‘టీనేజీ’తో కాస్త జాగ్రత్త..
ABN , Publish Date - Jan 26 , 2025 | 08:36 AM
పిల్లల పెంపకం అనేది ఓ కళ. ‘పేరెంటింగ్’ మీద లెక్కకు మించిన పుస్తకాలు అందుబాటులో ఉన్నప్పటికీ ఈ కాలం ‘టీనేజ్’ పిల్లల్ని ఎలా చూడాలో, ఎలా అర్థం చేసుకోవాలో తెలియక సతమతమవుతున్నారు పేరెంట్స్.
సాంకేతిక ప్రపంచంలో టీనేజీ పిల్లల భావోద్వేగాలు సహజంగానే తల్లిదండ్రులకు పెను సవాళ్లను విసురుతున్నాయి. ‘టీనేజీ’ జంక్షన్ దగ్గర... పిల్లల అడుగులు ఎటు వైపు పడుతున్నాయన్నదే అసలు సిసలు పేరెంటింగ్ ప్రశ్న.
స్పందన నాన్న కూచి. నాన్నే ఆమె ప్రపంచం. పదవ తరగతి దాకా అన్ని విషయాలు నాన్నతో పంచుకునేది. ఇంటర్‌లో చేరి ఆరునెలలు కూడా కాలేదు. నాన్నకు దూరంగా ఉంటోంది. అమ్మతో కూడా అంతంత మాత్రమే. అమ్మానాన్నలకన్నా స్నేహితులే ముఖ్యమైనట్టుగా ప్రవర్తిస్తోంది.
అభయ్‌కి మొదటి నుంచీ అన్నీ అమ్మే. ఇంట్లో ఉన్నంతసేపు అమ్మ వెనకాలే తిరుగుతూ ఉంటాడు. కబుర్లు చెబుతుంటాడు. ఎప్పుడూ ఏదో ఒకటి వాగుతూనే ఉంటాడు. అలాంటిది హఠాత్తుగా ఈమధ్య అమ్మతో బాండింగ్ తగ్గించుకుంటున్నాడు. ఎప్పుడూ ముభావంగా ఉంటున్నాడు. పదో తరగతిలోనే ఇలా ఉన్నాడు, ఇక కాలేజీకి వెళ్లాక ఎలా ఉంటాడో... ఊహించడానికే భయపడుతోంది వాళ్ల అమ్మ.
స్పందన, అభయ్‌లను మించినవాడు బాబీ. మాటి మాటికీ అమ్మానాన్నలకు ఎదురుచెబుతున్నాడు. గొడవ పెట్టుకుంటున్నాడు. గట్టి గట్టిగా అరుస్తూ ఇంటి వాతావరణాన్ని పాడు చేస్తున్నాడు. బాబీకి ఇంకా పధ్నాలుగేళ్లే. అయినా కూడా మరీ వయొలెంట్‌గా మారుతున్నాడు. వాడు పెద్దయ్యాక ఇంటి వాతావరణం ఎలా ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు.
పైన పేర్కొన్న ముగ్గురు పిల్లలూ టీనేజీలో ఉన్నారు. వాళ్లు ఏ క్షణంలో ఎలా ఉంటారో చెప్పడం కష్టం. ఒక్కోసారి గట్టిగా నవ్వుతారు. ఏడుస్తారు, అరుస్తారు, అన్నీ తమకు తెలుసని మాట్లాడతారు. కారణం అడిగితే బదులివ్వరు. కొన్నిసార్లు రెబల్‌గా మారుతారు. ‘తాము పట్టిన కుందేలుకు మూడు కాళ్లే’ అని మొండిగా వాదిస్తారు. దాంతో తల్లిదండ్రులకు సహజంగానే బీపీలు పెరిగిపోతాయి. ఇంకేం... ఒకే ఇంట్లో పిల్లలు, పెద్దలు బద్ధ శత్రువుల్లా మారిపోతుంటారు. తల్లిదండ్రులు పిల్లలకు విలన్లలా కనిపిస్తూ ఉంటారు. అందుకే టీనేజీ పిల్లలు ఉన్న ఇల్లు ప్రస్తుతం రణరంగాన్ని తలపోస్తుంది. ఈ సమస్యతో ఏం చేయాలో పాలుపోక తల్లిదండ్రులు తలలు బాదుకుంటుంటారు. ఒక రకంగా ‘టీనేజ్ పేరేంటింగ్’ అనేది ఈకాలంలో కత్తి మీద సాములా మారింది.
అదో జంక్షన్...
