Share News

Venkateshan Krithika: ఆశయం సమున్నతం

ABN , Publish Date - Jul 07 , 2025 | 04:36 AM

ఆశయం సమున్నతం క్రికెట్‌లో అంపైరింగ్‌ అనగానే మనకు వెంటనే గుర్తుకువచ్చేది మగవారే. కానీ ఇప్పుడిప్పుడే ఆడవారు కూడా ఆ పాత్రలోకి ఒదిగిపోతున్నారు. కేవలం మహిళల మ్యాచ్‌లకే పరిమితం...

Venkateshan Krithika: ఆశయం సమున్నతం

స్ఫూర్తి

ఆశయం సమున్నతం క్రికెట్‌లో అంపైరింగ్‌ అనగానే మనకు వెంటనే గుర్తుకువచ్చేది మగవారే. కానీ ఇప్పుడిప్పుడే ఆడవారు కూడా ఆ పాత్రలోకి ఒదిగిపోతున్నారు. కేవలం మహిళల మ్యాచ్‌లకే పరిమితం కాకుండా... పురుషుల ఆటకు కూడా అంపైరింగ్‌ చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. అలాంటి ఔత్సాహికుల్లో ఒకరు... వెంకటేశన్‌ కృతిక. చెన్నైకు చెందిన ఆమె... ఇటీవల క్రికెటర్‌ అశ్విన్‌ వివాదంతో వార్తల్లో వ్యక్తి అయ్యారు. అంపైర్లుగా అంతర్జాతీయ క్రికెట్‌లో తమదైన ముద్ర వేసిన బృందా రతి, గాయత్రి వేణుగోపాలన్‌ స్ఫూర్తితో అడుగులు వేస్తున్న కృతిక జర్నీ ఇది.

క్రికెట్‌ అంటే కృతికకు చిన్నప్పటి నుంచీ చాలా ఇష్టం. బ్యాటింగ్‌, బౌలింగ్‌... రెండింటిలో ఆమెకు మంచి ప్రవేశం ఉంది. తమిళనాడు మహిళల జట్టు తరపున ఎన్నో మ్యాచ్‌లు ఆడారు. ఆటకు సంబంధించిన ప్రతి అంశాన్నీ కూలంకషంగా పరిశీలించడమే కాదు... చక్కగా వివరించగలగడం ఆమె ప్రత్యేకత. మహిళల టీ20 లీగ్‌ మ్యాచ్‌లకు వ్యాఖ్యాతగా ఆమె అందరికీ సుపరిచితురాలు. తమిళనాట నిర్వహించిన పురుషుల టీ20 సహా పలు ఇతర మ్యాచ్‌లకూ అంపైర్‌గా వ్యవహరించారు. నైపుణ్యం ఉన్న క్రీడాకారిణులను గుర్తించే టాలెంట్‌ స్కౌట్‌గా కూడా పని చేశారు. 2023 మహిళల ప్రీమియర్‌ లీగ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టుకు క్రీడాకారిణులను ఎంపిక చేయడంలో ప్రముఖ పాత్ర పోషించారు. గత ఏడాది తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌ మ్యాచ్‌కు రిజర్వ్‌ అంపైర్‌గా వ్యవహరించారు. ఈ క్రమంలో ఆమె ఎన్నో ఒదుదొడుకులను ఎదుర్కొన్నారు. ‘ఆడవారికైనా... మగవారికైనా అంపైరింగ్‌ అనేది ఒకేలా ఉంటుంది. నియమ నిబంధనల్లో తేడా ఉండదు. అంపైరింగ్‌లో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొన్ని మ్యాచ్‌లు చాలా గంభీరంగా ఉంటాయి. కొన్ని అహ్లాదకరంగా సాగిపోతుంటాయి. ఆట తీరు ఎలా ఉన్నా అంపైర్‌ మాత్రం స్థిరంగా ఉండాల్సిందే’’ అంటారు కృతిక.


కుటుంబమే బలం...

