Share News

Kadiyams Agarbatti Project: వ్యర్థ పుష్పాలతో ఉపాధి పరిమళాలు

ABN , Publish Date - Oct 27 , 2025 | 05:00 AM

‘వ్యర్థం అనే మాటకు అర్థం లేదు’ అంటున్నారు తూర్పు గోదావరి జిల్లా కడియం ప్రాంతానికి చెందిన డ్వాక్రా మహిళలు. విక్రయించగా మిగిలిపోయిన, పాడైపోయిన పూలతో అగరుబత్తీలు తయారు చేసి... ఆదాయంతోపాటు...

Kadiyams Agarbatti Project: వ్యర్థ పుష్పాలతో ఉపాధి పరిమళాలు

‘వ్యర్థం అనే మాటకు అర్థం లేదు’ అంటున్నారు తూర్పు గోదావరి జిల్లా కడియం ప్రాంతానికి చెందిన డ్వాక్రా మహిళలు. విక్రయించగా మిగిలిపోయిన, పాడైపోయిన పూలతో అగరుబత్తీలు తయారు చేసి... ఆదాయంతోపాటు ప్రశంసలనూ పొందుతున్నారు.

‘పూలు’ అనగానే తూర్పుగోదావరి జిల్లా కడియం పేరు గుర్తుకువస్తుంది. కడియం, కడియపులంక పరిసరాల్లో దాదాపు అయిదు వేల ఎకరాల్లో నర్సరీలు విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతాలు ఒకప్పుడు వరద ముంపు ప్రదేశాలు. వరదలతో పాటు వచ్చే ఒండ్రు మట్టితో నేల సారవంతంగా మారింది. 50 ఏళ్ల క్రితం నుంచి ఇక్కడి నర్సరీల్లో పూల సాగు జరుగుతోంది. గతంలో మల్లెలు, బంతి, చామంతి తదితర రకాలను సాగు చేసేవవారు. అయితే కాలక్రమంలో నర్సరీ రైతులు వివిధ రకాల మొక్కల పెంపకం, విక్రయం వైపు మళ్లారు. దీంతో చిత్తూరు, కర్నాటక తదితర చోట్ల నుంచి పూలను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా చేస్తున్నారు. కడియపులంకలోని హోల్‌సేల్‌ పూల మార్కెట్‌కు వివాహాలు, పండుగలు, పర్వదినాల్లో రోజుకు 100 టన్నుల వరకూ రకరకాల పువ్వులు వస్తాయి. కాగా అన్‌సీజన్‌లో రోజూ మిగిలిపోయిన, వాడిపోయిన పువ్వులు 10 టన్నుల వరకూ ఉంటాయి. వాటిని కాలువ గట్టున పడేయడం పరిపాటి. వాటి పునర్వినియోగంపై ఎవరూ దృష్టి సారించలేదు. ఈ నేపథ్యంలో... ఆ పువ్వులను ఏదో ఒక విధంగా ఉపయోగించాలని గత ఏడాది అప్పటి కలెక్టర్‌ ప్రశాంతి భావించారు. డీఆర్‌డీఏ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ ఎన్‌.వి.వి.ఎ్‌స.మూర్తికి సంబంధిత కార్యాచరణను అప్పగించారు. దీంతో ‘కడియం నాచురల్‌ అగరుబత్తి’ అనే వినూత్న ప్రాజెక్టు పట్టాలెక్కింది.


ఇలా మొదలైంది...

ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా తొలి దశలో 60 డ్వాక్రా మహిళలను ఎంపిక చేశారు. అన్నవరం దేవస్థానంలో వినియోగించిన పూలతో తయారు చేస్తున్న అగరుబత్తీల తయారీ కేంద్రానికి తీసుకువెళ్లి, సంబంధిత ప్రక్రియను పరిచయం చేశారు. తరువాత యూనియన్‌ బ్యాంకు ఆధ్వర్యంలో నడుస్తున్న రీజనల్‌ సెల్ఫ్‌ ఎంప్లాయిమెంట్‌ ట్రైనింగ్‌ సంస్థ ద్వారా... విజయనగరం నుంచి అనుభవం కలిగిన ఒక వ్యకిని తీసుకువచ్చి శిక్షణ ఇప్పించారు. ‘పీఎం ఈజీపీ పథకం’ కింద బ్యాంకు లింకేజీ ద్వారా యంత్రాలు, తొలి దశ పెట్టుబడికి రూ.3 లక్షల రుణం మంజూరు చేయించారు. వర్కింగ్‌ క్యాపిటల్‌ కింద మరో లక్ష రూపాయలు మంజూరయ్యాయి. కడియం మండలాధ్యక్షుడు వెలుగుబంటి సత్య ప్రసాద్‌ చొరవతో సచివాలయంలోని ఒక గది కేటాయింపు జరిగింది. మొదట తొలిగా అయిదుగురు మహిళతో అగరుబత్తీల తయారీ మొదలయింది.

