Share News

Winter Skin Care Tips: చలికి చర్మం చెక్కుచెదరకుండా

ABN , Publish Date - Dec 16 , 2025 | 05:36 AM

చలి... చర్మాన్ని ఇబ్బంది పెడుతుంది. మరీ ముఖ్యంగా పొడిచర్మం కలిగిన వాళ్లనూ, ముందు నుంచే చర్మ సమస్యలున్నవాళ్లనూ ఈ కాలం అసౌకర్యానికి లోను చేస్తుంది. కాబట్టి ఈ కాలంలో చర్మ రక్షణ చర్యలు తప్పనిసరి అంటున్నారు చర్మ వైద్యులు...

Winter Skin Care Tips: చలికి చర్మం చెక్కుచెదరకుండా

చలి... చర్మాన్ని ఇబ్బంది పెడుతుంది. మరీ ముఖ్యంగా పొడిచర్మం కలిగిన వాళ్లనూ, ముందు నుంచే చర్మ సమస్యలున్నవాళ్లనూ ఈ కాలం అసౌకర్యానికి లోను చేస్తుంది. కాబట్టి ఈ కాలంలో చర్మ రక్షణ చర్యలు తప్పనిసరి అంటున్నారు చర్మ వైద్యులు.

చలికాలంలో చర్మంలోని తేమ మొత్తం ఆవిరైపోయి పొడిబారిపోయి, చిట్లిపోతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా వాతావరణానికి బహిర్గతమయ్యే ముఖం, చేతులు, పాదాల్లో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. పిల్లలు, వృద్ధులు, చర్మ సమస్యలున్న వారికి ఈ కాలంలో ఇబ్బందులు మరింత ఎక్కువ. ముఖ్యంగా చలికాలం ప్రారంభంలో చల్లని వాతావరణానికి చర్మం సంసిద్ధంగా ఉండదు కాబట్టి సమస్యలు మరింత తీవ్రమవుతూ ఉంటాయి. అయితే చలి ప్రభావానికి చర్మం దెబ్బతినకుండా ఉండడం కోసం మనం కొన్ని జాగ్రత్తలు పాటించవచ్చు. అవేంటంటే...

కొబ్బరినూనె మర్దన: సాధారణంగా తలకు వాడుకునే కొబ్బరినూనె ఒంటికి పూసుకుని, చర్మంలోకి ఇంకుతుందనే ఆలోచనతో ఎండలో కూర్చుంటూ ఉంటాం. ఇలా చేయడం వల్ల చర్మం నల్లబడిపోతుంది. మంగు సమస్య తలెత్తుతుంది. కాబట్టి బదులుగా గోరువెచ్చని కోల్డ్‌ ప్రెస్‌డ్‌ కొబ్బరినూనెను ఒంటికి పూసుకుని, సున్నితంగా మర్దన చేసి, స్నానం చేయాలి. మొటిమలు తలెత్తే గుణం కలిగిన చర్మం ఉన్నవాళ్లు, కొబ్బరినూనె ముఖానికి పూసుకున్నప్పుడు మొటిమలు పెరిగే అవకాశం ఉంటుందనే విషయం గుర్తు పెట్టుకోవాలి.

స్నానం నీళ్లు: చలి వల్ల మసిలే నీళ్లతో స్నానం చేస్తూ ఉంటాం. కానీ ఇంత వేడికి చర్మంలోని తేమంతా పూర్తిగా ఆవిరైపోయి, మరింత పొడిబారిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి స్నానానికి గోరువెచ్చని నీళ్లే వాడుకోవాలి. మరీ చల్లని, మరీ వేడి నీళ్లు చర్మానికి చేటు చేస్తాయి జిడ్డు ఉండాలి: చర్మానికి పట్టించిన నూనె జిడ్డును వదిలించాలనే తాపత్రయంతో అవసరానికి మించి సబ్బును పట్టించకూడదు. ఇలా చేయడం వల్ల చర్మంలోని తేమ మొత్తం వదిలిపోయి, పొడిబారిపోతుంది. కాబట్టి స్నానానికి సున్నితమైన సబ్బులనే వాడుకోవాలి


