వివాహ వ్యవస్థపై విలక్షణ చర్చ
ABN , Publish Date - Mar 09 , 2025 | 01:34 PM
వివాహ వ్యవస్థ అనేది ఇప్పుడొక అయోమయ అవస్థ. వైవాహిక బంధంలోని ఊపిరాడనితనం. సరైన స్వేచ్ఛ దొరక్కపోవడం, ఒక స్పేస్ లేకపోవడం, పరస్పర విశ్వాసం లోపించడం... భార్యాభర్తల సంబంధాల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అందులో నుంచే స్వేచ్ఛ కోసం సహజీవనం, స్వలింగ సంపర్కం, విడాకులు, వివాహేతర సంబంధాలు లాంటి వాదాలు, అవసరాలు తెరపైకి వచ్చాయి.
వివాహ వ్యవస్థ అనేది ఇప్పుడొక అయోమయ అవస్థ. వైవాహిక బంధంలోని ఊపిరాడనితనం. సరైన స్వేచ్ఛ దొరక్కపోవడం, ఒక స్పేస్ లేకపోవడం, పరస్పర విశ్వాసం లోపించడం... భార్యాభర్తల సంబంధాల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అందులో నుంచే స్వేచ్ఛ కోసం సహజీవనం, స్వలింగ సంపర్కం, విడాకులు, వివాహేతర సంబంధాలు లాంటి వాదాలు, అవసరాలు తెరపైకి వచ్చాయి. అలాంటి వాదాలన్నింటినీ మరోసారి సరికొత్తగా తెరపైకి తెచ్చిన చిత్రమే ‘కాదలిక్క నేరమిల్లె’. అంటే ‘ప్రేమకు సమయం లేదు’ అని అర్థం.
శ్రేయ ఒక ఆర్కిటెక్ట్. స్వతంత్ర భావాలున్న ఆధునిక యువతి. పెళ్ళికి సంబంధించిన ఆచారాలు, సంప్రదాయాలు అంటే చిరాకు పడుతుంటుంది. అందుకే ఇంట్లో చెప్పకుండా తనకు నచ్చినతన్ని రిజిష్టర్ మ్యారేజ్ చేసుకుంది. తర్వాత ఇంట్లో చెప్పవచ్చనుకున్న సమయంలో అతను తన ేస్నహితురాలితో పడకగదిలో సన్నిహితంగా ఉండడం చూసి షాక్ తింటుంది. దాంతో వివాహబంధానికి స్వస్తి చెబుతుంది. అయితే శ్రేయకు పిల్లలంటే ఇష్టం. అందుకే మగవాళ్ళతో సంబంధం లేకుండా ఐవీఎఫ్ ద్వారా పిల్లల్ని కనాలని నిర్ణయించుకుని గర్భం ధరిస్తుంది.
సిద్ధార్థ ఒక స్ట్రక్చరల్ ఇంజనీర్. అతనికి తన స్నేహితురాలిని వివాహం చేసుకోవడం ఇష్టమే కానీ పిల్లలు వద్దని అనుకుంటూ ఉంటాడు. జనాభాకు ఇంకొకడిని చేర్చడం అవసరమా? అని వాదిస్తూ ఉంటాడు. పిల్లల విషయంలో అతని నిర్ణయం మారకపోవడంతో నిశ్చితార్థం జరగాల్సిన రోజున పెళ్ళికూతురు డుమ్మా కొట్టడంతో రద్దు అవుతుంది. సిద్ధార్థ ఇద్దరు ప్రాణేస్నహితుల్లో ఒకరు గే. అతను భవిష్యత్తులో పిల్లల కోసం తన స్పెర్మ్‌ను ఫ్రీజ్ చేయించాలని అనుకుంటాడు. అతనితో పాటు మిగిలిన ఇద్దరు ేస్నహితులు కూడా స్పెర్మ్ ఫ్రీజ్ చేయిస్తారు. అలా శ్రేయ గర్భం ధరించడానికి సిద్ధార్థ స్పెర్మ్ కారణమవుతుంది. తన బిడ్డకు తండ్రి ఎవరో తెలుసుకోవడానికి సిద్ధార్థ ఉండే ఊరికి వెళ్లిన శ్రేయకు అతను తప్పు అడ్రస్ ఇచ్చిన కారణంగా గుర్తించలేక పోయినా... అనుకోకుండా ఒక మీటింగ్‌లో ఇద్దరికీ పరిచయం కలుగుతుంది. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి సదభిప్రాయం ఏర్పడుతుంది.
