ప్రమిదలే కాన్వాసుగా...
ABN , Publish Date - Jun 01 , 2025 | 09:33 AM
పిల్లల్లో పరిశీలనా శక్తి చాలా ఉంటుంది. పండగలు, పబ్బాలకు ఇంటిని అందంగా అలంకరించడం మామూలే. ముఖ్యంగా దీపావళి వంటి పండగలకు ఇంట్లో రంగులతో గుమ్మాలకు, కుండలకు, ప్రమిదలకు రంగులేస్తుంటారు. తల్లి పొందికగా చేస్తున్న పనిని పక్కనే కూర్చుని, జాగ్రత్తగా గమనించి... తన చిట్టి చేతుల్లోకి ప్రమిదను తీసుకుని రంగులతో బొమ్మలు వేయడం ప్రారంభించింది. ఆ ఆసక్తి క్రమక్రమంగా చిన్నారి కిలారు వేక్షిత శివను రికార్డుల వైపు నడిపించింది.
నిండా ఏడేళ్లు కూడా నిండలేదు. కానీ వేక్షిత శివ చేతుల్లో ప్రమిద ఉందంటే చాలు అదొక చక్కని కళాఖండంగా మారిపోతుంది. ప్రతిభను ప్రదర్శించడానికి వయస్సు అర్హత కాదని నిరూపించింది. సాధారణంగా చిత్రకారులు తమ కళను ప్రదర్శించడానికి పేపర్, కార్డ్‌బోర్డ్, గాజు, గోడలు, వస్త్రాలు... ఇలా రకరకాల కాన్వాసులను ఎంచుకుంటారు. చిన్నారి వేక్షిత మాత్రం ఇవేవీ కాకుండా ప్రమిదల్ని తన కాన్వాసుగా మార్చుకుంది. ఒక మట్టి ప్రమిదను ఆమెకు ఇస్తే, క్షణాల్లో అదొక అద్భుత కళాచిత్రంగా మారిపోతుంది. ఆయా రంగుల్లో ప్రకృతి రమణీయ దృశ్యాలతో పాటు దేవుళ్ల బొమ్మలను కూడా అలవోకగా చిత్రిస్తుంది. ప్రమిదలే పెయింటింగులను తలపిస్తాయి.
3 గంటల్లో... 81 ప్రమిదలపై...
ఆంరఽధప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా పెనమలూరు గ్రామానికి చెందిన కిలారు వేక్షిత శివ... ప్రమిదలపై బొమ్మలేయడంలో దిట్ట. ప్రస్తుతం ఆమె ప్రతిభను చూసి ఊరు ఊరంతా ఆశ్చర్యపోతోంది. రంగుల పట్ల వేక్షిత ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు ఒక డ్రాయింగ్ మాస్టర్ దగ్గర ఆమెను చేర్పించారు. అక్కడ బొమ్మలు వేయడంలో మెళకువలు నేర్చుకున్న వేక్షిత... ఆరేళ్ల వయసులోనే ఏకబిగిన 81 ప్రమిదలపై 3 గంటల 29 నిముషాల, 47 సెకన్లలో వివిధ రకాల పెయింటింగ్స్ వేసింది. నిజానికి ఆమె తల్లిదండ్రులు, గురువు కూడా ప్రాథమికంగా 50 ప్రమిదలపై వేస్తే చాలని భావించారు.

వేదిక వద్ద డిజిటల్ స్టాప్‌క్లాక్‌లో క్షణాల అంకెలు మారుతున్నాయి. వేక్షిత చిట్టి చేతుల్లోని కుంచె చకచకా బొమ్మలు గీస్తోంది. నిర్దేశించిన సమయంలో అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఆమె ఏకంగా 81 ప్రమిదలపై వివిధ రకాల బొమ్మలు గీసి పలు రికార్డులు సొంతం చేసుకుంది. అసాధారణ ప్రతిభను కనబర్చినందుకు గాను ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్’, ‘వరల్డ్‌వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్’, ‘అసిస్ట్ వరల్డ్ రికార్డ్’ల్లోకి ఎక్కింది. అతి తక్కువ సమయంలో అత్యధిక ప్రమిదలపై అద్భుతంగా పెయింటింగ్ వేసినందుకుగాను వేక్షితకు ఈ మూడు రికార్డులు లభించాయి.
కరాటేలోనూ శిక్షణ...
వేక్షితకు ఐదేళ్ల వయస్సున్నప్పుడు దీపావళి సమయంలో పెద్దలనుచూసి, ఇంట్లో ప్రమిదలకు రంగులేయడం ప్రారంభించింది. తల్లిదండ్రులు చిన్నారి ఆసక్తిని గమనించి, చిత్రరంగంలో మరింత ప్రావీణ్యం సంపాదిం చేందుకు గురువు, ప్రముఖ చిత్రకారుడు పామర్తి శివ వద్ద చేర్పించారు. ఒక కళలో రాణించాలంటే ఎవరికైనా శిక్షణ తప్పనిసరి. గురువు నేర్పించే మెళకువలతో శిష్యులు మరింత జ్ఞానం సంపాదిస్తూ అద్భుతాలు సృష్టిస్తారు. గురువు సమక్షంలోనే వేక్షిత రికార్డు సృష్టించేందుకు రంగులు, బ్రష్ అందుకుంది. పట్టుదల, దీక్షతో ప్రమిదలపై వేగంగా బొమ్మలు వేయడం ప్రారంభించింది.
ఎవరూ ఊహించని విధంగా కేవలం మూడున్నర గంటల్లోనే 81 ప్రమిదలపై రకరకాల బొమ్మలు వేసి ఆశ్చర్య పరిచింది. చిన్నారి ఏమాత్రం అలసిపోకుండా, చిట్టి చేతులతో ఏకధాటిగా ప్రమిదలపై బొమ్మలు వేస్తుంటే వీక్షకులు, నిర్వాహకులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు.
వేక్షిత ప్రస్తుతం పెయింటింగ్‌తో పాటు కరాటేలోనూ శిక్షణ తీసుకుంటోంది. ఈ చిన్నారి పెద్దయ్యాక పెయింటింగ్స్ కొనసాగిస్తూనే డాక్టర్ కావాలని అనుకుంటోంది. ‘ముందు ముందు పెయింటింగ్ పోటీల్లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నాన’ని చెబుతోంది. ఏడేళ్ల వయసులోనే రికార్డులు సృష్టించిన ఈ చిన్నారి భవిష్యత్తులో చిత్రకళారంగంలో ఎన్ని అద్భుతాలు చేస్తుందో వేచి చూడాలి.
- కె. సౌజన్య, విజయవాడ
ఈ వార్తలు కూడా చదవండి.
నేడు స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఎంతకు చేరాయంటే..
చిన్న తేడానైనా పసిగట్టేస్తున్నారు...
Read Latest Telangana News and National News