5-navya.jpg

అగరుబత్తీల తయారీ గురించి డ్వాక్రా మహిళలు పి.లక్ష్మీబాయి, వి.వెంకట లక్ష్మి, జె.నాగ లక్ష్మి, కె.శ్రావణి, ఎస్‌.మల్లేశ్వరి వివరిస్తూ ‘‘ఉదయం 9గంటలకు తయారీ కేంద్రానికి చేరుకుంటాం. బంతి, చామంతి, గులాబీ తదితర పూల వ్యర్థాలను తొడిమలతోసహా తొలగిస్తాం. రేకులను వేరు చేస్తాం. 25 కిలోలు ముడి సరుకుగా తీసుకువస్తే... శుభ్రం చేసిన తర్వాత దాదాపు అయిదు కిలోల పూరేకులు వస్తాయి. వాటిని 20 రోజులపాటు ఎండబెట్టి, పొడి చేస్తే 2 కిలోల పౌడరు వస్తుంది. దానికి ఎలాంటి రసాయన పదార్థాలను జోడించం. అగరుబత్తి పుల్లకు ఆ పొడి అంటిపెట్టుకొని ఉండడానికి గమ్‌ పౌడరు రాస్తాం. అగరుబత్తి వెలుగుతూ ఉండడానికి రంపం పొడి మాత్రం స్వల్ప మోతాదులో కలుపుతాం. ఆ మిశ్రమంతో యంత్రం ద్వారా అగరుబత్తీలు తయారు చేసి ప్యాక్‌ చేస్తాం. ఇలా రోజుకు దాదాపు 15 కిలోల చొప్పున నెలకు సుమారు 500 కిలోల వరకూ ఉత్పత్తి చేస్తున్నాం. చేతితో ధూప్‌స్టిక్స్‌ కూడా తయారు చేస్తున్నాం. ప్రస్తుతం మార్కెట్‌లో లభ్యమవుతున్న అగరుబత్తీల తయారీలో రసాయనాలు వాడడంతో ఆరోగ్యపరమైన ఇబ్బందులు కలుగుతాయి. కానీ కడియం నాచురల్‌ అగరుబత్తీలలో రసాయనాలు లేకపోవడంతో ఆ పొగతో సమస్య ఉండదు. బహిరంగ మార్కెట్‌ కంటే తక్కువ ధరకే వీటిని అందిస్తున్నాం. ప్రస్తుతం పెట్టుబడి, బ్యాంకు వాయిదా పోను నెలకు ఒక్కొక్కరికి రూ.12 వేల వరకూ ఆదాయం వస్తోంది. ఆ మొత్తం పెట్టుబడి తదితరాలకు సరిపోతోంది. ఇది కాస్త శ్రమతో కూడుకున్న పనే. కానీ భవిష్యత్తు బాగుంటుందనే ఆశతో కొనసాగిస్తున్నాం’’ అని చెప్పారు.


ఉపాధికి ఆస్కారం...

ప్రస్తుతం వీటిని జిల్లా మహిళా సమాఖ్య తరఫున డీఆర్‌డీఏ కొనుగోలు చేస్తోంది. ఎక్కడైనా ప్రభుత్వ కార్యక్రమాలు ఉంటే తయారీ కేంద్రం తరఫున స్టాల్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. ముడిసరుకు ఏడాది పొడవునా లభ్యత ఉండడంతోపాటు డబ్బులు చెల్లించి కొనుగోలు చేయాల్సిన అవసరం లేకపోవడం ఈ ప్రాజెక్టులోని విశేషంగా చెప్పవచ్చు. కొద్ది రోజుల క్రితం కలెక్టర్‌ కీర్తి చేకూరి ఈ కేంద్రాన్ని సందర్శించారు. సోలార్‌ డ్రయర్‌తోపాటు అవసరమైన యంత్రాలు సమకూరుస్తామని హామీ ఇస్తూ... వాణిజ్యపరంగా ఇంకా పెద్ద స్థాయిలో తయారీకి సిద్ధం కావాలని, ఆ ఉత్పత్తులను దేవాదాయ శాఖ ద్వారా దేవాలయాల్లో వినియోగించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా... వ్యర్థమవుతున్న పూలలో ఈ విధంగా వినియోగిస్తున్నవి చాలా తక్కువ. వాటిని పూర్తిగా వినియోగించుకోవడంతోపాటు.. దేవాలయాల్లో వాడిన పూలు, పూలమాలలను కూడా జతచేస్తే కడియం పరిసర ప్రాంతాలతోపాటు దగ్గరలో ఉన్న రాజమహేంద్రవరంలోని డ్వాక్రా మహిళలకు కూడా ఉపాధి లభించే అవకాశం ఉంది. అలాగే తక్కువ మంది మహిళలతో చిన్న యూనిట్లను నెలకొల్పి ఆ ఉత్పత్తులను ప్రభుత్వం మార్కెట్‌ చేయగలిగితే ఎంతోమంది మహిళల జీవితాలు ఆర్థికంగా గుబాళిస్తాయి.

పి.రమేశ్‌ నాగేంద్ర

ఈ వార్తలు కూడా చదవండి..

కర్నూలు బస్సు ప్రమాదం.. బ్లూ మీడియాపై ప్రభుత్వం సీరియస్

పరకామణి వ్యవహారంలో నిందితులను వదిలిపెట్టం.. భానుప్రకాష్ వార్నింగ్

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 27 , 2025 | 05:00 AM