Stunning Photo Showing: సూర్యుడి ఉపరితలంపై స్టన్నింగ్ ఫొటోషూట్.. అవాక్కవ్వాల్సిందే.!
ABN , Publish Date - Nov 16 , 2025 | 10:23 PM
డిఫెరెంట్ యాంగిల్స్‌లో ఇటీవల వైరల్ అవుతున్న ఫొటోలు, ఫొటో షూట్‌లెన్నో చూసే ఉంటారు. కానీ, ఈ అద్భుతమైన ఫొటోషూట్‌ను మాత్రం ఎప్పుడూ చూసి ఉండరు. అదేంటి అని ఆశ్యర్యపోతున్నారా.! అయితే ఈ ఫొటో చూడండి.. నిజమే అనిపిస్తుంది.
ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకో లేదా ఇంకేదో కారణంగానో ఇటీవల చాలా మంది రకరకాల స్టంట్స్ చేస్తుంటారు. అలాంటి కోవకే చెందుతుందీ స్టన్నింగ్ ఫొటోషూట్(Stunning Photo Shoot) కూడా. సూర్యుని ముందు ఓ మనిషి స్వే్చ్ఛగా, అలా పడిపోతున్నట్టు చూపించే ఈ ఫొటో ఇప్పుడు పలువురిని ఆకర్షిస్తూ ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది.
అమెరికాకు చెందిన ఆండ్రూ మెక్‌కార్తీ అనే ఫొటోగ్రాఫర్(Andrew McCarthy).. భగ భగా మండుతున్న సూర్యుడి ఉపరితలానికి సరిగ్గా అనుసంధానమై స్కైడైవింగ్ చేస్తూ పడిపోయే ఓ వ్యక్తిని అత్యద్భుతంగా ఫొటో తీశారు. ఈ ఫొటో చూస్తే నిజంగా ఆ వ్యక్తి సూర్యుని ఉపరితలంపై ఉన్నాడేమో అన్నట్టుగా అద్భుతంగా చిత్రీకరించారు. అరిజోనా(Arijona)ప్రాంతానికి చెందిన ఆండ్రూ.. నవంబర్ 8న ఓ ఎడారి ప్రాంతంలో ఈ స్టన్నింగ్ ఫొటోషూట్ నిర్వహించారు. ఇందుకోసం సంగీతకారుడు, స్కైడైవర్ అయిన గాబ్రియేల్ బ్రౌన్(Gabriel Brown)ను ఎంచుకున్నారాయన. కెమెరా(Camera) నుంచి సుమారు 3,500 అడుగులు(1,070 మీటర్లు), 8000 అడుగుల(2,440 మీటర్లు) దూరంలో ఉన్న ఓ చిన్న ప్రొపెల్లర్ పవర్ సాయంతో పనిచేసే క్రాఫ్ట్ నుంచి దూకుతున్న సమయంలో దీన్ని చిత్రీకరించారు ఆండ్రూ. పూర్తిగా కల్పిత పరిస్థితుల మధ్య పక్కా ప్రణాళిక ప్రకారం తీసిన ఈ ఫొటోషూట్‌ను 'ది ఫాల్ ఆఫ్ ఇకారస్'గా పిలుస్తున్నారీ ఫొటోగ్రాఫర్(Photographers). ఇలాంటి అవాస్తవ పరిస్థితుల నడుమ తీసిన తొలి ఫొటో ఇదేనేమోనని ఆయన భావించారు.
వీడియో క్లిప్..
'ఎన్నో కఠిన సవాళ్లను ఎదుర్కొంటూ ఈ ఫొటోషూట్ నిర్వహించాం. నా తొలి ప్రయత్నంలో భాగంగా చేసిన మొదటి క్లిక్‌తోనే ఇది సాధ్యమైంది. దీనిని మేము 'ది ఫాల్ ఆఫ్ ఇకారస్' అని పిలుస్తాం. ఈ ఫొటోను కొంతకాలం పాటు ఫైన్ ఆర్ట్ ప్రింట్‌గా అందుబాటులో ఉంచుతాం.' అని తను ఫొటో తీసిన అనుభవాన్ని పంచుకున్నారు ఫొటోగ్రాఫర్ ఆండ్రూ.
అత్యద్భుతంగా తీసిన ఈ ఫొటో వైరల్ కావడంతో.. సోషల్ మీడియా వినియోగదారులు మెక్‌కార్తీ కూర్పు పట్ల విస్మయానికి గురైనట్టు వ్యాఖ్యానిస్తున్నారు. ఫొటోగ్రాఫర్‌ను, ఆయన పనితనాన్ని మెచ్చుకుంటూ.. అవార్డ్స్ ఇవ్వాలని కోరుతూ కొందరు మద్దతుగా నిలుస్తున్నారు. ఆస్ట్రోఫొటోగ్రఫీ అంటే ఏమిటో సరైన అర్థం వచ్చేలా ఫొటో తీశారంటూ మరికొందరు కామెంట్స్ చేశారు.
గతంలోనూ..
సూర్యుడి అద్భుతమైన చిత్రాలు తీసి వైరల్ అవ్వడం మెక్‌కార్తీకి ఇదేం తొలిసారి కాదు. ఈ ఏడాది ప్రారంభంలోనే ఆయన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(International Space Station) సూర్యుడి ఉపరితలంపైకి వెళ్తున్న దృశ్యాన్ని చిత్రీకరించారు. ఈ కూర్పు చాలా ఉత్కంఠను రేపింది. నక్షత్రాల ముందు పరివర్తనం చెందుతున్న ఐఎస్ఎస్(ISS)ను మాత్రమే కాకుండా సూర్యుడి జ్వాలనూ సంగ్రహిస్తున్నట్టుగా తీశారు. 'ఐఎస్ఎస్ సూర్యుణ్ని దాటడానికి వేచి చూస్తుండగా.. అందులో కొన్ని సూర్య కిరణాలు ఓ సమూహంగా ప్రారంభమయ్యాయి. ఈ షాట్‌ను తీశాక.. ఇది జీవితంలో ఒక్కసారి మాత్రమే తీయగలిగినది అనిపించింది.' అని ఆండ్రూ చెప్పుకొచ్చారు. నాడు ఆయన తీసిన ఆ పిక్‌కు 'కర్‌దాషేవ్ డ్రీమ్స్' అనే పేరుపెట్టినట్టు తెలిపారు.
వాస్తవానికి ఐఎస్ఎస్ భూమి చుట్టూ 400 కిలోమీటర్ల దూరంలో తిరుగుతూ ఉంటుంది. అంటే సౌర జ్వాల విస్ఫోటనం చెందిన సమయంలో అది సూర్యుడికి దగ్గరగా ఉండదు. అలా అంతరిక్ష కేంద్రం ప్రతి 90 నిమిషాలకు ఒకసారి అది భూమిని చుట్టివస్తుంది. ఇలాంటి ఫొటోలను తీయడం చాలా కష్టమైన పని. ఎంతో శ్రమిస్తేగానీ ఇలాంటి చిత్రాన్ని తీయడం సాధ్యం కాదేమో అనిపిస్తుంది.