Share News

అనగనగా ఒక అంతరంగ ప్రయాణం

ABN , Publish Date - Feb 23 , 2025 | 11:10 AM

అనగనగా ఒక ఊరిలో ... అంటూ రాత్రిపూట పిల్లల్ని నిద్రపుచ్చడానికి కథలు చెప్పని అమ్మలు ఉండరు. కథ వింటూనే వింటూ నిద్రలోకి జారుకోని చిన్నారులూ ఉండరు. అయితే ఇక్కడ కథలు అవసరమైంది ఒక కోటీశ్వరుడికి. ఆయనో పెద్ద వ్యాపారవేత్త. వ్యాపారాల లెక్కలతో, లెక్కల చిక్కులతో ఆయన బుర్రకు క్షణం విశ్రాంతి ఉండదు.

అనగనగా ఒక అంతరంగ ప్రయాణం

అనగనగా ఒక ఊరిలో ... అంటూ రాత్రిపూట పిల్లల్ని నిద్రపుచ్చడానికి కథలు చెప్పని అమ్మలు ఉండరు. కథ వింటూనే వింటూ నిద్రలోకి జారుకోని చిన్నారులూ ఉండరు. అయితే ఇక్కడ కథలు అవసరమైంది ఒక కోటీశ్వరుడికి. ఆయనో పెద్ద వ్యాపారవేత్త. వ్యాపారాల లెక్కలతో, లెక్కల చిక్కులతో ఆయన బుర్రకు క్షణం విశ్రాంతి ఉండదు. ఆయన చెయ్యని బిజినెస్‌ లేదు. ‘‘మీకు మంచి నిద్ర కావాలా? అయితే మా పరుపులనే వాడండి’’ అంటూ ప్రకటనలు గుప్పించే పెద్ద పరుపుల కంపెనీ కూడా ఉంది. ఆయన ఆ పరుపులమీదే పడుకుంటాడు. అయినా నిద్ర రాదు. నిద్రమాత్రలతో సహా అన్ని చిట్కాలూ పాటిస్తాడు. అయినా ఉపయోగం లేదు. ‘‘నిద్ర పట్టాలంటే చిన్న పిల్లల్లాగే రాత్రిపూట కథలు వినండి’’ అని ఒకరు సలహా ఇస్తారు. అలా ఆ కోటీశ్వరుడి అవసరం లోంచి రూపుదిద్దుకున్నదే ‘ది స్టోరీ టెల్లర్‌’. ప్రముఖ దర్శకుడు సత్యజిత్‌రే రచించిన ‘గోల్పో బోలియే తారిణీ ఖురో’ అనే కథకు చిత్రరూపమే ‘ది స్టోరీ టెల్లర్‌’. ‘గోల్పో బోలియే తారిణీ ఖురో’ అంటే బెంగాలీలో ‘కథ చెప్పు తారిణీ మామా’ అని అర్థం.


తారిణీ బందోపాధ్యాయ ఒక రిటైర్డ్‌ ఉద్యోగి. కథలు చెప్పడం ఆయనకున్న సరదాల్లో ఒకటి. ఒకరోజు తారిణీ ఒక ప్రకటన చూస్తాడు. అహ్మదాబాద్‌లోని రతన్‌ గరోడియా అనే వ్యాపారవేత్త కథలు చెప్పగలిగే వ్యక్తి కావాలని వేయించిన ప్రకటన. చిన్న పిల్లలకు కథలు చెప్పడం అనుకుని ఉత్సాహంగా వెళ్లిన తారిణీకి కథలు చెప్పి నిద్రపుచ్చాల్సింది గరోడియాని అని తెలిసి ఆశ్చర్యపోయినా చివరికి ఉద్యోగంలో చేరతాడు. రోజూ రాత్రిపూట ఎనిమిదింటికి తారిణీ కథలు చెప్పి గరోడియాకు నిద్ర పట్టేలా చేయాలనేది ఒప్పందం. కొత్త కథలు, స్వంత కథలు చెప్పాలని గరోడియా షరతు పెడతాడు. తారిణీ రకరకాల కథలు చెప్పి అతన్ని నిద్రపుచ్చేలా చేయాలని ప్రయత్నిస్తుంటాడు. అయినా గరోడియాకు నిద్రాదేవి దూరమవుతూనే ఉంటుంది. ఐక్యూ ఎక్కువగా ఉన్నవాళ్ళకి నిద్ర త్వరగా పట్టదని తారిణీ అంటాడు. చివరికి రవీంద్రుడి సంగీతం కూడా వినిపిస్తాడు.


తారిణీకి కథలు అచ్చువేసే అలవాటు లేదని తెలుసుకున్న గరోడియా ఆయన కథల్ని తను రాసినట్టుగా గోర్కీ అనే కలం పేరుతో ప్రచురిస్తుంటాడు. తన స్నేహితురాలు సరస్వతి మెప్పు పొందడం కోసం గరోడియా చేస్తున్న ఈ కథాచౌర్యం ఒకరోజు తారిణీకి కూడా తెలుస్తుంది. గరోడియాకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని తారిణీ అను కుంటాడు. ‘‘మంచి ఆర్టిస్టులు కాపీ చేస్తారు. గొప్ప ఆర్టిస్టులు దొంగిలిస్తారు’’ అన్న పికాసో వ్యాఖ్యానంతో గరోడియా ఇంటి నుంచి నిష్క్రమించిన తారిణీ గరోడియా చేస్తున్న కథా చౌర్యాన్ని చివరికి ఎలా బయట పెట్టాడు? దాని పర్యవ సానాలు ఏమిటనేది మిగిలిన కథ.


