Share News

అరె వో సాంబా... పూరా పచాస్‌ సాల్‌..

ABN , Publish Date - Aug 10 , 2025 | 10:46 AM

రమేష్‌ సిప్పీ అనే కవీ, డ్రీమరూ దీన్ని నిజం చేసినవాడు. విజువల్‌ లాంగ్వేజీ మీద అతనికి ఉన్న పట్టు అసాధారణం. కేవలం డబ్బు గుట్టలుగా పడివుంటే చాలదు. దాన్ని ఎలా వాడాలో తెలిసివుండాలి. రమేష్‌ సిప్పీ కిటికీ తెరిచి, కిరణాల్ని చూస్తూ, కాఫీ తాగుతున్నాడు.

 అరె వో సాంబా... పూరా పచాస్‌ సాల్‌..

1975- ఒక సృజనాత్మక, హింసాత్మక, కళాత్మక తుపానై ఇండియాను కుదిపేసింది ‘షోలే’. ప్రేక్షకుల గుండెల్లో రైళ్లూ, గుర్రాలూ ఒకేసారి పరిగెత్తించింది. బీభత్సమైన ఒక కొత్త అనుభవం జనాన్ని వొణికించింది. భారతీయ సినిమాని కొత్త దారుల్లో కదం తొక్కించిన ఆ సినిమా రికార్డుల్ని తిరగరాసింది. ఈ మేజిక్‌ ఎలా జరిగింది? ‘షోలే’ విడుదలై 50 ఏళ్లు అవుతున్న సందర్భంగా ...

రమేష్‌ సిప్పీ అనే కవీ, డ్రీమరూ దీన్ని నిజం చేసినవాడు. విజువల్‌ లాంగ్వేజీ మీద అతనికి ఉన్న పట్టు అసాధారణం. కేవలం డబ్బు గుట్టలుగా పడివుంటే చాలదు. దాన్ని ఎలా వాడాలో తెలిసివుండాలి. రమేష్‌ సిప్పీ కిటికీ తెరిచి, కిరణాల్ని చూస్తూ, కాఫీ తాగుతున్నాడు. సలీం జావెద్‌ చెప్పిన కేవలం నాలుగు వాక్యాల ఐడియా 70 ఎం.ఎంలో అతన్ని ఊరిస్తోంది. అప్పటి వరకూ భారతీయ తెర చూడని పాత్‌బ్రేకింగ్‌ ఫిల్మ్‌మేకింగ్‌ అనే ఐడియా అతన్ని ఉత్తేజితుణ్ణి చేస్తోంది. రమేష్‌ సిప్పీ ప్రశాంతంగా ఉన్నాడు. సినిమాకి ప్లానింగ్‌ ప్రాణం. టాప్‌క్లాస్‌ టెక్నీషియన్లు, జనాన్ని వెర్రెత్తించే నటీనటులు, నెత్తురు మరిగించే నేపథ్య సంగీతం, ‘షోలే’ని విజువల్‌ వండర్‌గా ప్రెజెంట్‌ చేసే సూపర్‌ సినిమాటోగ్రాఫర్‌, సినిమా భాషకి కొత్త వ్యాకరణం రాయగల డైలాగ్‌ రైటర్‌... వీళ్ళే తన ఆయుధాలు.


book7.2.jpgకోటి రూపాయలు విరజిమ్మడానికి తండ్రి జీపీ సిప్పీ సిద్ధంగా ఉన్నాడు. రమేష్‌ సిప్పీ సిగరెట్‌ చివరి దమ్ములాగి, మెట్లు దిగాడు. ప్రతీ ఫ్రేమ్‌నీ ఇంపుగా అమర్చగల సౌందర్యదృష్టితో ‘షోలే’ని ఒక మరిచిపోలేని మానవానుభవంగా మలిచాడు. సూపర్‌హిట్‌ టాక్‌తో, గగుర్పొడిచే గబ్బర్‌సింగ్‌ గెటప్‌తో, ధర్మేంద్ర అమితాబ్‌ల పాపులారిటీతో, హేమమాలిని వొయ్యారంతో, ఆర్డీ బర్మన్‌ సంగీతపు హోరుతో, పబ్లిసిటీ మెరుపుదాడితో ముంచుకొచ్చింది ‘షోలే’!

ఆహ్లాదంగా ప్రారంభమై...

పచ్చని వాతావరణంతో, సున్నితమైన సంగీతంతో హాయిగా, ఆహ్లాదంగా ప్రారంభమవుతుంది సినిమా. కొద్దిసేపట్లోనే ఊపిరాడకుండా చేసే రైలు దోపిడీతో ఉద్రిక్తంగా మారిపోతుంది. నీలాకాశం కింద, కొండల మధ్య, గుహల్లోంచి వేగంగా వెళుతున్న రైలు. దోపిడీ చేయడానికి గుర్రాల మీద దూసుకువస్తున్న బందిపోటు దొంగలు. క్లయిమాక్స్‌ సన్నివేశం ముందే వచ్చేసినట్టుంటుంది.


