air Conditioner Safety Tips : చలికాలం తర్వాత ఏసీ ఉపయోగిస్తున్నారా.. ఇవి చెక్ చేయడం మర్చిపోతే అంతే..
ABN , Publish Date - Feb 03 , 2025 | 03:27 PM
ఇన్నాళ్లూ చలికాలం కావడంతో ఏసీలను వాడటం ఆపేసి ఉంటారు అంతా. ఇక రాబోయేది వేసవి కాలం. కాబట్టి ఇప్పటి నుంచే అందరూ ఏసీల వాడకం మొదలుపెట్టి ఉంటారు. అయితే, చలికాలం తర్వాత ఎయిర్ కండీషనర్ ఉపయోగించే ముందు ఈ విషయాలు చెక్ చేయడం మర్చిపోకండి. లేకపోతే AC త్వరగా పాడయ్యే ప్రమాదముంది.

గడగడలాడించే చలి దెబ్బకు ఇంట్లో ఉన్న ఏసీలకు విశ్రాంతి ఇచ్చి ఉంటారంతా. ఇక రాబోయేది వేసవి కాలం. ఇప్పటికే ఎండలు కొన్నిచోట్ల ప్రతాపం చూపిస్తున్నాయి. ఆ వేడి సెగల నుంచి ఉపశమనం పొందేందుకు ఇన్నాళ్లూ మూలన పడేసిన ఎయిర్ కండీషనర్‌లకు పనిచెప్పడం మొదలుపెట్టే ఉంటారు. అయితే, చలికాలం తర్వాత ఎయిర్ కండీషనర్ ఉపయోగించే ముందు ఈ విషయాలు తప్పక తనిఖీ చేయాలి. ఇవి పాటించడంలో నిర్లక్ష్యం వహిస్తే AC త్వరగా పాడయ్యే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త..
నిజానికి చలికాలంలో ఏసీలను దాదాపు ఉపయోగించరు. అందరూ స్విచ్ ఆఫ్ మోడ్‌లోనే ఉంచుతారు. కానీ, వేసవి కాలంలో వేడిని తట్టుకోవడానికి ఏసీని ఉపయోగిస్తారు. ఇలా చాన్నాళ్ల తర్వాత ఏసీని ఆన్ చేయడం వల్ల అది సరిగ్గా పని చేయకపోవచ్చు. ఎక్కువ సేపు స్విచ్ ఆఫ్ చేయడం వల్ల ఏసీపై దుమ్ము పేరుకుపోవడమే ఇందుకు కారణం. అటువంటి పరిస్థితిలో AC సరిగ్గా రన్ అవదు. కాబట్టి, శీతాకాలం పూర్తయ్యాక ఎయిర్ కండీషనర్ ఆన్ చేసే ముందు ఎయిర్ కండీషనర్ రీస్టార్ట్ చేసినప్పుడు అది సరిగ్గా పని చేస్తుందో లేదో నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం. మీరు కొన్ని ముఖ్యమైన విషయాలను తనిఖీ చేయకపోతే మీ AC పాడైపోవచ్చు లేదా కరెంటు ఎక్కువ ఖర్చయ్యి బిల్లు అమాంతం పెరిగిపోవచ్చు.
గ్యాస్ చెక్ చేయండి :
శీతలీకరణ కోసం ACలో గ్యాస్ అత్యంత ముఖ్యమైనది. చలికాలం తర్వాత ఏసీని ఉపయోగించే ముందు గ్యాస్‌ను తనిఖీ చేయాలి. ACలో గ్యాస్ పరిమాణం తగ్గితే దాని పనితీరుపై ప్రభావం పడవచ్చు. అందువల్ల గ్యాస్ పరిమాణాన్ని తనిఖీ చేయడం ముఖ్యం.
విద్యుత్ సరఫరా :
ACకి విద్యుత్ సరఫరా సరిగ్గా ఉందో లేదో ముందుగానే నిర్ధారించుకోండి. ఏదైనా కనెక్షన్ వదులైనా లేదా వైర్ దెబ్బతిన్నా ఏసీని చెడిపోతుంది. అలాగే ఏసీ వైర్లలో కోతలు ఉన్నాయేమో తనిఖీ చేయండి. ఒకవేళ ఉంటే వైర్‌ను మార్చండి. AC ఫిల్టర్‌ను కూడా క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి లేదా మార్చాలి. డర్టీ ఫిల్టర్ AC గాలి నాణ్యతను ప్రభావితం చేస్తుంది. ఇది సరిగా లేకపోతే AC పని చేసేందుకు ఆటంకం ఏర్పడుతుంది.
అవుట్‌డోర్ యూనిట్ :
సాధారణంగా విండో ACకి ఒకే యూనిట్ ఉండటం వల్ల విండోలో ఒకటే ఇన్‌స్టాల్ చేస్తారు. కానీ, స్ప్లిట్ ACకి రెండు యూనిట్లు ఉంటాయి. ఇంటి లోపల ఇండోర్ యూనిట్, వెలుపల అవుట్‌డోర్ యూనిట్ ఏర్పాటు చేస్తారు. చలికాలం తర్వాత వాడే ముందు ఇంట్లో దాంతో పాటు బయట ఉన్న యూనిట్‌ను కచ్చితంగా తనిఖీ చేయాలి. అవుట్‌డోర్ యూనిట్‌లో పేరుకుపోయిన దుమ్ము, ధూళిని శుభ్రం చేస్తే AC సమర్థవంతంగా పనిచేస్తుంది.