్ ఎంచుకుంటే... ఎండిన పూలే కాదు గడ్డి, తీగలతో కూడా గదుల రూపాన్ని మార్చవచ్చు. మార్కెట్లో ఒరిజనల్ మొక్కలను పోలిన అనేక రకాలు అందుబాటులో ఉన్నాయి. వాటితో ఇంటి లుక్ చాలా మారిపోతుంది.
- డైనింగ్ టేబుల్, కాఫీ టేబుల్, బుక్ రాక్... అలాగే ఉంటాయి కాబట్టి వాటి లుక్‌ను మార్చడం కష్టం అనుకుంటే పొరబడ్డట్టే. వాటి మీద ఇటు ఉన్నవి అటు, అటు ఉన్నవి ఇటు మార్చేయండి. చిన్న చిన్న మార్పులతో వాటిని అందంగా తీర్చిదిద్దొచ్చు. కొన్నింటిని యాడ్ చేయడం వల్ల కూడా సరికొత్తగా కనిపిస్తాయి. అలాగే మెత్తటి వస్తువుల పక్కన గట్టివి, పొడవాటి వాటి పక్కన పొట్టివి సెట్ చేసి చూడండి.

- హాలు, వరండా, బెడ్‌రూమ్‌లలో ఫర్నీచర్‌ని ఈ గోడ నుంచి ఆ గోడకి మార్చేయండి. దీవాన్‌ను కిటీకీ పక్కకి జరపండి. దీనివల్ల బోరింగ్‌గా ఫీలవ్వకుండా కొత్త అనుభూతి కలుగుతుంది. ఇంట్లో పేద్ద మార్పు మీకే కనిపిస్తుంది. దీనికి కాస్త సమయం పట్టినా కొత్త ఇంట్లోకి వెళ్లిన ఫీలింగ్ కలుగుతుంది.
- వసంతం రంగులకు సూచిక. అందుకే వెలసిపోయి, మట్టిరంగులో ఉన్న పూల కుండీలకు శుభ్రం చేసి రంగులు వేయండి. లేదా కొత్తగా, ఆకర్షణీయంగా రంగురంగుల పింగాణీ పాత్రలు మార్కెట్లో చాలా ఉన్నాయి (ఆన్‌లైన్‌లో కూడా దొరుతున్నాయి). కావాల్సిన సైజుల్లో వాటిని కొని డైనింగ్ టేబుల్, కిచెన్ గట్టు మీద ఉంచండి.
- సోఫాలు, కుర్చీలు, పరుపుల మీద మరిన్ని దిండ్లను చేర్చండి. వాటి రంగులు కూడా వేర్వేరుగా ఉండాలన్న విషయం మరచిపోకూడదు.
- ఇల్లు ఎలా ఉన్నా సరే. ఆ లుక్‌ను వెంటనే మార్చేసేది ఆర్ట్‌వర్క్. గోడ మీద వేలాడదీసిన పెయింటింగ్స్ వసంతాన్ని మీ ఇంట్లో ఎల్లప్పుడూ ఉండేలా చేస్తాయి. ఈ పెయింటింగ్స్‌ను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండడం మరచిపోవద్దు. కూసింత బద్ధకాన్ని వీడి, కాస్త ఓపికతో ఈ మార్పులు చేసుకుంటే ఎల్లప్పుడూ వసంతం మీ వెంటే.