రైలుని ఆపడానికి అడ్డంగా పెట్టివున్న కొయ్యదుంగల్ని వేగంగా ఢీ కొట్టడంతో అవి ఎగిరిపడతాయి. ‘దుంగలు ప్రేక్షకుల మీద పడవు కదా’ అనిపించే చిత్రీకరణ. ట్రెయిన్‌లో ఉన్న పోలీస్‌ అధికారి సంజీవ్‌కుమార్‌, ఇద్దరు దొంగలు ధర్మేంద్ర, అమితాబ్‌ బందిపోట్లని కాల్చి చంపుతుంటారు. వాళ్ల గుర్రాలు కూలబడిపోతుంటాయి. తూటా దెబ్బతిన్న దొంగలు లోయల్లోకి దొర్లిపోతుంటారు. రైలువేగం, మన గుండె కొట్టుకునే వేగం పెరిగిపోతుంటుంది. రైలు పక్కనే ఎగిరి దూకుతున్న గుర్రాలు, పిట్టల్లా రాలిపడుతున్న మనుషులు, కట్టిపడేసే కెమెరా వర్క్‌, బీపీని పెంచే సంగీతం ప్రేక్షకుణ్ణి కుదురుగా వుండనివ్వవు. మనకి తెలీకుండానే సినిమాలో లీనం అయిపోతాం.

book7.3.jpg

‘షోలే’ అపూర్వమైన ఆదరణ పొందిందనీ, చరిత్ర సృష్టించిందనీ అందరికీ తెలుసు. సినిమా షూటింగ్‌ జరిగిన 1973-74 నాటికి డాల్బీ సరౌండ్‌, ఇతర ఆధునిక సాంకేతిక సదుపాయాలూ మనకి లేవు. తెగించి, సాహసించి, ఎంత ఖర్చయినా సరే అని మొండికేసి, సూపర్‌క్లాస్‌ సినిమా తీయాలనే నిశ్చయంతో కార్యరంగంలోకి దిగారు. తెరమీద మాత్రమే కాదు, తెరవెనక నడిచిన ‘షోలే’ కథ కూడా సస్పెన్స్‌ థ్రిల్లర్‌లాగే ఉంటుంది. ఒక మంచి సినిమా తీయడం ఆషామాషీ కాదు.


బెంగళూరులో...

అప్పట్లో అంటే 50 ఏళ్ల క్రితం... హీరోహీరోయిన్లకి ఇచ్చే పారితోషికాలు మనకిప్పుడు నవ్వు తెప్పిస్తాయి. హీరో ధర్మేంద్రకి లక్షన్నర, సంజీవ్‌కుమార్‌కి లక్షా 25 వేలు, అమితాబ్‌బచ్చన్‌కి లక్ష, కొత్త విలన్‌ అమ్జాద్‌ఖాన్‌కి 50 వేలు, జయబాధురికి 35 వేలు ఇచ్చారు. మొత్తం సినిమా ఖర్చు కోటి రూపాయలు దాటకూడదని గట్టిగా అనుకున్నారు. ఆరునెలల నుంచి ఏడాదిలోగా షూటింగ్‌ పూర్తయిపోవాలని ప్లాన్‌ చేశారు. ‘షోలే’కి లొకేషన్‌ ప్రధానం. ఒక సీనియర్‌ ఆర్ట్‌ డైరెక్టర్‌తో దర్శకుడు రమేష్‌ సిప్పీ మాట్లాడాడు. ‘గుర్రాలూ బందిపోటు సినిమాలు అనగానే రాజస్థాన్‌, చంబల్‌లోయలో తీయడం సాధారణం అయిపోయిందనీ, జనాన్ని ఇక అవి ఏమాత్రమూ ఆశ్చర్యపరచవనీ, మనం దక్షిణాదికి వెళితే బాగుంటుంద’ని ఆర్ట్‌ డైరెక్టర్‌ అన్నాడు, రమేష్‌కి ఆ ఆలోచన బాగా నచ్చింది.

book7.4.jpg


వెంటనే అతన్ని టీమ్‌తో కర్నాటకకు పంపించారు. వెతికాడు, కారులో తెగ తిరిగాడు. బెంగళూరుకి ఒక గంట దూరంలో పెద్ద పెద్ద బండరాళ్లతో, కొండలతో నిండి వున్న జనసంచారం లేని సువిశాలమైన ప్రదేశం ఆయన్ని ఆకట్టుకుంది. ‘వావ్‌... ఇది కదా లొకేషన్‌ అంటే’ అనుకున్నాడు. ఆ ప్రాంతం పేరు రామనగరం. దర్శకుడు సొంతబృందంతో దిగాడు. ఆ ప్రాంతం స్టన్నింగ్‌గా, బ్యూటీఫుల్‌గా ఉంది. అక్కడో సినిమా గ్రామం, విలన్‌, ఇతర బందిపోట్ల స్థావరం, దూరంగా ఠాకూర్‌ బల్‌దేవ్‌సింగ్‌ (సంజీవ్‌కుమార్‌) కుటుంబం ఉండే ఇల్లు సెట్‌... అన్నీ భారీగా ఉండాలి అనుకున్నారు. బెంగళూరు నుంచి వందమంది వర్కర్లు, బొంబాయి నుంచి అనేకమంది నిపుణులు దిగారు. రెండు నెలలు పగలూ రాత్రీ చెమటోడ్చి ఆ కొండరాళ్ల అందం ఇనుమడించేలా, సహజంగా కనిపించేలా సృజనాత్మకంగా సెట్టింగ్‌ వేశారు. సకల హంగులతో ఒక పూర్తి గ్రామాన్ని నిర్మించారు. దాని కోసం వాళ్లొక యజ్ఞమే చేశారు.


