Share News

జన హృదయాంతర్వాహిని

ABN , Publish Date - May 16 , 2025 | 05:18 AM

జలాన్ని చైతన్య దేవతగా ‘చాందగ్యోపనిషత్తు’ వర్ణించింది. భారతీయ జీవన విధానం నదులతో పెనవేసుకుంది. వాటిలో ఒకటైన సరస్వతి నది వేదకాలం నాటిది. ‘అంబితమే... నదీతమే... దేవీతమే సరస్వతి’ అని స్తుతించాయి వేదాలు. ఒకప్పుడు మహా ధారగా...

జన హృదయాంతర్వాహిని

పుష్కరాలు

మన దేశంలోని మహా నదుల్లో ఒకటైన సరస్వతి నదిని వేదాలు,

పురాణాలు, ఇతిహాసాలు అద్భుతంగా కీర్తించాయి. అయిదు వేల

ఏళ్ళకు పూర్వమే ఆవిర్భవించిన ఈ నది... భూమిపై తన

ప్రవాహశీలతను క్రమంగా కోల్పోయింది. ఇప్పుడు

అంతర్వాహనిగా భక్తుల ఆరాధనలను అందుకుంటోంది.

జలాన్ని చైతన్య దేవతగా ‘చాందగ్యోపనిషత్తు’ వర్ణించింది. భారతీయ జీవన విధానం నదులతో పెనవేసుకుంది. వాటిలో ఒకటైన సరస్వతి నది వేదకాలం నాటిది. ‘అంబితమే... నదీతమే... దేవీతమే సరస్వతి’ అని స్తుతించాయి వేదాలు. ఒకప్పుడు మహా ధారగా ప్రవహించిన ఈ నది కాలక్రమంలో వచ్చిన భౌగోళిక మార్పులతో ఒడుదొడుకులకు లోనై క్షీణించింది. మహా భారత కాలానికే ఈ స్థితి ఏర్పడినట్టు చరిత్ర చెబుతోంది. ఇంతకీ ఈ నది గురించి పురాణాలు ఏం చెబుతున్నాయి?

ఏడు రూపాలతో...

సరస్వతి నది ఆవిర్భావం గురించి ఎన్నో కథలు ఉన్నాయి. పరమ శివుడి ఆద్యంతాలు తెలుసుకున్నానని బ్రహ్మ అసత్యం పలుకగా, దాన్ని గుర్తించిన శివుడు... బ్రహ్మ వాక్కుకు మూలమైన సరస్వతిని ‘‘నదివి కమ్ము’’ అని శపించాడని, అలా సరస్వతి నదీ రూపాన్ని పొందిందని ‘బ్రహ్మాండ పురాణం’ చెబుతోంది. ఇక సరస్వతిని విష్ణుపత్నిగా ‘బ్రహ్మవైవర్త పురాణం’, ‘దేవీ భాగవతం’ పేర్కొన్నాయి. అసూయతో సరస్వతిని భూలోకంలో నదిగా జన్మించాలని గంగ శపించగా, గంగను కూడా అదే విధంగా సరస్వతి శపించినట్టు మరికొన్ని కథలు వెల్లడిస్తున్నాయి. కాగా... ‘బ్రహ్మ చేతి నుంచి ఆయన కమండలం జారిపడి, అందులోని పవిత్రజలం సరస్సుగా మారింది. అదే బ్రహ్మ సరస్సు (పుష్కరతీర్థం)గా ప్రసిద్ధి పొందింది. దానిలోనుంచి సరస్వతి నది పుట్టింది’ అనేది స్థలపురాణం. ఆ జలంతో బ్రహ్మ చేసిన యాగం వల్ల ‘సుభద్ర’, నైమిశారణ్యంలో చేపట్టిన సత్ర యాగం వల్ల ‘కనకాక్షి’, గయుడు చేసిన క్రతువు ద్వారా ‘విశాల’, ఉద్దాలకుడు నిర్వహించిన యాగం వల్ల ‘సురతన్వి’, వశిష్టుడు ఆచరించిన యజ్ఞం ద్వారా ‘ఓఘమాల’, బృహస్పతి చేసిన యాగం వల్ల ‘సువేణి’, బ్రహ్మ చేసిన మరో యాగం వల్ల ‘విమలోదక’ అనే పేర్లు పొందిన సరస్వతి... ఏడు రూపాలతో ‘సప్త సారస్వతం’గా ప్రసిద్ధి చెందింది.


