Christmas: గల్ఫ్ దేశాలలో తెలుగు ప్రవాసీయుల క్రిస్మస్ సంబరాలు
ABN , Publish Date - Dec 26 , 2025 | 10:48 AM
గల్ఫ్‌లో తెలుగు ప్రవాసీయులు వైభవంగా క్రిస్మస్ వేడుకలను జరుపుకున్నారు. భారతీయులలో కేరళ వారితో పాటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన క్రైస్తవులు చెప్పుకోదగ్గ సంఖ్యలో పని చేసే వారిలో ఉండడంతో క్రిస్మస్ పండుగకు ప్రత్యేకత ఉంది.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: గల్ఫ్ దేశాలలోని తెలుగు ప్రవాసీయులు క్రిస్మస్ సంబరాలను ఆధ్యాత్మిక అంబరంగా జరుపుకుంటున్నారు. వారం రోజులుగా రాత్రి వేళలలో తీవ్ర చలిలో కొనసాగుతున్న కారెల్స్ ముందస్తు సంబరాలు గురువారం పండుగ పర్వదినంతో ఆకాశాన్నంటాయి. ఒకప్పుడు క్రైస్తవం వికసరించిన ఎడారులలో ఇస్లాం వర్ధిల్లిన అనంతరం క్రైస్తవం అంతరించిపోయినా ఆ తర్వాత చమురుతో పాటు వచ్చిన విదేశీయుల కారణంగా క్రైస్తవ పండుగకు ప్రాధాన్యత సంతరించుకుంది. భారతీయులలో కేరళ వారితో పాటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన క్రైస్తవులు చెప్పుకోదగ్గ సంఖ్యలో పని చేసే వారిలో ఉండడంతో క్రిస్మస్ పండుగకు ప్రత్యేకత ఉంది.
కువైత్‌లో..
గల్ఫ్ దేశాలన్నింటిలోనూ కువైత్ చర్చికు ప్రాధాన్యత ఉంది. వాటికన్‌తో అనుసంధానం కలిగిన కువైత్‌లోని క్రైస్తవ సమాజంలో తెలుగు చర్చి (టి.సి.సి)కు మొత్తం గల్ఫ్‌లోని మొట్టమొదటి తెలుగు చర్చి. సాల్మీయాలో గత అయిదు దశాబ్దాలకు పైగా తెలుగు భాషలో సేవలందిస్తున్న చర్చి ప్రాంగణంతో పాటు సాల్మీయాలోని రోడ్లు కూడా భక్తులతో కిక్కిరిసిపోయాయి. టి.సి.సితో పాటు దేశవ్యాప్తంగా వివిధ చర్చిలో గురువారం ఉదయం నుండి సేవలు కొనసాగుతుండగా అనేక చోట్ల బుధవారం రాత్రి ముందస్తు వేడుకలు జరిగాయి.

దుబాయిలో
దుబాయిలో తెలుగు భాషలో సేవలందించే హోలీ ట్రినిటీ, సెంట్ పాల్ చర్చిలలో కూడా ఇదే పరిస్థితి. తెలుగు సినిమా రంగంలో ఉజ్వల భవిష్యత్తును కాదనుకుని యేసును నమ్ముకుని పాస్టర్‌గా మారిన రాజా హేబెల్ ప్రధాన వక్తగా దుబాయికు రావడంతో అనేక మంది ఆయన ప్రసంగాన్ని వినడానికి ప్రత్యేకంగా వచ్చారు. నాదల్ షిబా కార్తూన్ తెలుగు క్రైస్తవ సంఘం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య ప్రసంగికుడిగా రాజా హేబెల్ ఏసు ప్రభు జన్మ, క్రైస్తవ ఔన్నత్యం గురించి వివరించిన తీరుకు భక్తులు పరవశించిపోయారు. పాస్టర్ ఉచ్చుల థామస్ కూడా ఈ సందర్భంగా ప్రసంగించారు. గంటా కిషోర్ నేతృత్వంలో భక్తులందరు క్రిస్మస్ గీతాలను ఆలపించడం ద్వారా ప్రభువును ప్రసన్నం చేసారు. క్రిస్మస్ ఉత్సవాలకు సయ్యద్ మసూదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

