Priyanka Khimani Story: సెలబ్రిటీ లాయర్
ABN , Publish Date - Dec 08 , 2025 | 02:07 AM
చిన్నప్పటి నుంచీ ఎన్నో కలలు. డాక్టర్ కావాలని. రచయితగా రాణించాలని. తెరపై కనిపించాలని. కానీ చివరకు న్యాయవాదిగా స్థిరపడ్డారు ప్రియాంకా ఖిమాని. సొంతంగా ఒక లా ఫర్మ్ నెలకొల్పి...
స్ఫూర్తి
చిన్నప్పటి నుంచీ ఎన్నో కలలు. డాక్టర్ కావాలని. రచయితగా రాణించాలని. తెరపై కనిపించాలని. కానీ చివరకు న్యాయవాదిగా స్థిరపడ్డారు ప్రియాంకా ఖిమాని. సొంతంగా ఒక లా ఫర్మ్ నెలకొల్పి... బాలీవుడ్ సెలబ్రిటీల కేసులతో బిజీ అయ్యారు. ఎంతోమంది యువ లాయర్లకు మార్గదర్శకత్వం చేస్తూ... మరెంతోమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ప్రియాంక కథ ఇది.
‘‘జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో... ఏ మలుపు తిరుగుతుందో ఊహించలేం. పరిస్థితులకు అనుగుణంగా సాగిపోతుండాలి’’ అంటారు ప్రియాంకా ఖిమాని. బడికి వెళ్లే రోజుల్లోనే తనలోని సృజనకు రెక్కలు తొడిగారు. రచయితగా పలు టీవీ షోలకు పని చేశారు. రంగస్థల కళాకారిణిగా, మోడల్‌గా... విభిన్న రంగాల వైపు అడుగులు వేశారు. కానీ విధి మరోలా తలచింది. జీవితం అనుకోని మలుపు తీసుకుంది. ‘‘ముంబయిలో పుట్టాను. తరచూ వెళ్లిరావడంవల్ల ఢిల్లీతోనూ అనుబంధం ఏర్పడింది. పదిహేనేళ్ల వయసులో తొలిసారి ‘తమన్నా హౌస్’ అనే టెలివిజన్‌కు రచయితగా పని చేశాను. ముఖానికి రంగు వేసుకొని రంగస్థలంపై ప్రధాన పాత్ర పోషించాను. చదువుకొంటూనే ఇవన్నీ కొనసాగిస్తూ వచ్చాను. ముంబయి... ఢిల్లీ నగరాల మధ్య తీరిక లేకుండా రోజులు గడిచిపోయేవి. ఆ సమయంలో మా నాన్న మరణించారు. వెళుతూ వెళుతూ మాపై పెద్దఎత్తున అప్పుల భారం మోపారు. అప్పుడు నేను మెడిసిన్ కోసం సన్నద్ధమవుతున్నా. డాక్టర్ కావాలన్నది నా కల. కానీ మా ఇంటి పరిస్థితుల నేపథ్యంలో అటువైపు వెళ్లలేని పరిస్థితి. దాంతో నా కల కలగానే మిగిలిపోయింది’’ అంటూ ఓ సందర్భంలో తన చిన్ననాటి రోజులు గుర్తు చేసుకున్న ప్రియాంక... డిగ్రీలో కోరిమరీ బయోటెక్నాలజీ తీసుకున్నారు. ‘‘2009లో... ముంబయి జైహింద్ కాలేజీలో చేరాను. తరగతి గదిలో ఉన్నంతసేపూ పాఠ్యాంశాలు. దాని నుంచి బయటకు వస్తే నేనో రచయితను. అలా చాలా టీవీ షోలకు స్ర్కిప్ట్స్ రాశాను. అర్చనా పూరన్‌సింగ్ లాంటి ప్రముఖుల షోలకు కూడా పని చేశాను’’ అని చెప్పారామె.
స్నేహితులను చూసి...
అందరూ కాలేజీ జీవితాన్ని ఆస్వాదిస్తుంటే, ప్రియాంక మాత్రం జీవిత పోరాటంలో బిజీగా ఉండేవారు. అయితే ఎంతకాలం ఇలా? డిగ్రీతోనే ఆగిపోతే భవిష్యత్తుకు తగిన భరోసా దొరకదు. చదువు కొనసాగించాలంటే ఏంచేయాలి? కెరీర్‌ను అర్థవంతంగా తీర్చిదిద్దుకోవాలంటే ఎలా ముందుకు వెళ్లాలి? ‘‘ఈ ఆలోచనలు నన్ను కుదురుగా కూర్చోనివ్వలేదు. నా స్నేహితులు కొందరు బయోటెక్నాలజీకి జతగా పేటెంట్ లా కూడా చదువుతున్నారు. దానివల్ల మంచి అవకాశాలు ఉంటాయని తెలుసుకున్నాను. నేను కూడా అదే దారిలో నడిచాను. ప్రభుత్వ లా కళాశాలలో చేరాను. తోటి విద్యార్థులందరికీ లా ఫర్మ్స్‌లో అప్రంటీ్‌సషిప్స్ లభించాయి. నేను నా రైటింగ్స్ కొనసాగించాను. ఎందుకంటే ఇందులో మంచి ఆదాయం వస్తుందని’’ అని తన కాలేజీ రోజులను ఆమె గుర్తు చేసుకున్నారు.