3-navya.jpg

ఎన్నో చోట్ల... ఎన్నెన్నో పేర్లతో...

సరస్వతి నదీ తీరంలో నివసించిన రాజుల చరిత్రను, ఋషులు చేసిన ప్రస్తావనలను, ప్రజల విశ్వాసాలను గమనిస్తే అనేక విషయాలు తెలుస్తాయి. సరస్వతి నది హిమాలయాల్లో పుట్టి... వితస్తా (జీలం), అసిక్ని (చీనాబ్‌), పరుష్టి (రావి), శతద్రు (సట్లెజ్‌), విపాశ (బియాస్‌), సింధు నదులతో కలిసి... కశ్మీర్‌, పంజాబ్‌, ఉత్తర భారతం మీదుగా... ఈనాటి పాకిస్తాన్‌లోని పంజాబ్‌లో ప్రవహించి, అరేబియా నదిలో సంగమిస్తుంది. ఈ ఏడు నదులు ప్రవహించిన ప్రదేశమే ‘సప్తసింధు’ ప్రాంతంగా పేరుపొందింది. నేటికీ ఈ నదిపట్ల ప్రజలలో విశ్వాసం సన్నగిల్లలేదు. దేశంలోని ఎన్నో ప్రదేశాలలో... ఈ నది అంతర్వాహినిగా ప్రవహిస్తోందనేది జనం నమ్మకం. ఈ నదిపై విశేషమైన పరిశోధనలు జరిగాయి. ఫ్రెంచి రచయిత మైఖేల్‌ దామినో ది ‘లాస్ట్‌ రివర్‌’ (లుప్త నది) అనే పేరుతో ఒక గ్రంథాన్నే రచించాడు. శివాలిక్‌ ప్రాంతంలో పుట్టిన సరస్వతి... కురుక్షేత్రంలో లుప్తమయిందనే పురాణ కథ కూడా ఉంది. ఇప్పటికీ అక్కడ ఒక నది ప్రవహిస్తోంది. దాన్ని ‘గగ్గర్‌ నది’గా వ్యవహరిస్తారు. శ్రీకృష్ణుడు నిర్యాణం చెందిన ప్రభాస పట్టణంలోని నదిని ‘ప్రభాస తీర్థం’ అంటారు. పుష్కర తీర్థంలో పుట్టి కొంతదూరం ప్రవహించి, లవణా నదిలో కలిసే నదిని ‘పుష్కర సరస్వతి’ అంటారు. సరస్వతి నది లుప్తమైనప్పటికీ... భూగర్భంలో ప్రవహిస్తూ, బదరీనాథ్‌ ఆలయానికి సమీపంలోని మానా గ్రామంలో ‘బిందు సరోవరం’గా దర్శనమిస్తుంది. దీన్ని ‘సరస్వతీ కుండం’గా వ్యవహరిస్తారు.


ఈ ప్రదేశాలన్నిటినీ పుష్కర సమయంలో వేలాది భక్తులు దర్శించి, పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. అలాగే దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన తెలంగాణలోని కాళేశ్వరంలో గోదావరి, ప్రాణహిత, అంతర్వాహినిగా సరస్వతీ సంగమించే ‘త్రివేణ సంగమ’ ప్రదేశంలో... సరస్వతి పుష్కరాలు వైభవంగా ప్రారంభ మయ్యాయి. విశేషమేమిటంటే... ఈ మూడూ పుష్కర నదులే. ఈనెల 26వ తేదీవరకూ కొనసాగే పుష్కరాల్లో నదీ స్నానాలు, దాన ధర్మాలు, పితృకార్యాలు చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయనేది పెద్దల మాట.

ఆయపిళ్ళ రాజపాప

ఫొటోలు: వీరగోని హరీష్‌, మధు, వరంగల్‌

ఈ వార్తలు కూడా చదవండి..

Rahul Gandhi: రాహుల్‌పై చర్యలకు రంగం సిద్ధం..

Abhinandan Vardhaman: అభినందన్ వర్థమాన్‌‌ను భారత్‌కి పాక్ ఆర్మీ అప్పగించిన తర్వాత ఏమైందంటే..

Supreme Court: సుప్రీంకోర్టులో సజ్జల భార్గవ్‌కు చుక్కెదురు

For Telangana News And Telugu News

Updated Date - May 16 , 2025 | 05:18 AM