The Inspiring Journey of Dr Balasuvarna: తగ్గేదే లే
ABN , Publish Date - Dec 10 , 2025 | 05:32 AM
వెటర్నరీ కాలేజీలో చదివే రోజులు... ఓ గుర్రం ఆమెను ఆకర్షించింది. దాని పక్కన నిలబడి ఒక ఫొటో దిగుదామని ముచ్చటపడ్డారు. కానీ ‘ఆ అవకాశం ఎన్‌సీసీలో ఉన్నవారికే’ అనడంతో చిన్నబుచ్చుకున్నారు....
అభిరుచి
వెటర్నరీ కాలేజీలో చదివే రోజులు... ఓ గుర్రం ఆమెను ఆకర్షించింది. దాని పక్కన నిలబడి ఒక ఫొటో దిగుదామని ముచ్చటపడ్డారు. కానీ ‘ఆ అవకాశం ఎన్‌సీసీలో ఉన్నవారికే’ అనడంతో చిన్నబుచ్చుకున్నారు.
ఆ తరువాత ఫొటోనే కాదు... ముచ్చటపడిన గుర్రంపై స్వారీ కూడా చేశారు. ఇప్పుడు హార్స్ రైడర్‌గా అదరగొడుతూ... రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలెన్నో గెలిచారు. పశువుల వైద్యురాలిగా సేవలందిస్తూ... ప్రముఖుల ప్రశంసలు అందుకొంటున్న సాహసనారి...
డాక్టర్ చాట్ల బాలసువర్ణతో ‘నవ్య’ మాటామంతి.
ఒక్కోసారి అనుకోని సంఘటనలు జీవితాన్ని మలుపు తిప్పుతాయి. కొత్త దారిలో నడిపిస్తాయి. అలాంటి కథే బాలసువర్ణది. కాకినాడకు చెందిన ఆమె తండ్రి పుష్పారెడ్డి వ్యాపారవేత్త. తల్లి రాజేశ్వరి. ఆమె సోదరుడు జనరల్ సర్జన్. బాల సువ ర్ణ ఎన్టీఆర్ జిల్లా గన్నవరంలోని ఎన్టీఆర్ వెటర్నరీ కళాశాలలో పశు వైద్య విద్యను అభ్యసించారు. ఆ సమయంలో జరిగిన ఓ సంఘటన ఆమెను గుర్రపు స్వారీలో నిష్ణాతురాలిగా చేసింది. టీమోర్ అనే గుర్రంతో ఏర్పరచుకున్న బంధం ఆమెను హార్స్ రైడింగ్ వైపు అడుగులు వేయించింది. గుర్రపు స్వారీ సాహసంతో కూడినది కావడంతో బాలసువర్ణ నిర్ణయాన్ని తల్లిదండ్రులు అంగీకరించలేదు. వద్దని వారించారు. అయితే ‘తగ్గేదేలే...’ అంటూ ఆమె స్వారీకి సిద్ధమయ్యారు. తరువాత తన ప్రతిభ చూసి తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించారు.
పతకాలు... ప్రశంసలు...
అలా నేర్చుకున్న గుర్రపు స్వారీ జాతీయ స్థాయిలో పతకాలు సాధించే దిశగా సాగింది. కోచ్ కల్నల్ బగేల్ సహకారంతో బాలసువర్ణ పోటీలకు సన్నద్ధమయ్యారు. 2015-16లో రాష్ట్రస్థాయిలో జరిగిన గుర్రపు స్వారీ పోటీల్లో పాల్గొన్నారు. 2017లో ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే క్యాంప్ పోటీలకు ఎంపికయ్యారు. ఆ ఈవెంట్‌లో 80 మంది పోటీపడి విజేతగా నిలిచారు. ఎన్‌సీసీ హార్స్ రైడింగ్ తరపున ఢిల్లీలో ప్రధాని మోదీ సమక్షంలో గుర్రంపై ఖడ్గంతో సెల్యూట్ చేసే అవకాశం కూడా దక్కించుకున్నారు. జాతీయ స్థాయిలో బంగారు, రజత పతకాలు సాధించారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా బహుమతి అందుకున్నారు. నాటి ఏపీ, తెలంగాణ సీఎంల నుంచి కూడా ఆమె ప్రశంసలు పొందారు.
పెట్ క్లినిక్ కూడా...
ప్రస్తుతం కాకినాడలో పశు వైద్యరాలిగా పని చేస్తున్న బాలసువర్ణ... సొంతంగా పెట్ క్లినిక్ కూడా నిర్వహిస్తున్నారు. కొన్ని పక్షులను పెంచుతూ వాటి బాగోగులు చూసుకొంటున్నారు. వృత్తిపరంగా చేస్తున్న సేవలకు గానూ ఉత్తమ పశు వైద్యురాలిగా అవార్డులు అందుకున్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాలు పంచుకుంటున్నారు. చిన్నారులకు గుర్రపు స్వారీలో మెళకువలు నేర్పిస్తున్నారు.
పీవీవీ వరప్రసాద్, కాకినాడ
అనుబంధం అలా...
మా వెటర్నరీ కళాశాలలో గుర్రాలు ఉండేవి. ఓ రోజు ఓ గుర్రంతో ఫొటో దిగాలని అనుకుంటే అది సాధ్యపడలేదు. వాటి దగ్గరకు వెళ్లాలంటే ఎన్‌సీసీ విద్యార్థులై ఉండాలి. ఆ విషయం అప్పుడు నాకు తెలియదు. దీంతో వెంటనే ఎన్‌సీసీలో చేరాను. ఒకసారి నేను నడిచి వెళ్తూ ఉండగా... ఎత్తయిన గుర్రం నా దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చింది. దాని పేరు టీమోర్. అది నా భుజంపై తల పెట్టింది. అప్పటి నుంచి ఆ గుర్రంతో అనుబంధం ఏర్పడింది. తరువాత గుర్రపు స్వారీ నేర్చుకోవాలని కోరిక కలిగింది. అలా సరదాగా నేర్చుకున్న స్వారీ... కల్నల్ సార్ ప్రోత్సాహంతో జాతీయ పతకాలు సాధించే స్థాయికి వెళ్లింది.
బాలసువర్ణ
ఈ వార్తలు కూడా చదవండి..
థాయ్‌లాండ్‌లో కనిపించిన గౌరవ్ లూథ్రా
ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీం విచారణ.. రేపటికి వాయిదా
Read Latest AP News And Telugu News