1-navya.jpg

సబ్బు/బాడీవాష్‌: ఈ రెండింట్లో ఏదైనా వాడుకోవచ్చు. అయితే సబ్బు పిహెచ్‌ 5.5 ఉండేలా చూసుకోవాలి. చర్మంలోని తేమను పట్టి ఉంచే ఎన్‌ఎమ్‌హెచ్‌ ఫ్యాక్టర్‌ ఎక్కువగా ఉండే గ్లిసరిన్‌, ఓట్‌మీల్‌, అలొవేరా సబ్బులను వాడుకోవాలి. ప్రత్యేకించి గంధం ఆధారిత సబ్బులు ఈ కాలంలో వాడుకోకూడదు. సబ్బు వాడిన తర్వాత చర్మం మీద తెల్లని పొర ఏర్పడితే, ఆ సబ్బు వాడకూడదని అర్థం. ఈ కాలంలో సున్నితమైన జిండెట్‌ సబ్బులు వాడుకోవాలి. సాధారణంగా బాడీవాష్‌ పిహెచ్‌ 5.5 ఉంటుంది కాబట్టి ఈ కాలంలో వీటిని నిరభ్యంతరంగా వాడుకోవచ్చు

స్నానం ఎంత సేపు: ఐదు నుంచి పది నిమిషాల్లో స్నానం ముగించాలి. సమయం పెరిగేకొద్దీ చర్మంలోని తేమ అడుగంటిపోతూ ఉంటుంది. పొడిచర్మం కలిగిన వాళ్లు ఐదు నిమిషాల్లోపే స్నానం ముగించాలి

స్నానం తర్వాత: టవల్‌తో చర్మాన్ని రుద్దేసుకోకుండా, అద్దుకుని తుడుచుకోవాలి. చర్మం మీద తడి మొత్తం తొలగించే ప్రయత్నం చేయకుండా, కొంత తేమ మిగుల్చుకుని, వెంటనే మాయిశ్చరైజర్‌ పూసుకోవాలి. దాంతో చర్మం మీద మిగిలిన నీరు, మాయిశ్చరైజర్‌ రెండూ చర్మంలోకి ఇంకిపోతాయి

మాయిశ్చరైజర్‌ ప్రభావాన్ని బట్టి...

వీటిలో అక్లూజివ్స్‌, ఎమోలియంట్స్‌, హ్యూమెక్టెంట్స్‌ అనే రకాలుంటాయి. వీటి స్వభావాల ఆధారంగా చర్మ తత్వాన్ని బట్టి తగిన మాయిశ్చరైజర్‌ను ఎంచుకోవాలి.

అక్లూజివ్‌: ఈ మాయిశ్చరైజర్లు చిక్కగా ఉంటాయి. కాబట్టి వీటిని పూసుకున్నప్పుడు చర్మం మీద ఒక పొర ఏర్పడి, చర్మంలోని తేమ ఆవిరైపోకుండా ఉంటుంది. మరీ ముఖ్యంగా పొడిచర్మం కలిగిన వారికి ఈ మాయిశ్చరైజర్‌ ప్రయోజనకరంగా ఉంటుంది. కార్నబా వ్యాక్స్‌, లనోలిన్‌, ఆలివ్‌ ఆయిల్‌, పెట్రోలేటమ్‌, సిలికాన్‌తో తయారయ్యే మాయిశ్చరైజర్లు ఈ కోవకు చెందినవే!

హ్యూమెక్టెంట్‌: నీటిని పీల్చి, చర్మం లోపలి పొర ఎపిడెర్మిస్‌ నుంచి నీటిని సంగ్రహించి చర్మాన్ని తేమగా ఉంచుతుంది. గ్లిసరిన్‌, ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్‌, హైల్యురోనిక్‌ యాసిడ్‌, సార్బిటాల్‌, యూరియా ఆధారిత మాయిశ్చరైజర్లు ఈ కోవకు చెందినవే!

ఎమోలియంట్‌: చర్మం మీద పగుళ్లను కార్నియోసైట్స్‌తో నింపి చర్మాన్ని నునుపుగా మారుస్తుంది. సెరమైడ్‌, కొల్లాజెన్‌, కొల్లాయిడల్‌ ఓట్‌మీల్‌, ఎలాస్టిన్‌, గ్లైసెరాల్‌ స్టెరేట్‌, ఐసొప్రొపైల్‌ పాల్మిటేట్‌, షియా బటర్‌, స్టెరియ్‌ యాసిడ్‌ మాయిశ్చరైజర్లు ఈ కోవకు చెందినవే!

22-navya.jpg


జిడ్డు చర్మం ఉంటే?

జిడ్డు చర్మం కాబట్టి మాయిశ్చరైజర్‌ అవసరం లేదనుకుంటే పొరపాటు. ఎలాంటి చర్మానికైనా కచ్చితంగా మాయిశ్చరైజర్‌ అవసరమే! అయితే చర్మ తత్వాన్ని బట్టి మాయిశ్చరైజర్‌ రకం కూడా మారుతుంది. కాబట్టి తగినది ఎంచుకోవాలి. జిడ్డు చర్మం కలిగిన వాళ్లు చిక్కని మాయిశ్చరైజర్‌కు బదులుగా తక్కువ నూనె కలిగిన నీటి ఆధారిత మాయిశ్చరైజర్‌ ఎంచుకోవాలి. పొడిచర్మం కలిగిన వాళ్లు నూనె ఎక్కువ, నీరు తక్కువగా ఉండే మాయిశ్చరైజర్‌ ఎంచుకోవాలి. అలాగే క్రీమ్‌, ఆయింట్‌మెంట్‌ ఆధారిత మాయిశ్చరైజర్లను పొడిచర్మం కలిగిన వాళ్లు, లోషన్‌ ఆధారిత మాయిశ్చరైజర్‌ను జిడ్డు చర్మం కలిగినవాళ్లు వాడుకోవాలి. ఆకర్షణీయమైన ప్యాకింగ్‌, సువాసనలను బట్టి మాయిశ్చరైజర్లను ఎంచుకోకూడదు. జిడ్డు చర్మం కలిగిన వాళ్లు, ప్యాక్‌ మీద నాన్‌ కొమడోజెనిక్‌ అనే లేబుల్‌ కోసం వెతుక్కోవాలి. యూరియా ఆధారిత మాయిశ్చరైజర్లను ప్రధానంగా పాదాలకే వాడుకోవాలి. తీవ్రమైన పొడిచర్మం కలిగిన వాళ్లు మొదట అక్లూజివ్‌, తర్వాత ఎమోలియెంట్‌.. ఈ రెండు రకాల మాయిశ్చరైజర్లనూ కలిపి వాడుకోవాలి. అలాగే రోజులో పలుసార్లు అప్లై చేసుకుంటూ ఉండాలి.

చిట్కాలు శ్రేయస్కరమేనా?

అలొవెరా: ఇది చర్మం తేమను పెంచే మాట వాస్తవమే అయినా. ప్రత్యేకించి చలి కాలంలో దీని మీదే ఆధారపడడం సరి కాదు. చర్మంలోని తేమను నిలిపి ఉంచే సామర్థ్యం కలబందకు ఉండదు కాబట్టి ఈ కాలంలో అప్పటికప్పుడు తయారుచేసుకుని, లేదా ఫ్రిజ్‌లో నిల్వ చేసుకుని ముఖానికి పట్టించే కలబందతో సరిపెట్టుకోకుండా, అదనంగా నాణ్యమైన మాయిశ్చరైజర్‌ కూడా వాడుకోవాలి

గ్లిజరిన్‌: గ్లిజరిన్‌ నీటిని పీల్చుకునే తత్వం కలిగి ఉంటుంది. చలికాలంలో గాల్లో తేమ లేనప్పుడు, గ్లిజరిన్‌ చర్మంలోని తేమను పీల్చుకునే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి పొడి ప్రదేశాల్లో నివసించేవాళ్లు చలికాలం గ్లిజరిన్‌ను వాడుకోకపోవడమే మంచిది.

