The Inspiring Journey of Pooja Garg: ఆత్మస్థైర్యమే ఆయుధం
ABN , Publish Date - Oct 27 , 2025 | 04:52 AM
ఊహించని ప్రమాదం ఆమెను ఏడేళ్ళు మంచానికి పరిమితం చేసినా... క్యాన్సర్ మహమ్మారి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నా... ఆత్మస్థైర్యమే ఆయుధంగా పోరాటం సాగించారు పూజా గార్గ్. పారా అథ్లెట్‌గా ఎన్నో...
ఊహించని ప్రమాదం ఆమెను ఏడేళ్ళు మంచానికి పరిమితం చేసినా... క్యాన్సర్ మహమ్మారి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నా... ఆత్మస్థైర్యమే ఆయుధంగా పోరాటం సాగించారు పూజా గార్గ్. పారా అథ్లెట్‌గా ఎన్నో పతకాలు సాధించడంతోపాటు... క్యాన్సర్ పై అవగాహన కలిగించడానికి బైక్‌పై 4,500 కిలోమీటర్ల యాత్ర చేశారు. మరోవైపు సామాజిక కార్యకర్తగా, వక్తగా వేలమంది జీవితాల్లో మార్పునకు దోహదం చేస్తున్న పూజ కథ... ఆమె మాటల్లోనే...
‘‘అది 2020 సెప్టెంబర్. అంతకు కొన్నాళ్ళ క్రితమే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బిఇ పూర్తి చేశాను. నోయిడాలోని ఒక కంపెనీలో సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా ఉద్యోగం వచ్చింది. కోరుకున్న కెరీర్‌ను ఆకర్షణీయమైన జీతంతో ప్రారంభించబోతున్నాననే ఆనందం నన్ను నిలవనివ్వడం లేదు. కానీ విధి నిర్ణయం వేరేగా ఉంది. ఒక రోజు స్నేహితుల్ని కలుసుకోడానికి బయలుదేరాను. అంతకుముందు పడిన వర్షం వల్ల తడిగా ఉన్న మెట్ల మీద నుంచి జారి పడిపోయాను. వెంటనే స్పృహ తప్పింది. ఆ ఏడాది అక్టోబర్ అయిదో తేదీన నేను జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వాలి. కానీ ఆ రోజు ఆపరేషన్ టేబుల్ మీద... అపస్మారక స్థితిలో ఉన్నాను.

కొత్త దారి తెలిసింది...
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో నేను పుట్టి పెరిగాను. సాఫ్ట్‌వేర్ రంగంలో రాణించాలనేది నా లక్ష్యం. దానికోసం కష్టపడి చదివాను. కోరుకున్న ఉద్యోగంలో చేరబోతున్న దశలో... ఊహించని ప్రమాదంతో నా కలలన్నీ కరిగిపోయాయి. వెన్నుకు ఫ్రాక్చర్ కావడంతో మంచానికే పరిమితం కావాల్సి వచ్చింది. ఏడేళ్ళలో... దేశంలోని వివిధ నగరాల్లో నాకు పదమూడు సర్జరీలు జరిగాయి. నా తల్లితండ్రులు ఎంతో డబ్బు ఖర్చు చేశారు. కానీ ఎలాంటి ప్రయోజనం కనిపించలేదు. హోలీ, దీపావళి లాంటి పండుగలను అందరూ సందడిగా చేసుకుంటూ ఉంటే... నేను నా గదికే పరిమితం కావడం ఎంతో బాధ కలిగించేది. మంచం మీద నుంచి నా అంతట నేను లేచి కూర్చోవడం చాలా కష్టంగా ఉండేది. దాదాపు మూడేళ్ళ పాటు ఒకవైపు నుంచి మరోవైపు కదలలేకపోయేదాన్ని. అయితే ఆత్మస్థైర్యాన్ని మాత్రం కోల్పోలేదు. దానికి కారణం నా కుటుంబం. నా తల్లిదండ్రులు, ఇద్దరు చెల్లెళ్ళు నన్ను కనిపెట్టుకొని ఉన్నారు. నా ప్రతి అవసరం తీర్చారు. క్రమంగా వీల్‌ఛైర్‌లో అటూ ఇటూ తిరగడం అలవాటు చేసుకున్నాను. ‘నడవలేకపోతేనేం... నేను ఎన్నో సాధించగలను’ అని నన్ను నేను ప్రేరేపించుకున్నాను. పారా-షూటింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టాను. కొన్ని నెలలలో నైపుణ్యం సాధించాను. మధ్యప్రదేశ్ రాష్ట్రస్థాయి పారా-షూటింగ్ ఛాంపియన్‌షి్‌పలో బంగారు పతకం గెలిచాను. నేను పయనించాల్సిన కొత్త దారి ఏమిటో అప్పుడు నాకు స్పష్టమయింది.