నాలుగు లైన్ల ఐడియా...

రమేష్‌ సిప్పీని చిన్ననాటి నుంచే సినిమా పట్టుకుని పీడించింది. తండ్రి జీపీ సిప్పీ కొడుకుని ప్రతిష్టాత్మకమైన లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌లో జాయిన్‌ చేశాడు. ఆర్నెల్లు ఆ చదువు సాగింది. రమేష్‌ని బొంబాయి సినిమా పిలుస్తోంది. ‘వచ్చేస్తాను నాన్నా’ అని ఫోన్‌ చేశారు. మరో మాట లేకుండా ‘వచ్చెయ్‌రా’ అన్నాడు సిప్పీ. వచ్చి డిగ్రీలో జాయిన్‌ అయ్యాడు. తండ్రి నిర్మాతగా వున్న సినిమా షూటింగుల్లో తిరిగాడు. కొన్ని సినిమాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వున్నాడు. ఒక హిందీ సినిమాకి అసిస్టెంట్‌గా రమేష్‌ సిప్పీ పని ఏమిటంటే హీరోయిన్‌ సాధన చెప్పులు పట్టుకుని తిరగడం... కావాల్సినప్పుడు వాటిని అందించడం. 25 ఏళ్ల వయసులో ‘అందాజ్‌’కి దర్శకత్వం.

book7.5.jpg


ఓ మోస్తరుగా ఆడింది. దిలీప్‌కుమార్‌ ‘రామ్‌ ఔర్‌ శ్యామ్‌’ (మన ‘రాముడు భీముడు’)కి ఫిమేల్‌ వెర్షన్‌ తలపెట్టాడు రమేష్‌ సిప్పీ. హేమమాలిని డబుల్‌రోల్‌తో తీసిన ‘సీతా ఔర్‌ గీతా’ బంపర్‌హిట్టయ్యింది. రమేష్‌ పేరు మోగిపోయింది. ఒక మెగా ఫిల్మ్‌ తియ్యాల్సిందే అని ఫిక్సయ్యాడు. దేనికీ ఆవేశపడకుండా ప్రశాంతంగా వుండే రమేష్‌లో ‘షోలే’ ఆలోచన సుడులు తిరుగుతోంది. నాలుగులైన్ల ఐడియాని పూర్తిస్థాయి కథగా మలిచి రాయడానికి లక్షరూపాయలు అడిగారు సలీం-జావేద్‌. 50 వేలు ఇస్తానన్నాడు నిర్మాత. డీల్‌ ఓకే అయ్యింది. సీతా ఔర్‌ గీతా హీరోయిన్లు కొత్త సినిమాకి మస్ట్‌ అనుకున్నాడు రమేష్‌. సంజీవ్‌కుమార్‌ మంచి నటుడు.


book7.6.jpg

హేమమాలిని కుర్రాళ్ల కలలరాణిగా పేరు తెచ్చుకుంది. పచ్చి నెత్తురు తాగే ఒక బందిపోటు దొంగల ముఠా నాయకుణ్ణి అంతం చేయడానికి ఇద్దరు చిల్లర దొంగల్ని కిరాయికి కుదుర్చుకొని పోరాటం చేసే ఒక మాజీ పోలీసు అధికారి కథ ఫైనలైజ్‌ అయ్యింది. అప్పటికి భారతదేశం అంతా గుర్తించే విలన్‌ అంటే వోన్లీ శత్రుఘ్నసిన్హా. అమితాబ్‌ పాత్రకు అతన్ని అనుకున్నారు. గబ్బర్‌సింగ్‌గా డానీ డెంజొప్ప అయితే బాగుంటుందని అనుకున్నారు. ‘ధర్మాత్మ’ సినిమా షూటింగ్‌లో డానీ పూర్తిగా బిజీగా ఉన్నాడు. ‘షోలే’ పెద్ద ఫిల్మ్‌ అనీ, అందులో నటించాలనీ డానీ తహతహలాడాడు. ఆఫ్ఘనిస్తాన్‌లో ‘ధర్మాత్మ’, బెంగళూరులో ‘షోలే’ షూటింగులు దాదాపు ఒకే సమయంలో అయినందున, గుండె చెదిరిన డానీ చివరికి ‘నో’ అనక తప్పలేదు.