సొంతంగా లా ఫర్మ్...
ఉద్యోగ బాధ్యతల్లో కొద్ది కాలంలోనే మంచి అనుభవం గడించిన ప్రియాంక వృత్తిగత జీవితాన్ని ఒక ఫోన్ కాల్ మలుపు తిప్పింది. ‘‘గతంలో నేను అసిస్టెంట్‌గా పని చేసిన ఓ టీవీ షో రైటర్ నుంచి ఫోన్ వచ్చింది. దిగ్గజ గాయని లతా మంగేష్కర్ కేసు తీసుకోవాలని తను కోరారు. నాకు మాటలు రాలేదు’’... అంటూ ఎంతో ఉద్వేగంగా నాటి ఘట్టాన్ని నెమరేసుకున్న ఆమెకు ఇక వెనక్కి తిరిగి చూసుకొనే అవసరం రాలేదు. సోనూ నిగమ్, అలిషా చినాయ్, అనురాగ్ కశ్యప్, రాజేష్ రోషన్ తదితర బాలీవుడ్ ప్రముఖుల కేసులు ఆమె వాదించారు. కీలక కేసులు గెలిచారు. ఇది ఆమెలో ఆత్మవిశ్వాసం పెంచింది. దీంతో ప్రియాంక 2014లో ‘ఖిమాని అండ్ అసోసియేట్స్’ను ప్రారంభించారు.
ఢిల్లీలో మరొకటి...
ప్రియాంక పేరు పరిశ్రమలో బాగా పరిచయమైంది. కేసులు పెరుగుతూ వచ్చాయి. ఈ క్రమంలో రెండేళ్ల కిందట ఢిల్లీలో కూడా తమ సంస్థ సేవలు ప్రారంభించారు. ‘ఉమెన్ ఆఫ్ మ్యూజిక్’ పేరిట ఒక స్వచ్ఛంద సంస్థ కూడా నెలకొల్పారు. వివిధ రంగాల్లో మహిళలను ప్రోత్సహించి, వారు సాధించిన విజయాలను గుర్తించి, సాధికారత వైపు నడిపించడమే ఈ సంస్థ ప్రధాన ఉద్దేశం. కెరీర్ పరంగానూ ఎన్నో మైలురాళ్లను అందుకున్న ప్రియాంక... విదేశాల్లో సైతం న్యాయ సహాయం అందిస్తున్నారు. ‘‘మా లా ఫర్మ్ నెలకొల్పి దశాబ్దం దాటింది. రాబోయే పదేళ్లలో అంతర్జాతీయంగానూ మా సేవలు విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నాం’’ అంటున్న ప్రియాంక ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజిక్ లైసెన్సింగ్ ప్లాట్‌ఫామ్ అయిన ‘సాంగ్‌ట్రేడర్’తో పాటు ‘బీట్‌డా్‌ప’కు బోర్డ్ మెంబర్‌గా ఉన్నారు.
అలా ఉపయోగపడింది...
చేతి నిండా పని... దానికి తగ్గ ఆదాయం. సాఫీగానే సాగిపోతున్నా ఆమెలో ఏదో ఆందోళన. ‘‘టెలివిజన్ రంగం నాలాంటి యువతులకు సరైన వేదిక కాదనిపించింది. ఎందుకంటే నేను ఎంత నిజాయతీగా, ప్రభావవంతంగా పని చేసినా... వాళ్లు నన్ను ఏ రోజూ ఒక పూర్తి స్థాయి రచయితగా గుర్తించలేదు. అందుకే 2012లో ఎల్‌ఎల్‌బీ అయ్యాక ఇక న్యాయ వృత్తిలోనే నా కెరీర్ నిర్మించుకోవాలని నిశ్చయించుకున్నా. తోటి విద్యార్థుల్లా నాకు అనుభవం లేదు. ఎలాగని ఆలోచిస్తుంటే ప్రముఖ లా ఫర్మ్ ‘ముల్లా అండ్ ముల్లా’లో అవకాశం వచ్చింది. అందుకు ప్రధాన కారణం... సృజనాత్మకంగా రూపొందించిన నా సీవీ వారిని బాగా ఆకర్షించింది. నాలోని రచయిత్రి అనుకోకుండా అలా ఉపయోగపడింది’’ అంటారు ప్రియాంక.
ఈ వార్తలు కూడా చదవండి..
శాప్‌తో ఏసీఏ కలిసి అన్ని క్రీడలు ప్రోత్సహించేలా కృషి: ఎంపీ కేశినేని చిన్ని
సీఎం రేవంత్‌కి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఛాలెంజ్
For More AP News And Telugu News