‘ది స్టోరీ టెల్లర్‌’ సినిమా ఆద్యంతం ఒక చక్కటి దృశ్య కావ్యంగా సాగిపోతుంది. పికాసో, గోర్కీ, టాల్‌స్టాయ్‌, షేక్‌స్పియర్‌, టాగోర్‌, రస్కిన్‌ బాండ్లు ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఇలా వచ్చేసి అలా వెళ్ళిపోతుంటారు. వాళ్ల రచనల్లోని కొటేషన్లు అడుగడుగునా వినిపిస్తూనే ఉంటాయి. జన సమ్మర్ధంలోని ప్రశాంతమైన పురాతన కలకత్తా, అహ్మదాబాద్‌ నగరాల్ని అప్పటి వాతావరణాన్ని ప్రతిబింబించడంలో దర్శకుడు అనంత్‌ మహ దేవన్‌ నూటికి నూరుపాళ్ళు మంచి మార్కులు కొట్టేస్తాడు. సినిమాలోని ప్రతి ఫ్రేములోనూ ఆయన దర్శకత్వ ప్రతిభ కనిపిస్తూనేఉంటుంది.


ఈ చిత్రంలో ముఖ్యంగా చెప్పుకోవలసింది పరేష్‌రావల్‌, ఆదిల్‌ హుస్సేన్‌ల నటన గురించి. పెట్టుబడిదారీ వ్యవస్థ మీద, దానికి ప్రతిరూపమైన అమెరికామీద, దిగజారుతున్న మానవ సంబంధాల మీద అడుగడుగునా వ్యంగ్యోక్తులు విసిరే తారిణీ బందోపాధ్యాయ పాత్రలో పరేష్‌రావల్‌ అద్భుతంగా నటించాడు. భుజాన వేలాడే సంచితో అచ్చమైన బెంగాలీ మేధావి రచయితలా అనిపిస్తాడు. చేపలమీది ప్రేమతో గరాడియా వంట మనిషిని తారిణీ పెట్టే తిప్పలు సరదాగా నవ్వుకునేలా ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే సత్యజిత్‌రే ఊహించుకున్న తారిణీ బందోపాధ్యాయ పాత్రకు పరేష్‌రావల్‌ ప్రాణప్రతిష్ట చేశాడు. గరోడియా పాత్రలో ఆదిల్‌ హుస్సేన్‌ కూడా పరేష్‌రావల్‌తో సమానంగా పోటీపడి నటించాడు. ఎన్ని సిరిసంపదలు ఉన్నా నిద్రకు దూరమైన కోటీశ్వరుడి పాత్రలో విషాద గంభీరంగా, హుందాగా చక్కటి నటన కనబరిచాడు.


తారిణీ, గరోడియా ఇద్దరూ ఉన్న సన్నివేశాలన్నీ ఎంతో సహజంగా... రాత్రి వేళల్లో ఇద్దరు స్నేహితుల మధ్య జరిగే సాహిత్య చర్చలా, పిచ్చాపాటీలా ఉంటాయి తప్ప... సినిమా చూస్తున్నట్టు ఎక్కడా అనిపించదు. బెంగాలీ సాహిత్యాభిలాషకీ, గుజరాతీ వ్యాపారాభిలాషకీ మధ్య రెండు విభిన్న ప్రపంచాలకు ఇద్దరూ చక్కటి నమూనాల్లాగా అనిపిస్తారు. కొద్దిసేపే కనిపించినా సరస్వతిగా రేవతి, లైబ్రేరియన్‌గా తనిష్టా చటర్జీ బాగా నటించారు. చక్కటి సంభాషణలు, ఫొటోగ్రఫీ అన్నీ దేనికవే చక్కగా అమిరి సినిమాకు మరింత నిండుదనాన్నిచ్చాయి.

పైకి చూడడానికి కథా చౌర్యంపై, విలువల దిగజారుడుతనంపై సెటైర్‌లా అనిపించినా... ఒక మనిషి తన అంతరంగంలోకి చేసే ప్రయాణమే ‘ది స్టోరీ టెల్లర్‌’.

సత్యజిత్‌రే కథకు అంతే చక్కటి దృశ్యరూపం ఇచ్చిన దర్శకుడిని ప్రత్యేకంగా అభినందించాలి.

- జి. లక్ష్మి, 94907 35322

ది స్టోరీ టెల్లర్‌ (హిందీ)

నటీనటులు: పరేష్‌రావల్‌,

ఆదిల్‌ హుస్సేన్‌, రేవతి, తనిష్టా ఛటర్జీ తదితరులు

నిడివి: 116 నిమిషాలు

దర్శకుడు: అనంత మహదేవన్‌

విడుదల: డిస్నీ హాట్‌స్టార్‌

Updated Date - Feb 23 , 2025 | 11:10 AM