Share News

Viral Video: లిఫ్ట్‌లో కుక్కపిల్లను నేలకేసి కొట్టి చంపిన పనిమనిషి

ABN , Publish Date - Nov 04 , 2025 | 07:58 AM

బెంగళూరులో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. కోపంతో ఓ యువతి కుక్కపిల్లను ఘోరంగా చంపింది. అసలేమైందంటే..

Viral Video: లిఫ్ట్‌లో కుక్కపిల్లను నేలకేసి కొట్టి చంపిన పనిమనిషి
Viral Video

బెంగుళూరు, నవంబర్ 4: కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. కోపంతో ఓ యువతి కుక్కపిల్లను ఘోరంగా చంపింది. ఓ అపార్ట్ మెంట్ లో ఉంటున్నవారు కుక్క పిల్లను పెంచుకుంటున్నారు. అయితే వారు ఏదో పని ఉందని తమ కుక్క పిల్లను ఇంట్లోని పని మనిషికి అప్పజెప్పారు. ఏమైందో ఏమో తెలియదు గాని ఆ కుక్క పిల్లపై కోపం పెంచుకున్న పనిమనిషి, సరైన సమయం కోసం వేచిచూసింది. అగ్రహావేశంతో లోలోపల రగిలిపోతున్న ఆమె.. ఎవరూ లేని సమయంలో కుక్కను చంపేయాలని ప్లాన్ వేసింది. అనుకున్నదే తడవుగా ఆ కుక్కను చంపేసింది. ఆ తరువాత తనకేమీ తెలియనట్లు నాటకమాడింది.


తమ కుక్కపిల్ల చనిపోయిందని తెలిసిన అపార్ట్‌మెంట్ వారు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. తమ కుక్కపిల్ల ఎందుకు చనిపోయిందని అన్వేషించారు. తమ దగ్గర ఉన్న ఆధారాలను నిశితంగా పరిశీలించారు. అయితే ఎక్కడా ఏ క్లూ లభించలేదు. కానీ విధి ఊరుకోదు కదా! వారి బాధను అర్ధం చేసుకున్న విధి.. ఆధారం చూపించింది. సీసీటీవీలో తమ కుక్కపిల్ల ఫుటేజీని పరిశీలించిన వారు.. పనిమనిషే చంపేసిందని నిర్ధారించారు. లిఫ్ట్‌లో కుక్కపిల్లను తీసుకెళ్తుండగా.. ఎందుకు కోపం పెంచుకుందోగానీ కుక్కపిల్లను దారుణంగా కొట్టి చంపేసింది. అనంతరం అక్కడినుంచి ఏం తెలియదన్నట్లు మెల్లగా జారుకుంది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


ఈ ఘటనపై అపార్ట్‌మెంట్ వాసులు సహా నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మూగ జీవులపై కోపం పెంచుకొని ఇలా ప్రవర్తిస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'మూగ జీవిపై ఇంతటి ప్రతాపమా! అసలు ఆమె మనిషేనా' అంటూ ఫైర్ అవుతున్నారు. పెంపుడు జంతువుపై జాలి, దయ లేకుండా కొట్టి చంపినందుకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్టోబర్ 31 మధ్యాహ్నం ఈ ఘటన జరిగిందని, గూఫీ అనే తన పెంపుడు కుక్కపిల్లను పనిమనిషి దారుణంగా కొట్టి చంపినట్టు ఫిర్యాదులో పేర్కొంది. బాగలూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. ఈ మేరకు పని మనిషిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.


ఇవి కూడా చదవండి:

ED Seizes Anil Ambani Group Assets: అనిల్‌ అంబానీ ఆస్తుల జప్తు

Delhi HC: ఆ నిబంధన వద్దే వద్దు

Updated Date - Nov 04 , 2025 | 11:16 AM