పాతికకు పైగా పతకాలు
ఆ తరువాత... కేరళలో జరిగిన ప్రీ-నేషనల్స్‌లో, నేషనల్-పారా షూటింగ్ ఛాంపియన్‌షి్‌పలో బంగారు పతకాలు గెలిచాను. 2000 సంవత్సరానికల్లా మన దేశంలోని టాప్-8 పారా షూటర్స్‌లో ఒకరుగా నిలిచాను. ఈ క్రమంలో నా దృష్టి కెనోయింగ్ మీద పడింది. తీవ్ర సాధన తరువాత... ఉజ్బెకిస్తాన్, జపాన్‌లలో నిర్వహించిన ఆసియన్ ఛాంపియన్‌షి్‌ప్సలో వరుసగా పాల్గొన్నాను. ఆ రెండిటిలో నాలుగో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కానీ ఈ ఏడాది థాయిలాండ్‌లో జరిగిన ‘ఆసియన్ పారా-కెనోయింగ్’ పోటీల్లో... రెండు ఈవెంట్లలో కాంస్య పతకాలు సాధించాను. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ఇప్పటివరకూ పాతికకు పైగా పతకాలు నా ఖాతాలో ఉన్నాయి. మరోవైపు సామాజిక సేవను కూడా నా జీవితంలో భాగం చేసుకున్నాను. ‘పంకోంకీ ఉడాన్’ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశాను. దివ్యాంగులకు వివిధ వృత్తుల్లో నైపుణ్యాన్ని కల్పించి, వారు తయారు చేసిన ఉత్పత్తుల విక్రయం ద్వారా ఆదాయ మార్గం చూపించడం, అణగారిన వర్గాల పిల్లలకు, వయోధికులకు అవసరమైన సాయాలు అందించడం లాంటి కార్యక్రమాలను చేపడుతున్నాను. అలాగే విద్యాసంస్థల్లో వర్క్‌షా్‌పలు, సమావేశాలు నిర్వహిస్తూ... పలు అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాను. ‘పంకోంకీ ఉడాన్’ ఇప్పటివరకూ దాదాపు అయిదు వేల మంది జీవితాల్లో మార్పునకు దోహదం చేసింది. ఇది నాకు ఎంతో సంతృప్తి కలిగిస్తోంది.

తొలి మహిళను నేనే...
ఈలోగా మరో సవాల్ ఎదురయింది. రెండేళ్ళ క్రితం తరచూ అనారోగ్యానికి గురవుతూ ఉండడంతో... వైద్య పరీక్షలు చేయించుకున్నాను. నాకు ఎముకల క్యాన్సర్ ఉందని వైద్యులు నిర్ధారించారు. అయితే నేను భయపడలేదు. చికిత్స చేయించుకుంటూనే నా కార్యక్రమాలన్నీ కొనసాగిస్తున్నాను. ప్రజల్లో క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పించడం కోసం... కిందటి ఏడాది ఇండోర్ నుంచి... దేశంలో మోటార్ సైకిళ్ళ మీద ప్రయాణించగలిగే అత్యంత ఎత్తైన రోడ్లలో ఒకటైన నాథూలా పాస్ వరకూ... 4,500 కిలోమీటర్ల దూరం మోటార్ బైక్‌పై ప్రయాణించాను. జాతీయ పతాకాన్ని చేతపట్టుకొని... అక్కడ శిఖరాగ్రానికి చేరాను. అక్కడికి చేరుకున్న తొలి ‘పారాప్లెజిక్’ మహిళను నేనే. ఇది ప్రపంచ రికార్డుగా... ‘లండన్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో నా పేరు చోటుచేసుకుంది. ప్రస్తుతం... వచ్చేఏడాది ఆసియా క్రీడల కోసం, 2028లో జరగబోయే పారాలింపిక్స్ కోసం సన్నద్ధం అవుతున్నాను. ఆత్మవిశ్వాసంతో, నిజాయితీగా పని చేస్తే విజయం తథ్యం అని నేను నమ్ముతాను. నా కథ కొందరిలోనైనా స్ఫూర్తి నింపుతుందనే నమ్మకం నాకుంది.’’
ఈ వార్తలు కూడా చదవండి..
కర్నూలు బస్సు ప్రమాదం.. బ్లూ మీడియాపై ప్రభుత్వం సీరియస్
పరకామణి వ్యవహారంలో నిందితులను వదిలిపెట్టం.. భానుప్రకాష్ వార్నింగ్
Read Latest AP News And Telugu News