Oman: గల్ఫ్ ఎడారి ఒయాసిస్‌లో వేములవాడ రాజన్న కళ్యాణోత్సవం
ABN , Publish Date - Feb 09 , 2025 | 03:14 PM
ఒమాన్ దేశంలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి కళ్యాణోత్సవం.. వేములవాడ నుండి వచ్చిన ప్రత్యేక అర్చకుల బృందం, స్థానిక ప్రవాసీ బ్రహ్మణ వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య కన్నులపండువగా సాగింది.

ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన కోడెల మొక్కు
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి ఇర్ఫాన్: వేములవాడ.. దక్షిణ కాశీగా పేరొందిన ప్రముఖ శైవ క్షేత్రం, శ్రీరాజరాజేశ్వర స్వామిగా వేములవాడ రాజన్నగా భక్తులు పలికే దేవుడు. కాశీ, చిదంబరం, శ్రీశైలం, కేదారేశ్వరాన్ని పావనం చేసి.. వేములవాడకు శివుడు వస్తాడని పురాణ కథనం కాగా భక్తుల విశ్వాసం శివుడిని అరేబియా తీరాలకు తీసుకొచ్చింది.
ఎడారిలో ఒయాసిస్‌గా భావించే ఒమాన్ సముద్ర తీరంలో మస్కట్ నగర శివారులో ప్రకృతి రమణీయమైన బర్కా ప్రాంతంలో ఓం నమః శివాయః అంటూ తెల్లవారు జామున నుండి మొదలైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి కళ్యాణోత్సవం ఒమాన్ దేశంలో వేములవాడ నుండి వచ్చిన ప్రత్యేక అర్చకుల బృందం, స్థానిక ప్రవాసీ బ్రహ్మణ వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య కన్నులపండువగా సాగింది (NRI).
Chandrababu: ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన ఎన్నారై ప్రముఖుడు
ఒమాన్ తెలంగాణ సమితి ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన రాజన్న కళ్యాణోత్సవంతో ప్రవాసీ భక్తులు పరవశించిపోయారు. వేములవాడ నుండి ప్రత్యేకంగా వచ్చిన అర్చక పండితులు వల్లంభట్ల భరత్ కుమార్, నందగిరి భాను, కత్నపల్లి సత్యంలకు తోడుగా స్థానిక ప్రవాసీ వేద పండితులు విజయకుమార్ శర్మ, పాలె, రాజేంద్ర శర్మల నేతృత్వంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి సుప్రభాతంతో మొదలయిన కార్యక్రమం అత్యంత నియమ నిష్టలతో, శాస్త్రోక్తంగా నిర్విఘ్నంగా కొనసాగింది.
వేములవాడ రాజన్న అంటే కోడెలను మొక్కుల రూపంలో సమర్పించుకోవడం ప్రత్యేకత. ఆ సంప్రదాయాన్ని గల్ఫ్ లో కూడ నిర్వాహకులు కొనసాగించడం ఈ కళ్యాణోత్సవ విశిష్టత అని చెప్పవచ్చు. వేదిక ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కోడెల మొక్కు భక్తులను అలరించింది. తెలంగాణ ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యుడు మరియు వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్ధానం ధర్మకర్తల మండలి మాజీ అధ్యక్షుడు కూడా అయిన ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఒమాన్‌లోని ఈ కళ్యాణోత్సవం వేములవాడ స్థాయిలో ఉందని ప్రశంసించడం నిర్వాహకులు ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది.
SATA: సౌదీలో ఇద్దరు ఆంధ్రులను ఆదుకున్న మానవతామూర్తులు
ఆర్మూరు శాసన సభ్యుడు, బీజేపీ ఫైర్ బ్రాండ్ నేత అయిన పైడి రాకేష్ రెడ్డి కూడా కళ్యాణోత్సవంలో గౌరవ అతిథిగా పాల్గొని విదేశాలలో సైతం ప్రవాసీయులు హైందవ సంస్కృతిని పరిరక్షించడానికి చేస్తున్న కృషి ప్రశంసనీయమని కొనియాడారు.
దుబాయిలోని తెలంగాణ ప్రవాసీ ప్రముఖుడు కటుకం రవి, టి.పి.సి.సి ప్రవాసీ విభాగం కన్వీనర్ మంద భీంరెడ్డి, టి.పి.సి.సి ఎన్నారై కోఆర్డినేటర్ నంగి దేవేందర్ రెడ్డి, అమెరికాలోని గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడు కల్వల విశ్వేశ్వర్ రెడ్డి, దుబాయిలోని బీజేపీ నాయకులు రత్నగిరి వంశీ గౌడ్, ఆకుల గగన్, హైర దేవ్ యాదవ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.