Trendy Velvet Sarees for the Winter: వెల్వెట్‌తో ట్రెండీ వెలుగులు
ABN , Publish Date - Oct 29 , 2025 | 05:25 AM
చలికాలంలో వెచ్చని అనుభూతినిస్తూ అందంగా మెరిసే వెల్వెట్ చీరలు ట్రెండింగ్‌లోకి వచ్చేశాయి. నీలం, ఎరుపు, ఆకుపచ్చ, గులాబీ లాంటి ముదురు రంగులతో పాటు లేత రంగులు, పేస్టల్ కలర్స్‌లో కూడా...
ఫ్యాషన్
చలికాలంలో వెచ్చని అనుభూతినిస్తూ అందంగా మెరిసే వెల్వెట్ చీరలు ట్రెండింగ్‌లోకి వచ్చేశాయి. నీలం, ఎరుపు, ఆకుపచ్చ, గులాబీ లాంటి ముదురు రంగులతో పాటు లేత రంగులు, పేస్టల్ కలర్స్‌లో కూడా రకరకాల వెల్వెట్ చీరలు లభ్యమవుతున్నాయి. ఈ చీరలు సుతిమెత్తగా ఉంటూ ఎలాంటి శరీరాకృతి ఉన్నవారికైనా చక్కగా నప్పుతాయి. చీర జారిపోతుందన్న భయం ఉండదు. అందుకే మహిళలు... ముఖ్యంగా యువతులు వివాహాది శుభకార్యాలు, పార్టీలకు వెళ్లేటప్పుడు వెల్వెట్ చీరలను కట్టుకోవడానికే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇలా అన్ని వర్గాలవారిని ఆకర్షిస్తున్న వెల్వెట్ చీరలపై ఓ లుక్కేద్దామా...
వెల్వెట్ చీరలు కట్టుకున్నప్పుడు చక్కగా నగలు పెట్టుకోవచ్చు. బంగారు, వెండి ఆభరణాలతోపాటు ముత్యాలు, వజ్రాలు, కెంపులు, పచ్చలు, బీడ్స్‌తో రూపొందించిన నగలన్నీ బాగా సూటవుతాయి. నగలు, మేకప్ లేకపోయినా వెల్వెట్ చీర కట్టుకుని చేత్తో క్లచ్ పట్టుకుంటే చాలు... గ్రాండ్‌గా మెరిసిపోవచ్చు.
వెల్వెట్ చీరల్లో చాలా రకాలు అందుబాటులో ఉన్నాయి. క్రష్ట్ వెల్వెట్, సిల్క్ వెల్వెట్, కాటన్ వెల్వెట్, పాలిస్టర్ వెల్వెట్ రకాలను మహిళలు ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఈ చీరలమీద ఎంబ్రాయిడరీ, జర్దోసి, లేస్, కుందన్, నక్కీ, ప్యాచ్ వర్క్‌లు అందంగా కనిపిస్తాయి. జరీ బోర్డర్లు జతచేసి అందమైన బుటీ వర్క్ చేసిన చీరలను పెళ్లి సమయంలో ధరించడానికి యువతులు ఎక్కువగా ఎంపిక చేసుకుంటున్నారు. చిన్నపాటి ఈవెంట్లు, పార్టీలకు వెళ్లేటప్పుడు మాత్రం ప్లెయిన్ వెల్వెట్ చీరతోపాటు చక్కని డిజైనర్ బ్లౌజ్ ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు.
వెల్వెట్ చీరలను జాగ్రత్తగా సంరక్షించుకోవాలి. వీటిని నీళ్లతో ఉతకకూడదు. డ్రైక్లీనింగ్ చేయించడం మంచిది. ఈ చీరలను నేరుగా ఇస్త్రీ చేయకూడదు. చీరను లోపలివైపునకు తిప్పి, పైన ఓ కాటన్ క్లాత్‌ను పరిచి, దాని మీద తక్కువ వేడితో ఇస్త్రీ చేయాలి. వెల్వెట్ చీరల మీద ఏవైనా మరకలు పడితే వాటి మీద కొద్దిగా లిక్విడ్ డిటర్జెంట్ రాసి చేతి రుమాలుతో మెల్లగా రుద్దాలి. తరువాత తడి గుడ్డతో తుడిచేస్తే సరిపోతుంది. ఆపైన నీడలో గాలికి ఆరనివ్వాలి.
ఈ వార్తలు కూడా చదవండి...
మొంథా తుపాను.. ఎమ్మెల్యేలకు లోకేష్ ముఖ్య సూచనలు
ఆ జిల్లా ప్రజలను వణికిస్తోన్న తుపాను హెచ్చరికలు
Read Latest AP News And Telugu News