Share News

Paramjeet Kaur The Young Rapper: ఈ యువ ర్యాపర్‌ కథే వేరు

ABN , Publish Date - Oct 08 , 2025 | 01:45 AM

ప్రతిభ ఏ మూలన ఉన్నా, ప్రపంచం నలుమూలలకూ వ్యాపిస్తుంది. ఇందుకు పరమ్‌జీత్‌ కౌర్‌ ఉదంతమే ఉదాహరణ. పంజాబ్‌లోని మోగాకు చెందిన ఈ 19 ఏళ్ల అమ్మాయి... యువ ర్యాపర్‌గా...

Paramjeet Kaur The Young Rapper: ఈ యువ ర్యాపర్‌ కథే వేరు

ప్రతిభ ఏ మూలన ఉన్నా, ప్రపంచం నలుమూలలకూ వ్యాపిస్తుంది. ఇందుకు పరమ్‌జీత్‌ కౌర్‌ ఉదంతమే ఉదాహరణ. పంజాబ్‌లోని మోగాకు చెందిన ఈ 19 ఏళ్ల అమ్మాయి... యువ ర్యాపర్‌గా సంగీతాభిమానుల మనసులు చూరగొంటోంది. ‘దట్‌ గర్ల్‌’ పాటతో లేడీ మూసేవాలాగా పేరు తెచ్చుకుంటున్న పరమ్‌ గురించి మరిన్ని వివరాలు...

తల్లి ఇళ్లలో పనులు చేస్తూ ఉంటుంది. తండ్రి రోజువారీ కూలీ. తమకొచ్చే కొద్దిపాటి సంపాదనతో కూతుర్ని వృద్ధిలోకి తీసుకురావాలన్నది వాళ్ల కల. తమ కష్టానికి ఎప్పటికైనా ప్రతిఫలం దక్కుతుందనీ, భగవంతుడు ఎప్పటికైనా కరుణిస్తాడనీ ఆశపడిన ఆ నిరుపేద తల్లిదండ్రుల కలలు ఎట్టకేలకు ఫలించాయి. కాలేజీలో ఇంటర్‌ చదువుకుంటున్న 19 ఏళ్ల పరమ్‌జిత్‌ కౌర్‌ చదువులోనే కాదు, సంగీతంలో కూడా ప్రతిభ కనబరచడం మొదలుపెట్టింది. మొదట్లో ఇంట్లో కూని రాగాలు తీస్తూ, లల్లాయి పాటలు పాడుకుంటూ ఉండేది. ఆమెది అదురు బెదురులేని నైజం. చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం ఆమె పాటల్లో ధ్వనించడం గమనించిన తల్లితండ్రులు పరమ్‌ను మరింత ప్రోత్సహించారు. కానీ వాటికెలా ఒక రూపాన్నివ్వాలో, ఏ జోనర్‌లోకి చేర్చాలో పరమ్‌కు తెలియదు. అదే సమయంలో కాలేజీలో తన స్నేహితులు, తోటి విద్యార్థులు పాటలు రాస్తూ పాడుతూ ఉండడం పరమ్‌ గమనించింది. వాటి ద్వారా తాను ఎంచుకున్న శైలిని ‘ర్యాప్‌’ అంటారనే విషయాన్ని గ్రహించింది. అలా పాటలు రాస్తూ, పాడడం మొదలుపెట్టింది. అలా ఆమె ప్రతిభ ఇంగ్లండ్‌కూ పాకింది. అక్కడ స్థిరపడిన రికార్డ్‌ ప్రొడ్యూసర్‌ మన్ని సంధు... పరమ్‌ పాటలు విని వాటిని రికార్డు చేసి ప్రపంచానికి వినిపించాలనే ఆలోచనతో పంజాబ్‌కు చేరుకున్నాడు. అక్కడి నుంచి పరమ్‌ కథ ఊహించని మలుపు తిరిగింది.


సాదాసీదాగా మొదలై...

‘‘దట్‌ గర్ల్‌ పాటను మేమెలాంటి ఖరీదైన ఆధునిక స్టూడియోలోనూ రికార్డు చేయలేదు. రికార్డింగ్‌ కోసం ఒక సాధారణ హోటల్‌ గదిని ఎంచుకున్నాం. కాబట్టే పాటలో కార్ల హారన్ల మోతలూ, అరుపులూ వినిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత నేను ఆ పాటను స్టూడియోకు తీసుకువెళ్లి చిన్న చిన్న మెరుగులు దిద్దాను. అలాగే మ్యూజిక్‌ వీడియో కోసం నిపుణులైన వీడియోల రూపకర్తలను సంప్రతించాం. వీడియో ఎలా ఉండాలని కోరుకుంటున్నామో వివరించాం. మా ఆలోచన ఆధారంగా వాళ్లు అద్భుతమైన వీడియో రూపొందించారు. ఇప్పుడీ పాటకు ఇంత ఆదరణ దక్కడం ఎంతో సంతోషంగా ఉంది. పరమ్‌ విజయానికి ఇది ఆరంభం మాత్రమే!’’ అంటూ పరమ్‌ తొలి ర్యాప్‌ సాంగ్‌ ‘దట్‌ గర్ల్‌’ రికార్డింగ్‌ గురించి వివరించాడు రికార్డ్‌ ప్రొడ్యూసర్‌ మన్ని సంధు. స్వతంత్ర లేబుల్‌తో విడుదలైన ‘దట్‌ గర్ల్‌’ పాట నేడు యువతను ఉర్రూతలూగిస్తోంది. విడుదలైన 11 రోజుల్లోనే యూట్యూబ్‌లో ఆరు లక్షల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పరమ్‌జిత్‌ కౌర్‌ ఫాలోవర్ల సంఖ్య నాలుగున్నర లక్షలకు పెరిగిపోయింది.

0000000-navya.jpg

లేడీ మూసేవాలా...

ప్రత్యేకించి ‘దట్‌ గర్ల్‌’ పాటలోని శక్తివంతమైన లిరిక్స్‌ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. గతంలో హత్యకు గురైన ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధు మూసేవాలా పాటలను మరిపిస్తూ ఉండడంతో ఇప్పుడు అందరూ పరమ్‌ను ‘లేడీ మూసేవాలా’ అని సంబోధించడం మొదలుపెట్టడం విశేషం. తన విజయం గురించి మాట్లాడుతూ... ‘‘ఇదంతా యాదృచ్ఛికంగా జరిగిపోయింది. ఈ పాట ఇంత విజయం సాధిస్తుందని నేను ఊహించలేదు. నాకసలు ర్యాప్‌ అంటే ఏంటో కూడా తెలియదు. కానీ స్నేహితుల ద్వారా నా పాటలకొక శైలి ఉన్నట్టు తెలుసుకున్నాను. పాటలతో వచ్చే ఆదాయంతో నా కుటుంబాన్ని ఆదుకోవాలనుకుంటున్నాను. అమ్మానాన్నల కోసం ఒక అందమైన ఇల్లు నిర్మించాలనే ఆలోచన ఉంది’’ అంటున్న పరమ్‌ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుందాం!

ఈ వార్తలు కూడా చదవండి..

పీఎంఓ పేరిట మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్..!

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 08 , 2025 | 01:47 AM