మనిషి ఎదుగుదలలో ఓ పెద్ద జంక్షన్ టీనేజ్. 13 ఏళ్ల నుంచి 19 ఏళ్ల వయసు వరకు ఉన్నదే టీనేజ్. పిల్లలు బాల్యం నుంచి యవ్వనంలోకి అడుగుపెట్టే దశ ఇదే. హార్మోన్ల ప్రభావంతో పిల్లల శరీరంలో వచ్చే కొత్త మార్పులు వాళ్లను తెలియని తికమకకు గురిచేస్తాయి. ఒకవైపు చదువులతో సతమతమవుతారు. మరోవైపు స్వతంత్రంగా వ్యవహరించడం మొదలుపెడతారు. సొంత అభిప్రాయాలను ఏర్పరచుకుంటారు. మూడ్ స్వింగ్స్ ఎక్కువ. ఇంట్లో కంటే బయట గడపడానికే ఇష్టపడతారు. ఒకవేళ ఇంట్లో ఉన్నా అధిక సమయం ఫోన్లలోనే తలదూర్చి కనిపిస్తారు. మరి కొంతమంది చిరుతిళ్లతో కాలక్షేపం చేస్తారు. వేళకు తిండి తినరు. కుటుంబసభ్యులతో కలిసి తినేందుకు, వారితో సమయం గడిపేందుకు అస్సలు ఇష్టపడరు.
అయితే పిల్లలు చెబితే వినడం లేదని, ఎంత చెప్పినా పట్టించుకోవడం లేదని వదిలేస్తే అసలుకే మోసం వస్తుంది. ఎప్పుడైనా సరే తల్లిదండ్రులు తమ పిల్లలకు దూరంగా జరగొద్దు. టీనేజీ పిల్లలకు నెమ్మదిగా దగ్గరై, మంచి స్నేహితులుగా మారాలి. దీని కోసం కొన్నిసార్లు తమ పద్ధతులను మార్చుకోవలసి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అత్యంత క్లిష్టమైన ఈ టీనేజీ జంక్షన్‌ను పిల్లలు సాఫీగా దాటగలిగితే... వారి భావి జీవితం తప్పకుండా ఆనందమయమే అవుతుంది. అందుకే టీనేజ్‌లో ఉన్న పిల్లల్ని అస్తమానం ఏదో తప్పు చేస్తున్నట్టుగా, వారిపై కేకలు వేసి ఇంటి వాతావరణాన్ని రచ్చ చేయకుండా... కాస్త ముందుచూపు, పెద్ద మనసుతో పిల్లలకు సహాయపడాలని అంటున్నారు మానసిక నిపుణులు. ఈకాలం టీనేజ్ పిల్లల కోసం వీళ్లు పేర్కొంటున్న ముఖ్యమైన పేరెంటింగ్ టిప్స్ ఏమిటంటే...
- తిరస్కరణ కాదు: సాధారణంగా స్కూల్, ట్యూషన్లు, మైదానాల్లో జరిగే ప్రతి విషయాన్నీ పంచుకునే పిల్లలు, టీనేజీకీ రాగానే ఒక్కసారిగా మారిపోతారు. అన్నింటినీ పెద్దలకు చెప్పరు. కొన్నింటిని కావాలని దాచేస్తారు. కొత్తగా రహస్యాలను మోసే వయసు ఇదే. భయంతోనో, ఆందోళనతోనో అన్నీ తెలుసుకోవాలనే ఆత్రుతతో పెద్దలు ప్రతీ విషయాన్ని గుచ్చిగుచ్చి ప్రశ్నిస్తే, వాళ్లకి చిరాకు, వీళ్లకి పరాకు తప్పదు. చిన్న చిన్న గొడవలతో మొదలై ఆఖరుకు ఇల్లు కిష్కింధకాండ కావడం ఖాయం. ఈ ‘అపోజిషనల్ బిహేవియర్’ వల్ల పెద్దల్లో కాస్త గందరగోళం,
ఎక్కడో పిల్లలు తమను రిజెక్ట్ చేస్తున్నారనే ఆందోళన మొదలవుతుంది. దీనివల్ల క్రమక్రమంగా తెలియకుండానే పిల్లలతో ఎడం వస్తుంది. కానీ ‘టీనేజ్‌లోకి వచ్చిన పిల్లల్లో ఆ వయసుకు ఇది మామూలే, తామూ ఆ వయసుని దాటుకుని వచ్చినవాళ్లమే అన్న ఆలోచనతో తల్లిదండ్రులు వ్యవహరించాల’ని అంటారు డాక్టర్ క్యాథరీన్ స్టీనర్ అడైర్. హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన సైకాలజిస్ట్ క్యాథరీన్ ‘ది బిగ్ డిస్‌కనెక్ట్’ రచయిత. ఇందులో ఈకాలం టీనేజ్ పిల్ల్లల ప్రవర్తన గురించి, వయసు వల్ల వారిలో కలిగే భావోద్వేగాల గురించి చాలా విషయాలను ఆమె చర్చించారు.