ఇక మరో విలన్‌ కోసం వెతుకులాట. అమ్జద్‌ఖాన్‌ తండ్రితో స్నేహం ఉన్న రచయిత సలీం వాళ్లని సంప్రదించాడు. థియేటర్‌లో కొంత పేరున్న అమ్జద్‌ఖాన్‌ ఖాళీగానే ఉన్నానని చెప్పాడు. రమేష్‌ సిప్పీ కూడా ఒకటీరెండు నాటకాల్లో అమ్జద్‌ని చూసి ఉన్నాడు. ఒకటి... అమ్జద్‌ఖాన్‌ది పెద్ద పర్సనాలిటీ కాదు. రెండు... అతను ఎవరికీ తెలియదు. సినిమాకి కొత్త. అయినా అమ్జద్‌ని చూసి, మాట్లాడాక రమేష్‌ ‘బాగానే ఉన్నాడుగా’ అనుకున్నాడు. ఆ రోల్‌ సినిమాకి గుండెకాయలాంటిదని ఒక్క రమేష్‌కే తెలుసు. కొన్ని రోజుల తర్వాత అమ్జద్‌కి స్ర్కీన్‌ టెస్ట్‌ జరిగింది. ఫొటోలు తీశారు. గడ్డం పెరిగి, పళ్లకి నల్లరంగు వేసుకున్న అమ్జద్‌ డైలాగ్‌ చెప్పిన తీరు, పలుకుబడి బాగుంది. ఆరోజు 1973 సెప్టెంబర్‌ 20. ‘‘నువ్వు నా సినిమాలో నటిస్తున్నావ్‌’’ అన్నాడు రమేష్‌. కట్టలు తెగిన ఆనందంతో అమ్జద్‌ తన భార్య శైలని కలవడానికి ఆస్పత్రికి వెళ్లాడు. ఆ రోజు సాయంత్రం నాలుగింటికి అమ్జద్‌కి కొడుకు పుట్టాడు. వాడి పేరు షాబాద్‌.


మొదట్లో అమితాబ్‌ లేడు...

అమితాబ్‌ బాధ అంతా ఇంతా కాదు. ‘షోలే’లో నటించితీరాలని అమితాబ్‌ పట్టుదలతో ఉన్నాడు. అయితే వరుసబెట్టి పది సినిమాలు ఫెయిలై, ఫ్లాపై ఉన్నాయి. అప్పటికి ‘జంజీర్‌’ సినిమా పూర్తయ్యిందిగానీ విడుదల కాలేదు. ఓ రోజు అమితాబ్‌కి వొంట్లో బాగోలేదు. 102 జ్వరం. నీరసంగా ఉన్నాడు. ఆ రోజే జీపీ సిప్పీ ఇంట్లో ఒక గ్రాండ్‌ పార్టీ. నిర్మాతలూ దర్శకులూ హీరోహీరోయిన్లూ గుంపులుగా అక్కడ ఉన్నారు. శత్రుఘ్నసిన్హా స్టయిలిష్‌గా పార్టీకి వచ్చాడు. అందరూ ఎదురెళ్లి ఆహ్వానించారు. ధర్మేంద్ర, హేమమాలినితో ఫొటోలు. లేట్‌గా అమితాబ్‌ వచ్చాడు. కొద్దిమంది మాత్రమే అతన్ని పట్టించుకున్నారు. డిస్ట్రిబ్యూటర్లు కొందరు ‘‘శత్రుఘ్న ఉన్నాడుగా చాలు. ఆ సన్నగా, పొడుగ్గా ఉన్న అమితాబ్‌ ఎందుకూ పనికిరాడు. అడుగుపెడితే ఫ్లాపే’’ అని రమేష్‌ చెవిలో చెప్పారు. నవ్వి వూరుకున్నాడు. ‘సంజీవ్‌కుమార్‌, ధర్మేంద్రతో పాటు శత్రుఘ్నసిన్హాను తీసుకుంటే ఈ సూపర్‌స్టార్ల ప్రవర్తన, అతి, ఈగో ప్రాబ్లం భరించడం కష్టం’ అనుకున్నాడు. నా గురించి ఒక మాట చెప్పమని ధర్మేంద్రని బతిమిలాడాడు అమితాబ్‌. రచయిత సలీం కూడా అమితాబ్‌ మంచి ఆర్టిస్టు కదా అని రికమెండ్‌ చేశాడు. వీళ్లందరి ప్రయత్నం ఫలించింది. రమేష్‌సిప్పీ అమితాబ్‌ని ఖాయం చేశాడు.


తొలిసినిమా ‘సప్నోంకా సౌదాగర్‌’లో రాజ్‌కపూర్‌కే మత్తుజల్లిన హేమమాలిని ‘సీతా ఔర్‌ గీతా’ హిట్‌తో డ్రీమ్‌గాళ్‌ ఆఫ్‌ ఇండియాగా మోగిపోతోంది. బాలీవుడ్‌ నెంబర్‌వన్‌ హీరోయిన్‌ అయ్యింది. ‘షోలే’లో గుర్రబ్బండి నడిపే పిల్ల పాత్ర. ఐదారు సీన్లే ఉండటం ఆమెకు రుచించలేదు. ఎందుకలా? అని దర్శకుణ్ణి అడిగింది. ‘‘ఎందుకేమిటీ? ఇది నీ సినిమా కాదు... సంజీవ్‌కుమార్‌, గబ్బర్‌ సింగ్‌ ఫిల్మ్‌. అయితే నీదొక ప్రధానమైన పాత్ర’’ అన్నాడు రమేష్‌ సిప్పీ. ఆయన ఎలాంటి మేజిక్‌ చేయగలడో తెలుసు గనక ఆమె ఇక ప్రశ్నలు అడగలేదు. సంజీవ్‌కుమార్‌ వేసిన ఠాకూర్‌ పాత్రకి లెజండరీ విలన్‌ ప్రాణ్‌ పేరు చర్చకి వచ్చింది. లక్షల్లో అభిమానులున్న గొప్ప నటుడు ప్రాణ్‌. ‘సీతా ఔర్‌ గీతా’లో సంజీవ్‌ సహజ నటనా చాతుర్యం చూసి ఇంప్రెస్‌ అయివున్నాడు రమేష్‌. కనుక అతనే నా ఠాగూర్‌ అని డిసైడ్‌ అయ్యాడు. సినిమాలో తన పాత్ర తెలిసి జయబాధురి ఇబ్బంది పడింది. ఒక విధవరాలు. ఈ పిచ్చి పాత్ర చేయాలా ఇప్పుడు? అని కొంచెం గింజుకుంది. అప్పటికే అమితాబ్‌తో ప్రేమ నడుస్తోంది.


