Share News

Women Power: కరువును గెలిచి.. ఒక్కటై నిలిచి..

ABN , Publish Date - Jul 16 , 2025 | 02:26 AM

కరువును ఎదుర్కోవడం కోసం సంఘటితమైన మహిళలు చిన్న స్థాయిలో ప్రారంభించిన ముల్కనూరు మహిళా సహకార డెయిరీ... ఇప్పుడు 205 గ్రామాలకు చెందిన 23 వేల మంది సభ్యులతో రూ.125 కోట్ల...

Women Power: కరువును గెలిచి.. ఒక్కటై నిలిచి..

కరువును ఎదుర్కోవడం కోసం సంఘటితమైన మహిళలు చిన్న స్థాయిలో ప్రారంభించిన ముల్కనూరు మహిళా సహకార డెయిరీ... ఇప్పుడు 205 గ్రామాలకు చెందిన 23 వేల మంది సభ్యులతో రూ.125 కోట్ల టర్నోవర్‌ స్థాయికి చేరింది. 20కి పైగా ఉత్పత్తులతో రాష్ట్ర స్థాయికి విస్తరించిన ఈ డెయిరీ గ్రామీణ మహిళాశక్తికి ప్రతీకగా నిలుస్తోంది.

పాతికేళ్ల క్రితం... 1999లో హనుమకొండ (అప్పటి వరంగల్‌) జిల్లాలోని భీమదేవరపల్లి మండలం ముల్కనూరును, ఆ పరిసర ప్రాంతాలను తీవ్రమైన కరువు అతలాకుతలం చేసింది. ప్రజలు ఉపాధి కోసం వరంగల్‌కు వెళ్లవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ ఉన్న ఊర్లను వదిలి వెళ్లడానికి చాలామంది మహిళలు ఇష్టపడలేదు. ఈ నేపథ్యంలో... అక్కడక్కడ ఉన్న మహిళా సంఘాలు సంఘటితమయ్యాయి. ప్రతి ఇంట్లో గేదెలు ఉండడంతో పాల ఉత్పత్తులను జీవనోపాధిగా చేసుకోవాలని ముల్కనూరు, చంటయ్యపల్లి, రంగయ్యపల్లి గ్రామాలకు చెందిన మహిళలు నిర్ణయించుకున్నారు. 150 మంది మహిళలు కలిసి 2002లో ‘ముల్కనూరు మహిళా సహకార డెయిరీ’ని ఏర్పాటు చేశారు.


3 వేల లీటర్లతో మొదలై...

మొదట్లో మూడు గ్రామాల నుంచి రోజుకు మూడు వేల లీటర్ల పాల సేకరణలో ఈ డెయిరీ ప్రస్థానం మొదలయింది. ఆ పాలను వరంగల్‌ నగరానికి, ఇతర ప్రాంతాలకు సరఫరా చేసేవారు. ఆ పాల నాణ్యతపై వినియోగదారులకు నమ్మకం పెరిగింది. క్రమంగా వ్యాపారం కూడా పెరిగింది. దీంతో కొన్నేళ్ళ తరువాత ప్యాకెట్లలో పాల సరఫరా ద్వారా వ్యాపారాన్ని విస్తరించాలనే ఆలోచన కలిగింది. 25 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన పాల ఉత్పత్తుల ప్రాజెక్ట్‌ కోసం 2021లో డిల్లీలోని జాతీయ పాడి పరిశ్రమల అభివృద్ధి సంస్థ (ఎన్‌డీడీబీ)ను సంప్రదించారు. అయితే కనీసం లక్ష లీటర్ల సామర్థ్యం ఉంటేనే తాము డీపీఆర్‌ ఇస్తామని అధికారులు చెప్పారు. తాము గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన మహిళా సంఘాల ప్రతినిఽధులమంటూతమ పరిసర ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితుల గురించి సంఘం సభ్యులు చెప్పారు. దీంతో ఎన్‌డీడీబీ అధికారులు సానుకూలంగా స్పందించారు. ముల్కనూరుకు వచ్చి, పాల ఉత్పత్తిని, మహిళల ఆసక్తిని గమనించారు. వారు ఇచ్చిన డీపీఆర్‌కు అనుకూలంగా పరిసర ప్రాంతాల్లో ఉండే 74 గ్రామాల నుంచి మహిళలను సంఘంలో చేర్చుకున్నారు. ముల్కనూరు సమీపంలో ఎనిమిది ఎకరాలను కొనుగోలు చేయడంతో పాటు ప్లాంట్‌ ఏర్పాటుకు కావాల్సిన ఎక్వి్‌పమెంట్‌ కోసం రూ.3 కోట్లు డిపాజిట్‌ చేశారు. ఇలా సభ్యులు తమ వాటా ధనంతో పాటు కొంత అప్పు చేసి మరీ ఈ డెయిరీకి గట్టి పునాది వేశారు. వారి కృషితో 2022 ఆగస్టు 15న ముల్కనూరు పాల ఉత్పత్తులు మార్కెట్‌లోకి వచ్చాయి. దీంతో క్రమక్రమంగా డెయిరీ విస్తరించింది.

444sports.jpg

అన్నింటా ఆసరాగా...