- స్పెషల్ టైమ్: రోజూ కాసేపు మీ పిల్లలతో గడుపుతున్నారా? పావుగంట, అర గంట మీ ఇష్టం. కానీ ఆ సమయంలో మాత్రం ఫోన్లు వద్దు. కనీసం మెసేజ్‌లు కూడా చూడకండి. అంటే పిల్లలకే పూర్తి సమయం కేటాయించడం అన్నమాట. రోజూ ఈ ‘ఒన్ ఆన్ ఒన్ టైమ్’ వల్ల మీ అనుబంఽధం గట్టిపడడమే కాకుండా... భవిష్యత్తులో పిల్లల్లో ఇంటర్ పర్సనల్ స్కిల్స్ మెరుగుపడేలా బాటలు వేస్తుంది. ముఖ్యంగా తల్లి వంట చేసే సమయంలో, పిల్లలు తినే సమయంలో వారితో మాటలు కలపాలి. తల్లి ఒక స్నేహితురాలిగా మారాలి. ఒకసారి నమ్మకం కలిగిన తర్వాత టీనేజ్ పిల్లలు అన్ని విషయాలను భయం లేకుండా చర్చిస్తారు. అన్నీ సమకూరుస్తున్నాం కాబట్టి వారికేం బాధలుంటాయని అనుకుంటే పొరపాటే. ప్రతీ విషయాన్ని వారు గమనిస్తూ ఉంటారు. అందుకే వాళ్లు కుతూహలంతో లేదంటే బాధతో చెప్పే ప్రతీ విషయాన్ని ఓపికగా వినే శ్రోతగా మారితే తల్లిదండ్రులను స్నేహితుల్లాగే భావిస్తారు. అన్ని విషయాలను పంచుకుంటారు. కానీ చాలామంది తల్లిదండ్రులు పిల్లలు చేసే ప్రతీపనిని ప్రశ్నిస్తుంటారు. అలాగే కొన్ని విషయాలను గట్టిగా పట్టుకుని వాదిస్తుంటారు. అలాంటప్పుడు ఫలితం నెగిటివ్‌గానే ఉంటుంది. ఒక్కసారి పిల్లలు రెబల్‌గా మారితే పరిస్థితి చేయిదాటి పోతుందనే సంగతి గుర్తెరగాలి. ముఖ్యంగా ప్రతీ చిన్న విషయాన్ని భూతద్దంలో చూడటం మానేయాలి.
- పరోక్ష పద్ధతి: ఈరోజు స్కూల్లో ఏం జరిగింది? పరీక్ష ఎలా రాశావు? లాంటి ప్రత్యక్ష ప్రశ్నలు పిల్లలకి వేయవచ్చు. వాళ్లూ ఆనందంగా సమాధానాలు చెబుతారు. కానీ టీనేజీ పిల్లల్ని ఇలా ప్రశ్నిస్తే కొంప కొల్లేరే. వాళ్లకి ఇలాంటి ప్రశ్నలు ఏ కోశానా నచ్చవుగాక నచ్చవు. పైగా పిన్‌పాయింట్ చేసినట్టుగా ఫీల్ అవుతారు. అందుకే కాలేజీ నుంచి రాగానే పాలో, ఫలహారమో అందిస్తూ, ఏమీ ప్రశ్నించకుండా వాళ్ల పక్కన కూర్చోండి. వారికి మీపై నమ్మకం కలిగించండి. అప్పుడే కథలు కఽథలుగా మాట్లాడడం మొదలుపెడతారు. ఆ ధాటికి మీరు ఎట్టిపరిస్థితిల్లోనూ అడ్డుకట్ట వేయకండి. ఎలాంటి అడ్డుప్రశ్నలు వేయకుండా వింటూ ఉండండి. వాళ్ల నిత్య జీవితంలో ఏం జరుగుతోందన్న దాన్ని ఈ మాటల ద్వారా కొంతమేరకు అంచనా వేసుకోవచ్చు. అయితే వీరావేశంతో తక్షణమే సలహాలు, సూచనలు ఇవ్వడానికి, వాళ్ల సమస్యలని తీర్చడానికి ప్రయత్నించకండి. పరిస్థితులను అర్థం చేసుకుని సమయం కోసం వేచిచూడండి. అడిగితేనే సలహా ఇవ్వండి. స్నేహాన్ని పెంచుకోండి. అందుకేనేమో పిల్లలకు పదహారేళ్లు రాగానే వాళ్లను స్నేహితులుగా చూడాలని పెద్దలు చెబుతారు.