ఒకే ఒక్క డైలాగ్‌ ...

సినీ పరిభాషలో సింగిల్‌ లైన్‌ ఆర్డర్‌ అనే ఆ నాలుగులైన్ల సింపుల్‌ ఐడియాని పూర్తిస్థాయి కథగా మార్చాలి. సలీం-జావేద్‌లు 15 రోజులు కూర్చుని కుస్తీలు పట్టి, రాసి, మార్చి, తిరగరాసి కథను ఓ కొలిక్కి తెచ్చారు. రమేష్‌తో కూర్చుని రాసేపని ముగించేసరికి పాత్రలు పెరిగిపోయాయి. జావేద్‌ అక్తర్‌ చేతిరాత దరిద్రంగా వుంటుంది. ఉర్దూలో నాన్‌స్టాప్‌గా రాసి పారేస్తాడు. రాస్తున్న ఊపులో, మెరుపుల్లా ఐడియాలు తరుముకొస్తుంటే గబ్బర్‌సింగ్‌ డైలాగుల్లో పదును పెరిగింది. జావేద్‌ చదివి వినిపిస్తుంటే, కొన్నిచోట్ల వొత్తి పలుకుతున్నాడు సలీం. వాళ్లిద్దరూ యాక్షన్‌తో బిగ్గరగా ఒక ఫోర్స్‌తో చదువుతూ ఆ గదిలోనే సినిమా చూపించేసేవాళ్లు. విని, ఆశ్చర్యపోయిన సంజీవ్‌కుమార్‌ ‘‘నేను గబ్బర్‌ పాత్ర చేస్తా’’ అన్నాడు. ‘‘అలా అయితే నువ్వు విలన్‌గా మిగిలిపోతావ్‌’’ అన్నాడు రమేష్‌. సాంబాగా ప్రపంచ ప్రసిద్ధిచెందిన గబ్బర్‌ అనుచరుడు మెక్‌మోహన్‌కి ఒకే ఒక్క డైలాగ్‌ వుంటుంది. గబ్బర్‌ని పట్టుకుంటే 50 వేల రివార్డు వుంటుంది. గబ్బర్‌లాంటి బలిసి కొవ్వుపట్టిన విలన్‌, ఆ గొప్పని మరొకరు చెప్పాలనుకుంటాడు. దానికి సలీం-జావేద్‌లు పేలిపోయే డైలాగ్‌ రాశారు.


‘‘అరె వో సాంబా! కిత్నా ఇనామ్‌ రఖాహై సర్కార్‌ హమ్‌పర్‌’’ అని గబ్బర్‌ ప్రశ్నిస్తే...

‘‘పూరా పచాస్‌ హజార్‌’’ అంటాడు సాంబా.

‘‘సునా.. పూరే పచాస్‌ హజార్‌’’...

సాంబా అనే మాట కొండల్లో మార్మోగుతుంది.

స్ర్కిప్టు చదివినపుడు నాకు కేవలం ఒక్క డైలాగేనా? అని సాంబాగా చేసిన మెక్‌మోహన్‌ నిరాశ పడ్డాడు. అతన్ని బుజ్జగించి, ఒప్పించాల్సి వచ్చింది. ఆ ఒక్క డైలాగే జనాన్ని అల్లకల్లోలం చేసింది. భారతీయ సినీ చరిత్రలో మెక్‌మోహన్‌ పేరు సాంబాగా ఎప్పటికీ నిలిచి వుంటుంది.

కథ అనుకున్నట్టుగా వచ్చింది. ఉత్కంఠభరితమైన 70ఎం.ఎం. స్ర్కీన్‌ప్లే సిద్ధమైంది. హీరోహీరోయిన్‌, విలన్‌ పాత్రల నుంచి జూనియర్‌ ఆర్టిస్టులదాకా సెలక్షన్‌ పూర్తయ్యింది. ఇంత మెగా ఫిల్మ్‌కి ఒక ఐటెమ్‌సాంగ్‌ మస్ట్‌ అనుకున్నారు. ఒక్క కంటి చూపుతో, చిలిపి నవ్వుతో, పెదవి విరుపుతో, నడుం వొంపుతో థియేటర్లలో అగ్గి రాజేయగల డ్యాన్సింగ్‌ క్వీన్‌ హెలెన్‌ ఎలాగూ వుంది. అన్నిరకాల ప్రభుత్వ, ప్రైవేట్‌ పర్మిషన్లూ సాధించారు. ఇక షూటింగ్‌ మెదలెడదాం. చలో బెంగళూరు. ఎక్కడా అంగుళం కూడా రాజీపడడానికి ఇష్టపడని రమేష్‌ సిప్పీలాంటి పిచ్చివాడు ఇంకొకడున్నాడు అతని పేరు ద్వారకా దివేచా. ‘షోలే’ కెమెరామ్యాన్‌. ప్రతీ సీనూ అనుకున్నది అనుకున్నట్టుగా- పర్‌ఫెక్ట్‌గా వచ్చేదాకా, ఎన్ని గంటలైనా, ఎన్ని పూటలైనా తను కదలడు. కెమెరాని వదలడు. లైటింగ్‌ స్పెషలిస్ట్‌ అతను. రమేష్‌ నమ్ముకున్న దివేచానే సినిమాకి ప్రాణం పోశాడు. ‘విజువల్‌ లాంగ్వేజీ అంటే ఇదిరా సన్నాసుల్లారా’ అని అర్థమయ్యేలా చెప్పాడు.


