Teacher Dedication School Improvement: బడి రాత మార్చారు
ABN , Publish Date - Dec 25 , 2025 | 02:21 AM
ఎక్కడ చూసినా చెత్తచెదారం... పశువుల సంచారం... బుర్రా వెంకటనాగలక్ష్మి బదిలీపై వచ్చేనాటికి ప్రకాశం జిల్లా తోటవెంగన్నపాలెం మండల ప్రజాపరిషత్ పాఠశాల దుస్థితి ఇది. ఆరుగురే విద్యార్థులు..
స్ఫూర్తి
ఎక్కడ చూసినా చెత్తచెదారం... పశువుల సంచారం... బుర్రా వెంకటనాగలక్ష్మి బదిలీపై వచ్చేనాటికి ప్రకాశం జిల్లా తోటవెంగన్నపాలెం మండల ప్రజాపరిషత్ పాఠశాల దుస్థితి ఇది. ఆరుగురే విద్యార్థులు... అధ్వాన్నమైన పరిసరాలు... చూసి చలించిన ఆమె... మూతపడే దశలో ఉన్న పాఠశాల ముఖచిత్రాన్నే మార్చేశారు. సొంత డబ్బు ఖర్చు చేసి... వసతులు కల్పించడమే కాదు... విద్యార్థుల సంఖ్యను కూడా పెంచి... ఆదర్శంగా నిలిచిన ఈ ఉపాధ్యాయురాలిని ‘నవ్య’ పలుకరించింది.
‘‘నేను గతంలో ప్రకాశం జిల్లా కందులూరు పాఠశాలలో పనిచేసేదాన్ని. ఈ ఏడాది జూన్ మాసంలోనే తాళ్లూరు మండలం తోటవెంగన్నపాలెంలోని ‘మండల ప్రజాపరిషత్ పాఠశాల’కు బదిలీ అయ్యాను. ఇక్కడకు వచ్చినప్పుడు బడి పరిస్థితి చూసి చాలా బాధపడ్డాను. ప్రహరీ, సరైన మరుగుదొడ్లు లేవు. అపరిశుభ్రమైన పరిసరాలు, తరచూ వచ్చిపోయే పశువులు. అన్నిటికీ మించి విద్యార్థుల సంఖ్య నన్ను కలవరపెట్టింది. నేను వచ్చేనాటికి ఇక్కడ కనిపించింది ఆరుగురే విద్యార్థులు. మూతపడే స్థితిలో ఉంది ఈ బడి. పట్టించుకొనేవారే లేరు. ఆ రోజే నిర్ణయించుకున్నా... ఈ పరిస్థితిలో మార్పు తేవాలని. పాఠశాలను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు నావంతు కృషి చేయాలని.
సొంత నిధులతో...
మండలంలో మారుమూల గ్రామం... తోటవెంగన్నపాలెం. తమ పిల్లలను బడికి పంపడానికి తల్లిదండ్రులు ఇష్టపడేవారు కాదు. స్థానికంగా ఐదో తరగతి లోపు పిల్లలను గుర్తించి, వారి తల్లిదండ్రులతో మాట్లాడాను. ‘మీ పిల్లల బాధ్యత నాది’ అని చెప్పి వారిని ఒప్పించాను. పిల్లలు రావాలన్నా, ప్రశాంతంగా చదువుకోవాలన్నా ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలి. దాని కోసం యాభై వేలకు పైగా సొంత డబ్బుతో... ముందుగా పశువులు రాకుండా చుట్టూ ఇనుప కంచె వేయించాను. గేటు పెట్టించాను. గోడలకు సున్నాలు కొట్టించాను. నిరుపయోగంగా పడివున్న మరుగుదొడ్లకు తలుపులు ఏర్పాటు చేయించాను. ఈ అభివృద్ధి పనులవల్ల పాఠశాల కొత్త కాంతులు అద్దుకుంది.

క్రమశిక్షణ నేర్పి...
బడిలో మారిన వాతావరణం చూసి, తల్లిదండ్రులు తమ పిల్లలను పంపడం ప్రారంభించారు. విద్యార్థులకు క్రమశిక్షణ అలవాటు చేసి, క్రమం తప్పకుండా పాఠాలు బోధిస్తున్నాను. ఇది సత్ఫలితాలను ఇచ్చింది. విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరిగింది. నాడు ఆరుగురు విద్యార్థులున్న పాఠశాలలో నేడు ఆ సంఖ్య 24కు పెరిగింది. ఇది నా ఒక్కరివల్ల సాధ్యమైనది కాదు. దీని వెనుక స్థానిక ప్రజలు, తలిలదండ్రులు, విద్యార్థుల సమష్టి కృషి ఉంది. ప్రైవేటు బడులకు దీటుగా దీన్ని నిలబెట్టాలనేది నా ధ్యేయం. అందుకు నిరంతరం శ్రమిస్తున్నాను. గతంలో స్థానికులు కొందరు తమ పిల్లలను సమీపంలోని తూర్పుగంగవరం పాఠశాలకు పంపేవారు. కొందరు ప్రైవేటు బడులను ఎంచుకున్నారు. అలాంటి పిల్లలను గుర్తించి, వచ్చే విద్యా సంవత్సరంలో మా పాఠశాలలోనే వారిని చేర్పించేలా తల్లిదండ్రులను ఒప్పించాను.
ఆవరణలో పచ్చదనం...
అంతేకాదు... పాఠశాల ఆవరణ మరింత ఆహ్లాదంగా ఉండేందుకు, పర్యావరణంపై చిన్నారులకు అవగాహన కల్పించేందుకు పలు రకాల పండ్ల మొక్కలు నాటించాను. వాటిని సంరక్షించే బాధ్యత విద్యార్థులకు అప్పగించాను. నిరుపయోగంగా ఉన్న బోరుకు మోటార్ బిగించి, స్కూల్లో నీటి వసతిని పునరుద్ధరించగలిగాను. సరైన వసతులు, ప్రశాంతమైన వాతావరణం ఉంటేనే పిల్లలకు మనం చెప్పే పాఠాలు ఒంటబడతాయి. దీనికోసం నావంతు ప్రయత్నం చేస్తున్నాను. సేవగా కాకుండా... దీన్ని ఒక బాధ్యతగా భావిస్తున్నాను. ప్రభుత్వంతో పాటు ప్రజల సహకారం, ఉపాధ్యాయుల అంకితభావం తోడైతే... ప్రభుత్వ బడులు కూడా ప్రైవేటు వాటికి దీటుగా నిలబడతాయి.’’
సుసర్ల నాగేంద్రనాథ్, తాళ్లూరు.
ఇవి కూడా చదవండి...
వీరన్న హత్య కేసులో వీడిన మిస్టరీ... అసలు నిజం ఇదే
తిప్పలు పెడితే రాసుకోండి.. మిత్తీతో సహా తీర్చేద్దాం: హరీష్ రావు
Read Latest Telangana News And Telugu News