- అప్‌గ్రేడ్ కావాల్సిందే: పిల్లలకీ పెద్దలకీ ఏజ్‌గ్యాప్ ఎక్కువే అనే విషయాన్ని మరవకూడదు. అలాగే పాత తరానికి, కొత్తతరానికి మధ్య సాంకేతికత ఒక అడ్డుగోడలా మారిందనడంలో సందేహం లేదు. ఈ కాలంలో పిల్లల ప్రపంచం గురించి తెలుసుకోవాలంటే సోషల్ మీడియా, యాప్స్, ఫ్యాషన్స్, మూవీస్, మ్యూజిక్, లేటెస్ట్ గ్యాడ్జెట్స్ తదితరాలపై తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాల్సిందే. అప్పుడే టీనేజీ పిల్లలను సరిగా డీల్ చేయగలం, వాళ్ల ప్రపంచాన్ని అర్థం చేసుకోగలం. మీరు మాటల మధ్యలో ఏదైనా యాప్, గ్యాడ్జెట్‌ను ప్రస్తావిస్తే వాళ్లు ఆశ్చర్యపోతారు కచ్చితంగా. పైగా మా పేరెంట్స్ అప్టూడేట్‌గా ఉంటారని పొంగిపోతారు. వీలున్నప్పుడూ సోషల్ మీడియాలో పిల్లలు పెడుతున్న పోస్టింగ్‌లు చూస్తూ ఉండండి. వాళ్ల ఆలోచనలు సరైన మార్గంలో వెళుతున్నాయో లేదో తెలుసుకోవడానికి ఇదో చక్కని మార్గం.
- మెచ్చుకోలు ముఖ్యం: ఎదిగే పిల్లల్లో బెరుకు ఎక్కువగా ఉంటుంది. పైకి ఎలా ఉన్నా లోపల ఒకలాంటి సంశయంతో ఉంటారు. అందుకే వాళ్లు చేసిన ప్రతీ మంచి పనిని మెచ్చుకుంటే వాళ్లలో సహజంగానే ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. బోర్డు ఎగ్జామ్స్, కాంపిటీటివ్ ఎగ్జామ్స్ అని రకరకాల ఒత్తిళ్లల్లో వాళ్లు ఉంటారు. చదువుకు సంబంధించిన ఒత్తిడిని దూరం చేసేందుకు హాబీలు అలవర్చుకునేలా ప్రోత్సహించాలి. మెడిటేషన్, యోగా సాధనల వల్ల మెమొరీని మెరుగుపరచుకునేలా సహాయపడాలి. పరీక్షల్లో విజయం సాధించినప్పుడు మెచ్చుకోవాలి. ఎందులో అయినా పిల్లలు విఫలం అయితే వారిని తిట్టడం కన్నా కూడా ‘తిరిగి ప్రయత్నించు’ అనేలా ప్రోత్సహించాలి. అన్ని వేళల్లో వాళ్లకి అండగా తల్లిదండ్రులు ఉంటారనే నమ్మకాన్ని కలిగించాలి.
క్రమశిక్షణ పేరిట టీనేజ్ పిల్లల్ని దండించడం, దూషించి దూరం చేసుకునే కన్నా... వారిని ఓ కంట కనిపెడుతూ తల్లిదండ్రులు కాస్త స్నేహితుల్లా మారితేనే వారి భావోద్వేగాలు సరిగ్గా అర్థం అవుతాయి. అప్పుడే పిల్లలు టీనేజీ మైలురాయిని దాటి ఎంచక్కా ముందుకు సాగుతారు. ఈ కాల పరీక్షలో కేవలం పిల్లలే కాదు... తల్లిదండ్రులూ విజయం సాధించాలి.
- సండే డెస్క్
గుర్రపుస్వారీ లాంటిదే...

