Share News

World Patient Safety Day: పసికందుల భద్రత తల్లితండ్రుల చేతుల్లో

ABN , Publish Date - Sep 16 , 2025 | 02:38 AM

ప్రతి ఏటా సెప్టెంబరు 17న, ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ రోగుల భద్రతా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నేతృత్వంలో అన్ని ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో రోగి భద్రత ప్రాముఖ్యతను...

World Patient Safety Day: పసికందుల భద్రత తల్లితండ్రుల చేతుల్లో

సెప్టెంబరు 17 ప్రపంచ రోగుల భద్రతా దినోత్సవం

ప్రతి ఏటా సెప్టెంబరు 17న, ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ రోగుల భద్రతా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నేతృత్వంలో అన్ని ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో రోగి భద్రత ప్రాముఖ్యతను తెలియజెప్పడం కోసం ఈ ప్రయత్నానికి పూనుకుంటూ ఉంటారు. ‘‘నవజాత శిశువు, బిడ్డల సంరక్షణ’’ ఈ ఏడాది థీమ్‌. వైద్య పరిసరాల్లో పిల్లల భద్రత, హక్కుల పట్ల అత్యవసర శ్రద్ధ వహించడమే ఈ థీమ్‌ లక్ష్యం.

ఎదిగే క్రమంలో పిల్లల అవసరాలు భిన్నంగా ఉంటాయి. వారి శరీరంలో చోటుచేసుకునే మార్పులు కూడా భిన్నంగా ఉంటాయి. ిపిల్లల భావవ్యక్తీకరణ సంక్లిష్టంగా ఉంటుంది. అయితే వీటన్నిటి పట్ల శ్రద్ధ కనబరుస్తూ, పసికందుల ఆరోగ్యాన్ని కాపాడుకునేలా నడుచుకోవడం తల్లితండ్రుల బాధ్యత. ప్రసవం మొదలు, ఆరోగ్యకరమైన నవజాత శిశువుతో ఇంటికి చేరుకునే వరకూ అనేక జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. తీసుకోవలసిన జాగ్రత్తల్లో ఏ చిన్న తప్పు జరిగినా, లక్షణాలను అశ్రద్ధ చేసినా, మందుల మోతాదు క్రమం తప్పినా పిల్లలు దీర్ఘకాలపు పర్యవసానాలను ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి ప్రత్యేకించి నవజాత శిశువులు, పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచడం అవసరం. ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది పిల్లలు, నియంత్రించే వీలున్న వైద్యపరమైన తప్పిదాల బారిన పడుతున్నారు. నియోనాటల్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో ఉన్న నెలలు నిండకుండా పుట్టిన పిల్లలకు బహుళ మందులు, ఫీడింగ్‌ సపోర్ట్‌, శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే పరికరాలు, నిరంతర పర్యవేక్షణలు అవసరవుతాయి. వీటిలో ఏ ఒక్క అంశంలో తప్పిదం జరిగినా బిడ్డ ప్రాణాలకే ప్రమాదం వాటిల్లుతుంది. కాబట్టి నవజాత శిశువుల భద్రత విషయంలో పూర్తిగా యంత్రాల మీదే ఆధారపడకుండా, అనుభవజ్ఞులైన నిపుణులను ఎంచుకోవడం కూడా అవసరమే!


సురక్షితమైన ప్రసవం కోసం...

ప్రసవమైన తొలి 28 రోజులు ఎంతో కీలకమైనవి కాబట్టి నిపుణులైన ప్రసూతి వైద్యులతో పాటు ప్రసవ సహాయకులను ఎంచుకోవడమూ అవసరమే! పరిశుభ్రమైన ప్రసవ పరిస్థితులు, నియోనాటల్‌ కేర్‌ అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. అలాగే...

బరువును బట్టి మోతాదు: పసికందులకు ఇచ్చే మందులు వారి బరువు ఆధారంగా అంచనా వేయాలి. పసిపిల్లలకు పొంచి ఉండే ప్రమాదాల్లో మందుల మోతాదు ప్రధానమైనది.

కమ్యూనికేషన్‌: ఆరోగ్య సంరక్షకులు, కుటుంబాల మధ్య సంభాషణ స్పష్టంగా సాగాలి. కుటుంబ సభ్యులు తమకు నచ్చని అంశాన్ని సూటిగా ప్రశ్నించి సంతృప్తికరమైన సమాధానం రాబట్టాలి.

ఇన్‌ఫెక్షన్లు: చేతులు శుభ్రం చేసుకోవడం, పరికరాలను స్టెరిలైజ్‌ చేయడం, ఆస్పత్రుల్లో మరీ ముఖ్యంగా పిల్లల వార్డుల్లో, ఎన్‌ఐసియుల్లో పరిసరాలను శుభ్రంగా ఉండేలా చూసుకోవడం వల్ల పిల్లలకు ప్రాణాంతక ఇన్‌ఫెక్షన్ల ముప్పు తప్పుతుంది.

తల్లితండ్రులు ఇలా నడుచుకోవాలి

  • బిడ్డకు అందించే మందుల పట్ల పూర్తి అవగాహన పెంచుకుని, వైద్యులతో ఒకటికి రెండుసార్లు చర్చించాలి

  • చికిత్స, వ్యాధినిర్థారణ గురించి వైద్యులను అడిగి అవగాహన పెంచుకోవాలి

  • బిడ్డకు సంబంధించిన ఏ ఒక్క లక్షణాన్నీ వైద్యుల నుంచి దాచకూడదు

  • బిడ్డ పరిపూర్ణ ఆరోగ్యానికి దోహపడే అంశాలన్నిటినీ వైద్యులను అడిగి తెలుసుకోవాలి.

డాక్టర్‌ సురేష్‌ కుమార్‌ పానుగంటి

సీనియర్‌ పీడియాట్రిషియన్‌,

యశోద హాస్పిటల్స్‌,

సోమాజిగూడ, హైదరాబాద్‌.

ఈ వార్తలు కూడా చదవండి..

మహిళలకు రాజకీయ అవకాశాలతోనే అభివృద్ధి సాధ్యం: గవర్నర్ అబ్దుల్ నజీర్

భూముల ఆక్రమణకు చెక్.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

For AP News And Telugu News

Updated Date - Sep 16 , 2025 | 02:39 AM