Share News

Vara Lakshmi Vratam: సకల సంపత్కర వ్రతం

ABN , Publish Date - Aug 08 , 2025 | 02:20 AM

సృష్టిలో ఉన్న ఐశ్వర్యాలన్నీ లక్ష్మీ స్వరూపాలే. అవి అనంతాలు. ఆమె కృప కలిగినవారికి మానసిక, భౌతిక, ఆధ్యాత్మిక శ్రేయస్సు పుష్కలంగా లభిస్తుంది. సద్గుణాలు మానసికమైనవైతే, సంపదలు భౌతికమైనవి. పరాశక్తిని...

Vara Lakshmi Vratam: సకల సంపత్కర వ్రతం

పర్వదినం

నేడు వరలక్ష్మీ శుక్రవారం

సృష్టిలో ఉన్న ఐశ్వర్యాలన్నీ లక్ష్మీ స్వరూపాలే. అవి అనంతాలు. ఆమె కృప కలిగినవారికి మానసిక, భౌతిక, ఆధ్యాత్మిక శ్రేయస్సు పుష్కలంగా లభిస్తుంది. సద్గుణాలు మానసికమైనవైతే, సంపదలు భౌతికమైనవి. పరాశక్తిని శ్రీమహాలక్ష్మిగా ఆరాధించి... ఆమె అనుగ్రహంతో లౌకిక, పారలౌకిక ప్రయోజనాలు ఎలా సాధించుకోవాలో మంత్రశాస్త్రాలు, వివిధ గ్రంథాలు విస్తారంగా తెలియజేశాయి. ఆ తల్లిని శ్రావణమాసంలో ‘వరలక్ష్మీ దేవి’గా పూజించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం.

శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని ‘వరలక్ష్మీ శుక్రవారం’ అంటారు. ఈ రోజున వరలక్ష్మీ వ్రతాన్ని మహిళలు ఆచరిస్తారు. జగత్తులోని సకల ప్రాణులకు బతుకుతెరువు కల్పించేది శ్రీమహాలక్ష్మి. సకల సంపదలకు ఆమె అధిష్టాన దేవత. శ్రీహరికి ఆమె ప్రాణసమానురాలు. ఆమెను హృదయంలో ప్రతిష్ఠించుకున్నాడు. సస్య స్వరూపిణి అయిన ధాన్యలక్ష్మిగా, వైకుంఠంలో స్వర్గలక్ష్మిగా, గృహాలలో గృహలక్ష్మిగా, అలాగే జితేంద్రియగా, శాంతస్వరూపిణిగా, అరిషడ్వర్గాలనుంచి విముక్తి కలిగించే జ్ఞానప్రదాయినిగా ఆమెను పురాణాలు కీర్తించాయి. అయితే... అష్టైశ్వర్యాల కోసం అష్ట లక్ష్మీ రూపాలలోనే ఆమెను ఎక్కువగా భావన చేయడం, పూజించడం పరిపాటి. కాగా... ‘సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మి’ అంటూ ఆరు రూపాలలో ఆమెను ‘శ్రీసూక్తం’ వర్ణించింది. సమస్త ఐశ్వర్యాలను, జయాన్ని, జ్ఞానాన్ని, ఐహిక-ఆముష్మిక సంపదలను వర్షించేది కాబట్టే ఆమెను వరలక్ష్మిగా ఆరాధిస్తున్నాం.


చారుమతిలా...

వరలక్ష్మీ వ్రతం గురించి పార్వతికి స్కందుని సమక్షంలో చెప్పినట్టు ‘స్కాంద పురాణం’లో కథ ఉంది. స్కందుని ద్వారా సూతుడికి తెలిసిన ఈ కథ... ఆయన ద్వారా భూలోకంలో ప్రాచుర్యం పొందింది. ‘వర’ అంటే శ్రేష్టమైనది. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల అనుకూలమైన భర్త లభిస్తాడని, గృహిణులు సకల సౌభాగ్యాలతో తులతూగుతారని నమ్మకం ఉంది. వరలక్ష్మీ వ్రత కథలో ప్రధాన పాత్ర చారుమతి అనే గృహిణి. ఆ వ్రతాన్ని ఆచరించిన ఆమె లక్ష్మీ అనుగ్రహాన్ని పొందింది. ‘చారుమతి’ అంటే ‘చక్కని బుద్ధి’ అని అర్థం. ‘ఈ వ్రత విధానాన్ని అనుసరించి పూజలు చేసి, వ్రతకథను చెప్పుకొని లేదా విని... చారుమతి మాదిరిగా జీవితాలను తీర్చిదిద్దుకున్నవారు సర్వ సంపదలు, పొందుతారు, సమాజంలో గౌరవప్రదమైన స్థానం లభిస్తుంది, కుటుంబ శ్రేయస్సు, సౌభాగ్యం కలుగుతాయి, జీవితాంతం ఆ వరలక్ష్మీదేవి ఆలంబన లభిస్తుంది’ అనేది పెద్దల మాట.

ఆయపిళ్ళ రాజపాప

ఈ వార్తలు కూడా చదవండి..

కుట్టిన సాలీడు.. బాలిక మృతి

తురకా కిషోర్‌ను తక్షణమే విడుదల చేయండి: హైకోర్టు

For More Telangana News And Telugu News

Updated Date - Aug 08 , 2025 | 02:20 AM