Share News

Harun India Art List 2025: కళా ప్రపంచంపై వారి ముద్ర

ABN , Publish Date - Dec 07 , 2025 | 05:33 AM

ఈ ఏడాది విడుదలైన ‘హరున్‌ ఇండియా ఆర్ట్‌ లిస్ట్‌ 2025’ జాబితాలో మునుపెన్నడూ లేని విధంగా ఏకంగా 17 మంది మహిళలు స్థానం సంపాదించి చరిత్ర సృష్టించారు. భారత ఆర్ట్‌ మార్కెట్‌ గతిని మార్చేస్తున్న ఈ....

Harun India Art List 2025: కళా ప్రపంచంపై వారి ముద్ర

ఈ ఏడాది విడుదలైన ‘హరున్‌ ఇండియా ఆర్ట్‌ లిస్ట్‌ 2025’ జాబితాలో మునుపెన్నడూ లేని విధంగా ఏకంగా 17 మంది మహిళలు స్థానం సంపాదించి చరిత్ర సృష్టించారు. భారత ఆర్ట్‌ మార్కెట్‌ గతిని మార్చేస్తున్న ఈ శుభపరిణామానికి గ్యాలరీలు, కళారాధకులు, వేలం సంస్థలు బ్రహ్మరథం పడుతున్నాయి. మహిళల సృజనకు, వారి విభిన్నమైన ఆలోచనా సరళికి ఎట్టకేలకు సరైన గుర్తింపు, ఆర్థిక విలువ లభిస్తున్నాయనడానికి ఇదే నిదర్శనం.

అగ్రపీఠంపై 85 ఏళ్ల మేధావి

ఈ మహిళా శక్తికి మకుటంగా నిలిచారు 85 ఏళ్ల దిగ్గజ కళాకారిణి, పద్మశ్రీ అవార్డు గ్రహీత అంజోలి ఎలా మేనన్‌. వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమేనని నిరూపిస్తూ ఆమె తన కళతో ఇప్పటికీ మార్కెట్‌ను శాసిస్తున్నారు. గడిచిన సంవత్సరంలో ఏకంగా రూ. 8.7 కోట్ల టర్నోవర్‌తో ఈ జాబితాలోని మహిళల్లో అగ్రస్థానాన్ని అధిష్టించారు. మొత్తం 32 కళాఖండాలు విక్రయించగా, అందులో ఒక చిత్రం గరిష్టంగా రూ. 1.4 కోట్లకు అమ్ముడు కావడం ఆమె కళకు ఉన్న డిమాండ్‌కు అద్దంపడుతోంది. దశాబ్దాలుగా తనదైన శైలితో కళాభిమానులను మంత్రముగ్ధులను చేస్తున్న మేనన్‌ విజయం నేటి యువ కళాకారులకు స్ఫూర్తిదాయకం.

ఒకరిద్దరు కాదు...

ఈ విజయం కేవలం ఒకరిద్దరిది కాదు. మేనన్‌ తర్వాత ఢిల్లీకి చెందిన సీనియర్‌ ఆరిస్ట్‌ అర్పితాసింగ్‌ (రూ. 5.7 కోట్లు), ముంబైకి చెందిన నళిని మలాని (రూ. 4.9 కోట్లు) వరుసగా రెండుమూడు స్థానాల్లో నిలిచి సత్తాచాటారు. ముఖ్యంగా అర్పితాసింగ్‌ గీసిన ఒక కళాఖండం రూ. 3.9 కోట్లకు అమ్ముడై రికార్డు సృష్టించింది. టాప్‌-10 జాబితాను పరిశీలిస్తే మహిళల ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తుంది. జయశ్రీ బర్మన్‌ (రూ.4.3 కోట్లు), భారతీ ఖేర్‌ (రూ.4 కోట్లు) వంటి ప్రముఖులతోపాటు మాధ్వి పరేఖ్‌, అర్పణాకౌర్‌, శోభా బ్రూటా, సెలియాపాల్‌, అంజు దోడియా వంటి ప్రతిభావంతులు కోటి రూపాయలకుపైగా టర్నోవర్‌తో ఈ జాబితాలో సగర్వంగా నిలిచారు.

22-navya.jpg

మారిన దృక్పథం.. పెరిగిన ఆదరణ

ఒకప్పుడు పురుషాధిక్య రంగంగా భావించిన కళా ప్రపంచంలో ఈ మార్పు ఆకస్మికంగా వచ్చింది కాదు. ఎందరో మహిళలు తమ జీవితాలను కళకే అంకితం చేసి నిశ్శబ్దంగా తమ పని తాము చేసుకుపోయారు. వారి కళలోని లోతు, సామాజిక సృహ, ప్రత్యేక భావవ్యక్తీకరణ ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కళను కేవలం అలంకార వస్తువుగా కాకుండా, ఒక శక్తిమంతమైన ఆయుధంగా, పెట్టుబడిగా చూసే ధోరణి పెరగడంతో కళాకారిణుల కృతులకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. మొత్తం మీద హరున్‌ ఆర్ట్‌లిస్ట్‌ 2025 భారత కళారంగంలో ఒక కొత్త శకానికి నాంది పలికింది. అది కేవలం గణాంకాల నివేదిక కాదు. పట్టుదల, ప్రతిభ, సృజనాత్మకతతో కాన్వాసుపైనే కాదు, మార్కెట్‌లోనూ తమదైన ముద్రవేస్తున్న మహిళల విజయ పతాక.

ఈ వార్తలు కూడా చదవండి..

విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తాం: పవన్ కల్యాణ్

గిరిజనులకు జీవనోపాధి మార్గాలు పెంచాలి

Read Latest AP News and National News

Updated Date - Dec 07 , 2025 | 05:33 AM