సిద్ధార్థతో పాటు అతని ఇంటికి వెళ్లిన శ్రేయకు... మాటల సందర్భంలో అతనికి పిల్లలంటే ఇష్టంలేక నిశ్చితార్థం రద్దయిన విషయం తెలిసి, తను గర్భవతి అని చెప్ప కుండానే ఊరికి వచ్చేస్తుంది. అలా ఎనిమిదేళ్ళు గడిచిపోతాయి. శ్రేయ తన ఎనిమిదేళ్ళ కొడుకుతో కలిసి ఉన్న అపార్ట్‌మెంట్‌లోనే అద్దెకు వచ్చిన సిద్ధార్థకు తిరిగి శ్రేయతో పరిచయం పెరుగుతుంది. శ్రేయ కొడుకు కూడా అతడికి బాగా దగ్గరవుతుంటాడు. ఇదే సమయంలో సిద్ధార్థ మొదట ఇష్టపడిన అమ్మాయి తిరిగి అతని జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఇద్దరి మధ్యా ఎటూ తేల్చుకోలేక సిద్ధార్థ సతమతమవుతుంటాడు. అతడు చివరికి ఇద్దరిలో ఎవరివైపు మొగ్గు చూపుతాడనేది మిగిలిన కథ.
ఉదయనిధి స్టాలిన్ భార్య కిరుతిగ ఉదయ నిధి దర్శకత్వం వహించిన ఈ సినిమావివాహ వ్యవస్థకు సంబంధించి అనేక ప్రశ్నలను లేవనె త్తుతుంది. పెళ్ళి అంటే ఆచారాలు, సంప్రదా యాలు మాత్రమే కాదని ఇద్దరి మధ్యపరస్పర ప్రేమ, విశ్వాసం ఉండాలనే అంశాన్ని చెప్ప డానికి... వివాహ వ్యవస్థను ప్రశ్నించడం ద్వారా ఒక సాహసం, మంచి ప్రయత్నం చేశారు.

‘‘పిల్లలను కనడానికి మగవాళ్ళే కావాలా? ఆ అవసరం ఏముంది?’’ అని శ్రేయ ప్రశ్నించడం, ‘‘నేను ఇంకా వర్జిన్‌గానే ఉన్నానని అనుకుం టున్నావా’’ అని తల్లితో అనడం ద్వారా ఆడ పిల్లల మైండ్‌సెట్‌లో వచ్చిన విప్లవాత్మకమైన మార్పుని చూపించే ప్రయత్నం చేస్తారు దర్శకురాలు. సిద్ధార్థ స్నేహితుడు స్వలింగ వివాహం చేసుకోవడం, సిద్ధార్థ ‘వివాహం చేసుకుందామా?’ అని అడిగినప్పుడు సహజీవనానికే శ్రేయ మొగ్గు చూపించినట్టు చెప్పడం ద్వారా వివాహ వ్యవస్థలోకి కొత్తగా వచ్చి చేరిన అంశాల్ని చర్చకు పెడతారామె.
వివాహ వ్యవస్థ లోపాలను, తీరుతెన్నులను ప్రశ్నించడం ద్వారా మంచి ప్రయత్నమే చేసినప్పటికీ... ఆ ప్రయత్నంలో ఎక్కడో దారి తప్పినట్టు అనిపించక మానదు. వివాహ వ్యవస్థ ప్రస్తుతం ఒక సంధియుగంలో ఉంది. ఆ సంధియుగానికి సంబంధించిన అయోమయం, అస్పష్టత, సంక్లిష్టత దానికదే సినిమాలో కూడా ప్రతిఫలించడమే ఆ దారి తప్పినట్టు అనిపించడానికి కారణం. ఐవీఎఫ్ ద్వారా గర్భం ధరించినా తన బిడ్డకు తండ్రి ఎవరని శ్రేయ అన్వేషించడం, కొన్ని కోట్ల పర్మిటేషన్స్ కాంబినేషన్లలో ఆ స్పెర్మ్ సిద్ధార్థదే కావడం, చివరికి అతనితోనే సహజీవనం చేయాలని శ్రేయ నిర్ణయించుకోవడం మెలోడ్రామాగా అనిపిస్తుంది. నైతికత విషయంలో పైకి ఎంత ఆధునికంగా కనిపించినా మనిషి అంతరంగం కొన్ని విలువలకు, నిబద్ధతకు కట్టుబడి ఉంటుందని చెప్పకనే చెప్పినట్టు అనిపిస్తుంది.
నటీనటుల విషయానికి వస్తే ఆడపిల్లల్లో వచ్చిన చైతన్యానికి, ఆత్మవిశ్వాసానికి ఒక ప్రతీకలాగా నిత్యామీనన్ తన సహజ నటనతో మంచిమార్కులు కొట్టేసింది. సిద్ధార్థ పాత్రలో ‘జయం’ రవి కూడా చక్కగా నటించాడు. యోగి బాబు తదితరులు కూడా పాత్రల పరిధుల మేర నటించారు. ఏదేమైనా వివాహ వ్యవస్థకు సంబంధించిన కొన్ని అంశాలను చర్చకు పెట్టడానికి మహిళా దర్శకురాలు కిరుతిగ చేసిన సాహసాన్ని స్వాగతించకుండా ఉండలేం.
- జి. లక్ష్మి, 94907 35322