కొన్ని ఆటంకాల వల్లా, అద్భుతంగా తియ్యాలనే ఆరాటం వల్ల, షూటింగ్‌ లేట్‌ అవుతోంది. ప్రతీ షాట్‌ 35ఎం.ఎం.లోనూ, 70ఎం.ఎం.లోనూ పిక్చరైజ్‌ చేయడం వల్ల కూడా ఆలస్యం అవుతోంది. కోటి రూపాయలు అనుకున్న బడ్జెట్‌ మూడు కోట్లకి పెరిగిపోయింది. ఆరేడు నెలలు అనుకున్న షూటింగ్‌ రెండేళ్లు దేకింది. చివరికి, అన్ని అడ్డంకులూ దాటుకుని షూటింగ్‌ పూర్తి చేశారు. ఎడిటింగ్‌లో కూర్చుంటే, మెదడు చిట్లి, బుర్ర తిరిగిపోయింది. రెండు లక్షల అడుగులకు పైగా నిడివి వుంది. కావాల్సింది 24 లేదా 26 వేల అడుగులు మాత్రమే. కట్‌ చేసి, తగ్గించీ, మళ్లీ మళ్లీ కట్‌ చేసి, కుదించీ, ఒక గొప్ప ఫీట్‌ తర్వాత అనుకున్న నిడివి సాధించగలిగారు. ఊపిరి పీల్చుకొని సెన్సారుకి పంపించారు. భారత సెన్సార్‌ బోర్డ్‌ వారు మొహం చిట్లించారు. ‘ఏమిటీ హింస... ఈ నెత్తురేంటీ’ అని తిట్టినంత పని చేశారు. హింసని గ్లామరైజ్‌ చేశారని విమర్శ! పైగా ‘ఒక పోలీస్‌ అధికారి విలన్ని ఇనుపబూట్లతో తొక్కి చంపేయడమా? క్లయిమాక్స్‌ మార్చండి’ అని సెన్సార్‌ కఠినంగా మాట్లాడింది.


హడావిడిగా అందరికీ కబురు పెట్టారు. సంజీవ్‌కుమార్‌ బూట్లతో కుమ్మి పగ తీర్చుకున్నాక, గబ్బర్‌ని చంపడానికి ముందు పోలీసులు వచ్చి అరెస్ట్‌ చేస్తారు. గతి లేక క్లయిమాక్స్‌ మార్చారు. హింస తగ్గించారు. అంతా ఓకే అయ్యింది. 1975 ఆగస్ట్‌ 15న రిలీజ్‌ చేద్దాం అనుకున్నారు. 70ఎం.ఎం. ఫిల్మ్‌ని ఎడిట్‌ చేసి, ప్రింట్లు వేసే ఆధునిక పరికరాలు మనకు లేవు. లండన్‌లో చెయ్యాల్సిందే అన్నారు. రమేష్‌ సిస్పీ ప్రతివారం లండన్‌ వెళ్లి రావడం. ఇక్కడ సమయం మించిపోయింది. లండన్‌లో పని పూర్తి అయినా, 70ఎం.ఎం. రీళ్లు ఇండియా రావడానికి ప్రభుత్వాధికారులు ఏవేవో కారణాలు చెప్పి అడ్డుపడ్డారు. ఫోన్లు, రికమెండేషన్లు, రాజకీయ నాయకుల జోక్యం... ఈ నరకం తర్వాత అనుమతి దొరికింది. చిట్ట చివరికి కొన్ని ప్రింట్లు తీసి ఉత్తరాదిన రిలీజ్‌ చేయగలిగారు. 1500 సీట్ల కెపాసిటీ ఉన్న బొంబాయి మినర్వా థియేటర్లో అనుకున్న రోజుకి సినిమా వేయగలిగారు.


అట్టర్‌ఫ్లాప్‌ ‘షోలే’!

ఒకరోజు ముందే చూసిన బొంబాయి సినీ ఇండస్ట్రీ పెద్దలు, సీనియర్‌ జర్నలిస్టులు పెదవి విరిచారు. ఇది హాలీవుడ్‌ సినిమాలకి పేలవమైన పచ్చి కాపీ అన్నారు. ‘దీవార్‌’ షూటింగ్‌లో బిజీగా వున్న అమితాబ్‌తో ‘షోలే’ దొబ్బింది గురూ అని చెప్పారు. కుప్పకూలిపోయాడు. బొంబాయిలో నడిచి వెళ్తున్న అమ్జాద్‌ఖాన్‌కి ఓ మిత్రుడు చెప్పాడు. ‘షోలే’ దారుణమైన డిజాస్టర్‌ అని. అలాగే ఫుట్‌పాత్‌ మీద కూలబడి, తల కొట్టుకుని ఏడ్చాడు. రమేష్‌సిప్పీకి మనశ్శాంతి లేదు.