గత 23 ఏళ్ల కాలంలో... 205 గ్రామాలకు చెందిన 23,045 మంది ఈ డెయిరీలో సభ్యులుగా చేరారు. రోజుకు 90 వేల నుంచి లక్షా 10 వేల లీటర్లవరకూ పాలు సేకరిస్తున్నారు. డెయిరీ టర్నోవర్‌ రూ.125 కోట్లకు చేరింది. ప్రతి నెలా సభ్యులకు పాల బిల్లుల కింద రూ.8 కోట్ల నుంచి రూ.14 కోట్ల వరకూ చెల్లిస్తున్నారు. డెయిరీలో ఉన్న 100 మంది ఉద్యోగులు ఇందులో సభ్యత్వం ఉన్న మహిళల పిల్లలే. మహిళా సభ్యుల భర్తలకు, కుటుంబ సభ్యులకు కూడా డెయిరీ అండగా నిలుస్తోంది. వివిధ అంశాల్లో సాయం చేస్తోంది. పశువులను పెంచుకోవాలనే ఆసక్తి ఉన్న మహిళలకు బ్యాంకు నుంచి రుణం ఇప్పించటంతో పాటు ఉచితంగా వైద్య చికిత్స కూడా డెయిరీ ద్వారానే అందిస్తున్నారు. అలాగే సగం ధరకు మందులు, పశువులకు ఉచితంగా బీమా, గ్రాసం అందిస్తూ... పశు సంపద పెరుగుదలను ప్రోత్సహిస్తున్నారు.


సారథ్యం మహిళలదే...

డెయిరీ సారఽథ్యం అంతా మహిళలదే. 205గ్రామాల్లో ప్రతి గ్రామంలో ఓ కమిటీని ఎన్నుకుంటారు. వాటికి ఇద్దరు ఉద్యోగులు ఉంటారు. ఈ 205 గ్రామాలను 12 బ్లాకులుగా విభజించారు. ఈ బ్లాకుల పరిధిలోని గ్రామాలకు చెందిన మహిళా సంఘాల అధ్యక్షులు కలిసి తమలో ఒకరిని డైరెక్టర్‌గా ఎన్నుకుంటారు. 12 బ్లాకులకు 12మంది డైరెక్టర్లను ఎన్నుకున్న తరువాత... వారిలో ఒకరిని అధ్యక్షురాలిగా ఎన్నుకుంటారు. ఎన్నిక ఏకగ్రీవం కాకపోతే అధ్యక్షులు, డైరెక్టక్ల ఎన్నికకు ఓటింగ్‌ జరుగుతుంది. అధ్యక్షురాలి పదవీకాలం నాలుగేళ్లు ఉంటుంది. అయితే తన గ్రామంలో ప్రతి ఏడాది అధ్యక్షురాలిగా ఎన్నిక కావటంతో పాటు తన బ్లాకులో డైరెక్టర్‌గా ఎన్నిక కావాల్సి ఉంది. అలాగైతేనే నాలుగేళ్లు అధ్యక్ష స్థానంలో ఉంటారు. లేదంటే మధ్యంతర ఎన్నికలు నిర్వహిస్తారు.

తడుక రాజనారాయణ

ఫొటోలు: వీరగోని హరీష్‌

44-sports.jpg

సంఘటిత శక్తికి నిదర్శనం...

ముల్కనూరు మహిళా సహకార డెయిరీ మహిళా రైతుల సంఘటిత శక్తికి నిదర్శనం. ఒక చిన్న గ్రామంలో మొదలైన పాల ఉత్పత్తుల వ్యాపారాన్ని తెలంగాణ మొత్తం విస్తరిస్తున్నాం. ప్రస్తుతం పూర్వ వరంగల్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, నల్గొండ, ఖమ్మం, మెదక్‌ జిల్లాల్లో మా ఉత్పత్తులకు డిమాండ్‌ ఉంది. ఇటీవలే హైదరాబాద్‌లో బోడుప్పల్‌, అల్వాల్‌ ప్రాంతాల్లో అవుట్‌లేట్లను ఏర్పాటు చేశాం. మరో ఐదారు చోట్ల ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. స్వచ్ఛమైన పాలతో పాల ప్యాకెట్లు, పెరుగు, మజ్జిగ, పన్నీరు, నెయ్యి, పాల పదార్థాలతో 20 రకాల స్వీట్లు, దూద్‌పేడ, మిల్క్‌ కేక్‌, బాసుంది, మ్యాంగో లస్సీ, స్వీట్‌ లస్సీ, బాదం పాలు, చాక్లెట్స్‌ తదితర ఉత్పత్తులను తయారు చేస్తున్నాం. త్వరలోనే ఆన్‌లైన్‌లో కూడా అందుబాటులోకి తీసుకువస్తున్నాం.

డెయిరీ అధ్యక్షురాలు బుర్ర ధనుశ్రీ


జాతీయస్థాయిలో పురస్కారాలు

గ్రామీణ మహిళల నేతృత్వంలో విజయవంతంగా సాగుతున్న ఈ డెయిరీ సేవలను గుర్తించి జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్‌సీడీసీ) 2012లో దీన్ని జాతీయ స్థాయి సహకార ఉత్తమ పురస్కారానికి ఎంపిక చేసింది. డిల్లీలో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని డెయిరీ ప్రతినిధులు అందుకున్నారు. అలాగే దేశంలో మహిళల నిర్వహణలోని మొదటి సహకార డెయిరీగా దీనికి గుర్తింపు లభించింది. జాతీయ పాడి పరిశ్రమల అభివృద్ధి సంస్థ (ఎన్‌డీడీబీ) నుంచి 2017 ఉత్తమ సహకార డెయిరీగా జాతీయ అవార్డును కూడా అందుకుంది.

ఇవి కూడా చదవండి..

శుభాంశు శుక్లా బృందాన్ని ఆసుపత్రికి తరలించిన నాసా..

భారత్, పాకిస్తాన్ యుద్ధంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 16 , 2025 | 02:27 AM