Indian Origin Woman Assaulted: యూకేలో దారుణం.. ఇంట్లోకి చొరబడి భారత సంతతి యువతిపై అఘాయిత్యం
ABN , Publish Date - Oct 27 , 2025 | 09:39 AM
ఉత్తరఇంగ్లండ్‌లోని వాల్సాల్ టౌన్‌లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. స్థానికంగా నివసించే ఓ భారత సంతతి యువతిపై అత్యాచారం జరిగింది. నిందితుడు ఆమె ఇంట్లోకి చొరబడి దారుణానికి ఒడిగట్టాడు. అతడి ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: యూకేలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఉత్తర ఇంగ్లండ్‌లో వాల్సాల్ టౌన్‌లోగల పార్క్ హిల్ ప్రాంతంలో ఓ భారత సంతతి యువతిపై అత్యాచారం జరగడం కలకలానికి దారితీసింది. నిందితుడు ఇంట్లోకి చొరబడి యువతిని బలాత్కరించాడు. అతడి సీసీటీవీ ఫుటేజీని పోలీసులు విడుదల చేశారు. నిందితుడి వివరాలు తెలిసిన వారు వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు (racially aggravated rape UK).
జాత్యాహంకారంతో నిందితుడు ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు. శ్వేతజాతీయుడైన అతడి వయసు 30 ఏళ్లకు పైగానే ఉంటుందని చెప్పారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీని పోలీసులు జల్లెడపడుతున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నామని డిటెక్టివ్ సూపరింటెండెంట్ డీఎస్ రోనన్ టైరర్ తెలిపారు. ఇది దారుణమైన ఘటన అని అభివర్ణించారు. పోలీసులు బృందాలు ఆధారాలను సేకరిస్తున్నాయని తెలిపారు. నిందితుడి గురించి తెలిసిన వారు వెంటనే ముందుకు రావాలని అభ్యర్థించారు(Indian-origin woman UK attack).
కొన్ని వారాల క్రితం సమీప ఓల్డ్‌బరీ ప్రాంతంలో ఓ బ్రిటీష్ సిక్కు మహిళపై అత్యాచారం జరిగింది. ఇంతలోనే తాజా ఘటన వెలుగులోకి రావడంతో స్థానిక భారత సంతతి వారిలో ఆందోళన వ్యక్తం అవుతోంది. ‘వాల్సాల్‌లో వివిధ దేశాల వారు నివసిస్తుంటారు. ఈ దాడితో స్థానికంగా ఆందోళన వ్యక్తం అవుతోంది. స్థానికులతో ఈ విషయమై చర్చిస్తున్నాము. ఆ ప్రాంతంలో పోలీసుల గస్తీ పెంచుతాము’ అని వాల్సాల్ పోలీస్ చీఫ్ సూపరింటెండెంట్ ఫిల్ డాల్బీ తెలిపారు.
ఇక ఘటనను సిక్కు మతస్తుల సంఘం యూకే సిక్ ఫెడరేషన్ ఖండించింది. నిందితుడు ఆమె ఇంట్లోకి చొరబడి ఈ దారుణానికి ఒడిగట్టాడని తెలిపింది. ఆ ప్రాంతంలో ఇది రెండో జాత్యాహంకార పూరిత దాడి అని ఆందోళన వ్యక్తం చేసింది. నిందితులను వెంటనే అదుపులోకి తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని పేర్కొంది. ఇక ఓల్డ్‌బరీ ఘటనలో పోలీసులు కొందరు అనుమానితుల్ని అరెస్టు చేశారు. అనంతరం వారు బెయిల్‌పై విడుదలయ్యారు.
ఇవీ చదవండి..
ఇల్లు శుభ్రం చేయని భర్తపై కత్తితో దాడి.. యూఎస్‌లో భారత సంతతి మహిళ అరెస్టు
తానా న్యూజెర్సీ హైకింగ్ ఈవెంట్ విజయవంతం