‘మగవారికి మాత్రమే పరిమితం అనే భావనను అధిగమించి ఇక్కడి దాకా ఎదిగానంటే అందుకు నా కుటుంబం అందించిన తోడ్పాటు మరువలేనిది. రాష్ట్రాలు దాటి ప్రయాణించడం నా వృత్తిలో భాగం. దీనికి తల్లిదండ్రులు, అత్తమామలు, భర్త, పిల్లలు సహకరించడం నా అదృష్టం. మొదట్లో పురుషుల మ్యాచ్‌లకు ఒక మహిళ అంపైర్‌గా వ్యవహరించడం అనేది సందేహాత్మకంగా ఉండేది. రానురానూ ఈ ధోరణి మారింది. క్రమేణా ఆటగాళ్లందరూ మమ్మల్ని అంగీకరించి సహకరిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో అభినందిస్తున్నారు కూడా. ఈ పరిస్థితి... అంపైర్లుగా రాణించాలనుకునే మహిళలకు ప్రోత్సాహాన్ని, ధైర్యాన్ని అందిస్తుంది. తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌ పురుషుల మ్యాచ్‌కు అంపైర్‌గా పనిచేయడం నాకు మంచి గుర్తింపునిచ్చింది. అంతర్జాతీయ స్థాయిలో జరిగే మ్యాచ్‌లకు అంపైరింగ్‌ చేయాలన్నదే నా కల. దానిని నెరవేర్చుకోవడం కోసం అహర్నిశలూ శ్రమిస్తూనే ఉంటాను’’ అంటూ తన భావాలు పంచుకున్నారు కృతిక.

ఆ వివాదంతో...

తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌ సీజన్‌లో దిండిగల్‌ డ్రాగన్స్‌, ఐడ్రీమ్‌ తిరుప్పూర్‌ తమిళియన్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో వివాదాస్పద సంఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.


దిండిగల్‌ డ్రాగన్స్‌ జట్టుకు సారథ్యం వహించిన స్టార్‌ క్రికెటర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌... సాయి కిషోర్‌ వేసిన బంతిని స్వీప్‌ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి ప్యాడ్‌లకు తగిలింది. దీంతో అంపైర్‌ కృతిక ఎల్‌బీడబ్ల్యూగా ప్రకటించారు. వెంటనే అశ్విన్‌ కోపంగా అంపైర్‌ దగ్గరకు వెళ్లి బంతి లెగ్‌స్టంప్‌ బయట పిచ్‌ అయిందంటూ వాదించాడు రీప్లేలో అది నిజమని తేలినా... అప్పటికే డ్రాగన్‌ జట్టు రెండు రివ్యూలూ కోల్పోవడంతో అశ్విన్‌ రివ్యూకు వెళ్లలేకపోయాడు. అయితే కృతిక... ఇవేమీ పట్టించుకోకుండా మౌనంగా ఉన్నారు. మైదానాన్ని వీడుతూ అశ్విన్‌ కోపంగా బ్యాట్‌తో తన ప్యాడ్‌లను కొట్టుకున్నాడు. గ్యాలరీలోకి గ్లౌవ్స్‌ విసిరేశాడు. ఒక మహిళ అంపైర్‌పై అశ్విన్‌ ఇలా కోపం ప్రదర్శించడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. అశ్విన్‌ కోపాన్ని అర్థం చేసుకుని అంపైర్‌ కృతిక హుందాగా ప్రవర్తించారంటూ నెటిజన్లు అభినందిస్తున్నారు.

‘మగవారికి మాత్రమే పరిమితం అనే భావనను అధిగమించి ఇక్కడి దాకా ఎదిగానంటే అందుకు నా కుటుంబం అందించిన తోడ్పాటు మరువలేనిది. రాష్ట్రాలు దాటి ప్రయాణించడం నా వృత్తిలో భాగం. దీనికి తల్లిదండ్రులు, అత్తమామలు, భర్త, పిల్లలు సహకరించడం నా అదృష్టం.

ఈ వార్తలు కూడా చదవండి

సైబర్‌ సెక్యూరిటీ కోర్సుల్లో దరఖాస్తుల ఆహ్వానం

డిజిటల్‌ అరెస్టు పేరుతో.. వృద్ధుడికి రూ.53 లక్షల కుచ్చుటోపీ

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 07 , 2025 | 04:36 AM