పూర్తిగా పదిహేను రోజుల తర్వాత ‘షోలే’ సునామీలాగా ఉత్తరాదిని ముంచెత్తింది. టీ కొట్లలో, హోటళ్లలో, ఆఫీసుల్లో, గబ్బర్‌సింగ్‌ డైలాగులతో జనం మాట్లాడుతున్నారు. ‘అరె వో సాంబా... చాయ్‌ పట్రా’ అంటున్నారు. పాటలు హిట్టు. డైలాగులు హిట్టు. ‘షోలే’ మేనియా దేశాన్ని కుదిపేసింది. బొంబాయి మినర్వాలో వరుసగా మూడేళ్లు ఆడింది ‘షోలే’. తర్వాత రెండేళ్లు మ్యాట్నీషో వేశారు. 240వ వారంలో కూడా మినర్వా హౌస్‌ఫుల్‌ అయ్యింది.


50 ఏళ్ల తర్వాత ఒరిజినల్‌ ‘షోలే’

‘షోలే’ ఒరిజినల్‌ 70ఎం.ఎం. ప్రింట్లు పూర్తిగా పాడైపోయాయి. ఫిల్మ్‌ నెగిటివ్‌లు పనికిరాని స్థితిలో ఉన్నాయి. అయితే 2022లో నమ్మశక్యం కాని నిధి ఒకటి దొరికింది. ముంబాయిలోని ఒక గిడ్డంగిలో కొన్ని నెగిటివ్‌లు కనిపించాయి. ఒక మూల పడివున్న కొన్ని ఇనపపెట్టెల్లో సౌండ్‌ నెగిటివ్‌లూ, ఒరిజినల్‌ 35ఎం.ఎం. కెమెరా దొరికాయి. రమేష్‌ సిప్పీ కొడుకు షెహజాద్‌ సిప్పీ వీటిని కనిపెట్టాడు. ఈ విజయోత్సాహం చల్లారకముందే... లండన్‌లో చాలా రీళ్లు భద్రంగా వున్నాయని సిప్పీ ఫిల్మ్స్‌కి కబురొచ్చింది. దాంతో ‘షోలే’ ఫిల్ములు పునరుద్ధరించాలని ‘బొంబాయి ఫిల్మ్‌ హెరిటేజ్‌ ఫౌండేషన్‌’ని షెహజాద్‌ కోరాడు. లండన్‌లో దొరికిన నెగిటివ్‌లను ఇటలీలోని ప్రతిష్టాత్మకమైన ప్రపంచస్థాయి ఫిల్మ్‌ రెస్టోరేషన్‌ సంస్థకి అప్పగించారు. ఒరిజినల్‌ 70ఎం.ఎం. ఫిల్మ్‌ పోయినప్పటికీ, బ్రిటీష్‌ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ సహకారంతో మూడేళ్లు శ్రమించి, గొప్ప క్లారిటీని సాధించి నాటి ‘షోలే’కి ప్రాణప్రతిష్ట చేశారు. ఒరిజినల్‌ అంటే ఇందులో కట్‌ చేసిన హింసతో నెత్తురోడిన సన్నివేశాలు వుంటాయి. సంజీవ్‌కుమార్‌ గబ్బర్ని హతమార్చడమూ వుంటుంది.


ప్రత్యేక శ్రద్ధతో పునరుద్ధరించిన ఫిల్మ్‌ అవడం వల్ల, మనం చూసిన ‘షోలే’ కన్నా ఇది సాంకేతికంగా పర్‌ఫెక్ట్‌గా, విజువల్‌ వండర్‌గా వుంటుంది. 50 ఏళ్ల తర్వాత మూడేళ్లు కష్టపడి తీర్చిదిద్దిన ఈ ఒరిజినల్‌ ‘షోలే’ని ఇటలీలోని బాలోనా చిత్రోత్సవంలో ఈ మధ్యనే ప్రదర్శించారు. యూరప్‌లోకెల్లా అతి పెద్ద ఓపెన్‌ ఎయిర్‌ స్ర్కీన్‌ మీద చూసి సినీ పండితులూ, ప్రేక్షకులూ ఆనందపారవశ్యంతో ఊగిపోయారు. ‘షోలే’ భారతీయ వెండితెరకు ఎప్పటికీ ఒక సాంస్కృతిక పునరుజ్జీవనమే.

- తాడి ప్రకాష్‌,

97045 41559


సినిమాలో అతి కీలకమైన, వెన్నులో వొణుకు పుట్టించే సీన్‌... ఠాకూర్‌ బల్‌దేవ్‌సింగ్‌ కుటుంబం మొత్తాన్ని గబ్బర్‌సింగ్‌ కాల్చి చంపడం. ఈ ప్రతీకారం సీన్‌ పిక్చరైజ్‌ చేయడానికి ఏకంగా 23 రోజులు పట్టింది. ఆ విజువలైజేషన్‌, ఫిల్మింగ్‌, పర్‌ఫెక్షన్‌ ఎవ్వరూ మర్చిపోలేరు. రెండో ప్రధానమైన సన్నివేశం... జయబాధురి నెమ్మదిగా, ప్రశాంతంగా లైట్లు ఆర్పివేయడం. సాయంకాలపు వెలుతురు క్రమంగా చిరుచీకట్లో కలిసిపోయే వేళని ‘మేజిక్‌ అవర్‌’ అంటారు. ఆ సహజమైన లైటింగ్‌లోనే చిత్రీకరించాలని ద్వారకా దివేచా పట్టుదల. అనుకున్నది సాధించడానికి 20 రోజులు షూటింగ్‌ చేయాల్సి వచ్చింది.