‘‘టీనేజర్‌ని పెంచడం అంటే గుర్రపు స్వారీ లాంటిదే. గుర్రం మీద స్వారీ చేసేప్పుడు దాన్ని గట్టిగా బంధించలేం, అలాగే వదులుగా విడిచిపెట్టలేం. పిల్లవాడికి ఎంత ఒత్తిడి ఇవ్వాలనే విషయంలో తల్లిదండ్రులే ఓ అంచనాకు రావాలి. ఎక్కువ ఒత్తిడి ఎప్పుడూ మంచిది కాదు. దాంతో వాళ్లు రెబల్‌గా మారవచ్చు. ఒకవేళ తక్కువ ఒత్తిడి ఇస్తే చేతగానివాడిగా మిగిలిపోవచ్చు. తగిన క్రమశిక్షణతో పెంచలేదని పెద్దయ్యాక పిల్లలు మిమ్మల్నే అంటారు. అందుకే ఆ సన్నని తాడు మీద నడవడానికి చక్కని సమతూకం అవసరం’’. - శ్రీ శ్రీ రవిశంకర్
ప్రేమతో గెలుద్దాం
పిల్లల మనసులో ఓ ‘ప్రేమ తొట్టి’ ఉంటుంది. అమ్మానాన్నలు కురిపించే ప్రేమతో ఆ తొట్టి నిండుతూ ఉంటుంది. నిండిన ప్రేమ తొట్టితో యవ్వనంలోకి అడుగుపెట్టే పిల్లలు జీవితం పట్ల ఎంతో సంతోషంగా, ఆశావహ దృక్పథంతో ఉంటారు. అదే తొట్టి ఖాళీగా ఉన్న పిల్లలు మానసిక రుగ్మతలతో బాధపడుతూ, ప్రేమకోసం తప్పుడు ప్రదేశాలలో వెదుకుతుంటారు. అందుకే ‘తల్లిదండ్రులు పిల్లలపై తమ అన్‌కండిషనల్ ప్రేమను కురిపిస్తూనే ఉండాలి’ అంటారు డాక్టర్ గ్యారీ చాప్‌మ్యాన్. ఆయన ప్రసిద్ధి చెందిన ‘ద ఫైవ్ లాంగ్వేజస్ ఆఫ్ టీనేజర్స్’ పుస్తక రచయిత. గ్యారీ రచించిన ‘ద ఫైవ్ లవ్ లాంగ్వేజస్’ ఏడు మిలియన్ల కాపీలకు పైగా అమ్ముడు పోయింది. దాన్ని 40 భాషలలోకి అనువదించారు. టీనేజీ పిల్లలకు తల్లిదండ్రులు అందించాల్సిన అయిదు ప్రేమ భాషలు.... ఆలింగనం, భరోసా, పిల్లలతో గడపడం, బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం, సహాయపడడం... అని గ్యారీ చాప్‌మ్యాన్ తన రచనలో పేర్కొన్నారు.
ఇలా చేద్దాం...
- టీనేజీ పిల్లలకు జీవితం పట్ల ఉన్న ఆసక్తి, అనురక్తిలను తెలుసుకోవాలి. వారి అభిప్రాయాలకు విలువ ఇవ్వాలి.
- క్రీడలు, సంగీతం, వాలంటరీ వర్క్ తదితరాలపై పిల్లలు ఆసక్తి చూపిస్తే వాళ్లను ప్రోత్సహించడం మంచిది.
- పిల్లల స్కూల్, కాలేజీల్లో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. అధ్యాపకులు, పిల్లల స్నేహితులతో పరిచయాలు ఏర్పరచుకోవాలి.
- స్కూల్ లేదా కాలేజీలలో తలెత్తే చిన్న చిన్న సమస్యలను పిల్లలు తమకు తామే నివృత్తి చేసుకునేలా గైడెన్స్ ఇవ్వాలి. సొంతంగా నిర్ణయాలు తీసుకునేలా ప్రోత్సహించాలి. అయితే ఏ విషయంలో అయినా సలహా, సూచనలను ఇచ్చేందుకు తల్లిదండ్రులు ముందుండాలి.
- ఇంటా, బయటా ఎక్కడైనా సరే అసౌకర్యవంతమైన పరిస్థితి ఎదురయితే దాన్నుంచి తప్పించుకునేలా టీనేజీ పిల్లలను సన్నద్ధం చేయాలి. డ్రగ్స్, ఆల్కహాల్ తదితర అంశాలలో స్నేహితులు ఒత్తిడి చేస్తే ఎలా తప్పించుకోవాలో ముందుగానే అర్థమయ్యేలా చెప్పాలి. ఈ విషయాల్లో పిల్లలతో నిజాయితీగా ఉండడం ఎంతో మంచిది.
- టీనేజీ పిల్లల స్ర్కీన్ టైమ్‌కు పరిమితి విధించాలి. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ తదితర సోషల్ మీడియాలో మీ పిల్లలు ఎలాంటి విషయాలు పోస్ట్ చేస్తున్నారో తెలుసుకుంటూ ఉండడం అవసరం.
- అయితే అన్నిట్లో తలదూర్చకుండా పిల్లలకూ కాస్త ప్రైవసీ అవసరం అన్నది ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి.