1950s Bengaluru photo: 70 ఏళ్ల క్రితం బెంగళూరు ఎలా ఉండేదో చూస్తే.. నెట్టింట ఫొటో వైరల్
ABN , Publish Date - Mar 17 , 2025 | 07:23 PM
1950ల్లో బెంగళూరులో తీసిన ఓ బ్లాక్ అండ్ వైట్ ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అప్పట్లో నగరం ఇలా భూతలస్వర్గంలా ఉండేదా అంటూ జనాలు వేల కొద్దీ కామెంట్స్ పెడుతున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: బెంగళూరు అంటే ప్రస్తుతం గుర్తొచ్చేది ట్రాఫిక్ రద్దీ, ఆకాశాన్నంటుతున్న అద్దెలు.. ఒక్క ముక్కలో చెప్పాలంటే మహానగరం.. బిజీ ప్రపంచం. అయితే, ఐటీ రంగం ఊపందుకున్నాక బెంగళూరు నగరం రూపురేఖలు మారిపోయాయి. గుర్తుపట్టలేనంతగా నగర ముఖచిత్రం మారిపోయింది. పాత తరం వారు మాత్రం బెంగళూరు గురించి గొప్పగా చెప్పుకుంటారు. ఎటుచూసినా పచ్చదనం, ప్రశాంతమైన జీవినం ఉట్టిపడే బెంగళూరు.. భూతల స్వర్గమని కామెంట్ చేస్తుంటారు. అప్పట్లో బెంగళూరు నగరం ఎలా ఉండేదో చెప్పే ఓ బ్లాక్ అండ్ వైట్ ఫొటో ప్రస్తుతం తెగ వైరల్ (Viral) అవుతోంది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: భార్యతో ఆఫీసు ముచ్చట పంచుకున్నందుకు ఊస్టింగ్.. టెకీకి షాకిచ్చిన మెటా
1950ల్లో నగరంలోని ఎమ్‌జీ రోడ్డు చిత్రం ఇది. రోడ్డుకు ఓవైపు ఆగి ఉన్న కార్లు, సైకిళ్లు, రిక్షాలు, స్ట్రీట్ లైట్లతో ఉన్న రోడ్డు ఫొటోను చూసి జనాలు అబ్బరుపడ్డారు. బెంగళూరు నిజంగా భూతల స్వర్గమే అని కామెంట్ చేశారు. నాటి నగరానికి నేటికి ఏమాత్రం పోలిక లేదని కొందరు విచారం వ్యక్తం చేశారు. ఆ రోజులు మళ్లీ రావన్న వారు కూడా ఉన్నారు. ‘‘ఆ ప్రాంశాతమైన వాతావరణం, గడబిడలు లేని రోడ్లు చూస్తుంటే అప్పట్లో బెంగళూరు స్వర్గంలా ఉండేదేమో’’ అని ఓ వ్యక్తి కామెంట్ చేశారు.
అయితే, కొందరు మాత్రం ఈ వాదనతో విభేదించారు. అప్పట్లో ప్రజల్లో పేదరికం వెనుకబాటుతనం ఉందని అన్నారు. సాఫ్ట్‌వేర్ విప్లవం తరువాత నగరంలో పేదరికం తగ్గిందని, అందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వచ్చాయని చెప్పుకొచ్చారు. నేడు అందరి చేతుల్లో స్మార్ట్‌ఫోన్లు దర్శనమివ్వడానికి ఈ అభివృద్ధే కారణమని వ్యాఖ్యానించారు.
Also Read: ఆరేళ్లు ఆఫీసుకు రాకున్నా ఫుల్ శాలరీ పొందిన ప్రభుత్వోద్యోగి.. అధికారులకు షాక్
ఇటీవల ఆర్‌పీజీ గ్రూపు అధినేత హర్ష్ గోయెంకా కూడా ఒకప్పటి బెంగళూరు నగరం సౌందర్యాన్ని గుర్తు చేసుకుని మురిసిపోయారు. ‘‘అప్పట్లో నగరం ప్రశాంతత ఉట్టిపడే నగరం. కబ్బన్ పార్కులో ఉదయం పూట వాకింగ్, ప్రీమియర్ పద్మిని కారులో షికార్లు, మధ్యాహ్నం వేళ బుక్ స్టోర్‌లల్లో బద్ధకంగా గడిపిన క్షణాలు..
ఆ తరువాత ఇద్దరు ఐఐటీ పట్టభద్రులకు వారి జీవితభాగస్వాములు కొంత డబ్బు ఇచ్చారు. ఆ తరువాత మనం ఎక్కువ సమయంలో నగరంలోని ఉద్యానవనాల గుబాళింపులకు దూరంగా ఔటర్ రింగు రోడ్డులోనే గడపాల్సి వస్తోంది.. ఇది అభివృద్ధి అని జనాలు అంటున్నారు’’ అని ఇన్ఫీ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి, నందన్ నీలేకని ఫొటోలను షేర్ చేస్తూ కామెంట్ చేశారు. ఇన్ఫోసిస్ ఏర్పాటు తరువాత బెంగళూరు భారత సిలికాన్ వ్యాలీగా మారిన విషయం తెలిసిందే.