- గబ్బర్‌ స్థావరంలో బండరాళ్ల మీద హేమమాలిని డాన్స్‌ చేయాలి. ఎండకి రాళ్లు కాలిపోతున్నాయి. ‘ఆ రాళ్ల మీద నీళ్లు పొయ్యొచ్చుగా’ అని హేమ అడిగింది. ‘లేదు, వేడెక్కిన రాళ్ల మీద నువ్వు డాన్స్‌ చేస్తుంటే, నీ ముఖంలో ఆ బాధ కనిపించాలి’ అన్నాడు క్రూరుడు రమేష్‌ సిప్పీ.

- రైలుదోపిడీ సీన్‌లో శిక్షణపొందిన గుర్రాలు వున్నా, కొన్ని శిక్షణ లేని గుర్రాలు కూడా వాడాల్సొచ్చింది. గుర్రాలు తూలి, కూలిపోతున్నప్పుడు, ఆ వేగంలో మనుషులు కిందపడి దొర్లిపోతున్నప్పుడు ఎవరు ఎప్పుడైనా చనిపోవచ్చు. నరాలు తెగే ఆ సీన్‌ని ప్రమాదరకంగా, గడగడలాడుతూ చిత్రీకరించారు.

- పిరికి జైలు అధికారిగా అస్రానీ నటనకి థియేటర్‌లో నవ్వని వాళ్లంటూ ఉండరు. అస్రానీ వెంట జూనియర్‌ ఆర్టిస్టులుగా వుండే ఇద్దరు పోలీసులు ఒకరోజు రాలేదు. అంతే... దర్శకుడు షూటింగ్‌ క్యాన్సిల్‌ చేశాడు. షూటింగ్‌ ఆపడం, వాయిదా వేయడం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. రాజీపడని నిక్కచ్చితనానికి ఇదొక ఉదాహరణ.


- అమితాబ్‌, ధర్మేంద్ర జోడీ, నిజమైన స్నేహానికి ప్రతీక. షూటింగ్‌లో రాళ్లగుట్టల కింద ధర్మేంద్ర వుంటాడు. కొండ మీద అమితాబ్‌ నిల్చుని వుంటాడు.. పెట్టెలోంచి కొన్ని కంగారుగా తీసి, ధర్మేంద్ర పైకి తుపాకీ కాల్చాలి. నిజానికి వీరూ తాగి వున్నాడు. రెండుమూడుసార్లు కాల్సినా సీన్‌ ఓకే అవ్వలేదు. చిరాకుపడి, అసహనంతో వున్న ధర్మేంద్ర పొరపాటున పక్కనే వున్న ఒరిజినల్‌ తూటాలు తీసి, ఢామ్మని కాల్చిపారేశాడు ఆ గుండు అమితాబ్‌ చెవి పక్క నుంచి దూసుకుపోయింది. టీమ్‌ అంతా షాక్‌ తిన్నారు. కొద్దిలో పెద్ద ప్రమాదం తప్పిపోయింది.


- జై, వీరూ స్నేహాన్ని ఎస్టాబ్లిష్‌ చేసే ‘యే దోసితీ...’పాట వేగంగా వెళ్తున్న మోటార్‌బైక్‌ మీద చిత్రీకరణ. ఆ స్పీడూ, బైక్‌ విన్యాసాలు, వాళ్ల అల్లరీ బ్యూటీఫుల్‌గా చిత్రీకరించడానికి... ఆ ఒక్కపాటకి 21 రోజులు పట్టింది.

- ఒక పనిమీద లండన్‌ వెళ్లిన దర్శకుడు అక్కడో వెస్ట్రన్‌పాట విన్నాడు. బీట్‌ అదిరింది. ఇది మన జనాన్ని ఉర్రూతలూగిస్తుందని అనుకున్నాడు. రాగానే ఆర్టీ బర్మన్‌కీ, ఆనంద్‌బక్షికీ ఆ పాట రికార్డ్‌ వినిపించాడు. భలే వుందిగా అని బర్మన్‌ మ్యూజిక్‌ కంపోజ్‌ చేశాడు. ఆ బీట్‌కి నప్పేలా జీరగొంతుతో ఎవరు పాడాలి? చివరికి ఆర్డీ పాడాలని నిర్ణయించారు. ‘మెహబూబా’ పాట అందరికీ నచ్చింది. గబ్బర్‌సింగ్‌ స్థావరంలో హెలెన్‌ పాట పెట్టడం బావుంటుందా? అతుకుతుందా? పెద్ద గొడవే జరిగింది. జిప్సీలతో పాట అక్కడే తీద్దాం అని డిసైడ్‌ అయ్యారు. మెరుపుకళ్ల సెక్సీ హెలెన్‌ ఉర్రూతలూగించింది. పాట చిత్రీకరణకి అయిదు రోజులు పట్టింది.

Updated Date - Aug 10 , 2025 | 10:46 AM