అదే విధంగా భారతీయులు నివసించే కరమా ప్రాంతంలో బుధవారం రాత్రి ప్రవాసాంధ్ర క్రైస్తవ ప్రముఖుడు సామ్యూల్ రత్నం ఆధ్వర్యంలో కొందరు క్రైస్తవులు కెరం కసరత్తు నిర్వహించారు. ఫెయిత్ ఫుల్ గోస్పెల్ కరమా చర్చి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సామ్యూల్ రత్నంతో పాటు పాస్టర్ సరెళ్ళ యేసు, సిస్టర్ మేరి జ్యోతి తదితరులు ఇందులో పాల్గొన్నారు. అంతకు ముందు కూడా సామ్యూల్ అరేబియా సముద్రంలో సామ్రాట్ అనే విహార నౌకలో ముందస్తు క్రిస్మస్ సంబరాన్ని నిర్వహించగా అందులో దుబాయిలోని ప్రవాసీ ప్రముఖులతో పాటు ఆంధ్రప్రదేశ్ నీటివనరుల మంత్రి నిమ్మల రామనాయుడు. తెలుగు దేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు టీ.డీ.జనార్థన్‌లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. డాక్టర్ నోవా (చీరాల) పాస్టర్ కె. సుదర్శన్, పాస్టర్ సెల్వరాజు, ఆశోక్ కుమార్‌లు యేసు బోధనల గురించి వివరించారు. సిస్టర్ ఎస్తేర్ సారథ్యంలో అరవింద్ వుడ్స్ బృందం సంగీతాన్ని ఆలపించింది. క్రైస్తవ ప్రముఖులతో పాటు దుబాయిలోని వాసురెడ్డి, నిరంజన్, ఇతర తెలుగు దేశం పార్టీ నాయకులందరూ పాల్గొన్నారు. ఆబుధాబి, షార్జా, రాస్ అల్ ఖైమాలలో క్రిస్మస్ ఉత్సవాలు జరిగాయి.


సౌదీ అరేబియాలో
సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని భారతీయ ఎంబసీ సౌజన్యంతో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలలో తెలుగు ప్రవాసీ ప్రముఖుడు రేవల్ అంథోని సమన్వయకర్తగా వ్యవహరించగా వివిధ ఏర్పాట్లను సతీష్ డేవిడ్ పర్యవేక్షించారు. ప్రతి సంవత్సరం తరహాలో ఈ సారి కూడా తెలుగు క్రైస్తవుల కొరకు ప్రత్యేకంగా శుక్రవారం ప్రముఖ తెలుగు ప్రవాసీ సంఘం సాటా సెంట్రల్ ఆధ్వర్యంలో క్రిస్మస్ ఉత్సవాలను నిర్వహించనున్నారు. నగరంలోని అన్ని చర్చిల సహాయంతో దీన్ని నిర్వహిస్తున్నట్లుగా సాటా సెంట్రల్ ప్రతినిధులు ఎర్రన్న, ముజ్జమ్మీల్ శేఖ్, ఆనంద్ పోకూరిలు తెలిపారు.
జెద్ధా నగరంలో జి.టి.సి తెలుగు చర్చి పాస్టర్ హనూక్ అభినయ్ ఆధ్వర్యంలో యాన్బూ పారిశ్రామిక పట్టణంలో పాస్టర్ సతీష్ నాయకత్వంలో, రాబిఖ్ పట్టణంలో కూడా తెలుగు ప్రవాసీయులు క్రిస్మస్ ఉత్సవాలను జరుపుకొన్నారు.


బహ్రెయిన్ లో
బహ్రెయిన్‌లో తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో బుధవారం రాత్రి అంగరంగ వైభంగా క్రిస్మస్ వేడుకలు జరిగాయి. రెవ. శ్యాం సునీల్, పాస్టర్ డాక్టర్ బ్లెయినె న్యూహౌజ ముఖ్యవక్తలుగా ప్రసంగించారు.
తెలుగు చర్చి గ్రూప్ పక్షాన ఆశా విజయరామరాజు, క్రైస్తు సంఘం పక్షాన చంద్రబాబు, స్వాతిలు సేవలందించగా శాంతి భూషణ్, గంగసాయి, రమణ, డాక్టర్ జచింత లైమోన్, జార్జి వివిధ కార్యక్రమాల సమన్వయం చేయగా ఆశా రామరాజు, కావ్య సంతోష్, ఆర్తి లైమోన్, జోయిసీ జోయిల్ మొత్తం కార్యక్రమాన్ని నిర్వహించారు.
భవిష్య, తన్మయి, వినీల నృత్య ప్రదర్శనలు కూడా సభికులను ఆలరింపజేసాయి.


ఈ వార్తలు కూడా చదవండి..
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు