అభిరుచే ఆశయంగా
ABN , Publish Date - Mar 12 , 2025 | 06:10 AM
అందుకు నిలువెత్తు సాక్ష్యం సురభి బన్సాల్. ఊహ తెలిసినప్పటి నుంచీ చక్రాల కుర్చీలో నుంచే ప్రపంచాన్ని చూసినా... ఆ ప్రభావాన్ని తన జీవితం మీద పడనివ్వలేదు...
సంకల్పం
సంకల్ప బలం దేన్నయినా జయించగలదు... ఎంతటి లక్ష్యాన్నయినా... వైకల్యాన్ని అయినా!
అందుకు నిలువెత్తు సాక్ష్యం సురభి బన్సాల్. ఊహ తెలిసినప్పటి నుంచీ చక్రాల కుర్చీలో నుంచే ప్రపంచాన్ని చూసినా... ఆ ప్రభావాన్ని తన జీవితం మీద పడనివ్వలేదు. ఉన్నత విద్యతో కార్పొరేట్ కొలువులు సంపాదించిన ఆమె... మోటివేషనల్ స్పీకర్‌గా, యూట్యూబర్‌గా తనకంటూ ఓ ప్రత్యేకతను తరించుకొంది. అన్నిటికీ మించి మించి... సవాళ్లెన్నిటినో అధిగమించి... నాట్యంతో అందరినీ మైమరిపిస్తోంది. ఎందరికో ప్రేరణనిస్తోంది.
‘‘మన జీవితం మన చేతుల్లోనే ఉంటుందనేది నా నమ్మకం. అందుకే దాన్ని అందంగా, విజయవంతంగా తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. ముంబయిలోని సాధారణ మధ్యతరగతి కుటుంబం మాది. పుట్టుకతోనే సెరెబ్రల్ పాల్సీ (మెదడు పక్షవాతం) ఉందని వైద్యులు తేల్చారు. ఇది ఎదుగుదల మీద, మానసిక, శారీరక కదలికల మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. ఊహ తెలిసినప్పటి నుంచీ చక్రాల కుర్చీలోనే నా ప్రయాణం. చుట్టుపక్కల పిల్లలతో కలిసి ఆడుకోవాలని, పరుగెత్తుతూ గంతులేస్తూ బాల్యాన్ని ఆస్వాదించాలని... నెరవేరవని తెలిసినా ఎన్నో కలలు. కాస్త పెద్దయ్యాక నా గురించి నాకు పూర్తి అవగాహన వచ్చింది. ఇక అప్పటి నుంచి బాధను పక్కకు నెట్టి... వైకల్యాన్ని మరిచి అడుగు ముందుకు వేశాను. నేను ఎవరికీ తక్కువ కాదని నాకు నేను ధైర్యం చెప్పుకొని, నాకంటూ ఒక కెరీర్‌ను నిర్మించుకోవాలని నిర్ణయించుకున్నాను. ఎదురైన సవాళ్లను నా అభివృద్ధికి అవకాశాలుగా మలుచుకున్నాను. దృఢ సంకల్పంతో, అచంచలమైన స్ఫూర్తితో నన్ను నేను నిరూపించుకొనేందుకు పోరాటం మొదలుపెట్టాను.
టాప్ కంపెనీల్లో కొలువు...
నా ప్రతి అడుగులో మా అమ్మానాన్న అండగా నిలిచారు. ఏది కావాలంటే అది సమకూర్చారు. వారి ప్రోత్సాహంతోనే నేను పాఠశాలకు వెళ్లి చదువుకున్నాను. అందరితో పోటీపడి మంచి మార్కులు తెచ్చుకున్నాను. ఉన్నత చదువులు కొనసాగించగలిగాను. ముంబయి ‘ఠాకూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ అండ్ రీసెర్చ్’ నుంచి 2006లో ఎంబీయే ఫైనాన్స్ పూర్తి చేశాను. వెంటనే ‘జేపీ ఎంటర్‌ప్రైజె్‌స’లో ఎగ్జిక్యూటివ్‌గా చేరాను. అదే నా తొలి ఉద్యోగం. దాదాపు మూడేళ్లు అక్కడ పని చేశాక ‘మెట్రోపాలిటన్ స్టాక్ ఎక్స్‌చేంజ్ ఆఫ్ ఇండియా’లో అసిస్టెంట్ మేనేజర్‌గా అవకాశం లభించింది. ఏడేళ్లకు పైగా అక్కడి మెంబర్‌షిప్, ఇన్‌స్పెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో విధులు నిర్వర్తించాను. అందులో పని చేస్తుండగానే, 2016లో ప్రముఖ కంపెనీ ‘మోర్గాన్ స్టాన్లే’ నుంచి పిలుపు వచ్చింది... మేనేజర్‌గా. మరో ఏడేళ్లు ఆ సంస్థలో గడిచిపోయాయి. టాప్ కంపెనీల్లో వివిధ విభాగాల్లో పని చేయడంవల్ల వ్యాపార, ఆర్థిక లావాదేవీల మీద పట్టు లభించింది.
ఎవరేమన్నా...
దాదాపు పద్ధెనిమిదేళ్ల ఉద్యోగ జీవితంలో ఎన్నో సవాళ్లు, సమస్యలు. నా సామర్థ్యాన్ని కాకుండా నా వైకల్యాన్ని చూసి కుంగదీసే మాటలు. ఎవరేమన్నా... ఎంతటి అవమానాలు ఎదరైనా దృఢ చిత్తంతో అన్నిటినీ అధిగమించాను. ప్రతికూల పరిస్థితులను సైతం అనుకూలంగా మలుచుకున్నాను. ఉద్యోగంతోనే సరిపెట్టుకోకుండా నలుగురిలో నన్ను నేను భిన్నంగా నిలుపుకొనే ప్రయత్నం కూడా చేస్తూ వచ్చాను. అదే ఇవాళ నన్ను ఈ ప్రపంచానికి గొప్పగా పరిచయం చేయడానికి దోహదపడింది.
లక్ష్యం వైపు నడిపిస్తూ...
ఒక వైపు ఉద్యోగానికి వెళుతూనే ఖాళీ సమయాల్లో వివిధ సర్టిఫికెట్ కోర్సులు చేశాను. లైఫ్ కోచ్‌గా యువతను లక్ష్యం దిశగా నడిపించాను. మోటివేషన్ స్పీకర్‌గా తోటి మహిళల సాధికారతకు తోడ్పాటు అందిస్తున్నాను. మానసికంగా కుంగిపోయినవారికి మనోధైర్యం ఇస్తూ, కార్యోన్ముఖులను చేస్తున్నాను. నా అనుభవం, నాకున్న విజ్ఞానాన్ని పంచుతూ ఒక మార్గదర్శకురాలిగానే కాకుండా ఒక స్నేహితురాలిగా కూడా యువతరంలో స్ఫూర్తి నింపుతున్నాను.
నాట్యం నా అభిరుచి...
చిన్నప్పటి నుంచీ నాకు నాట్యం అంటే ఎంతో ఇష్టం. నర్తకిగా ప్రశంసలు పొందాలనేది నా బలమైన ఆకాంక్ష. నేను తిరిగేది చక్రాల కుర్చీలోనే. శారీరకంగా నా కదలికలకు కొన్ని పరిమితులున్నాయని తెలుసు. కానీ వాటిని దాటి అనుకున్నది సాధిస్తేనే కదా... మనమేంటో ప్రపంచానికి తెలిసేది. అందుకే నాకు అత్యంత ఇష్టమైన నాట్యం నేర్చుకోవాలని నిశ్చయించుకున్నాను. దాని కోసం నా ఉద్యోగం వదిలేశాను. పూర్తి సమయం కథక్ అభ్యాసానికి కేటాయించాను. కథక్‌లో తొలి అంకం పూర్తి చేశాను. ‘భావ్ నృత్య’ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాను. నా శరీరం ఇప్పుడు లయబద్దంగా కదులుతుంది. ఇదేకాకుండా బాలీవుడ్ పాటలకు కూడా నాదైన శైలిలో నాట్యం చేస్తున్నాను.
రికార్డులూ ఉన్నాయి...
నాట్యం నా అభిరుచి మాత్రమే కాదు... నా హృదయ స్పందన కూడా. నాలోని భావాలను పలికించే ఒక ప్రక్రియ. నాట్యానికి సరిహద్దులు లేవు. నా దృష్టిలో ఇది ఒకరిలో చైతన్యం రగిలించగలదు. కొన్ని రియాలిటీ షోస్‌లో, మరికొన్ని వేదికలపై ప్రదర్శనలు ఇచ్చాను. కళ పట్ల నాకున్న అంకితభావానికి గుర్తుగా ‘హార్వార్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో నా పేరు నమోదైంది. కొన్ని ప్రముఖ సంస్థల నుంచి అవార్డులు, అభినందనలు అందుకున్నాను. నాలాంటివారిలో, యువతరంలో స్ఫూర్తిని నింపే ఉద్దేశంతో యూట్యూబ్ చానల్ కూడా ప్రారంభించాను. నా డ్యాన్స్ వీడియోలను అందులో పోస్ట్ చేస్తున్నాను. ‘మీ ప్రయాణం నాకు ప్రేరణ కలిగిస్తోంది’ అంటూ కామెంట్లు చదివినప్పుడు నా మనసు ఆనందంతో ఉప్పొంగుతుంది. గర్వంగానూ ఉంటుంది.’’
మరిన్నీ తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: వైసీపీ భూ కుంభకోణాన్ని ఎండగట్టిన ఎంపీ
Also Read: నా చేతిలో కత్తి పెట్టి..
Also Read: అందంగా ఉందని ప్రియురాలిని చంపేశాడు..
For AndhraPradesh News And Telugu News