హైల్యురోనిక్‌ యాసిడ్‌: ఈ సీరమ్‌ను ఎవరికి వారు కొని వాడుకునే ధోరణి పెరిగింది. అయితే వీటిలో కూడా రకాలుంటాయి. తక్కువ మాలిక్యులర్‌ వెయిట్‌ ఉన్న సీరమ్స్‌ చర్మంలోని పైపొరకు మాత్రమే తేమను అందిస్తాయి. కాబట్టి ఈ కోవకు చెందిన సీరమ్స్‌ కూడా చలికాలానికి సరిపోవు. వీటికి అదనంగా మాయిశ్చరైజర్లు కూడా వాడుకోవాలి


ఈ లక్షణాలను గమనిస్తూ...

  • స్నానం చేసిన తర్వాత, చర్మం మీద తెల్లని పొర ఏర్పడడం

  • చల్లగాలికి బహిర్గతమైనప్పుడు, చర్మం చిటపటమనడం

  • మంట, దురద

  • గోకినప్పుడు చర్మం చిట్లి నీరు కారడం

  • ముడతలు పెరగడం

  • పొట్టు రాలడం

మాయిశ్చరైజర్‌

మాత్రలు

తీవ్రమైన పొడిచర్మం కలిగిన వాళ్లకు ఇప్పుడు ఓరల్‌ మాయిశ్చరైజర్లు కూడా అందుబాటులోకొచ్చాయి. ప్రత్యేకించి చలికాలంలో మాత్రల రూపంలోని ఈ మాయిశ్చరైజర్లను వాడుకోవాలి.

ఎన్నిసార్లు?

చలికాలం ఉదయం, రాత్రి.. రెండుసార్లు మాయిశ్చరైజర్‌ వాడితే సరిపోదు. స్నానం చేసిన వెంటనే ఒంటి మీద తడి ఆరేలోగా మాయిశ్చరైజర్‌ పట్టించాలి. అలాగే అవసరాన్ని బట్టి మాయిశ్చరైజర్‌ను ఎన్నిసార్లైనా అప్లై చేసుకోవచ్చు. తీవ్రమైన పొడిచర్మం కలిగిన వాళ్లు, ఎక్కువగా పొడిబారిపోయే శరీర భాగాల్లో రోజుకు పదిసార్లు మాయిశ్చరైజర్‌ అప్లై చేసుకోవచ్చు.

షవర్‌ ఆయిల్స్‌

స్నానానికి ముందు నూనె పట్టించే అవసరం లేకుండా లిక్విడ్‌ సోప్‌లోనే నూనెలు కూడా కలిసి ఉంటాయి. వీటితో సమయం కలిసొస్తుంది. చర్మానికి తగిన తేమ కూడా దక్కుతుంది.

కాలానికి తగినట్టు

రెటినాల్స్‌, సాల్సిలిక్‌ యాసిడ్స్‌, మొటిమల క్రీమ్స్‌ వాడుకుంటున్న వాళ్లు ఈ కాలంలో ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ చర్మాన్ని మరింత పొడిబారుస్తాయి. కాబట్టి చలికాలంలో చర్మ వైద్యులను సంప్రతించి, చలికాలానికి తగిన వాటిని ఎంచుకోవాలి.

డాక్టర్‌ స్వప్న ప్రియ

డెర్మటాలజిస్ట్‌,

కాస్మోస్యూర్‌, హైదరాబాద్‌

ఈ వార్తలు కూడా చదవండి..

బయటపడ్డ అమ్మవారి విగ్రహం.. ప్రత్యేక పూజలు

వైసీపీ బైక్ ర్యాలీ.. రెండు వర్గాల మధ్య ఘర్షణ..

For More AP News And Telugu News

Updated Date - Dec 16 , 2025 | 05:38 AM