Share News

Hindu Temples: దేహమే దేవాలయం

ABN , Publish Date - Sep 12 , 2025 | 05:49 AM

‘‘దేహమే దేవాలయం. అందులోని జీవుడే సనాతనుడైన భగవంతుడు. కాబట్టి అజ్ఞానాన్ని తొలగించి, సోహంభావ బుద్ధితో (‘పరమాత్మే నేను’ అనే భావనతో) ఆయనను పూజించాలి’’...

Hindu Temples: దేహమే దేవాలయం

తెలుసుకుందాం

‘‘దేహమే దేవాలయం. అందులోని జీవుడే సనాతనుడైన భగవంతుడు. కాబట్టి అజ్ఞానాన్ని తొలగించి, సోహంభావ బుద్ధితో (‘పరమాత్మే నేను’ అనే భావనతో) ఆయనను పూజించాలి’’ అని ‘స్కందోపనిషత్తు’ చెబుతోంది. అయితే ‘‘పరమాత్మ తాలూకు దేహమే దేవాలయం’’ అంటోంది ‘శ్రీప్రశ్న సంహిత’. దేవాలయంలోని భాగాలను దేహంలోని భాగాలతో పోల్చడాన్ని ఈ క్రింది శ్లోకాలలో గమనించవచ్చు.

గర్భగేహం శిరఃప్రోక్తం శిఖా శిఖరముచ్యతే నాసికా శుకనానీస్యాత్‌ అంతరాలంగలంస్మృతంత్యమండపం దేహమిక్త ప్రాకారః కర ఉచ్ఛతే గోపురం పాద ఇత్యుక్తం దేవస్థానం ప్రకధ్యతే (ఈశ్వర సంహిత)

భగవంతుడి గర్భగృహం శిరస్సుగా, శిఖరం శిఖాస్థానంగా, శిఖరం పైన ఉండే శుక నాసిక దేవుని ముక్కుగా, అంతరాలము (మధ్య ప్రదేశం) కంఠంగా, మండపాలు శరీరంగా, ప్రాకారాలు చేతులుగా, గోపురాలు పాదాలుగా ‘ఈశ్వర సంహిత’ వర్ణించింది. కొద్దిపాటి తేడాలతో మరి కొన్ని ఆగమాలు కూడా ఈ విషయాన్ని తెలిపాయి. ‘‘ఏవయేష హరి స్సాక్షాత్‌ ప్రాసాదేత్వేన సంస్థితః... ఆలయ రూపంలో సాక్షాత్తూ శ్రీహరి రూపం ఉంటుంది. కాబట్టి దేవాలయంలోని ప్రతి నిర్మాణాన్ని పవిత్రమైనవిగా భావించి నమస్కరించాలి’’ అంటోంది ‘హయశీర్ష సంహిత’.


దేవాలయ ప్రతిష్ఠాఫలం

దేవాలయాలను నిర్మించడం, వాటిలో విగ్రహాలను ప్రతిష్ఠించడం, నిత్య, నైమిత్తిక, బ్రహ్మోత్సవాది కార్యక్రమాలు... ఇవన్నీ పూర్వ కాలంలో ఆ దేశపు రాజు లేదా రాజ ప్రతినిధి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగేవి. ఉత్సవాలు అవిచ్ఛిన్నంగా జరగడం కోసం ఎన్నో ధనరాశులను, మాన్యాలను ఆలయాలకు వారు సమర్పించేవారు. అయితే ఇదంతా గతం. ఆధునిక కాలంలో రాజులు, రాచరిక వ్యవస్థ అంతరించిపోయాయి. ఇప్పటి కాలంలో భక్తులు ఒక కూటమిగా ఏర్పడి... తమతమ ప్రాంతాలలో కొత్త దేవాలయాల నిర్మాణం, పాత దేవాలయాల విషయంలో జీర్ణోద్ధారణ, ఉత్సవాల నిర్వహణ లాంటివి చేపడుతున్నారు. దేవాలయాల నిర్మాణం చేసినవారికి, అందులో పాలు పంచుకున్నవారికి కలిగే పుణ్య ఫలాలను వివిధ ప్రాచీన గ్రంథాలు వివరించాయి. దేవాలయాల నిర్మాణం గొప్ప పుణ్యకార్యం అని, ప్రతిమను కూడా నిర్మించి ప్రతిష్ఠిస్తే మరింత పుణ్యఫలం కలుగుతుందని, సుఖ సంపదలు లభిస్తాయని, పాపాలు తొలగిపోతాయని, అభీష్టాలు నెరవేరుతాయని, పవిత్ర యజ్ఞఫలాలు, సకల పుణ్యతీర్థాలలో స్నానం చేసిన ఫలం, అన్ని దానాలు చేసిన ఫలం కలిసి లభిస్తాయని ‘అపరాజిత పృచ్ఛ’, ‘ప్రాసాద మంజరి’, ‘పురుషోత్తమ సంహిత’ లాంటి గ్రంథాలు చెప్పాయి. ఐశ్వర్యం, విజయం, పుణ్యఫలం, ఆయుష్షు, ఆరోగ్యం, సర్వశత్రు క్షయం, సర్వోపద్రవ నాశనం, ఇహలోక సౌఖ్యం, అనంతరం మోక్షం పొంది భగవంతుని సాయుజ్యం లభిస్తాయని ‘కపర్దీ సంహిత’, ఆలయంలోని ఏ భాగాన్నైనా భక్తితో, ప్రీతితో నిర్మిస్తే భగవంతుడి సామీప్యాన్ని పొందుతారని ‘సుముర్తార్చనాధికారం’ అనే గ్రంథం, కలప, శిల, లోహం, మట్టి లాంటి ద్రవ్యాలతో ఆలయ నిర్మాణం చేసినవారు అనంత పుణ్యఫలాలు పొందుతారని, ప్రతినిత్యం యజ్ఞం చేస్తే ఏ ఫలితం లభిస్తోందో దానికి సమానమైన ఫలం లభిస్తుందని, తాము మాత్రమే కాకుండా పూర్వీకులు, తదుపరి తరాలవారు సద్గతి పొందుతారని భృగు మహర్షి విరచితమైన ‘ప్రకీర్ణాధికారం’ స్పష్టం చేశాయి. ఈ విధంగా మన మహర్షులు అందించిన ఆగమాలు, శిల్ప శాస్త్రాలు దేహమే దేవాలయం అని పేర్కొంటూ... ఆలయాల విశిష్టతను, ఆలయాలు నిర్మించేవారికి, దానికి సహకరించేవారికి లభించే పుణ్య ఫలాలను వివరించాయి. ఆలయాలు సర్వతోముఖాభివృద్ధి సాధిస్తే ధర్మం వికసిస్తుంది. అన్ని కళలకు నిలయమైన ఆలయం సకల జగతిని సస్యశ్యామలంగా ఉంచుతుంది.

దగ్గుపాటి నాగవరప్రసాద్‌ స్థపతి

9440525788

ఇవి కూడా చదవండి

నిఖత్‌కు నిరాశ క్వార్టర్స్‌లో ఓటమి

అమ్మాయిలు అదే జోరు

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 12 , 2025 | 05:49 AM